17 January 2018

a shit poem

I talk shit; you too, like; "ఎలా ఉన్నావు?"/ "Ha. నే బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు?" / "ఏమో; ఉన్నానో, లేదో తెలియడం లేదు" / "అదేంటబ్బా ఆలా అంటావు? హెల్త్ బావోలేదా" /

"బావుంది; అందుకే ఏమీ తెలియడం లేదు." / "హ్మ్మ్, అవునా?! ఇంకా? ఏమైనా చెప్పు?" / "ఎదురుగా అపార్ట్మెంట్లో ఊరు వెళ్ళారు. కింద అపార్ట్మెంట్లోనేమో ఇద్దరు బ్యూటిఫుల్బెంగాలీ బేబ్స్ దిగారు; వాచ్మెన్ కూడా ఊరు వెళ్ళాడు. రైతు బజార్బంద్! ఇంట్లో కూరగాయలూ లేవు"/

"అబ్బా, అవి కావు, వేరేవి ఏమైనా చెప్పు" / "వేరేవి అంటే? అంటే అవి ఎట్లాంటివి?" (బ్రాకెట్లో ఈ స్మైలీ) / "హ హ హ. అట్లాంటివి కాదులే బాబూ! ఇంతకీ నువ్వు బుక్ వేస్తున్నావా లేదా?"/ / బొజ్జ నిండా బాయి తాగి బుక్ బజ్జుంది. రాత్రి మరి పక్క నిండా అది సుస్సూ కూడా పోస్తుంది. ఆ సుస్సూ కవితల్ వలే వాసన వేస్తాయి. అవి ఏడుస్తాయి, నవ్వుతాయి, నిన్నూ లేపుతాయి"/

"హి హి హి. భలే చెప్తావు నువ్వు. నిజం" / "నిజం. అవి నీ వొడిలో చేరతాయి. నీవైపు చేతులు చాస్తాయి. కాళ్ళు కొట్టుకుంటూ, ఏవో ఆటలు ఆడతాయి, నిదురోతాయి" / "Ha Ha Ha. అందుకే నువ్వు poetవి". / "తొక్కేం కాదూ! ఇంకా చెబుతా విను .../

/"నిదురలో వాటికి ఏవో కలలు వస్తాయి. ఉలిక్కిపడి లేచి, అవి నీవైపు తిరిగి, నిన్ను గట్టిగా హత్తుకుని గుక్కపట్టి మరెంతో ఏడుస్తాయి; నీ రొమ్ములని తాకి, నిన్ను తాగి శాంతిస్తాయి. నీకు నిదురలేకుండా చేసి అవే అర్థరాత్రికో నిదురోతాయి, ఇంకా ..." /


/"అబ్బా ఇంకా ఆపు బాబూ! తిన్నావా ఇంతకూ?" / ఆ, తిన్నా. తిన్నావా నువ్వు ఏమైనా లేక అలాగే కూర్చున్నావా?" / ఊ. ఇంకా తినలేదు. కొంచెం ఆగి తింటాను. రాత్రంతా ఏవో పిచ్చి కలలు వస్తున్నాయి ..." / "ముందు తిను పిల్లా నువ్వు" / "తింటాలే కానీ, ఇంకా? ఇంకా ఏంటి సంగతులు?" / "ఏముంటాయి? ఏమో.. మరి తెలియదు నాకు. నువ్వే చెప్పాలి ..." /

"హ్మ్, ఎలా ఉన్నావు నువ్వు?" / "Ha. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు?" / "నేనా?"/ " ఆ. అవును. నువ్వే. ఎలా ఉన్నావు?" / "నేను... అంటే, నేనెలా అంటే ..."
***
I talk shit. You talk shit. we talk shit. You know, sometimes it keeps us alive!

14 January 2018

సరిహద్దు

ఎంతో ఇష్టంగా ఒక ముఖాన్ని పుచ్చుకున్నావు; ఒక ప్రమిదెను అందుకున్నట్టు!

కనుచూపుమేరా చీకటి. తీరాన్ని తాకి అక్కడే ఉండలేక, ఒడ్డుకేసి తలలని బాదుకునే అలల ఘోష. గాలిలో ఏదో ఉప్పటి వాసన; బహుశా, ఇసుక తెరలుగా మారిన, నీ కళ్ళల్లో కావొచ్చు. దూరంగా ఎక్కడో లీలగా జాలరుల పాట. ఒక శోక గీతమై, హృదయపు కోతై, ఈ రాత్రిని రెండుగా చీల్చే ఒక గీతై, మెత్తగా కోసుకుని పోతో; ! హ్మ్ ఇదంతా నీకు తెలిసినదే; ప్రాచీనమైన ఒక గాధనే. చీకట్లో మెరిసే నక్షత్రాల పరివేదనే! తగలబడే కాగితాలలోని శరణార్ధుల అక్షరాల  ఆక్రందనలే !
***
ఎంతో ప్రాణంగా, ఒకరిని హత్తుకున్నావు; శిశువులా నిదురించావు; ఏదో కలతై ఇక కలలో దిగ్గున లేచి చూస్తే, నీ ఎదురుగా ఊగే ఒక ఖాళీ ఊయల. చెల్లాచెదురుగా పడి ఉన్న, సగం గీసిన చిత్రాలు. నేలపై విరిగిన ఓ బొమ్మై, కాళ్ళూ చేతులూ మొండెం లేని నువ్వు!

13 January 2018

కన్సర్న్

అయ్యో! కంగారు పడకులే!
ఊచలకి వేలాడబడి
రాత్రిని చూడటం, వినడం
అలవాటే నాకు,

ఖాళీ గూళ్ళతో మాట్లాడటం
వాటికి, ఈ వేళ రాని
వెన్నెల గురించి చెప్పడం
మామూలే నాకు,

అయ్యో! నువ్వు అసలు ఏం
చింతించకు; నీతో,
రాళ్ళతో, సహజీవనం చేసే
విద్య ఏదో మరి

భలేగా అబ్బిందిలే నాకు!

చూడు: ఇక్కడింకా, బ్రతికే
ఉన్నాను నేను, ఇలా
ఈ చెత్తని, ఎంతో చక్కగా
రా/కో/సుకుంటో ...

పో! పో! వెళ్లి, నువ్వు కూడా
మరి ఓ పోయెమ్ని
త్వరితంగా కక్కుకో! ఇక
రేపు ఎప్పుడన్నా

మనం, శరీరం కాలేని, ఒక
పదం గురించీ,
పనికిమాలిన తత్వాల్లోని
ఆత్మ గురించీ,

ఎంతో మాట్లాడుకుందాం! 

నారింజ

నారింజను వొలిచే ఆ చేతివేళ్ళని
చూసావా ఎపుడైనా?
కంటిపై నీటిపొరని తుడిచినట్టు,

ఎంతో ఒద్దికగా ఓ మూల పట్టుకుని
మరెంతో సున్నితంగా
ఇంకో మూలదాకా నిన్ను వొలిచే,

సుకుమారమైన తన చేతివేళ్ళని?
మరి సూర్యరశ్మినీ
పుప్పొడినీ నింపుకున్నా కళ్ళనీ?

ధ్యాసతో ముడుచుకున్న పెదాల్నీ
వొంచిన తన తలకు
పైగా వీచే, పల్చటి గాలి తెరల్నీ?

పిచ్చుక రెక్కలని విదిల్చినట్టున్న
ఆ చేతి కదలికల్ని?
నీపై చిల్లే, తొనల్లోని తడివంటి

వేసవి ఆగమన, తన మాటల్నీ?
***
నారింజని వొలిచే ఆ చేతివేళ్ళని
చూసావా ఎపుడైనా?
నిన్ను, సమూలంగా వొలిచినా

బద్ధబద్దగా నిను చీల్చినా, మరి
నీ దాహాన్ని తీర్చి,
నిన్ను మరో వేసవికి సిద్ధం చేసే

జీవధాతువైన, ఆ నారింజని? 

11 January 2018

అయితే ...

1
పూవువే,
ఓ పరిమళానివే
మసక వెన్నెల్లో ఎగిరే సీతాకోకవే,
రాత్రి శ్వాసవే

నువ్వు
వెచ్చని పొగమంచువే!
నిన్ను
కాదన్నదెవరు?
అయితే,
2
మరి,
ఆ చీకట్లో, ఆ గాలిలో
కొడవలై ఓ నెలవంక అతడిని
నిలువునా
చీరేస్తే
పూలమౌనాల్లోని ముళ్ళలోకీ
నీడలఊచల్లోకీ
'దాహం'
అని అర్దిస్తో

నీలోకి
వొరిగిపోయింది
ఎవరు?

ఇక్కడ

1
వెళ్ళడానికి ఎటూ లేదు,
ఇదో సిటీ పోఎం
ఇరుకిరుకు అపార్ట్మెంటై
2
ప్రేమ, పొగమంచులోని
జాబిలి కదా,
అది నీలో ఎగిరే సీతాకోక
కదా, అని

డిజిటల్గా వ్రాసింది!

స్మార్ట్ఫోనో మెత్తని చేయి,
విడవలేక ఇద్దరూ
ఆ రాత్రి భలే రమించారు

FBలో msgలు టైపిస్తో!
4
వెళ్ళడానికి ఎటూ లేదు,
ఇదో గాయమ్,
సిటీయై, సిక్ ఐ, I లేని

పొగచూరిన యంత్రమై
5
గృహంనుంచి రూకలకై
రాజ్యంరొటీన్ఐ
తిరిగి, సంతైన ఇంటికి

రెడ్లైట్ లేనో జంక్షన్ఐ,
6
ప్రేమ, నీలో విచ్చుకునే
ఒక పూవు కదా,
దాని స్వప్న పరిమళం
కదా, అని

jioతో ఓ sms పంపింది!
7
బయట ఇక, hope అని
రాసున్న apronతో,
జీవితం ఒక అమ్మాయై

ఆగిన ప్రతి car వద్దా ఓ
డబ్బాను చాచి,
మౌనంగా చూస్తోంది!

09 January 2018

ప్రశ్న

"ఇంటికి వస్తావా?" నువ్వు
అడుగుతావు,
పీలగా నీ గొంతు, తెగినట్టు

ఇసుక తెరలవంటి ఆకాశం;
సాయంసంధ్య,
తెరచాప లేచిన నావ అది

మసకగా గాలి; కొంచెం చలి,
టెలిఫోన్ వైర్లపై
ఒక్కటే, ఒక శ్వేత కపోతం
(నువ్వేనా అది?)

"ఇంటికి వస్తావా?"ని నువ్వు
అడిగిన చోట, ఇక
ఒక పచ్చని గాజుపెంకు

మొక్కలా తొలుచుకు వచ్చి
రాత్రై చూస్తోంది;
నేల చీలిన చోట, నొప్పి!
***
"ఇంటికి వస్తావా నువ్వు?"
అడుగుతావు
ఎంతో నిస్సహాయతతో,

దారికిరువైపులా వాహనాల
రద్దీని దాటలేక,
ఎవరో అశ్రువులతో అట్లా

ఆగి, నిలబడిపోయినట్లు! 

07 January 2018

ప్రక్రియ

ఆవరణ అంతా చీకటి; రాలిన
ఆకులు. ఏదో
ఒక మాగిన వాసన అంతటా,

"మ్మా" అని పిలుస్తావు; ఎవరూ
పలుకరు. ఏదో
బూజులాంటి నిశ్శబ్దం లోపల,

పైన, ఒక సాలెపురుగై ఆకాశం;
అది అల్లే గూళ్ళై
మబ్బులు; గూట్లో చిక్కీ రాత్రి,

రెక్కలు అతుక్కుపోయి, ఇక
కదలలేక, మరి
నీవైపు నీరు నిండిన కళ్ళతో!
***
ఆవరణ అంతా, చీకటి; ఏవేవో
శబ్దాలు; వొణికే గాలి;
ఒక సిరాముద్దై, కణితై ఇల్లు!

లోన, నిస్త్రాణమైనది ఎవరు?

03 January 2018

ఎవరు?

తల వంచుకు కూర్చున్నావు నువ్వు;
తడిచి ముద్దయిన ఒక
పిచ్చుకలాగా, గాలిలో నిశ్శబ్దం,

"ఏమైంది?" అని, అడగాలని ఉండీ
అడగలేక, తడిచిన
ఆ రెక్కల బరువు కింద ఒక్కడినే,

మోపలేకా, ఎత్తాలేకా, నీడలో లేక ఒక
రాత్రో వ్యాపించినట్టున్న
కురుల కింది ముఖాన్ని చూడలేక,

"చెప్పవా?..." అని, అడగాలని ఉండీ
అడగలేక, కురిసిన
నీ కనుల చీకట్ల కింద ఒక్కడినే/నై,
***
తల వంచుకు కూర్చున్నావు; నువ్వు,
పొగమంచులాగా; మరి
ఎప్పుడో తప్పక అడుగుతాన్నేను

నిన్ను ఓ రోజు; "రెక్కలారిన పిచ్చుక
మాటలొచ్చి ఎగిరిపోతే,
రెక్కలు తెగి ఇక, రాత్రిలోకి అట్లా

నెత్తురుతో రాలిపోయేది ఎవరు?"

02 January 2018

ఒకనాడు

ఒకనాడు, ఏ ఏటి ఒడ్డునో
చేరగిలబడి,
నీటిని తదేకంగా చూస్తావు,

నీలో, ఊగిసలాడే అలలు,
వాటి చప్పుడు;
ఉఫ్మని ఎగిరే, తూనీగలు ...

నీ బరువుకు నలిగిపోయిన
ఒక పసుపుపూవు,
పశ్చిమాన క్రుంగె సూరీడు!

నీళ్ళల్లో నువ్వో, నీలో మరి
నీళ్ళో, నీడలై
ఎటో తేలిపోయే వెల్తురు...
***
ఒకనాడు, ఏ ఏటి ఒడ్డునో
లేచి నిలబడి,
చేతులు దులుపుకుంటే,

తన ముఖాన్ని తాకిన నీ
అరచేతుల్లోంచి,
చుక్కలై నేల రాలే, మరి

ఎవరివో బేల అశ్రువులు!

01 January 2018

ముగింపు

ఎంతో దూరం నడుస్తాను
చేరుకోవాలని,
చివరి చినుకు ఆగేదాకా -

పచ్చటి కనులతో రాత్రి,
తడిచీ, వొణికీ,
ఏ దీపస్థంబంపైనో ఆగి -

దారి అంతా నీ ఊహే; ఓ
దీపమై, నీడల్లో
పరిమళమై, జీవజలమై,

బహుశా, నువ్వు మాట్లాడే
మొదటి మాట,
నా తొలి శ్వాసా, శబ్ధమూ!
***
ఎంతో దూరం నడుస్తావు
చేరుకోవాలని;
చివరి చినుకు రాలదు,

ఈ రాత్రిక, తెలవారదు!