28 July 2014

ఏమో

"ప్రేమ ఉందా ఇక్కడ?"  అని కదా నువ్వు అడుగుతావు -

నునుపైన తెలుపు రేకుల్లా రాలే వెన్నెల ఆకులపై
నెత్తురు అంటిన నీ కళ్ళు, తమ లోపలికి తాము భయంతో ముడుచుకుపోయిన పావురాళ్ళు-

"భయపడకు: పర్వాలేదు. అంతా సర్ధుకుంటుంది"
అని నేను అంటాను కానీ, నా లోపలా ఎక్కడో సన్నటి వొణుకు. మంచుముక్కలు
గొంతులోకి కూరుకుపోయినట్టు ఒక నొప్పి ఏదో -

దీపం ఒలికిన గోడలపై, గాలికి ఊగే నీడలు. కొమ్మలు కదిలి, ఆకులు ఒకదానిని మరొకటి
ఒరుసుకునే సవ్వళ్ళు. ఈ రాత్రి, చీకటి చినుకులుగా
రాలే చప్పుళ్ళు. పొయ్యిపై ఉడుకుతున్న అన్నం గిన్నె

తొలిగి, మెతుకులు మెతుకులుగా నువ్వూ నేనూ రాలి పడే క్షణాలు. ఇక, గూళ్ళల్లో
మరింత దగ్గరగా భీతిగా ముడుచుకునే పావురాళ్ళు
గర్భస్రావమయ్యి, ఇంకా పచ్చిగా కుదించుకుపోయే

నీ కాళ్ళు. నీ కళ్ళు. జ్వరంతో వెచ్చగా కంపించే నీ ఒళ్ళు. తడారిపోయిన నీ అరచేతులు.
నోరంతా ఎండిపోయి, నాలికపై నర్తించే ఒక చేదు...

"ప్రేమ ఉందా ఇక్కడ?" అని కదా నువ్వు అడుగుతావు-

ఏమో: లుంగలు చుట్టుకుపోయి రోదించే ఈ లోకంలో ఈ విషయం ఎవరిని, ఎలా అడగను?   

No comments:

Post a Comment