23 July 2018

చిత్తు ప్రతి

నువ్వు వెళ్ళిపోయి మిగిల్చిన 
గొప్ప దిగులు ఇక్కడ -
***
అప్పటికి, నువ్వింకా రాలేదు -
పూవులు ఏరి
దాచి ఉంచాను నీ కోసం ...

కిటికీ తెరలలో తెల్లని కాంతి -
నేలపై ఊగే
నీడలు, హృదయ ఛాయతో!
బయట గాలిలో, ఆకులు
వేలపిట్టలై
ఉన్నచోటే ఎగిరే చప్పుడు ...
***
తెలుసు నాకు, తెలుసు నాకు
పద్యాన్ని పొదిగే
స్వప్నకాలం ఇది కాదని -
***
నువ్వు వెళ్ళిపోయి మిగిల్చిన
గొప్ప కోత ఇక్కడ ...
***
ఇప్పటికీ, నువ్వింకా రాలేదు -
***
బయట, చిరుగాలిలో ఎవరో
చినుకుల్తో రాలి
చిట్లిపోతున్న చప్పుడు ...
***
నిజం -
పూలు ఏరడం నేరం అనీ
అతని హృదయం
నీకొక చిత్తు ప్రతి అనీ
అతనికింకా
ఇప్పటికీ తెలియనే లేదు!
***
ఏమీ లేదు -
నువ్వు మళ్ళా వచ్చి, మళ్ళా
వెళ్ళి మిగిల్చే
హత్యలే, లోపలంతటా!

17 July 2018

vignettes

1
కొంచెంసేపు వర్షం కురిసి, మరి
ఆగిపోయింది -
నా చుట్టూతా ఇక, కొలవలేని
ఒక నిశ్శబ్దం;

ప్చ్; నువ్వెప్పుడూ ఇంతే!


2
కదలక నిశ్చలంగా చెట్లు; కూడా
మరి రాత్రీ, ఆకాశం -
గాలిలో తేమ ఏదో పలువరిస్తోంది -

చెప్పు నాకు, నీ పేరేనా అది?


3
బాల్కనీ అంతా వాన వాసన -
రాత్రంతా ఆకాశం
ఇక్కడ కక్కుకున్నట్లు!

తడచి ముద్ధయ్యి, వొంటరిగా
చూడు, చూడు ...
ఓ పూలకుండీ, ఓ కవితా

వాటిని వ్రాసే ఈ మనిషీ!

4
తడచిన చెట్ల నల్లటి బెరడు
అతనికి, ఆమె
శరీరాన్ని జ్ఞప్తికి తెస్తాయి;

తన శరీరపు వాసననీ, తేమనీ
చివరిగా పోటెత్తే
వర్షాన్ని కూడా! ఇక మరి

అతనిలో ఆకస్మికంగా, లక్షల
ఆకులు, నిప్పుతో
రెపరెపలాడుతోన్న సవ్వడి!

5
వీధి దీపాలు కొట్టుకులాడతాయి
చల్లటి గాలి అల ఒకటి
అతనిని చరచి వెళ్ళిపోతుంది -

ఎప్పటిలాగే అతనొక్కడే అక్కడ
దీపస్తంబం కింద
వొంటరిగా; ఎదురుచూస్తో -

6
వర్షం కురిసి, చీకటి ఛారికను
వొదిలి వెళ్ళింది;
మెరుస్తో ఈ రహదారులు -

గాయపడి, వ్యాఘ్రం వలెనో,
హృదయంవలెనో
గర్జిస్తో మరీ రాత్రీ, చీకటీ!

నెత్తురోడుతో అడుగుతాడు
అతను: ఎటు
మనం అనే గూటికి దారి?

7
అతను, ఒక దీపాన్ని స్వప్నించాడు
ఒక పరిమళాన్నీ,
జీవితంలా, వాన చినుకులా

ఒక కవితలా లేక అచ్చు ఆమెలాగా
జ్వలించే ఒక
దీపశిఖనీ కలగన్నాడు; మరి

సరిగ్గా ఘడియలోనే, ఎప్పటిలాగానే
ఎవరో ఎక్కడో
ఎందుకో, అతనికి నిశ్శబ్దంగా

అంతిమ వీడ్కోలు పలుకుతారు!

8
వర్షంలో తడచి, ఇళ్ళన్నీ నిశ్చలంగా
నిలబడి ఉన్నాయి;
వాటన్నిటిలోనూ ఒక శాంతి భావన,

అరతెరచిన నోర్లతో అలా నిదురిస్తున్న
శిశువుల వలే
ఉన్నాయి అవి; అవే, ఆ ఇళ్ళు!

మరి మనం కూడా కలతలు లేని ఒక
నిద్రకి అర్హత
పొంది ఉన్నాం అని అనుకుంటా;

అదెంత క్షణికమైనా! అనంతమైనా!

9
మబ్బులు తొలిగిపోయాయి; ఇంకా
చీకటిగానే ఉంది,
అయినా కొన్నిటిని నువ్వు

చూడగలవు; రబ్బరు చెప్పులతో
ఇంటికి పరిగెత్తుకెళ్ళే
ఓ పిల్లవాడినీ, ఆ చప్పుళ్ళనీ,

వేచి చూసే అతని తల్లినీ, ఇంకా
వీధిలో ఆగిన
మొక్కజొన్న బండ్లపై రాజుకునే

నిప్పునీ, పొగనీ, ఏవేవో మాటలనీ!
పర్వాలేదు, ఇది
బానేవుంది: నువ్వు ఇచ్చిన

నిలుపుకోలేని వాగ్దానం వలెనే!
_______________
*అనుసృజన

14 July 2018

vignettes

1


It rained for a while, and then
it stopped; 
there is a silence that 

one can neither understand 
nor measure!
You always do this to me!

2

The balcony reeks of rain!
As if the sky
has vomited the night!

Drenched, all alone, look -
A flowerpot 
A man and this poem!

3

The dark bark of the trees
reminds him
of her skin; the smell


the moisture and the rain
of her body;
Suddenly, a thousand 

leaves flutter in his heart! 

4

The street lamps flicker;
A wave of breeze
hits him and then recedes.


As always, he stands there
all alone, 
under the tree; waiting!

5

The rain has left a trail 
of darkness;
Roads glistened;

And the night roared like
a wounded 
tiger; Or a heart! 

Bleeding, he asks, tell me
which way 
leads to our home?!

6

He dreamt of a lamp; Of
Perfume; of
A flame that shone


like life; like a rain drop;
like a smile;
Like a poem; Or you! 

It is just then that, someone
somewhere 
says the final goodbye!

7

Soaked in the rain , the houses
stand motionless;
there's a certain sense 

of peace about them; they look 
like kids asleep 
with mouths agape! I think 

we too have earned this sleep
tonight; though
It may be, for a short while! 

29 June 2018

ధ్వని, 3 కవితలు


1
|| ప్రతిధ్వని ||

నీ చేతులు వానని జ్ఞప్తికి తెస్తాయి,
వాన తడిపిన మట్టినీ
మట్టి తడిచిన ఆ సువాసననీ -

నీ మాటలేమో రాళ్ళని రుద్దుకుని
సాగే నీటి పాయలు -
ఎంతటి అందమైన శబ్దం అది!

'రంగుల శబ్దంవి కదా నువ్వు' అని
అన్నాను నేను నీతో,
వానేదో రాత్రేదో తెలియని రోజు!
***
ఇప్పుడు చూడు; వానాగిపోయాక
వీధి దీపాల కాంతిలో,
నా చట్టూతా మార్మ్రోగుతున్న

రాలిన ఆకుల మహానిశ్శబ్దం!

2
|| ఎన్నడైనా ||

నువ్వో ఉత్తరం వ్రాస్తావా నాకు?
ఎన్నడైనా?
అందుకే ఎదురు చూస్తాను,

ఇక్కడ; ప్రియమైన ఈ రాత్రి వద్ద
పొరల పొరల గాలితో,
చీకట్లో, చుక్కల వర్ణమాలతో!

( మరి ఎందుకు అలా అంటే)

ఎదురు చూడటమే కదా ఎవరైనా
చేయగలిగినది,
ముఖ్యంగా ఈ మూగకాలంలో!
***
అవతల ఎక్కడో, ఎగుడు దిగుడు
మైదానాలలో, అట్లా
వానకు తడిచే చెట్లు శోకించేది

ఏమిటో, మరి ఎవరికి తెలుసు?

3
|| పాత కుర్చీ ||

వానకి తడిచిపోయింది
వరండాలోని
పాత వెదురు కుర్చీ,

దాని నుంచి రాత్రంతా
మక్కిన వాసన,
బహుశా చీకటిదేమో ...

బద్దలు చీలిపోయి,మరి
కొన్ని విరిగీ,
గోడకి అట్లా ఆ కుర్చీ...
***
తెల్లవారింది; అయినా
అతనినెవరూ
పలకరించనే లేదు!

01 June 2018

|| communication, 3 కవితలు ||


|| నో నెట్వర్క్ ||

బహుశా, తలుచుకోవు నన్ను నువ్వు -
ఎప్పటిలాగే నువ్వు
నీ లోకంలో, నీ cellలో తప్పిపోయి ..

మరి, ఇక్కడా అంతకన్నా మెరుగుగా
ఏమీ లేదు; నేనూ,
లోయలాంటి ఎండా, సుళ్ళు తిరిగే

గాలికి ఎగిరే చిత్తు కాగితాలూ, దుమ్ము
వీధి చివర ఆగిన
కారు కింద నీడలో, రొప్పే కుక్కలూ

నిటారుగా, లోహ మృగాలై వేచి చూసే
షాపింగ్ mallలూ,
బహుళ అంతస్థులూ, antennaలూ ...
***
బహుశా, తలచుకోవసలే నువ్వు నన్ను
Instagramలోనో,
youtubeలోనో మరి నిండా మునిగి -

పో పో; ఏమ్ స్విచ్చింగాఫ్ దిస్ ఫోన్!

|| బంధీ ||

నేను నీకొక laptopని; ఊరికే
మీటలు నొక్కి
ఏవో దృశ్యాలను తెరచి, నీ

ఖాళీ సమయం గడిపేందుకూ
కాలక్షేపంకై
వినోదం చూసేందుకూ;

అంతే, అంతకుమించి ఏమీ
లేదు; బ్రతుకో
నిరంతర వార్తాప్రసారం,

whatsappలో బంధీ అయిన
శరీరం, ఒక
పోర్న్ సైట్, రాత్రుళ్ళు

చూసే క్రైంపెట్రోల్, ఫైనల్లీ
my బేబీ, నేను
నువ్వాడుకునే ఓ బొమ్మ;

dildo! అంతే!

|| loneliness of a dog ||

ఎవరూ లేరు, అందరూ ఉండి; నువ్వూ
నీ జీవితం వలయం చుట్టూ
ఒక oppo, ఒక redmi A1, Jioతో కలిసి ...

రాత్రి; అకాల వర్షం వెలిసి మిగిలే తేమ,
జిగటగా, ఇరుకుఇరుకుగా;
నేలపై నీడల్లో ఎవరో ఎందుకో చిట్లితే,

తడుముకునే చేతుల్లోకి domino's పిజ్జా
నువ్వు; ఒక mc donald's
burgerవి, ఒక cokeవీ, ఒక నిషా, ఒక

whatsappవి మాత్రమే నువ్వు; ఫేస్బుక్లో
మాత్రమే పొంగి పొర్లే,
స్పర్శ లేని దేహంలేని ప్రేమ నువ్వు,

గుప్పెడు అన్నం కానీ, తాకగలిగే మాట
కానీ, జీవజలం కానీ కాలేని,
ఇల్లు ఓ Homeshop18వి ఐన నువ్వు!
***
అందరూ ఉండి ఎవరూ లేరు; ఎక్కడో
చీకట్లో ఓ కుక్క, మోరెత్తి
ఏడుస్తో, ఆనక ఆగి ఆగి మూలుగుతో -

ఇక ఇవే ఈ రాత్రికి తోడు: ' Hi from Dr
C! Health Check @ HOME
61 tests, Rs 849 only. Just 10 min'

'మీరు, వొంటరిగా ఉన్నారా? అయితే
కాల్ చేయండి 54565కి'
'Mr. Reddy we've a loan offer of ...'

మాటిమాటికీ స్క్రీన్ను స్క్రాల్ చేసే ఈ
బొటనవేలు, గొంతు తెగేలా
అరుస్తోన్న ఒక naaptol అమ్మాయి!

06 May 2018

|| ఇక్కడ ... ||


1
రెండు ఖాళీ అరచేతులంత చీకటి
ఒక రెక్క తెగి,
కిటికీ అంచుకు వేలాడే సీతాకోకై,
2
ఊచలే ఇప్పటికి మిగిలిన వాస్తవం
బంధీ అయినది
ఏమిటో ఎవరో కూడా తెలియదు,
3
పగిలిన ఓ కుండై ఈ రాత్రి ఆకాశం
అడగకు ఇక
చుక్కలు మరి ఎవరి అశ్రవులని,
4
పెగిలీ పెగలని గాలి గొంతు; వొణికీ
గుక్కపట్టీ, అది 
పాడే పాట లోపలో మృత్యువైతే,
5
ఇదే సత్యం ఇప్పటికీ; నిను  తలచి
తెగి, నేల రాలి 
దేనికిందో చితికి, నుజ్జునుజ్జయి ...

02 May 2018

|| ఉనికి ||


ఎంతో పల్చని ఎండ, మరి ఓ పొరలా;
సవ్వడి చేయని గాలి -
ఆవరణలో తాకీ తాకని నీడలు

త్రవ్విన మట్టికి పైగా చల్లిన నీళ్ళల్లో
తడిచిన రాళ్ళు; మెత్తగా
అమ్మ కళ్ళలాగా మెరుస్తో స్రవిస్తో

నేలపై ఎప్పుడో రాలిపడినో పసుపు
ఆకు; గవ్వలాగా, మరి
ఒక శరీరంలాగా, ముడుతలతో ...
***
ఎంతో పల్చని ఎండ, మరి ఓ పొరలా;
అక్కడే ఒక పిట్ట
అటూ ఇటూ ఎంతో తచ్చాట్లాడి

చివ్వున ఎటో అట్లా ఎగిరేపోయినట్టు
అమ్మకి తప్ప ఇంకెవరికీ 

మరి, ఎందుకో తెలియనే లేదు!