17 September 2019

print

తను వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది
మెట్లన్నీ అతి కష్టంపై దిగి 
ఆయాసంతో రొప్పుతో అమ్మ -

అగ్నికీలలవలే ఎండగాజు పెంకులేవో 
రాలినట్లు, దారంతా మెరుస్తో 
కోసుకుపోయే అంచుల్లేని కాంతి - 

గేటు పక్కగా పెరిగిన వేపచెట్టుఎన్నెన్నో
ఆకుల్ని రాల్చి, తనలో తానే 
వొదిగీ వొంగీ, ఇక ముడతలు పడితే 

పక్షులు కూడా లేవు ఇప్పుడు. ఉన్నవి, 
ఖాళీ అయిన గూళ్ళూ, ఎండిన
కొమ్మలూ. ఎప్పుడైనా గాలి వీస్తే రాలే

సన్నటి దుమ్మూ, బెరడు చీలికల్లో చేరే
అంతులేని ఒంటరి పగళ్ళూ 
తేమ కూడా లేని కరకు రాత్రుళ్ళూ -
***
తను వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది
ఇక, పంటి బిగువున మరి 
తనని తాను ఆపుకునితలని

తిప్పుకున్న అమ్మ కళ్ళలో, వణికిపోతూ
పగిలిపోయే నీటి
బుడగలు: గుక్కపట్టే శిశువులు!
2

ఎక్కడ

అమ్మ పుట్టిన రోజు; మరి మబ్బులు పట్టి
వీచే గాలి  బయట; దుమ్ము -
ఆవరణలో రాలి, దొర్లుతో వేపాకులు,

ఇంటి వెనుక, తీగకు రెపరెపలాడుతో ఒక
ఊదా రంగు చీర; పాతదే,
ఇప్పుడు ఇల్లు తుడిచేందుకు వాడేదే,

(  అది అమ్మదే: వెలసిపోయి చిరిగి ... )

ఒక జామచెట్టు ఉండేది అక్కడ: ఎన్నెన్నో
పళ్ళను ఇచ్చిన చెట్టు. ఇక
ఇప్పుడు, అక్కడంతా కరకు బండలు

పరచిన నేల.  ( పగిలిన అరిపాదాలై ... )

ఎన్నో వెళ్ళిపోయాయి: ఎంతో ఏపుగా సాగి
అల్లుకున్న ఓ బీరతీగా, ఊగే
మల్లెపందిరీ, వెన్నెల్లో వొణికిన రాత్రీ ...

ఎన్నో వెళ్ళిపోయాయి. ఋతువులై కొన్ని,
అశ్రువుల్లో మునిగిపోయి కొన్ని,
చీరేయబడిన పిల్లిపిల్లలై మరికొన్నీ ...
***
అమ్మ పుట్టిన రోజు ఇవాళ.  బయట, మరి
మబ్బులు పట్టి, హోరున
గాలి.  ఇల్లంతా ఖాళీ. కళ్ళల్లో దుమ్ము -

మరి, ఇక్కడ ఉండాల్సిన అమ్మ ఎక్కడ?

3

ముగింపు

ఇక నడవలేదు తను. కొమ్మలు
విరిగే చప్పుడు
మోకాళ్ళల్లో, కళ్ళ నీళ్ళల్లో ...

పాత గుడ్డలు వేసిన ఓ వెదురు
బుట్ట ఇప్పుడు తను,
మూలగా, నీడల్లో, చీకట్లల్లో ...

ఏం ప్రయోజనం నీ కవిత్వంతో?
వెలిగే దీపాలను
చేయగలవా మళ్ళా కళ్ళను?

అంతే చివరికి! మడతలు పడిన
దుప్పటీ, నేలపై
ఓ చాపా, తలగడ కింద మరి

అమృతాంజనూ, ఓ నిద్రమాత్రా
వొదులైన వక్షోజాల
వెనుక, లీలగా మిణుకుమనే

ఓ హృదయ తారక! అంతే, ఇక -
చివరికి. ఓ రాత్రై,
ఎటో వెళ్ళిపోతోంది అమ్మ! 

4

ఇక

మంటపై రొట్టెలు కాలుస్తుంది ఆవిడ -
ఎంతో ధ్యాసతోతీక్షణతతో 
తన కనులు అప్పుడు -
బయటపల్చటి కాంతితో ఆకాశం -
గాలి. రాత్రిలోకి సాగిపోతూ
చివరి వరసలో కొంగలు -
***

కిటికీలోంచి పొగాపాత్రల అలికిడీ -
ప్లేటులో ఉంచిన రొట్టెలూ
ఓ మంచినీళ్ల గళాసూ -

ఇకనీ మరొక దినం ముగుస్తుంది! 

5

ముసురు

"చివరికొచ్చేసాను" అని అంటుంది
తను -
***

కిటికీ అద్దాలపై వాన గీసిన గీతలు
రాత్రి కాంతిలో తానై -
తడిచిన ఆకులు. కుండీల చుట్టూ
చెదిరిన నీళ్ళు: రాలిన
పూల రేకులతోకొంచెం బురదతో
ముడుతలు పడ్డ తన 
కనులతోచేతులతోనుదురుతో
గాలికి ఊగే నీడలతో -
***
"
చివరికొచ్చేసాను" అని అంటుంది
అమ్మ -
***

ఇక 
బయట చీకట్లోఆగకుండా వాన -
సగం తెగిన రెక్కలు
కొట్టుకులాడే నల్లని శబ్ధంతో! 

7

కృతజ్ఞత

ఎంతో సన్నటి చేయి తనది: అలా వాలి ఉంది బల్లపై
తన ముఖం పక్కగా -
***
ముసురుకునే చీకటి: తెరచిన కిటికీలలోంచి వీస్తోన్న 
పల్చటి గాలి. గూళ్ళల్లో పక్షులు
రెక్కలు సర్దుకునే సవ్వడి -

మంచు ఏదో వ్యాపిస్తున్నట్లు, కళ్లపై పెరిగే బరువు -
ఒక్క క్షణమే, భుజాన ఉన్న బ్యాగ్ని
పక్కనుంచి, తలను వాల్చితే

లిల్లీ పూవుల్లాంటి చేతివేళ్ళు నెమ్మదిగా దగ్గరయ్యి
ముఖం నిదుర నావలోకి చేరుకొని
అట్లా, ఎక్కడికో తేలిపోతే 
***
ఎంతో సన్నటి చేయి తనది: అలా వాలి ఉంది, నీ 
ముఖానికి చాలా దగ్గరగా -
***
ఇక, తన చేతి నీడను కూడా పొరపాటున తాకక
ఒక పక్కగా నిలబడి అనుకుంటాడు
అతను - కృతజ్ఞతగా - ఇట్లా:

"ఎంతో తేలికగా, ఎంతో బలహీనంగా అగుపించే
ఆ ధృడమైన చేయే లేకపోయి ఉంటే
ఏమై పోయుందును నేనీ పాటికి?"

10 June 2019

erasure

"ఎందుకు రాయడం లేదు? నువ్వు? "

పంటితో పెదవిని బిగించి, అంతదాకా
ఎంతో శ్రద్ధతో
వేసిన బొమ్మనేదో, తిరిగి

ఓ పాపాయి అంతే తదేకంగా రబ్బరుతో
తుడుపుతోన్నట్లు,
తుడిపి పేజీని మలిపినట్లు,

ఇక్కడ, ఋతువు తరువాత ఋతువు -
ఎండ మలుపులోంచి
వాన గీతలు లోనికి జొరబడి,

మరొక శీతాకాలం ఒక నలుపు సీతాకోకై
ఈ హృదయంపై
వాలి, రెక్కలతో మృత్యువును

ఇటువంటి రాత్రుళ్ళతో వినిపించేదాకా ...
***
"ఎందుకు రాయడం లేదు? నువ్వు?

అడగకు.  


30 May 2019

ఎక్కడినుంచో

ఎక్కడినుంచో చినుకంత మాట
నిద్రలోకి,
ఒక పసిచేయి వాలినట్టు,

మెడ చుట్టూ చుట్టుకుని, ఏదో
కలవరించి
పూవై హాయిగా నిద్రలోనే

సన్నగా నవ్వినట్టు, పెదాలపై
ఒక చుక్కై
తడితో మెరిసినట్టు కూడా!
*
ఎక్కడినుంచో చినుకంత మాట
నిద్రలోకి
రాలి, కలలై వలయాలై

ప్రేమగా నువ్వై వ్యాపిస్తో! 

అమ్మకి / 3 కవితలు

1
పగలంతా ఇలాగే గడిచిపోయింది,
గాలికై ఉగ్గబట్టుకుని
అల్లాడక వేచి చూసే ఆకులాగే

మంచం మీద ఒక్కత్తే అమ్మ, ఇక
ఏదో యోచిస్తో; మరి
కేటరాక్ట్ ఆపరేషన్ అయి, ఏమీ

చూడలేక, కళ్ళప్పుడే తెరువలేక;
ఏముంది? తన కళ్ళ
కింద? వానకు తడిచే తోటానా

లేక, నింగికెగిసే పక్షులా? చెట్లకు
వేళ్ళాడే గూళ్ళా, లేక
గోధూళి మబ్బులై వ్యాపించిన

సాయంత్రాలా? చుక్కలు చినుకులై
వెలిగే రాత్రుళ్ళా, లేక
వెన్నెల నీటిపొరైన కాలాలా?

ఏముంది ఆ కళ్ళ కింద? అసలు
ఇవేమీ కాక, తల్లి లేని
పసిపాపలే ఉన్నాయా అక్కడ?
***
పగలంతా ఇలాగే గడిచిపోయింది,
గాలికై ఉగ్గబట్టుకుని,
శిలలైన పూలతో, బాల్కనీలోనే

బంధీయైన ఒక పూలకుండీతో!
2
ఎంతో పల్చని ఎండ, ఒక పొరలా;
సవ్వడి చేయని గాలి -
ఆవరణలో తాకీ తాకని నీడలు,

త్రవ్విన మట్టికి పైగా చల్లిన నీళ్ళల్లో
తడిచిన రాళ్ళు ; మెత్తగా
అమ్మ కనులై మెరుస్తో, స్రవిస్తో,

నేలపై ఎప్పుడో రాలిన ఒక  పసుపు
ఆకు; గవ్వలాగా, మరి
శరీరంలాగా, వొళ్ళంతా గీతలతో... 
***
ఎంతో పల్చని ఎండ, ఒక పొరలా;
అక్కడే ఒక పిట్ట,
అటూ ఇటూ మరి తచ్చాట్లాడి,

చిన్నగా, ఎటో ఎగిరే పోయినట్టు
మరి అమ్మకి తప్ప
ఇంకెవరికీ, ఎందుకో అసలు 

మరి తెలియనే రాలేదు!

|| ఎలా/ ఒక ౩ కవితలు ||


1
ఎలా ఉన్నావు అని అడగాలని ఉంది
నిజంగానే,
నా నెత్తురునంతా మాటల్లోకి వొంపి,

ఊరికే, నీ పక్కన కూర్చోవాలని ఉంది
నిజంగానే,
ఏమీ మాట్లాడకుండా, నిన్నానుకుని

చిన్న నవ్వుతో నిన్ను వినాలని ఉంది
నిజంగానే,
శరీరం నిండుగా నిన్ను పీల్చుకుని,

ఎటో దారి తప్పి పోవాలనే ఉంది నీతో
నిజంగానే,
నన్నేను మరచీ, మరోసారి బ్రతికీ,

హా; నిజం. మరోమారు మరణించాలనే
ఉంది నీలో,
ఒక మెలకువలోకి పూర్తిగా మేల్కొని,
***
చూడూ; ఇప్పటికైతే ఇదే మరి సత్యం,

ఎలా ఉన్నావు అని అడగాలని ఉంది
నిజంగానే,
నిన్నొకసారిఎంతో గట్టిగా హత్తుకుని!

2
ముద్ధ గులాబీ పూవువా నువ్వు?
అని అడిగాను,
నడిరాత్రి ఒక చంద్రబింబాన్ని

వెన్నెల వాసనివా నువ్వు? అని
కూడా అడిగాను,
వేకువఝామున ఒక మంచుని

సరస్సుల స్వప్నానివా నువ్వు ?
అని అడిగాను,
తీరాన ఆగిన ఒక కాంతి నావని

చినుకులు రాలే కాలనివా నువ్వు ?
అని కూడా మరి  
అడిగాను ఆ పూలమేఘాన్ని,

ఇక ఏమీ అడగలేకఇలా వ్రాసాను
 తనకి; నా శ్వాస 
రహస్యానివి కదా నువ్వు

3


బహుశా

ఇదే దారిలో పోవాలి, బహుశా

చేతిలో ఒక చీకటి దివ్వెతో
లోపలెక్కడో
ఓ శిశువు రోదిస్తోన్న

ప్రకంపనలతో, వలయాలతో
నీతో, బహుశా
తప్పక, ఇదే దారిలో!

24 May 2019

report

how am i? నేను ఎలా ఉన్నానా? సాంధ్యచ్చాయలో మబ్బులు ముసిరి వీచే హోరు గాలిలో ఇంటికి వెనుక నిమ్మ చెట్టు పక్కగా దండేనికి, ఒకటే కొట్టుకులాడుతోంది వాన రంగులాంటి అమ్మ చీర: ఆ విసురుకి, మరి ఇక ఎపుడో, ఆ నిమ్మ ముళ్ళకి చిక్కుకుని చీర, చినుకులుగా చీరిపోవచ్చు; మబ్బు తెగిన వాసన వేయవచ్చు: ఎవరూ తొలగించక మరి నాని, ఆ దండేనికే రాత్రై, ఒక్కతే వణుకుతుండవచ్చు మిణుకుమిణుకుమనే నక్షత్రాల కింద ఏదో భాషలో, తడిచిన బరువుకి మూల్గుతుండనూ వచ్చు! *** how am i? ఎలా ఉన్నానా నేను? అమ్మ లేని ఇల్లు: మగ్గిన వాసన వేసే పగుళ్లిచ్చిన గోడలు; ఆవరణ అంతా చెదురుమదురుగా రాలి నిండా తడిచిన వేపాకులపైగా కుంటుకుంటో మరి బావురుమంటో తిరుగుతోంది ఎందుకో ఒక ఊదారంగు పిల్లిపిల్ల!

14 February 2019

బహుమతి

సాయంకాలపు నీడలూ, కాంతీ తన ముఖంలో -
కనులేమో నానిన మొగ్గలు. ఒడిలో
వొదిలేసిన చేతులేమో వడలిన కాడలు,

నెమ్మదిగా నడుం వాల్చి, అరచేతిని నుదిటిపై
వాల్చుకుని తను "నానీ, కాస్త
లైటు ఆర్పివేయి" అని లీలగా అంటే, ఇక

బయట, ఉగ్గపట్టుకున్న రాత్రి కరిగింది. ఎంతో
నెమ్మదిగా గాలి వీచి, ధూళి రేగి,
నేలపై ఆకులు దొర్లి, చీకటి సవ్వడి చేసింది,

తన శరీరంపైనుంచి అలలా తెర ఏదో, తాకి
వెళ్ళిపోయింది. అలసట క్రమేణా
వదులవ్వుతూ, ఇక మ్రాగన్నుగా తను ఒక

కలవరింత అయ్యింది. కంపించింది. ఆనక ఇక
ఆకులపై జారే మంచువోలె, తను
నిదుర ఒడ్డున గవ్వై ముడుచుకుపోయింది,

తెల్లని పావురమైపోయింది: నిశ్శబ్ధమయ్యింది

మరి అందుకే శ్రీకాంత్, నువ్వసలు మాట్లాడకు!
ఊహలోనైనా తనని కదపక, అలా
తనని తనతో ఉండనివ్వగలగడమే, నువ్వు

తనకి ఇవ్వగలిగిన ఒక విలువైన బహుమతి!

17 January 2019

no option

ఎందుకనో, ఒకోసారి గుర్తుకు వస్తావు నువ్వు -
ఏం చేయాలో తెలియదు
అప్పడు. లోపల ఏదో పట్టేసినట్టు, pain!

ఎదురుగా గోడలపై నీళ్లు అలికినట్లు నీడలు -
ఒక పొరలాంటి కాంతి,
అది కన్నీరులాగా ఉన్నదీ అంటే నమ్మవు

కదా నువ్వు. అవును, నువ్వే. ఋతువు మారే
కాలంలో వీచే గాలి,
చల్లదనం, వేడిమీ; కలగలసి రెండూ మరి

ఒకటేసారి, పూలరేకుల్లో గాజురజను జొనిపి
గుండెల్లో కూరి, మెలి
తిప్పినట్టు, గాలీ, కాంతీ, చలించే ఆకులూ

ఇంకా నువ్వూ! అంతే: ఇంకేమీ లేదిక్కడ ...
***
ఒకోసారి గుర్తుకు వస్తావు నువ్వు; ఎందుకనో -
స్కూలు నుంచి ఏడుస్తో
పోతున్నాడో పిల్లవాడు ఒక్కడే ఎందుకో,

దారే మరి గుక్కపట్టే ఆ పిల్లవాని ముఖమై!

|| baby ... ||

చుక్కలుగా రాత్రిని ఒంపుకుంటున్నాను
కళ్ళల్లోకి
eye drops వేసుకుంటోన్నట్లు

చర్మాన్ని ఓపికగా వొలుచుకుంటోన్నాను
చాపగా మార్చి
శయనించేందుకూ, రాలేందుకూ

బాకుతో ఛాతిని చీలుస్తో ఉన్నానిక; ఒక
పాత్రలోకి చేర్చి
శాంతితో తాగి, అన్నీ మరిచేందుకు ...
***
baby , did I ever tell you that, కళ్ళలోని
అగ్నీ, దహనం
నెత్తురు రుచి మరిగిన వెన్నెలా మరి

త్రవ్విపోసే ఆ పూలబాకూ నువ్వేనని?

|| ఇంకా ||

సాయంసంధ్య; మంచులాంటి వెలుతురు. బహుశా, ఈ గాలి 
ఇంత చల్లగా ఎందుకు
ఉందో, వొణికే ఆకుల మధ్య ఆరుస్తోన్న ఆ పక్షికి

అస్సలు తెలియకపోవచ్చు; (తెలుసునేమో! ఎవరికి తెలుసు?)
మారుతోన్న ఋతువు.
రాలుతోన్న పూవులు. నీలో, ఎంతో తడిచిన నీడలు;

చిక్కటి మబ్బులు కమ్ముకున్న రాత్రుళ్ల గురుతులు; ఎవరివో
కళ్ళూ, శరీరం చేసే
సరస్సు అంచున, గాలికి రావి ఆకులు కదిలి, ఇక

జలదరించి, జలజలా ఎవరి శరీరంలోంచో రాలే శబ్దాలూనూ!
అంతిమంగా, మరి
మరుపే లేని కాలం ఏదో ఇలా, దయ లేక మళ్ళా

నిన్ను నీకే వొంటరిని చేసి కుదిపివేసి వొదిలివేస్తే ...
***
సాయంసంధ్య; పొగలాంటి వెలుతురు. ఎన్నో జన్మల క్రితం
ఒక సరస్సు అంచున,
ఇలాగే, అలలపైకి రాళ్లు విసురుతో ఉన్నాను

"చీకటవుతోంది; చాలిక. పోదాం రా ఇంటికి" అనే ఒకే ఒక్క
ఆ పిలుపు కోసం. చూడు;
ఇంకా అక్కడే, ఆగిపోయి వేచి ఉన్నాను నేను!

ఎంతో ...

చీకటిలో, మ్రాగన్ను నిద్రలో, ఇక 
పొగమంచులో
మరి ఎందుకో, నువ్వు ఒక్కడివే ...

ఓ మంచు బిందువే మరి ఓపలేని
ఎంతో బరువై,
తలను వాల్చిన ఓ తెల్లని పూవు

నీ ముఖమై ఈ ఛాతిలోకి క్రుంగితే
లోపలెక్కడో, ఆ
ఒత్తిడికి కమిలిపోయిన వెలుగు -

ఖాళీ కనుల ధ్వనులు. తరంగాలు
"నువ్వు" అనే
వీడని, ఈ నెత్తుటి ముద్రికలు!
***
చీకట్లో, మ్రాగన్ను నిద్రలో, ఎవరో
తాకినట్లయ్యి
ఉలిక్కిపడి లేచి, ఎవరూ లేక

నిస్తేజంగా, అతనొక్కడే, ఎందుకో!

ఛారికలు

ఎండ వెలిగిన గోడపై, నీడల ఛారికలు,
తెల్లని కాగితంపై
పిల్లలు పెన్సిళ్ళతో గీతలు గీసినట్లు -

అవును; ఇది చలికాలమే. రాత్రి అంతా
మంచు తెరలు వీచి,
ఉదయాన సరస్సులు నిశ్చలమయ్యే

లోకమే. కానీ అడగకు! గడ్డ కట్టినది ఏదో
లోపల అసలు ఏదైనా
చలనంతో జీవించి ఉన్నదో లేదో,

మంచుపేటికలో విగతమైన ముఖంలోని
తాజాదనం, మరి
బ్రతుకు చిహ్నమో కాదో, నువ్వు లేని

లోకాల శ్వేతస్మృతుల మృతప్రాయమో!
***
ఎండ వెలిగిన గోడపై, నీడల ముద్రికలు -
ఎవరివో కనులు వెలిగి
ఆరిపోయినట్లూ, అశ్రువులు ఎండినట్లూ!

ఆచ్చులి*

ఏడుస్తో వచ్చావు ఇంటికి సాయంత్రం; 
నీ ముఖమేమో మరి
ఎవరో ఉండ చుట్టి విసిరి వేసిన
 
ఒక తెల్లని కాగితం -

హృదయంలోనేమో గాలికి దొర్లే కాగితం
చేసే శబ్దాలు; బహుశా,
నేలపై పొర్లి ఆపై గాలిలో తేలిపోయే

అక్షరాలు; అశ్రువులు!

'పడ్డాను నాన్నా' అనైతే చెబుతావు కానీ
చిట్లిన నీ మోకాళ్లపై
చెక్కుకుపోయి నెత్తురోడే, రెండు

చందమామలు. కాళ్ళు

విరిగి కూలబడ్డ రెండు జింకపిల్లలు!
****
ఏడుస్తో వచ్చావు ఇంటికి సాయంత్రం;
నిన్ను వదిలి వచ్చాను
కానీ, నిన్నా, ఈ వేళ అంతా, చలి

నిండిన ఈ దినంలో

ఈ ఎండలో, నా లోపల బెంగగా మరి
రెండు పావురాళ్ళు;
చిరిగిన ఒక కాగితం. రెపరెపమంటో

ఉప్పగా వీస్తో - ఇక

నెత్తురెండిన ఒక తెల్లని రుమాలు!
_______________
* పిల్లవాడి నిక్ నేమ్