22 June 2016

కృతజ్ఞత

ఎంతో సన్నటి చేయి తనది: అలా వాలి ఉంది బల్లపై
తన ముఖం పక్కగా -
***
ముసురుకునే చీకటి: తెరచిన కిటికీలలోంచి వీచే
పల్చటి గాలి. గూటిలో పక్షులు
రెక్కలు సర్దుకునే సవ్వడి -

కళ్లపై పెరిగే బరువు, మంచు ఏదో వ్యాపిస్తున్నట్టు -
ఒక్క క్షణమే, భుజాన ఉన్న బ్యాగ్ని
పక్కనుంచి, శిరస్సును వాల్చితే

లిల్లీ పూవుల్లాంటి చేతివేళ్ళు నెమ్మద్దిగా దగ్గరయ్యి
ముఖం నిదుర నావలోకి చేరుకొని
అట్లా, ఎక్కడికో తేలిపోతే 
***
ఎంతో సన్నటి చేయి తనది: అలా వాలి ఉంది, నీ 
ముఖానికి చాలా దగ్గరగా -
***
ఇక, తన చేతి నీడను కూడా పొరపాటున తాకక
ఒక పక్కగా నిలబడి అనుకుంటాడు
అతను - కృతజ్ఞతగా - ఇట్లా

"ఎంతో తేలికగా, ఎంతో బలహీనంగా అగుపించే
ఆ ధృడమైన చేయే లేకపోయి ఉంటే
ఏమై పోయుందును నేనీ పాటికి?"

No comments:

Post a Comment