31 July 2014

నేను. 1

I am 
Mood swings 
I am 
Hypomania 
I am Euphoria
I am inflated self-esteem
I am poor judgment
I am rapid speech
I am racing thoughts
I am aggressive behavior
I am agitation 
I am irritation
I am increased physical activity
I am risky behavior

I am 
Spending sprees 
I am unwise financial choices
I am increased drive to perform or achieve goals
I am increased sex drive
I am decreased need for sleep
I am easily distracted
I am careless 
I am dangerous use of drugs or alcohol
I am delusions 
I am a break from reality 

I am sadness
I am hopelessness
I am suicidal thoughts 
I am anxiety
I am guilt
I am sleep problems
I am fatigue
I am loss of interest in activities people consider as enjoyable
I am irritability
I am chronic pain without a known cause
And finally

I am you

టేకు చెట్ల నీడల్లో

ఆనాడు, ఆ టేకు చెట్ల కింద కలుసుకున్నాం మనం -

మబ్బులు కమ్ముకుని ఉన్నాయి ఆనాడు
నీ ముఖంపై.
ఉండుండీ గాలి చల్లగా వీస్తే

నన్ను పట్టుకున్న నీ చేతులు కంపించాయి. తల ఎత్తి
నేను చూడలేని నీ కళ్ళు
తడిగా మారి ఉంటాయి-

కాంతి లేని మన శరీరాలపై నీడలు నిశ్చలంగా, అప్పుడు -
అక్కడక్కడే తిరిగి
ఆగిన ఒక తూనీగ

వైపు నెమ్మదిగా సాగుతూ ఒక తొండ - ఇక మన పాదాల కింద
మరికొద్దిగా కుంగుతూ
మట్టి. విరిగిన
గాజులు -

మరి ఎక్కడో కొమ్మలు విరిగి పడుతున్న చప్పుడు.
ఆకులు విలవిలలాడి
చేసే చప్పుడు
అప్పుడు -

"ఇదేనా ఆఖరు సారి? మనం చూసుకోవడం?" అని
నువ్వు అన్నప్పుడు
తల ఎత్తి చూస్తే

టేకు ఆకు అంతటి కంత నీ హృదయ స్థానంలో -
ఇక మరి, ఒక
నిలువెత్తు టేకు
నా స్థానంలో

ఎవరో అంటించబోతున్న, ధగ్ధమవ్వబోతున్న, బూడిదవ్వబోతున్న
ఒక నిలువెత్తు టేకు
అప్పుడు

ఆనాడు, ఆ టేకు చెట్ల నీడల్లో మనం కలుసుకున్నప్పుడు-
ఇక ఇప్పుడు, ఇక్కడ
మిగిలింది
ఏమిటి

టేకు చెట్లు లేని ఆకాశం కింద, ఈ నగరంలో నీకూ నాకూ?

30 July 2014

ఆనాడు

రాత్రంతా మెత్తటి వాన: ఆనాడు-
పూర్తిగా ఆరకా, మానకా, చెక్కుకుపోయిన మోచేయి సలుపుతున్నట్టుగా ఉండి
నిన్ను నిద్రపోనివ్వని వాన.

అప్పుడు, ఆ రాత్రిలో, తలుపులు బార్లా తెరచి
కూర్చున్న నీ పసుపు వీపుపై మసక నీడలు. ఆ నీడల దాకా సాగిన నా అరచేయి
అక్కడే తెగి, ఆగిన

ఒక సందిగ్ధా సమయం: ఆనాడు -
అప్పుడు, "వొద్దు. అప్పుడే దీపం వెలిగించకు. అప్పుడే ఈ చీకటిని ఆర్పకు. చూడు-
I was only seven then...
When I was repeatedly

Violated  by my maternal uncle.
మరి ఆ రోజూ ఇలాగే, గోడల వెంట బల్లుల్లా వాన నీళ్ళు - బంక బంకగా. రక్తం.
ఇంకా, మరి రాత్రంతా పాలు లేక ఆ పిల్లే

పాపం అరుస్తూ వానలో-". అని అన్న
నీలోకి, నీళ్ళకి తడిచి ఒరిగిపోయిన పచ్చిగడ్డి. కిటికీ అంచులలో ఆఖరి శ్వాసతో
ఊగిసలాడే గూళ్ళూ

రెక్కలు రాని పిచ్చుకలూ
పూలపాత్రలోంచి పక్కకి ఒలికి ఒరిగిపోయిన రెండు పూవులూ. నీ కళ్ళూ. నేను
తాకలేని నీ చేతులూ, నువ్వూ

చితికిపోయిన నీ ఏడేళ్ళ యోనికి
కుట్లు పడి, జ్వరంతో వొణికి వొణికి వెక్కిళ్ళతో మన గదిలో ముడుచుకుని ముడుచుకుని
రాత్రంతా బెంగగా ఏడ్చి

ఆనక ఎప్పుడో నిద్రలోకి జారుకున్న ఒక పసివాన: ఆనాడు - 

29 July 2014

మరొక ముఖం

నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆడుకోడానికి నీకో ముఖాన్ని ఇస్తాను. మరొక ముఖంతో నేను ఇంకెక్కడో కూర్చుంటాను -

నువ్వు ఆ ముఖంతో బంతాట ఆడుకోవచ్చు. పూలతో అలకరించుకోవచ్చు. కడిగి పౌడర్ రాసి, అలమరాలో పింగాణీ బొమ్మల పక్కగా పెట్టుకోవచ్చు- లేదా టెడ్డీబేర్లా, నీ పక్కన చక్కగా ఒద్దికగా  పడుకోబెట్టుకుని 

కావలించుకోవచ్చు. ముద్దాడవచ్చు. కొరకవచ్చు. చీకటిలో దాని చెవిలో ఏవో గుసగుసలాడి దాన్ని చప్పరించవచ్చు. రాత్రి రహస్యాలు చెప్పవచ్చు. దాని జుత్తు చెరిపి పెద్దగా నవ్వవచ్చు. లేదా ఉదయాన 

నువ్వు దానిని నీతో పాటు పమేరియన్లా వాకింగ్కి తీసుకెళ్ళవచ్చు. నీ బ్యాగ్లో లిప్ స్టిక్ పక్కన వేసుకుని ఆఫీసుకి వెళ్ళవచ్చు. అప్పుడప్పుడూ బయటికి తీసి కారు అద్దంలో చూసుకుంటూ నీ బుగ్గలకీ, సున్నా చుట్టిన నీ పెదాలకీ రాసుకోవచ్చు. సెల్ఫోన్లా తీసి మాట్లాడుకోవచ్చు. వీకెండ్ సాయంత్రాలు నీతో పబ్లకీ పట్టుకెళ్ళవచ్చు. నీ వోడ్కా గ్లాసులోకి అది ఒక నిమ్మతొనలా పనికీ రావొచ్చు. తూలే, ఊగే నీ చేతికి అది మరొక చేయీ కావొచ్చు - అందుకే 

నువ్వు ఒంటరిగా లేనప్పుడూ, ఒక బాడ్జీలా, ఒక ఆధార్ కార్డులా, ఒక ఐడెంటిటీ కార్డులా, సోషల్ సెక్యూరిటీలా, పాస్పోర్ట్లా , నీ స్నేహితులకి ప్రదర్శించే నీ మెడలోని నగల్లా, నీ వేలికి ధరించే వజ్రపుటుంగరంలా, నీకు పనికివచ్చే ఏమీ పలుకని నా ముఖాన్ని నీకు ఇస్తాను. 

మరొక ముఖంతో - కళ్ళూ పెదాలూ ముక్కూ చెవులూ వాసనా లేని ముఖంతో - నేను ఇంకెక్కడో కూర్చుంటాను. 

మరి ఎప్పుడైనా, ఎక్కడైనా మొండెం లేని ముఖంతో ఏడ్చే ఒక మనిషిని చూసావా నువ్వు ఎన్నడైనా? 

నిబద్ధత 2.

నీకు ప్రియమైన వ్యక్తి ఇంటి దాకా వెళ్లి, తలుపు తట్టబోయి, ఆగిపోయి
నువ్వు తిరిగి వెనక్కి వచ్చేసినట్టు ఉండే దినాలు -

పంజరంలో అక్కడక్కడే ఇరుకుగా తిరుగాడే రామచిలుక వలే
నీ గుండెలో ఏదో గుబులు. నీలో తచ్చాట్లాడే
ఎవరివో మసక పాదాలు. మబ్బులు కమ్మిన
ఇళ్ళల్లో, ఆ చీకట్లలో, గాలికి కదిలే పరదాలు-

"Man has stopped being a Church, a refugee camp
Perhaps, for a long time. And God
Perhaps was killed at the same time

నాప్కిన్స్ తెచ్చావా. కొద్దిగా పాలు కాచి, బ్రెడ్డు వేసి ఇస్తావా?
బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. లేవలేను..." అని
నువ్వు అడిగితే, జ్వరతీవ్రతతో కొనసాగిన
రెండో దినాన గొణుక్కుంటూ లేస్తాను నేను:

"నీకు అత్యంత ప్రియమైన వ్యక్తి ఇంటి దాకా వెళ్లి తలుపు తట్టబోయి చూస్తే
అక్కడ, ఇంతకూ, ఒక వ్యక్తీ లేడు, తోటా లేదు
తలుపులూ లేవు చివరాఖరకు ఒక ఇల్లే లేదు-"

ఒక మనిషి - కనీసం తనకైనా - మిగిలి ఉన్నాడా
ఇం

కూ? 

నీ తలుపులు

ఎన్నిసార్లు తట్టానో ఆనాడు, నీ తలుపులు -

అప్పట్లో
నీ ఇంటి ముందు మసక చీకట్లో, ఎక్కడిదో ఇంత వెన్నెల పడి
ఊరికే చలించే మొక్కలు

శీతాకాలపు రాత్రుళ్ళలో
వొణికి వొణికి గూళ్ళలో ముడుచుకుపోయిన పావురాళ్ళు. పూసిన
పసుపు పూవులూ

గోడలపై నీడలూ, ఇంకా
నేను కూర్చున్న చోట, నా ఖాళీతనంలో, నాలో, అప్పట్లో
గది చూరుకి నువ్వు

వేలాడదీసిన
గాజు గంటలు:
గాలి గంటలు -

నువ్వు లేని బోలుతనంతో, ఇప్పటికీ నాలో ప్రతిధ్వనించే శబ్ధాలు -

ఎన్నిసార్లు తట్టానో ఆనాడు
నువ్వు తీయని, నువ్వు తీయలేని
నీ తలుపులు - 

28 July 2014

నిబద్ధత

జ్వర తీవ్రతతో మంచంపై నువ్వు: ఆనాడు -
అనేక ముఖాలతో వాన, కిటికీ అద్దాలని చరచీ చరచీ లోపలకి చొరబడేందుకు
ప్రయత్నిస్తున్న వేళ -

"మందులు వేసుకోక, అలా పడుకుంటే ఎలా?"
అని అన్నాను నేను. "మందులు లేకపోతే, వెళ్లి తెచ్చుకోలేనంత చిన్నపిల్లవా"
అని కూడా కసురుకున్నాను నేను.

మాట్లాడని నీ మౌనంలో, గదుల నిశ్శబ్ధంలో
తెరచిన తలుపులలోంచి హోరున కొట్టుకు వచ్చే గాలి: వెక్కిళ్ళ వలే గంటలు-
అవే, నువ్వు గుమ్మానికి వేలాడదీసిన

గాజు పక్షుల రెక్కలు విరిగి
టప టపా కొట్టుకునే చప్పుడు. తడచిన హాలులోకి, రాలి, కొట్టుకు వచ్చిన
చితికిన లిల్లీ పూవులు -
కమిలిన నీ శరీరంపై

తార్లాటలాడే నీడలూ, నువ్వు
ఆప్తంగా తెచ్చుకుని, గోడకు వేలాడ దీసిన క్రీస్తు చిత్రం ఇక చిన్నగా పక్కకి ఒరిగి -
నీ చేయి నా చేయి పక్కగా వాలి

వడలి, నీటిపై తేలుతున్న లతలా మారి, పోయిన నాడు
ఆనాడు
అప్పుడు

నీలో వాన. పొక్కిలయ్యిన గొంతు.
వెచ్చటి కరకు గాలీ, శ్వాసా, ముకుళితమయ్యిన కనులూ, హృదయం మనస్సూ
చెదిరి రాలిపోయిన

పిచ్చుక గూడు వంటి నీ శరీరమూ ---

అప్పుడు
ఆనాడు
"Man is not a church anymore"
అని అతి కష్టం మీద కూడదీసుకుని నువ్వు అంటే, ఇదిగో ఈనాడు
కూడదీసుకుని రాస్తున్నా
నీ ప్రతిధ్వనించే పదాలని

జ్వర తీవ్రతతో, మంచంపై, నీవు లేని
ఓటమి తెరలేవో లోపల గుమికూడి ప్రకంపనాలు సృష్టిస్తున్న వేళ, నాలిక చేదుగా మారి
పెదాలు ఎండిపోయి, చిట్లి
భాష కరువయ్యి

ఇలా ఇలా ఇలా ఇలా
ఒక్క గ్లాసు నీళ్లకై-   

ఏమో

"ప్రేమ ఉందా ఇక్కడ?"  అని కదా నువ్వు అడుగుతావు -

నునుపైన తెలుపు రేకుల్లా రాలే వెన్నెల ఆకులపై
నెత్తురు అంటిన నీ కళ్ళు, తమ లోపలికి తాము భయంతో ముడుచుకుపోయిన పావురాళ్ళు-

"భయపడకు: పర్వాలేదు. అంతా సర్ధుకుంటుంది"
అని నేను అంటాను కానీ, నా లోపలా ఎక్కడో సన్నటి వొణుకు. మంచుముక్కలు
గొంతులోకి కూరుకుపోయినట్టు ఒక నొప్పి ఏదో -

దీపం ఒలికిన గోడలపై, గాలికి ఊగే నీడలు. కొమ్మలు కదిలి, ఆకులు ఒకదానిని మరొకటి
ఒరుసుకునే సవ్వళ్ళు. ఈ రాత్రి, చీకటి చినుకులుగా
రాలే చప్పుళ్ళు. పొయ్యిపై ఉడుకుతున్న అన్నం గిన్నె

తొలిగి, మెతుకులు మెతుకులుగా నువ్వూ నేనూ రాలి పడే క్షణాలు. ఇక, గూళ్ళల్లో
మరింత దగ్గరగా భీతిగా ముడుచుకునే పావురాళ్ళు
గర్భస్రావమయ్యి, ఇంకా పచ్చిగా కుదించుకుపోయే

నీ కాళ్ళు. నీ కళ్ళు. జ్వరంతో వెచ్చగా కంపించే నీ ఒళ్ళు. తడారిపోయిన నీ అరచేతులు.
నోరంతా ఎండిపోయి, నాలికపై నర్తించే ఒక చేదు...

"ప్రేమ ఉందా ఇక్కడ?" అని కదా నువ్వు అడుగుతావు-

ఏమో: లుంగలు చుట్టుకుపోయి రోదించే ఈ లోకంలో ఈ విషయం ఎవరిని, ఎలా అడగను?   

27 July 2014

ఇల్లాగే వెళ్ళిపోతాం

ఇల్లాగే వెళ్ళిపోతాం నువ్వూ నేనూ-
ఇల్లాంటి పల్చటి గాలిలాగే, ఇల్లాంటి వానా కాలపు మబ్బుల్లాగే, బరువుగా, తేలికగా
నింపాదిగా ఇల్లాగే -

అప్పుడు గుర్తుండవు ఇవేమీ. ఈ క్షణాలు-
నువ్వూ నేనూ తిట్టుకున్నవీ, కొట్టుకున్నవీ, మన మౌనాలతో క్షతగాత్రులమైనవీ, దిగులుతో
ఒంటరిగా పడుకున్నవీ

ఒంటరిగా వణికిపోయినవీ, కూర్చున్నవీ
ఉగ్గపట్టుకున్నవీ, తమలో తాము చుట్టుకుపోయి కుదించుకుపోయి, ఏడ్చీ ఏడ్చీ లోపలెక్కడో
ఆఖరకు నిలిచిపోయినవీ

ఇవ్వేమీ గుర్తుండవు మనకి అప్పుడు.
ఆనాడు మనం కలుసుకున్నప్పుడు, నీలో నాలో రేగిన ప్రకంపనాల తప్ప, ఇప్పటికీ
కొట్టుకు వచ్చే ఆ తరంగాలు తప్ప
ఆనాడు మనం కలుసుకున్నప్పుడు

ఏర్పడిన ఒక అమాయకపు ఇష్టం తప్ప
కలిసి బ్రతుకుదామనే ఒక నులి వెచ్చటి స్వప్న సువాసన తప్ప, మట్టి దారుల్లో మనం
నడుస్తున్నప్పుడు నేను నీకు ఇచ్చిన

ఒక అనామక పసుపు పూవు తప్ప
ఆనాటి నీ చిరునవ్వు తప్ప, నువ్వు నా అరచేతి పుచ్చుకుని గట్టిగా ఒత్తిన స్పర్శ తప్ప
చెవిలో చెప్పిన గుసగుసలు తప్ప

ఆ పెదాల తడి తప్ప, ఆ రాత్రి తప్ప
హత్తుకున్న మన చేతులు తప్ప, మన శరీరాల తప్ప, లోతైన మన అవయవాల భాష తప్ప
అంతిమంగా, ఆనాడు

మనం కలుసుకున్నప్పుడు
మొదలయ్యిన ఒక జీవితకాలపు పవిత్ర నేరం, శిక్షా, సజీవ ఖైదూ తప్ప, 'నీతోనే జననం
నీతోనే మరణం' అనే కాలం తప్ప

నాకు నువ్వూ, నీకు నేనూ తప్ప
అప్పుడు మరేమీ గుర్తుండవనీ, ఇల్లాంటి పల్చటి గాలిలాగే, ఇల్లాంటి రాత్రి మబ్బులలాగే
బరువుగా, తేలికగా ఇల్లాగే

మనం వెళ్లిపోతామంటే, అలా అని
నేను చెబుతున్నానంటే
నువ్వు నన్ను నమ్ము మరి!  

ఒక ఆకు, ఒక కొమ్మ, ఒక స్త్రీ, మరొక మధ్యాహ్నం అను...

దేశం లేని జెండా వలే రెపరెపలాడుతూ
కొమ్మకి కొట్టుకులాడే ఒక ఆకు: ఒక దేశం, ఒక నిర్దేశం లేదు దీనికి నాలాగే.
సరే, మరి ఇది

ఒక మధ్యాహ్నం. గదిలోకి నీడలు వ్యాపించి
శరీరంలోకి తొంగి చూసి, తిరిగి ఉడతల వలెనో, సీతాకోకచిలుకల వలెనో, తుర్రున
పారిపోయే, ఎగిరిపోయే

ఒక మధ్యాహ్నం. లేత ఎరుపు చేతులేవో
నీ చుట్టూ కనిపించకుండా నాట్యం చేస్తే, ఇక ఒక చెట్టంత శ్వాస గుండె నిండుగా
పీల్చుకుని, ఒక ఎర్రటి కోరికతో నువ్వు -
అప్పుడు, ఇక

ఆ అమ్మాయికి రూపం లేదు, కాలం లేదు.
ఏ లోకంలోనుంచో నీ లోకంలోకి, డుబుక్కున, సరస్సులోకి ఎవరో ఒక పాలరాయిని
విసిరినట్టో, ఒక చిన్ని కప్ప దుమికినట్టో
దుమికితే

నీ లోపల అలలు కొట్టుకుంటాయి.
నీ లోపల వాన చినుకులు పిల్లల్లా గెంతుతాయి. ఎవరో నవ్వుతారు బిగ్గరగా నీలో -
నీ లోపలంతా బురద. 
ఎక్కడ ఎవరు తాకినా

వాళ్ళే మళ్ళీ తిరిగి నీలోంచి మొలకేత్తేటట్టుగా
మారి నువ్వు. కుళాయి కింద ఉంచిన ముఖంలా మారి నువ్వు. ఏ మట్టి కుండ కిందో
అరచేతులుగా మారి నువ్వు: ఆ
అమాయి ఎదురుగా, దాహంతో -

ఇక, ఆ తరువాత, ఒక కొమ్మకి కొట్టుకులాడీ
కొట్టుకులాడీ ఒక ఆకూ, గదంతా తిరిగీ తిరిగీ నీడలూ, ఒక్క దేశం ఒక్క దేహం లేక
రెప రెపలాడి నువ్వూ
తన శరీర ప్రాంగణంలో

వీచిన ఒక పరిమళపు గాలికి
ఎక్కడికో కొట్టుకుపోతే ... ప్స్చ్ ఇలా , ఇక్కడ, ఒక ఆకు, ఒక కొమ్మ, ఒక స్త్రీ,
మరొక మధ్యాహ్నం అను...