29 December 2014

abyss

"రాయడం ముఖ్యమా? రాయకపోవడం అంతకన్నా ముఖ్యమా?" అని అడిగాడు అతను-
తను ఏమీ మాట్లాడలేదు. ఒక సాయం సంధ్యవేళ
మసక చీకటి, పరదాలవలే జాలువారుతున్నవేళ

ఎదురుగా సైకిళ్ళపై వేగంగా వెళ్ళిపోతూ పిల్లలు. బెల్లులు గణగణమంటూ -
అంత చలిలోనూ ఎవరో వాకిలిలో చల్లిన, కళ్ళాపి
వాసన. పచ్చిగడ్డి వీచినట్టూ, ఒక స్త్రీ లేచి పాకలో
దీపం వెలిగించినట్టూ, ఆ రాత్రిలో నీ కళ్ళల్లో ఇంత
ప్రాణం పోసినట్టూ, తేరుకుని నువ్వు, తొలిసారిగా

 చూసినట్టూ - ఒక పదం, ఒక వాక్యం . ఒక విభ్రమం. ఆపై ఒక నిశ్శబ్ధం కూడా-

"రాయడం నిజంగా మరీ అంత ముఖ్యమా?" అతను మళ్ళా అడిగాడు, తనలో
తాను ఏదో గొణుక్కుంటూ, చీకట్లోంచి తలెత్తి
ఎవరూ కనిపించని చీకట్లోకే మళ్ళా చూస్తూ -

ఆ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు కానీ, ఇక అక్కడ

ఇంటికి వెళ్ళలేని ఒక పాపో, లేక దారి తప్పిన ఒక పిల్లవాడో, ఏడ్చీ ఏడ్చీ ఏడ్చీ
ఆఖరికి గుక్కపట్టి పెట్టే వెక్కిళ్ళు, ఆ రాత్రిలో
ఆకాశంలో మిణుకుమిణుకుమనే నక్షత్రాలై
ఆకుల నుంచి రాలే చినుకులో, అశ్రువులో

I

పో

యి

మిగిలీ, పిగిలీ
పొర్లి పొర్లి పొర్లి

పో

యీ
... 

19 December 2014

వాదన

తలుపులు తెరచి చూస్తే, నువ్వు వొదిలి వెళ్ళిన గుర్తులు:
బహుశా, నువ్వు నాకు ఇద్దామనుకుని తెచ్చిన
రెండు పుస్తకాలూ, ఇంకా ఒక పూలకుండీ -

నీకు తెలుసు: పూలను నేను ఎన్నడూ పెద్దగా ప్రేమించలేదని -
విరగబూసిన పూలని పూలపాత్రలో నింపుకుని
ఊరకే అలా చూస్తూ ఉంటాననీ, గడిచే కాలంతో
మారే వాటి రంగులూ, వడలే ఆకులు మాత్రమే

నాకు ఆసక్తి కలిగిస్తాయనీ, ఇంకా - గోడలపై  గాలికి రెపరెపలాడే
వాటి నీడలే నాకు మిక్కిలి ప్రాణమనీ, నిజానికి
కొమ్మకి ఉన్న పూలనెన్నడూ నేను వినలేదనీ!

అయినా, నువ్వు వచ్చిన ప్రతీసారీ నీతోపాటు ఒక పూలమొక్క
తల్లి ఒడిలాంటి మట్టితో, కుండీతో ఇంకా కొంచెం
నిన్ను అద్దుకున్న సువాసనతో: వాన తడితో -

అందుకే ఇవాళ, పూలను తెంపలేదు. పూపాత్రలో
అలంకరించలేదు. నీడలలో వేళ్ళు ముంచి, నీకై
ప్రతిబింబాలని ఏమీ రాయలేదు. రాళ్ళూ పూవులే
పూవులూ రాళ్ళే అని ఎవరితోనూ వాదించలేదు -

ఇచ్చిన హోంవర్క్ చేసి బుద్ధిగా కూర్చున్న ఒక బాలుడి వలే
చేతులు కట్టుకుని, కిటికీ ముందు, రాత్రిలోకీ, ఒక
నిశ్చలమైన చీకటిలోకీ - మరి నీ కోసమో, ఇక నా
కోసమో ఇక్కడ, నువ్వు వొదిలి వెళ్ళిన ఓ గుర్తునై

చిహ్నాన్నై, జాడనై, ఎదురుచూస్తో...  Tell me:
నన్ను తీసుకుని ఎప్పుడు తిరిగి వస్తున్నావు నువ్వు? 

18 December 2014

భారం

శీతాకాలపు చలిలో
రాలే ఆకుల ముందు కూర్చుంటే
నువ్వే గుర్తుకు వచ్చావు -

రాలుతూ, గాలికి కదులుతూ
నేలపై అవి చేసే నీడల సవ్వడులే
నీ కళ్ళు.

"ఇక ఇప్పుడు
ఎవరికి ఇవ్వను? నేను దాచిపెట్టుకున్న
ఈ పూలను?"

అని అడుగుతావా
ఖాళీ గూడుగా మారిన ఒక ఊయల ముందు
కూర్చుని నువ్వు

అమ్మాయీ
కళ్ళు తుడుచుకుని, తల వంచుకుని
కూర్చున్న వాళ్ళ ముందు

కూర్చుని
ఇక మాట్లాడగలిగే మాటలేమీ ఉండవు -
మళ్ళా వస్తాను

ఒక ఊయలతో
నీ అంత అశ్రువుతో, నీ అంత భారంతో
నీ అంత ప్రేమతో-  

04 December 2014

తల్లడిల్లే కాలం

పూవు రాలిపోతుంది.

హోరున వీచే గాలి దానిని లాక్కు వెళ్లిపోతుంది.
ఇక కొమ్మకు ఆకులు విలవిలలాడితే
ఏ క్షణాన అవి తెగుతాయో, ఏ క్షణాన
ఇక నువ్వు ఒంటరివాడివి అవుతావో

నీకూ తెలియదు, తనకూ తెలియదు-

తెలిసేలోగా
పూవూ రాలిపోతుంది. కొమ్మా విరిగిపోతుంది.
చేతిలోంచి చేయి జారి, నీ హృదయమే,ఈ
లోకపు మేళాలో ఎక్కడో తప్పిపోతుంది -

ఇక ధూళి రేగి, కళ్ళల్లో చేరి, మబ్బులో
లేక గుబులో లేక దారి పక్కగా ఒరిగిన
ఒక కాగితమో, దానిలోని ఒక పదమో

నువ్వు ఎన్నాళ్ళుగానో వెదికే ఒక పూవై
కొట్టి వేయబడి
విసిరివేయబడి

ఇక
దిద్దలేకా
దిద్దలేకా
దిద్దలేకా...  

28 November 2014

పెద్దపులి ఆ అమ్మాయి

పెద్దపులి ఆ అమ్మాయి.

తెల్లని చామంతుల కళ్ళే తనవి. నొప్పించినప్పుడు ఎవరైనా, బేలగా నీపై కురిసే మంచు రేకులే అవి. 

పెద్దపులి  ఆ అమ్మాయి.

తల్లివైపు పరిగెత్తే పసిపాపల వంటి చేతులే తనవి. ఓ ప్రేమ కోసమో, ఒక తోడు కోసమో, లోకంవైపూ ఇతరులవైపూ సాగి, నలిగిపోయి లుప్తమై వెనుదిరిగితే, వడలిపోయిన సాయంత్రాలై నీ ఛాతిపైకి జారే -తల్లి లేని - పిల్లి కూనలే అవి- వడలిన కాడలై నిర్లిప్తంగా వేలాడే పసి పిల్లలే ఆవి. తెల్లని చేతులే తనవి. 

పెద్దపులి ఆ అమ్మాయి.

పూల తోటలాంటి ముఖమే తనది. నువ్వు ఏం చెప్పినా నమ్మే, నువ్వు ఏం చెప్పినా నమ్మి సముద్రాలనూ ఎడారులనూ దాటి, నీకై ఎదురు చూసిన పచ్చటి ముఖమే తనది. ఒకప్పుడు నీకు పాదుగా మారి, నీవు ఏపుగా ఎదిగేందుకు తోడ్పడిన మహాఇష్టమే తనది. నీకై రాత్రుళ్లుగా, మట్టికుండగా, నక్షత్రాలు మెరిసే ఆకాశంగా, చివరికి నువ్వు భక్షించే ఆహారంగా కూడా మారిన శరీరమే తనది. ఇక ఇప్పుడు, వొణికే హృదయంతో, ఒక నీటి చెలమగా మారిన కాలమే తనది. ఎవరికీ చెందని లోకమే తనది. 

పెద్దపులి ఆ అమ్మాయి.  

అన్నిచోట్లా, ఎల్లప్పుడూ 

నిన్ను ప్రేమించి, ప్రేమించడంతోనే ఒక శిల్పంగా మారి, ఇక ఇప్పుడు తనలో తాను, తనతో తాను ఒంటరిగా సంభాషించే, ఒంటరిగా సంచరించే, తనను తాను కౌగలించుకుని, తనలో తాను దిగులుతో ముడుచుకుపోయే, అంతంలేని శీతాకాలపు రాత్రుళ్ళ, ఎవరూ లేని దారుల, ఆరిన చితుకుల మంట చుట్టూ నెమ్మదిగా ఇంకే వాన చినుకుల సవ్వళ్ళుల  

పసి పసిడి పెద్దపులే ఆయిన ఆ అమ్మాయి

ఎన్నడైనా, ఎక్కడైనా- ఒక్కసారైనా
ఎందుకైనా గుర్తుకు వచ్చిందా నీకు?

26 November 2014

అన్నా, నమస్తే అను ఒక మిడిల్ ఏజ్ వచ్చిన పద్యం

-అన్నా, నమస్తే-

......

-ఏమే, ఈ మధ్యన కనిపిస్తల్లేవ్?-

......

-సాయంత్రమేంజేస్తున్నావ్? కలుద్దామా?-

-ఈ మధ్యన త్రాగడం లేదు-

-ఏ... ఊరుకో అన్నా. మజాక్ జేస్తున్నావా ఏంది? ఏమైయ్యిందే?-

-ఏం లేదు. కొంతకాలం మానేద్దాం అనుకున్నా-

-అవునా? మరి మానేసి ఏం చేద్దామనే?-

-ఏం లేదు. ఈ మధ్య యోగాలో చేరాను...

-అవ్నా? ఇంకేం జేస్తున్నవే? ఎక్కడ కనిపిస్తల్లేవ్? ఏం రాస్తల్లేవ్?-

-రాయడం మానేసాను -

-ఎందుకే? ఏం చదవడం కూడా లేదా?-

-చదువుతున్నా. మళ్ళా రజనీష్నీ, ఇంకా...

-నువ్వు సైకోగాడని పిల్సుతుండే... గాడ్నా?!

-ఆ... రజనీష్నీ, జిడ్డు కృష్ణమూర్తినీ, రమణ మహర్షినీ, నిసర్గదత్తనీ
ఇంకా టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ లాంటివి మళ్ళా చదూతున్నా-
రేపెప్పుడన్నా  ఏదన్నా మెడిటేషన్ సెంటర్లో చేరుదామని కూడా
అనుకుంటున్నా-

-గిదేందే?-

-ఏమో?-

-ఎన్ని రోజోలసంది తాగడంలే? ఊర్కో అన్నా. దా... కాసేపు గూర్చుందాం...

-నిన్నటి నుంచే మానేసాను.
నాన్ వెజ్ కూడా. యోగా చేరి పది రోజులవుతుంది. వాకింగ్కీ, జిమ్కీ వెళ్తున్నా
డైట్ మార్చాను. మొలకలు లాంటివీ, ఇంకా
బాయిల్డ్ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటున్నా-

-నీకేదో అయ్యిందన్నా. ఇప్పుడేడకి?-

-అమ్మను చూసి రెండు వారాలయ్యింది. ఒకసారి చూసొద్దాం అని వెళ్తున్నా-

-అవ్నా ...

-నా సంగతి సరే కానీ, నువ్వేం చేస్తున్నావ్?-

-ఇగో ఏమనుకోకు కానీ
నీలాంటోల్లకి దూరంగా ఉండాలని ఇప్పుడే అనుకుంటున్నా-

.......

- సరే అన్నా - ఉంటా. మల్ల కలుస్తా.
అన్నా... నమస్తే -

25 November 2014

గుర్తుపెట్టుకో ఆ అరచేతులను

ఆ రెండు అరచేతులలోకి, నీ అరచేతులని వొదిలివేసి
అలా కూర్చుంటావు నువ్వు-

శీతాకాలపు సాయంత్రం.
శరీరంలో గుబులు చెట్లేవో వీచి, కలకలంతో పక్షులు
ఒక్కసారిగా గుంపుగా లేచి, తిరిగి సర్ధుకునే
ఒక జ్ఞాపకం. ఇక నెమ్మదిగా తల ఎత్తి తను

నీవైపు చూసిందో లేక ఆ కళ్ళలో కనిపించే నీటి తెరలను
నువ్వే సాయంత్రంగా భ్రమించావో, లేక
ఆ నీటి తెరలపై, అలసిన నీ అరచేతులను

కాగితపు పడవల వలే వొదిలివేసావో, లేక
తనకు చెప్పాలనుకుని రాసుకున్న ప్రేమ
లేఖలన్నిటినీ చెప్పలేక చించివేసావో, ఒక
నిట్టూర్పుతో వొదిలి వేసావో, మూగవాడివి

ఎందుకు అయ్యావో, నీకూ తెలియదు. తనకూ తెలియదు.

ఇక - తల ఎత్తి ముఖం వైపు చూసేలోపు, చప్పున
ముఖం తిప్పుకున్నదీ, గుండెను ఉగ్గపట్టుకున్నదీ
ఎవరో కూడా తెలియదు-
ఇక చివరకు మిగిలేదల్లా

ఒక శీతాకాలపు సాయంత్రం: ఖాళీ గూళ్ళు. నీడలు -
సన్నగా వొణికే చలి రాత్రీ, ఒంటరి చీకటీ
అరచేతుల్లోంచి అరచేతులు తొలిగిపోయి

నెమ్మదిగా దీపాలను ఆర్పి, తమలోకి తాము
ముడుచుకుపోయే మన చేతివేళ్లూ
ఈ కాలం, లోకం, చీకటిని చీలుస్తూ

గదిలోంచి వెళ్ళిపోయే - నీదో, నాదో -
మరి ఒక దేహ దీప ధూపం! 

19 November 2014

a little conversation of sorts

"ఎలా ఉన్నావు?"

"తెలియదు."

" ఏం రాస్తున్నావు ఈ మధ్య?"

"Nothing."

"No thing or nothing?"

"రాయడం మానివేసాను.
Or rather
It is the other way around."

"అంటే?"

" రాయడం
నేను మానివేయడం కాదు
బహుశా ఆ లిఖితమేదో
నన్ను లిఖించడం
మానివేసింది."

"అవునా?"

"కాబోలు."

"ఇంకా?"

"........."

"మరి
If you are not writing
Or rather
If writing has left you

What are you
Left with

Right now?"

"Only this: You.
నువ్వూ, ఇంకా
ఒకే ఒక వాక్యం-

Elahi, Elahi, lmana shwaqthani?"

PS:
And then
She said:
"I think
You are eligible
For a kiss.
Now-" 

10 November 2014

ప్రేమ ఉందనీ, లేదనీ

ప్రేమ ఉందనీ అనుకుంటావు, లేదనీ అనుకుంటావు-

ఎవరివైనా చేతివేళ్లు మెత్తగా పెదాల్ని తాకితే, సర్వం మరచి
తిరిగి అన్నిటినీ నమ్ముదామనీ అనుకుంటావు-
అప్పుడు

ఇక ఆ చేతివేళ్ళని పదాలుగా ఊహిస్తావు. నిన్ను చూడగానే
పూవులు విచ్చుకునే కనులగానూ
పచ్చిక బయళ్ళపై  అలవోకగా వీచే
చిరుగాలి వంటి ఒక చిర్నవ్వుగానూ

స్వప్నిస్తావు. నీలోపలే, రహస్యంగా
ఒక దీపం వెలిగించుకుని, ఒక తోటని సృష్టించుకుని
స్వప్న సువాసన చలించే, 'నువ్వు'
అనే కొన్ని పదాలని రాసుకుంటావు

"ఇదేమిటి?" అని అడిగిన వాళ్లకి

"ఇదంతా ఒట్టిది. ఈ దీపపు కాంతి నిన్నటిది.
ఈ కవిత కూడా నిన్నటిదే. ఒక
వడలిన పూవుదే. వెలసిన ఒక
వానదే. వీడిన వానని వదలలేక

ఆకుల చివరన ఊగిసలాడే ఒక చినుకుదే

నువ్వు ఇంకిపోలేని కాంతిలోని
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సుదే.
మరి ఇది ఇప్పుడు నీ ఎదురుగా
గూడు కట్టుకుంటున్న ఒక పిచ్చుకదే: దాని ముక్కులోని ఒక పుల్లదే"

అని చెబితే, అంతా విని "మరి ఇంతకూ
ప్రేమ ఉందని అంటావా లేదని అంటావా?
సరే ఇది చెప్పు:నిన్ను నమ్మడం ఎలా?"
అని తనో - వాళ్ళో అడిగితే, అతి మెత్తగా

వాళ్ళ పెదాలపై నీ చేతివేళ్ళని ఉంచి ఇలా అంటావు:
"ష్. ఇక మాట్లాడకు. అంతా నిశ్శబ్ధం -
వేళ దాటింది. హృదయం వెలిగింది
మౌనం మాట్లాడింది. ఇక ఈ కవితను
ఇలా ముగిద్దాం, మనిద్దరమూ:"

'ప్రేమ ఉందనీ అనుకోకు, ప్రేమ లేదనీ అనుకోకు. ఎవరి పెదాలపైనో
చేతివేళ్ళయ్యో, చిరునవ్వయ్యో, ఒక
దీపపు కాంతి అయ్యో వెలిగాక, ఒక
లేత పిలుపై తేలిపోయాక, ఇక నీకు

పదాలతో కానీ, శబ్ధాలతో కాని, ప్రేమతో కానీ
ప్రేమారాహిత్యంతో కానీ పని ఏమిటి?"

06 November 2014

నీడలు

చీకటి ఒక దీపంలా వెలుగుతున్న క్షణాన
ఒక్కడివే నువ్వు-
అప్పుడు ఆ రాత్రిలో

తడిచి ముద్దయిన గోడలు. గోడలపై
లోపలేవో ఊగిసలాడుతున్నట్టు
విలవిలా కొట్టుకులాడుతున్నట్టు
అటూ ఇటూ ఊగే లతలలాంటి నీడలు. వణికే నీడలు-

ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని
ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా
కాని కాలేని, నిన్ను వణికించే నీడలు.

రాత్రి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని
పడుకోనివ్వని, తల్లి లేని నీడలు
నిన్ను తండ్లాటకు గురి చేసి
నిన్ను ఆనాధను చేసే నీడలు

'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ
వలయాలుగా పరచుకునే నీడలు
వాన సవ్వడి చేసే, కన్నీళ్ళ వాసన వేసే నీడలు
నల్లని, తెల్లని లేతేరుపు నీడలు

పాలిచ్చే నీడలు. పాలు తాగే నీడలు.
ప్రేమించే, ద్వేషించే, నవ్వే, ఏడ్చే
కావలించుకునే నీడలు. స్ఖలించే
నీడలు. బెంగ పెట్టుకునే నీడలు
నీ చేతివేళ్ళని తాకుదామని వచ్చి

తాకకుండానే ఆఖరి క్షణాన క్షణాన వెనుదిరిగే నీడలు
నిన్ను చూడక వెళ్ళిపోయే నీడలు
నిన్ను పరిహసించే నీడలు. నిన్ను
నిందించే నీడలు. నిందించడంతోనే

ఉత్సవాన్ని జరుపుకునే నీడలు. మట్టి నీడలు.
నవరంధ్రాల నీడలు. బళ్ళున నీపై
కురిసే నీడలు. చల్లగా మృత్యువు
వలే వ్యాపించే స్మృతి నీడలు

ఏమీ కానీ ఏమీ లేని నీడలు. నిలువ నీడ లేని నీడలు
గోడలు. గోడలపై నీడలు, నీడల్లో
గోడలు. మరి గోడలేవో, నీడలేవో

తెలియని చీకటి, ఒక దీపంలా వెలిగే క్షణాన
నీడలతో ఒక నీడగా మారి
మిగిలిపోయే నువ్వు. ఇక...

ఇంకానా?
ప్రస్థుతానికి
నీడలతో ఏమైనా చెప్పడానికి
ఈ నీడకి ఇక్కడ ఇంకేమీ మిగిలి లేదు-! 

27 October 2014

i thirst.

ఇదొక దాహం.
పూలను పంచి, ముళ్ళని త్రాగే దాహం
హృదయాన్ని ఇచ్చి, భిక్షాందేహీ అంటూ నీ ముంగిట నిలబడే దాహం-
నీ చుట్టూతా

పిచ్చుకలై ఎగిరే దాహం -
రిఫ్ఫ్ రిఫ్మనే ఆ రెక్కల కలకలంలో కలవరపెట్టే దాహం
సీతాకోకచిలుకలై నీ కనుల అంచుల్లో వాలి, నిన్నే చూస్తుండిపోయే దాహం
వానచినుకులై

నీలో ఇంకిపోయే దాహం
నీడలై నీపై తార్లాటలాడే దాహం. నీపైకి వొంగి
అప్పుడప్పుడూ నిన్ను లేత ఎండలానో, తుఫాను తీవ్రతతోనో తాకే దాహం
తీరం లేని దాహం

నన్ను గుప్పిళ్ళతో అందుకుని
రాత్రుళ్ళలోకో, రాత్రి మనుషులలోకో వెదజల్లే దాహం
నీలోకో, తనలోకో, పిల్లల నిదురలోకో, ముసిలివాళ్ళ అరచేతుల గీతల్లోకో
నన్ను త్రోసివేసే దాహం

ఇదంతా
ఒక సంరంభం. ఒక మొదలూ, ఒక అంతం.
ఒక జననం, మరొక మరణం. మరలా మరలా పునరుజ్జీవనం. మరలా మరలా
శిలువ వేయబడటం -

ఇదంతా
కొంత వొదిలి వేయబడటం
కొంత ఎదురుచూడబడటం. కొంత అలసిపోబడటం. కొంత విసిగిపోబడటం-
అంతిమంగా, ఆత్మ ఎండిపోయి

ఇట్లా, మట్టికుండలాంటి
నీకై- ఒక ఖాళీ గాజుపాత్రనై - గాలికి నేలపై దొర్లుతూ వేచి ఉండటం
నాలోపలి వ్రూమ్మంటో తిరిగే గాలిని

నేనే వినడం. నేనే కనడం
నాలోపల నేనే పొదిగి పొదిగి, దాహం అయ్యి తిరిగి దారి తప్పి పోవడం
మళ్ళా, మొదటి నుంచి మొదలు పెట్టడం
తిరిగి వలయమవ్వడం
కరిగిపోవడం
బిందువుగా
మారిపోవడం.. 

అవును
మరి నువ్వన్నది నిజంగా నిజం.
అరచేతులని అరచేతులు తాకలేనంత దూరంలో
ఎదురెదురుగా ఉండి కలవలేని ఒక నిర్ధయమైన కాలంలో, లోకంలో
కాంతి లేని ఈ సీమలో

I thirst.
Truly.
నిజంగా ఇదొక దాహం!

24 October 2014

tetelestai

ఒక శంఖం:
నిదురించే శిశువు వంటిది. దాని లేతెరుపు
పిడికిలి వంటిది. నీ
హృదయం వంటిది-

మరి నీ హృదయాన్ని
దాని హృదయం దగ్గరగా ఆన్చినప్పుడు
నీకు వినవచ్చేదేమిటి?

సముద్రపు తీరాలలో
రాత్రుళ్ళల్లో కొట్టుకువచ్చే వెన్నెల నురగ.
మెరిసే నక్షత్రాల అనంతాల దూరం.
ఇంకా, ఇసుక సవ్వడీ, ఉప్పు వాసనా-

మరి ఆ కన్నీళ్ళూ, ఆ ఉప్పదనమూ
ఎవరిదీ అని అడగకు.

కొన్నిసార్లు అది ఇసుకది
కొన్నిసార్లు అది అలలది
కొన్నిసార్లు అది, జాలరి వలలో చిక్కుకున్న చేపదీ
చిక్కుకోలేని ఆకాశానిదీ

చివరిగా,  తరచూ - నీదీ, నాదీ.

సరే, సరే
ఇంకెప్పుడూ అడగను:
నీ శరీరం ముందు ఈ శంఖాన్ని ఎప్పుడూ ఉంచను-
నిన్ను వినమనీ, దాని పసి నిద్రలోకి రమ్మనీ
నిన్ను ఎన్నడూ వేడుకొను.

తెలియదా నీకు

ఈ శంఖంలో
దాని హృదయంలో
సీతాకోకచిలుక వలే రెక్కలల్లార్చే చీకటిలో
ఒక లేతెరుపు గులాబీ మొగ్గ దాగి ఉందనీ
నిన్ను చూచినంతనే

అది వికసిస్తుందనీ
అది నిన్నే శ్వాసిస్తోందనీ
అది నిన్నే స్వప్నిస్తోందనీ - అదే నువ్వై - నీ పదమై ఆగి ఉందనీ?

tetelestai.
ఇక నిన్నెప్పుడూ కదపను!

20 October 2014

పొదగబడి

అట్లా అని పెద్దగా ఏమీ లేదు -

గోడల వెంబడ పాకి, చప్పున ఆగి సహనంగా చూసే ఒక బల్లి.
దాని కింద నేలపై, ఊగే నీడలు.
కొంత మట్టి తడచిన వాసన -

నీళ్ళు చిలుకరించినట్టు, గదులలోంచి మాటలు.
కుండీలో ఆకులు కొద్దిగా కదిలే శబ్ధం.
నిన్ననే పుట్టిన పావురపు పిల్లపై, ఆ
తల్లి పావురం సర్దుకుని కూర్చునట్టు

ఇది ఒక రాత్రి.
ఒక లేత మంట ఏదో అలుముకున్నట్టు
దాని రెక్కల కిందకు నేనే ఒదిగినట్టు
ఎవరో నన్ను పొదుగుతున్నట్టూ, నువ్వు హత్తుకున్నట్టూ

నీ ఛాతిలో దాగిన ముఖానికి నువ్వు ఏదో చెబుతున్నట్టూ
కనురెప్పలపై మునివేళ్ళతో రుద్ది
నులివెచ్చని కలల లోకాలలోకి
నీ శ్వాసతో ఊయలలూపి
తేలికగా వొదిలివేస్తున్నట్టూ-

ఇక
ఆ తరువాత ఏం ఉంటుంది?
అట్లా అని

అన్నీ ఉండాలనేం లేదు. నువ్వూ, నేనూ, ఒక గూడూ
పక్షి రెక్కల కింద పగలని గుడ్డూ
నీడల్లో మెరిసే కాంతీ, కరుణా
ఇంకా, నేను చెప్పలేనివి ఎన్నో-

మరి ఇది నిజం చిన్నా
గోడపై వాలిన తూనీగను చప్పున ఒక బల్లి నోట కరచుకోగా
కళ్ళు తెరవక, గూటిలోంచి రాలిపోయి
గిలగిలా కొట్టుకులాడుతుంది

పస్థుతానికి ఈ 'జీవితం'- ఇక
ఎవరైనా "ఎలా ఉన్నావూ?" అని హటాత్తుగా అడిగితే
"నేను బావున్నాను"

అని నువ్వో, నేనో ఎలా చెప్పడం? 

17 October 2014

ఒకమరొకసారి

నీటిలోని కాంతిని తాకలేను
నీడలు ముసిరే వేళల్లో, బరువుగా ఒరిగిన నీ కనురెప్పల కింది
కనీళ్ళను చూడనూ లేను -

చీకటి చెట్ల కింద తల వంచుకుని
నువ్వలా, నేనిలా నుల్చుని...
మన అరచేతులు ఆనీ ఆనక

మన చేతివేళ్లు తాకీ తాకక
కలిసి ఉండాలేకా, విడిపోనూలేకా, ఏమీ
చెప్పుకోనూ లేక, చెప్పరాక

ఇక
లోపలంతా చెక్కుకుపోయి, తెగిపోయి, మౌనంగా
ఒకరి తలను మరొకరి గుండెకేసి
మోదుకునీ, బాదుకునీ, ఏడ్చీ...

చిన్నమ్మా
పగుళ్ళిచ్చి, హోరున కురిసిన ఆ రాత్రి
ఇంకా ఇప్పటికీ
ఇక్కడ తెల్లవారనే లేదు - 

15 October 2014

అమ్మ కళ్ళు

చీకట్లో వెలిగించిన రెండు దీపాల్లా వెలుగుతాయి, నీ కళ్ళు-

స్థాణువైపోతాను ఇక నేను.
రావి చెట్లు గలగలా వీచినట్టు, చల్లని గాలి ఏదో నా లోపల.
ఇన్నాళ్ళూ నేను చూడటం మరచిన

వెన్నెల ఏదో, నేను వినలేని వాన ఏదో
నక్షత్రాలు మెరిసే ఆకాశం ఏదో, పూలు వీచే పరిమళం ఏదో
పసి పసిడి పవిత్రత ఏదో

ఇంత వయస్సులోనూ
ఇంత కటువైన నీ చివరి కాలంలోనూ, నీ కనుల సమక్షంలో
అత్యంత లాలిత్యంగా, అత్యంత నిర్మలంగా -

ఇప్పటికీ ఆ కన్నుల్లో ఎక్కడా
నైరాశ్యపు జాడ లేదు, ఓటమి ఛాయ లేదు
జీవించడం పట్ల ద్వేషం లేదు, ఇతరుల పట్ల నిందారోపణ అసలే లేదు-
ఇక

మంచు తెరలు తేలిపోతున్నట్లు ఉండే
ఉదయపు లేత కాంతిని ప్రతిఫలించే ఆ తెల్లని కళ్ళను చూస్తూ
"అమ్మా ఇది ఎలా సాధ్యం?" అని
నేను విస్మయంతో అడుగుతానా

సరిగ్గా అప్పుడే, సరిగ్గా ఆ క్షణానే

వేపాకులు రాలే చెట్ల కింద
ఆ శీతాకాలపు గాలిలో, ఆ సంధ్యాసమయంలో, కాంతి పుంజాలు
నీడలతో కలబడే వేళల్లో, రాత్రిగా మారే
ఆ ఇంటి గుమ్మం వద్ద నుంచి

చిన్నగా నవ్వి,  ముడతలు పడ్డ ముంజేతితో తన కళ్ళని తుడుచుకుని
నా భుజం తట్టి, చిన్నగా
లేచి వెళ్ళిపోతుంది తను!

11 October 2014

ఒక క్షణం

అప్పుడు, నీ కన్నులు లేతెరుపును అద్దుకుంటాయి
అప్పుడు, నీ ముఖంపై మబ్బులు కమ్ముకుంటాయి
అప్పుడు

నీ శరీరంపై ఏవో పేరు తెలియని చెట్లు హోరున వీయగా
ఆ చల్లటి గాలిలోనీ కాళ్ళూ చేతులకు పైగా
పక్షులూ సీతాకోకచిలుకలూ తేలిపోతాయి

అప్పుడు
నీ చెవులలో పురాతన కథల గుసగుసలు
గుర్రాలూ, గూళ్ళూ, ఎగిరే ఎన్నెన్నో చేపలు-
నీ పెదాలపై పాల వాసనా, బుగ్గలపై మెత్తగా

ముద్దులు. మూసుకునే నీ చేతివేళ్లల్లో
ఒక తల్లి శిరోజాలు. తన కలలు నీవై
నీ కలలు తనవై, తన తనువై, వెరసి

ఒక మొగ్గ, ఒక పూవుని కావలించుకుని పడుకునే
ఒక దైనందిన ఇంద్రజాలం. చూసే నాలో
జీవించడం పట్ల ఒక ఇష్టం. ఒక కృతజ్ఞత-

అవును. అప్పుడు

నిద్ర జల్లు కురిసే వేళల్లో, ఆ చినుకుల్లో తడుస్తూ
మీ ఇద్దరినీ చూస్తూ, ఎన్ని రాత్రుళ్ళు బ్రతికానో
నేను ఇంకా బ్రతికే ఉన్నానని గ్రహించానో

ఇంతకూ ఎన్నడైనా చెప్పానా నేను
నన్ను పూరించే మీకు?

08 October 2014

నిశ్శబ్ధం

"నిశ్శబ్ధం అనేది ఉందా అసలు?"
అని అతను, తనని తాను ప్రశ్నించుకున్నాడు-

ఎదురుగా గోడలపై, లతల వలే జారే వాన నీళ్ళు.
ఒక పసివాడి తలని నిమిరినట్టు
నిన్ను లాలనగా నిమిరే ఓ గాలి

నీడలు లేని ఒక కాంతి అప్పుడు నీలో: నీ ప్రాంగణంలో-
మౌనముద్రలో ఉన్న బుద్ధుని
ఛాయాచిత్రాన్నేదో నీకు జ్ఞప్తికి
తెచ్చే చెట్లూ, పూలూ, ఆకులూ-

అక్కడక్కడే ఎగిరి నీ పక్కగా వాలే ఒక తూనీగ: ఇక
ఎవరో నెమ్మదిగా నీ పక్కగా చేరి, నీలో
కుదురుకుని కూర్చున్నట్టు ఉండే

సాయంత్రంలో, సరిగా అప్పుడు కొంత కలకలం. సరిగ్గా
అప్పుడు కొంత, కదలిక లేని కదలిక-
కుండీలో పెట్టిన రెండు గుడ్లపై మళ్ళా
సర్దుకుని కూర్చునే ఒక పావురం
ఒక తల్లీ, పిల్లలూ, నక్షత్రాలూనూ-

ఇక అప్పుడు, సరిగ్గా అప్పుడు, వాటన్నిటినీ చూస్తూ కూడా
వాటన్నిటిలో నిమగ్నమయ్యి కూడా
"నిశ్శబ్ధం ఉందా అసలు?" అనతను
తనను తాను కానీ, తనలో మిగిలిన 

ఆమెను కానీ, ఎలా ప్రశ్నించగలడు?   

23 September 2014

ఒకనాడు

తన పక్కన కూర్చుంటూ, "ఎలా ఉన్నావు?" అని ఎందుకో
తనని అడిగిననాడు - ఆనాడు -

ఆకాశం చీకటి అంచులలో చిక్కుకుని ఉంది. వొదులుగా గాలి
లతలలోనూ, ఆకులలోనూ తడపడి
చివరికి నేలపై ఆగిపోయి ఉంది -

ఎవరో ఎక్కడో ఏడుస్తున్నారు. పిల్లలో, పెద్దలో కానీ
ఆ గొంతులకి వయస్సు లేదు. ముళ్ళకి
చిక్కుకున్న చీర ఏదో కదిలి మరికొద్దిగా

చిరిగిపోయినట్టు, ఏడ్చీ ఏడ్చీ జీరవోయే గొంతులు -
ఆకలితో మూలకు ఒదిగిపోయిన పిల్లలు.
నీడలు సాగే గోడలు. గోడలు వలే నీడలు.
ఖాళీ పాత్రలు. చిరిగిన చాపలూ దుప్పట్లు -

మరి, అధాటున లేచి వెళ్లి జాగ్రత్తగా ఎవరూ తొలగించని
చీరే తను. ఉన్న రెండిటినే మళ్ళా మళ్ళా
ఉతకగా రంగులు పోయి మెరుపు పోయి
పాలిపోయి వడలిపోయి ఎక్కడో రాలిపోయి

మరి అవి తనో, తన చీరలో, తన వక్షోజాలో లేక
ఎండిపోయిన తన పెదాలో, నిస్త్రాణగా
వాలిపోయిన తన చేతులో, తన కళ్ళో

నాకు తెలియదు కానీ, తన పక్కన కూర్చుంటూ

'ఎలా ఉన్నావు నువ్వు?' అని ఎందుకో తనని అడిగిననాడు
- ఆనాడు - తను ఎందుకో చిన్నగా నవ్వి
నెమ్మదిగా నన్ను తట్టి, నా పక్కన్నుంచి
లేచి వెళ్లిపోయింది తను! 

ఎలా? ఇలా.

దారిన పరిగెత్తుకుంటూ పోయే పిల్లలు, ఝూమ్మంటూ -

మొగ్గలు నవ్వుతూ విచ్చుకుని పరిగెడుతున్నట్టూ
పూలు గాలిలో తేలుతున్నట్టూ
పూల వాసన వేసే సీతాకోకలు

అరుపులతో, మాటలతో, నేలపై
పాదాలు ఆనీ ఆనక ఆనక ఎక్కడికో ఎగిరిపోతునట్టూ
మబ్బులు పట్టిన నిన్నూ నీ చేతినీ
పుచ్చుకుని, ఏ కాంతి లోకాలలోకో

లాక్కు వెళ్తున్నట్టూ తోస్తున్నట్టూ చూపిస్తున్నట్టూ.

దా దా. మరి నువ్వు కూడా తప్పకుండా: నాతో.
చూడు చూడు, ఇక ఒక వర్షం
కురియబోతోంది ఇక్కడ
ఇప్పుడు

దా దా
మరి అందుకే
వచ్చేటప్పుడు
పొరబాటున కూడా, ఒక గొడుగుని మాత్రం నీ వెంట తెచ్చుకోకు!

20 September 2014

నీడలు

మబ్బు పట్టి ఉంది అప్పుడు.

'ఎవరూ లేరు నాకు' అని తనే అనుకుందో లేక నువ్వే అనుకున్నావో
లేక, చివరికీ గాలే అనుకుందో కానీ
ఆకుల అలలపై సాగేఈ కాలం నావ

నెమ్మదిగా ఆగిపోతుంది. ఒక సముద్రం నిశ్చలమవుతుంది. ఇక
ఒక పిట్ట కొమ్మల్లోకి ముడుచుకుపోగా
ఒక పసి పసిడి శరీరంతో ఆ రాత్రి

పగలే కన్నీరు పెడుతుంది. నీ ఛాతి అంతా
కుంకుమమయం అవుతుంది
వాన పడుతుంది. గుండె చెదిరి
నీ గూడు చెదిరి, నీ మనస్సంతా

చిత్తడి చిత్తడి అవుతుంది. నీళ్ళు గుమికూడి

అలజడి సవ్వళ్ళుగా, వలయాలు వలయాలుగా మారే
ఒక, చిన్ని నీటిగుంట అవుతుంది.
ఇకప్పుడు - మబ్బు పట్టినప్పుడు
మబ్బుపట్టి నువ్వు కురిసేటప్పుడు

ఒక పసిడి పావురం, తన పాదాలతో నీ ఛాతిని
నెత్తురోడేలా గీరుతూ, నీపై తచ్చాట్లాడుతూ
"ఎక్కడికి పోయావు నువ్వు? ఇన్నాళ్ళూ?

నాతో కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా?"

అని వెక్కిళ్ళతో జీరగా, ఉబ్బసం గొంతుతో అడిగితే

అప్పుడు

మబ్బు పట్టి - మబ్బు పట్టి
మబ్బు పట్టి - మబ్బు పట్టి
మబ్బు పట్టి - మబ్బు పట్టి

ఇనుప సంకెళ్ళయి ఊగే

నల్లని నీడలు - తెల్లని నీడలు

ఎవరికీ చెప్పుకోలేని, కన్నీళ్ళు పెట్టుకోలేని
పొదలవంటి మాటలవంటి
నీలాంటి

నీడలు - నీడలు
నీడలు - నీడలు
నీడలు - నీడలు
నీడలు - నీడలు
నీడలు - నీడలు

నీ... 

18 September 2014

జీవితం

"జీవితం అంటే ఏమిటి?" అని నువ్వు అడిగిన నాడు - ఆనాడు -
నా వద్ద సమాధానం లేదు

అందుకని, తల ఎత్తి ఒక సారి ఆ రాత్రి ఆకాశంలోకి చూసాను
చీకట్లోని నక్షత్రాలనీ, నేలపై అంబాడే వెన్నెలనీ
ఆ వెన్నెల వెలుగులో గలగలా కదిలే నీడలనీ
చెవిలో రహస్యమేదో చెప్పిపోయే గాలినీ విన్నాను.

చుట్టూ గూళ్ళయిన చెట్లనీ, చెట్లని పెనవేసుకుని పడుకున్న
మనుషులనీ, వాళ్ళు కప్పుకున్న మట్టినీ, ఆ మట్టి
చెప్పే కథలన్నిటినీ విన్నాను. ఆనక, ఆ కథలలోని

కనులలోకి దుమికి ఆ నీళ్ళల్లో మునిగాను. ఎవరెవరివో
వేల చేతులని తాకాను. ముద్దాడాను. మరో దినం
లేనట్టూ - ఇక రానట్టూ - గాట్టిగా ప్రాణం పోయేలా
వాళ్ళని కావలించుకున్నాను. ఎందుకో ఏడ్చాను

హృదయాన్ని చీల్చుకుని, దాని అరచేతిలో పెట్టుకుని
నెత్తురోడుతూ 'ఇది మీదే, ఇది మీదే' అని ఆ కలల
వీధుల్లో అరుచుకుంటూ తిరిగాను. గొంతు అరిగరిగీ 
ఒక అమ్మలోనో, అమ్మలాంటి స్త్రీలోనో ఒదిగాను

ఇక తను ఒక జోలపాట పాడి ఈ విశ్వాన్ని ఊపితే
వెక్కిళ్ళు పెట్టుకుంటూ, ఒక నిధ్రలోకో, నిద్రలాంటి
ఒక మృత్యువులోకో, నీ శ్వాసలోకో జారుకున్నాను-

నిజం: "జీవితం అంటే ఏమిటి?" అని నువ్వు అడిగిన నాడు - ఆనాడు -
"జీవితం అంటూ ఏదీ లేదు. జీవించడమే ఉంటుంది"
అనే సమాధానం నా వద్ద లేకా, చెప్పరాకా, తల ఎత్తి

ఒకే ఒక్కసారి నీలోకి చూసాను! నన్ను నేను కనుగొన్నాను.       

17 September 2014

మరే

103 degreeల జొరం
దానికి మూడింతల cold (జొలుబంటారులే)
గొంతులో వీచే తుమ్మముళ్ళ చెట్లు
ఆ చెట్లల్లో
గుడ్లగూబల పోరు
దగ్గు
హోరు

ఇక
Augumentin 625mg
Temfix
Crocin® Pain Relief Tableట్టూ
డ్రిల్లూ
డిసిప్లీనూ లేని
Benedryల్లూ వేసుకుని

గంటకోసారి
గోరువెచ్చని నీళ్ళతో ఉప్పు gargling చేసుకుంటో
నిమిషానికోసారి ముక్కు చీదుకుంటో

నా మానాన నేను, ఓ మూలగా
జోబుగుడ్డలోకి పసుపుపచ్చగా జారే
మురిగిన ఆత్మతో
కూర్చుంటే
ఇంతలో

నువ్వో
కవితతో తయార్
తుమ్ముకుంటో, ముక్కుకుంటో మూలుగ్గుంటో
బిక్కుబిక్కుమంటూ
తిరిగే నా ప్రాణానికి -

ఒరే నాయనా
అరే హేమిరా రాజన్
ఇంతయునూ జాలీ కరుణా దయా లేదా నీకు

Life
is beautiful అని
సమయంలో చెప్పటానికి!  

15 September 2014

delirium

తల ఒగ్గిన చెట్ల కింద ఒకమ్మాయి-

కృంగిన నీ తలను ఎత్తి, తనని నువ్వు చూసినప్పుడు
నీ చుట్టూతా తెల్లని పూల నీడలు-
ఆకాశానికీ భూమికీ ఒక వల వేసి
నిన్ను ఊపినట్టో, జోకోట్టినట్టో- గాలి.

అలలుగా వెళ్ళిపోయే సరస్సులోని కాంతి.

నీళ్ళల్లో సగం మునిగిన ఆ గులకరాళ్ళు
ఎలాగూ మాట్లాడవు: అందుకని, ఇక
వాటిని తీసి, నీ గుండెలో దాచుకుని
వాటి స్థానంలో నానిన నీ కళ్ళని ఉంచి

తన వైపు చూస్తావు: అదే-ఆ అమ్మాయి వైపే  
తల ఒగ్గిన చెట్ల కింద, మాగిన నీడల్లో
నుల్చున్న అమ్మాయి వైపే: అప్పుడు
- అప్పుడే - అడుగుతుందా అమ్మాయి

ఎంతో అమాయకంగా మరెంతో విస్మయంగా చిన్నగా:

"ఎక్కడికి వెళ్ళిపోతున్నాయీ అలలు?"

ఇక అప్పుడు,
ఆ సాయంసంధ్యలో తనువొగ్గిన చెట్ల మీదుగా
నీ లోపల కుంగిపోతున్న సూర్యబింబం వైపు
ఎలా

తన చూపుని మళ్ళించగలవు నువ్వు?

14 September 2014

ఇప్పుడే, ఇక్కడే

ఇది గొప్ప కవితేమీ కాదు కానీ
ఈ కవిత, గుంపుగా తోటలో వాలిన సీతాకోకచిలుకల నిశ్శబ్ధం నుంచి మొదలయ్యింది-

కాదు కాదు!
ఈ కవిత నిజానికి
గుంపుగా సీతాకోకచిలుకలు నీలో వాలక ముందు
ఆకాశం నిండా కమ్ముకుని పూవుల్లా వికసించే మబ్బులతో మొదలయ్యింది-

మరి అది నిజమో, అబద్ధమో
నాకు తెలియదు కానీ, నిజానికి, ఇది గొప్ప కవితేమీ కాదు కానీ, ఈ కవిత
గుంపుగా సీతాకోకచిలుకలు వాలక ముందు, మబ్బులు పూవుల్లా విచ్చుకోకముందు
ఎవరో నవ్వినట్టు, తెరలు తెరలుగా వీచిన ఒక గాలిలో తన ప్రాణం పోసుకుంది-

ఉఫ్ఫ్. మళ్ళా దారి తప్పాను-
నిజానికీ కవిత, సీతాకోకచిలుకలకి ముందూ, పూలకి ముందూ, తన నవ్వుకి ముందూ
చెట్ల కింద - ఇక ఏమీ చేయలేక - తన అరచేతుల్లోకి ముఖాన్ని కుక్కుకున్న
ఒక మనిషి ఒంటరితనంలో మొదలయ్యింది.

ఇదే ఆఖరు సారి. ఇక అబద్ధం చెప్పను-
అసలు కవితే కాని ఈ కవిత, "నువ్వు ఎవరినైనా ఇష్టపడితే
వాళ్ళకా విషయం ఈ రోజే చెప్పు. ఎవరితోనైనా గడపాలనుకుంటే, తప్పక కాలం గడుపు.
నువ్వు ఇష్టపడ్డవాళ్ళ అరచేతులలోకి

ముందూ వెనుకా చూడక, నిన్ను నువ్వు వొంపుకోవాలంటే
వాయిదా వేయక, ఆ పనిని ఇప్పుడే చేయి. ప్రేమించు. రమించు. తాకు -
అందులో తప్పేం లేదు. ఏం చేసినా - ఇప్పుడేఇక్కడే.

ఎందుకంటే, మరో లోకమేమీ లేదు
ఎందుకంటే, ఇంకాసేపట్లో ఈ కాగితంపై వర్షం కురియబోతుంది. ఆ తరువాత
నువ్వూ ఉండవు, తనూ ఉండదు, నువ్వు రాయబోయే కవితా ఉండదు- "

అని అతను అనుకున్న క్షణాన, నిజానికి అతని శరీరం అంతం అయ్యి
ఈ కవిత మొదలయ్యింది. నిజం -
ఇదేమీ గొప్ప కవితేమీ కాదు కానీ

ఈ కవిత, నిశ్శబ్ధం అతని గుండెలో
సీతాకోకచిలుకల గుంపులా గూడు కట్టుకోక మునుపే
ఒక ముఖంలో, ఒక పూవులో, ఒక మబ్బులో, ఒక వాన చినుకులో
ఒక వాన చినుకుతో మొదలయ్యింది-!

12 September 2014

తన చేతివేళ్లు

ఎన్నేళ్ళో అయింది 

తన చేతివేళ్ళని కాస్త ఓదార్పుగా పట్టుకుని.  బహుశా  నాకు నాలుగైదు నెలలు ఉన్నప్పుడో  లేక ఇంకా అంతకు మునుపో  తన చేతివేళ్ళని అలా ఒక పక్షి గూడులా నా చేతివేళ్ళతో అల్లుకుని ఉంటానేమో కానీ, మళ్ళా ఇంత కాలానికి తన చేతివేళ్ళని పదిలంగా నా అరచేతుల్లోకి తీసుకోవడం: వడలిపోయి రాలిన పూలకాడలను ఏరి, జాగ్రత్తగా ఎత్తి పట్టుకున్నట్టు-

"నొప్పి" అని తను అంటుంది. తను ఎవరు అని మీరడిగితే, ఆ తనువు అమ్మే. అవును మళ్ళా అమ్మే. తన చేతివేళ్లపై, తన పసుపచ్చని చేతివేళ్లపై, తన ముంజేతిపై ఆకుపచ్చని నరాలు తేలి వాచిపోయి, తల్లి లేని పసిపాపల్లా, "నొప్పీ" అని ఏడిస్తే ఎవరూ పట్టించుకోని ఆనాధల్లా - బెక్కి బెక్కి ఏడ్చే - తన చేతివేళ్ళే. ఆ చేతివేళ్ల వెనుక దాగున్న, మీకు తెలియని తన జీవితపు నెత్తుటి చారికలే -   

మరి, తెలియదేమో మీకు: ఇప్పుడు తనకో అరవై ఐదు. నాకో నలభై రెండు. ఇన్నాళ్ళూ  ఎవరు ఎటువైపు చెదిరిపోయామో, మబ్బులమై ఎటు కొట్టుకుపోయామో, వర్షమై ఎక్కడ రాలిపోయామో - మీకు తెలియదు. తనకి తెలుసో లేదో కూడా నాకు తెలియదు, కానీ 

తలుపు సందులో పడి ఇరుక్కుపోయి, నలిగిపోయి, వణికిపోతునట్టు ఉండే తన చేతివేళ్ళని ఎప్పుడైనా పొరపాటున మీ అరచేతుల్లోకి తీసుకుంటే, పొంగుకు వచ్చే ఒక దుక్కం: మీ గుండెలోకి ఎవరో చేతులు జొనిపి మీ హృదయాన్ని చీల్చి బయటకి లాగినట్టు ఉండే, కమ్ముకునే ఒక నిస్సహాయత. నొప్పి. నీకు కూడా. ఆ తరువాత 

 ఇక చివరకు మిగిలేదల్లా - ఇంకొంత కాలానికి తన చేతివేళ్ళు ఉండవు అనే స్పృహ. తనూ ఉండదు అనే స్పృహ. తను ఉన్నప్పుడు ఒక్కసారైనా తన చేతిని మీ చేతుల్లోకి తీసుకుని, ఊరకే రికామిగా తనతో ఎందుకు కూర్చోలేదనే దుక్కం. తను మిమ్మల్ని కని ఏం బావుకుంది అని బావురుమంటూ, ఈ లోకంలో ఒంటరిదై రాలిపోయే, మీ శరీరాలంతటి ఒక కన్నీటి చుక్క. 

అంతే.  

11 September 2014

చక్కని మాటలు

"చక్కని మాటలు ఏమైనా చెప్పు" అంది తను
నా చుట్టూ ఉన్న రాత్రినీ, చీకటి ఆకాశాన్నీ 
వాటిలో మెరిసే నక్షత్రాలనీ చూపించాను-

"ఆలా కాదు
పూలవంటి మాటలని ఏమైనా మాలగా కట్టు" అంది తను-
నేల రాలిన లతలనీ, చనుబాలు లేని వెన్నెల కనులనీ
శరీరాలు చెక్కుకుపోయిన ప్రేమలనీ చూయించాను-

"పోనీ, ఊరకే
కనీసం వానలాంటి
కనీసం తుంపరలాంటి పదాలనైనా కురవనివ్వు" అంది తను-
లోకం త్రవ్వుకుపోయిన కాలం కాంతినీ
రెక్కలు తెగిన ఒక పావురాన్నీ, కడుపు

డోక్కుపోయిన ఒక పసిపాపనీ, చీరేయబడ్డ
యోనులతో, దిగంతాల ఖాళీ అరచేతులతో
ఎదురుచూపులై నిలిచిన అమ్మలనీ చూయించాను-

వొణుకుతూ, అప్పుడు
"ఇప్పుడు ఇవేమీ వద్దు నాకు. కాసేపు, నువ్వు
నిశ్శబ్ధంగా ఉండు చాలు" అని అంది తను.

సరిగా ఆ క్షణానే
బిగించి పెట్టుకున్న తన అరచేతిని నెమ్మదిగా తెరచి
ఆ నెత్తుటి నెలవంకల ముద్రికలని
ఈ తెల్లని కాగితంపై -మెత్తగా- అద్ది

"చక్కటి మాటలు చెప్పడం
ఎలాగా?" అని, తిన్నగా తనలోకే చక్కగా వెళ్ళిపోయాను నేను! 

10 September 2014

దీప్తి*

మరి, ఆ రోజు

వాన కురిసినంతసేపూ తాగుతూనే ఉన్నాను.
మనుషుల మడుగుల్లో, పూల రాపిడుల్లో, ఆకులు రాలి, ధూళి రేగి
కళ్ళల్లో నువ్వు పడి, అవి ఎరుపెక్కే వరకూ -

బహుశా, నన్ను నేను పూర్తిగా మరచిపోదామనుకున్నానేమో: ఆ రోజు
బహుశా నన్ను నేను పూర్తిగా దగ్ధం చేసుకుందామనుకున్నానేమో:
ఆ రోజు. బహుశా, చచ్చిపోదామనుకున్నానేమో ఆ పూటా ఆ రోజు-

లేక
నా శరీరం మొత్తమూ అమృత విషంలా వ్యాపించిన నిన్ను
నా శరీరాన్ని చీల్చి, దానిలోంచి నిన్ను పూర్తిగా పెగల్చివేసి
నీ, నా గతాన్నుంచి విడివడి - శుభ్రపడి -మరొక జన్మ ఎత్తి
నా దారిన నేను బ్రతుకుదామనే అనుకున్నానేమో నేను

అమాయకంగా - ఆ రోజు. మరి ఇక ఏమైతేనేం

ఆ రోజు
వాన కురిసి, వెలసి చివరకు రాత్రితో వెళ్ళేపోయింది.
మనుషుల్లో పడి, పూలమౌనాల్లో మునిగీ, ఆకులతో కొట్టుకుపోయీ, ఎవరైనా
ఇంత మాట్లాడతారేమోనని, దారిన పోయే ప్రతివాళ్ళనీ
బ్రతిమాలుకుని, వెంటబడి అడుక్కుని, చీదరించుకోబడీ

మరి, ఆ రోజు  అతని కళ్ళల్లోకి నువ్వు రాలిపడితే

బరువెక్కి, ఎరుపెక్కీ అవి చినుకులతో జారిపోతే
రెండు పసిపాప చేతులై అవి, ఈ లోకంలోకి సాగి
నిన్ను వెతుక్కునేందుకు వెళ్లి, ఎక్కడో తప్పిపోతే

తిరిగి బెంగగా దారి వెతుక్కుంటుంటే, ఎక్కడో నెత్తురోడుతుంటుంటే

మరి, ఆ రోజు
నువ్వు ఎక్కడో, మళ్ళా ఒక గూటిలోకి చేరేదాకా
వాన మళ్ళా కురిసేదాకా తాగుతూనే ఉన్నాను-

05 September 2014

ఎదురుచూపు

కూర్చుని ఉంటావు నువ్వు -అక్కడ- ఆ నలిగిన వేళల్లో, ఎవరో వస్తారని.

అప్పుడు, నీ ముఖాన్ని తాకి
నీలో బెంగని నింపే ఒక చల్లటి గాలి. కొమ్మల్లో
తిరిగి వచ్చిన పక్షుల కలకలం సద్దుమణిగి, పూలు రాలే నిశ్శబ్ధంలో
ఎక్కడో దూరంగా ఒక ఇంటిలో వెలిగించబడిన దీపపు కాంతి:
ఇక

నీ చుట్టూ నువ్వు
గట్టిగా చేతులు చుట్టుకుని, నీలోకి నువ్వు ముడుచుకుని
తల తిప్పి చూస్తే, నీ పాదాల వద్ద, ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చిన ఒక ఆకు
నీ హృదయం వలే కంపిస్తే

నువ్వు
నీ ప్రాణం కంటే మిన్నగా
నువ్వు ప్రేమించినవాళ్ళెవరో నీకు గుర్తుకు వచ్చి, నీ శరీరం వణికిపోయి
క్షణకాలం నీ గుండె ఆగిపోయినట్టూ

లీలగా
ఆ ముఖం ఆ స్పర్శా ఆ గొంతూ
లిప్తకాలంపాటు నీ సమక్షంలో మెరిస్తే, నీలోంచి నువ్వు తొణికిపోయి
నీలో నువ్వు నలిగిపోయి, పిగిలిపోయి, మౌనమైపోయీ
కూర్చుని ఉంటావు నువ్వు
అక్కడే 

ఆ నలిగిన వేళల్లో - కొంత ఉప్పగా కొంత నొప్పిగా -           
నిన్ను నువ్వు ఉగ్గబట్టుకుని
ఈ చీకటిని ఎత్తుకుని

ఎవరో ఒకరు వస్తారని, రాత్రిలో మిణుగురులై మెరుస్తారనీ-

04 September 2014

ఆనాడు

"ఇక్కడ - ఎవరికీ ఎవరూ, ఏమీ కారా" అని ఏడ్చింది తను - ఆనాడు.

నాకు బాగా జ్ఞాపకం - ఆనాడు.
పది కిలోమీటర్లు నడిచి, తన గదికి చేరుకుని ఉంటాను - ఆనాడు.
టికెట్కి డబ్బులు లేక, మిగిలిన రూపాయితో బీడీలు కొనుక్కుని
నన్ను నేను తొక్కుకుంటూ, నీడలతో మాట్లాడుకుంటూ
మరో దారి లేక, తన గదికే చేరుకొని ఉంటాను -ఆనాడు-

అశోకా ఆకులు విలవిలలాడుతూ ఉండినై తన గది ముందు - ఆనాడు.
తన గది తలుపుల పూల కర్టెన్, సన్నగా ఊగుతూ ఉండింది - ఆనాడు.
సన్నటి గాలి ఒకటి గదినంతా కమ్మి కన్నీటి వాసన వేస్తూ ఉండింది -
ఆనాడు - పల్చటి ఎండ ఒకటి

తన గదిలో నేలపై, దొర్లుతూ బెక్కుతూ ఉండింది - ఆనాడు. మరచాను

గోడపై ఒక ఏసు క్రీస్తు చిత్రమూ, టేబుల్పై ఒక పూలపాత్రా, ఇంకా
తను తెచ్చుకుని అమర్చుకున్న వెదురు  బొమ్మలేవో కాలిపోయి
రాలిపోయేందుకు మిగిలిపోయినట్టు ఉన్నై-ఆనాడు. అవునారోజు
ఆ గదిలో- ఆ మంచంపై

తెల్లని దుస్తులతో, మూలకు గిరాటేసిన ఒక మాంసం ముద్ద వలే
కుత్తుక తెగి కొట్టుకులాడుతున్న కోడిపిల్ల వలే గుండెలు పగిలేలా
గుండెలు చరుచుకుంటూ ఏడుస్తున్న ఒక తల్లివలే, పసిపాపవలే
ఆ గదిలో - ఆ మంచంపై, తనే ఆనాడు 

"లంజాకొడుకు. మళ్ళా వచ్చాడు. ధెంగి, ఉన్నదంతా దెంకపోయాడు.
ఇంకేం పెట్టను పిల్లలకి" అంటే, ఒక మూలగా బెదురు బెదురుగా
ఇద్దరు పిల్లలు. నెత్తురు చారికలు. చిరిగిన చీర. తెగిన బ్లౌజు.
విరిగిన గాజులూ. బూటు ముద్ర పడ్డ పొత్తి కడుపు కిందుగా

తుక్కు తుక్కయిన తన యోనిలోంచి
చుక్కచుక్కగా
చుక్కచుక్కగా
చుక్కచుక్కగా
నె
త్తు
రు

"ఇక్కడ - ఎవ్వరికీ ఎవరూ ఏమీ కారు" అని తను
ఒక బండ కేసి బాదుకున్నట్టు
నాకేసి తన తలను కొట్టుకుని
ఏడ్చిననాడు

ఆనాడు- 

03 September 2014

తను

అప్పుడు, తన ఇంటికి వెళ్లాను.

ఎవరో కొమ్మనుంచి తెంపి పడవేస్తే,  నేలపై రాలి
ఇక పూర్తిగా ఎండి, గాలికీ ధూళికీ కొట్టుకుపోయే ఆకునై తన గుమ్మం ముందు
వణుకుతూ ఆగాను:

అప్పటికి తనకి పెళ్లై పోయింది.

చాలా చిక్కిపోయి ఉంది తను
చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక రోగిలాగా ఉండింది తను-
విదేశాల నుండి తనని చూసేందుకు వచ్చిన
తనని వొదిలి వేసిన కొడుకుని చూసి

అప్పటికీ ఒక నవ్వుతో, అతి కష్టం మీద
మంచంపై నుంచి లేచేందుకు ప్రయత్నించే, ఆస్థిపంజరం వలే మారిన
ఒక తల్లిలానూ ఉండింది తను. నాకు అలానే ఎదురుపడింది తను-

మరి అప్పటికి ఇంకా, నాకు పెళ్లి కాలేదు.

అప్పుడు
తనని అడగాలని అనుకున్నాను
ఎలా ఉన్నావనీ, ఇదంతా ఏమిటనీ, ఎందుకు ఇలా జరిగిందనీ, ఇలా
ఎందుకు మిగిలావనీ, ఇంకా ఏమేమో
చాలానే - ఆడగాలానే అనుకున్నాను

గతించిన వాటిని ఏమీ మార్చలేని
ఇలాంటివే, ఎందుకు పనికిరాని ప్రశ్నలనే ఎన్నో అడగాలనే అనుకున్నాను
మాటల్నీ కోల్పోయి ఒక మూగవాడిలా, ఇలాగే ఏవో
ఏవేవో ఎన్నెన్నో సంజ్ఞలతో చేయాలనే అనుకున్నాను

అప్పుడు
కళ్ళ వెంబడ నీళ్ళు పెట్టుకుంది తను.
ఇంకా అప్పటికీ నేను, ఒక గూడూ గుమ్మం లేకుండా మునుపటిలానే
మనుషుల్నో మట్టో కొట్టుకుని రోడ్లపై తిరుగుతున్నానీ గ్రహించింది తను.
ఏదో చెప్పాలని కూడా అనుకుంది తను
నా చేతిని ఒకసారి

గట్టిగా పట్టుకుందామని
తన చేతిని తపనగా చాచి, మళ్ళా అంతలోనే ఆగిపోయింది తను. కళ్ళు తుడుచుకుంది తను-
ఏవో పేర్లు పిలిచి, గదిలోకి పరిగెత్తుకు వచ్చిన
ఇద్దరు పిల్లలని చూయించింది తను. ఆపై

ఎందుకో తల వంచుకుంది తను. తనలో
తాను ఏదో గొణుక్కుంది తను. ఆకాశం మసకేసి, గాలి రేగి - మబ్బులేవో చుట్టుకుని
నేలపై నల్లని నీడలు వ్యాపించి, ఘోష పెడుతూ ఉంటే
లేచి, వణికే చేతులతో ఒక దీపం వెలిగించింది తను -

అప్పుడు, అంతసేపూ, ఆ తరువాతా
చినుకులు ఇనుప తాళ్ళై, ఇంటిని బిగించి తిరిగి వదులు చేసేలోపు, నేను
ఆ ఇద్దరు పిల్లలనీ ఒళ్లో కూర్చో పెట్టుకుని
ఏవో అడుగుతున్నంత సేపూ

అన్నం వండింది తను. హడావిడిగా ఏదో కూర చేసింది తను.
ఒక ప్లేట్లో ఇంత వడ్డించుకుని వచ్చి, తినమని, నా ఎదురుగా, మసిపట్టి
వెలుగుతున్న కిరసనాయిలు బుడ్డీ వలే కూర్చుంది తను -
నా ముఖంలో ముఖం పెట్టి కూర్చుని
"చెప్పు: ఎన్నాళ్ళి లా" అని అడిగింది, తను.

అప్పుడు
తనని చూద్దామని తనది కాని ఇంటికి వెళ్ళినప్పుడు
తను పెట్టిన అన్నం తింటున్నప్పుడు, నా గొంతుకేదో అడ్డం పడింది-
ఇక ఇప్పుడు

ఈవేళ
అన్నం తింటూ పొలమారితే
తనే గొంతుకు అడ్డం పడి, తను లేని ఆ అక్షరాలే ఇలా ఇక్కడ
ఇంకా ఇప్పటికీ గుండెకు అడ్డం పడి
ఇలా ఎక్కిళ్ళు పెట్టుకునే
తనో, నేనో లేక ఇంకా మరెవరో -

అంతే. ఇంకేమీ లేదు.

01 September 2014

చివరకు

ఒక రాత్రిలో నీ పక్కగా కూర్చుని

నెమ్మదిగా నీ అరచేతిని నా అరచేతిలోకి తీసుకుని, అమ్మాయీ
వంచిన నీ తలను పైకెత్తి, అంతే నెమ్మదిగా నీకు
ఏమైనా చెబుదామనే అనుకుంటాను
ఏదైనా చూపిద్దామనే అనుకుంటాను-

అమ్మాయేమో చూపు తిప్పదు. కాలమేమో ఇద్దరినీ దాటదు-
అప్పుడు అంటుంది అమ్మాయి ఎప్పటికో

"'ఏం జీవితమిది? నీతో? బ్రతకడానికి నీ వద్ద

పూవులు లేవు. వానలూ లేవు. వనాలూ లేవు. దయగా ప్రవహించే నదులూ లేవు.
మంచుదీపం వెలిగే వేకువ ఝాములు లేవు
మైదానాలపై ఎగిరే సీతాకోకచిలుకలూ లేవు-
రాత్రుళ్ళలో మెరిసే వెన్నెల సవ్వళ్ళసలే లేవు.

ఈ కాలం గడపటానికి,  కనీసం నీ వద్ద గుప్పెడు మిణుగురులైనా లేవు.
చెప్పు, ఏం జీవితమిది నీతో? పో. పో పో.
వెళ్ళిపో - ఇక్కడ నుంచి" అని పాపం
చాలా ఖచ్చితంగానే, చాలా కచ్చగానే
అడుగుతోందా అమ్మాయి-

సరిగ్గా అప్పుడు - సరిగ్గా అప్పుడే - సరిగ్గా ఆ క్షణానే
(ఆపై మీరేమనుకున్నా సరే)

తన అరచేతిని నా ఛాతిలో దాచేసుకుని, తనని గట్టిగా ముద్దు పెట్టేసుకుని
పూవులూ, వానా, నదులూ అయిన సీతాకోకచిలుకలు
మిణుగురులతో మిలమిలా మెరుస్తో తిరిగే రాత్రిలోకీ  
మంచు కురిసే వెకువఝాము చీకట్లలోకీ

- తటాలున - తనతో పాటు దుమికేసాను

'ఇంతకాలం నీకు చూయించనది ఇదొక్కటే' అనుకుంటూ!

బియ్యపు గింజల కథ

ఇదంతా పాతదే.
బియ్యాన్ని నువ్వు గుప్పిళ్ళతో తీసుకుంటున్నప్పుడు
ఒకప్పుడు నువ్వు బియ్యం డబ్బాలో వేసిన వేపాకులు - ఎండిపోయి ఇప్పుడు -
నలిగి చేసే, పిగిలిపోతున్న శబ్ధాలే -

మరి

ఒకతనేమో - బియ్యం ఉండటమే ముఖ్యం అని అంటాడు
మరొకతనేమో - బియ్యాన్ని వెలికి తీసే చేతులే ముఖ్యం అని అంటాడు
ఇంకొకతనేమో - బియ్యాన్ని ఇన్నాళ్ళూ కాపాడిన వేపాకులను చూడమని అంటాడు
చివరతనేమో - బియ్యాన్ని వండే చేతుల గాధ వినమని చెబుతాడు
మొదటతనేమో - ఇంతా చేసి మీరు 

బియ్యాన్ని తనలో నింపుకున్న డబ్బాని 
మరచిపోయారని గురుతు చేస్తాడు. ఇక
మొదటా చివరా కానీ అతను - అప్పుడు 

ధాన్యం వచ్చిన నేల గురించీ పండించిన చేతుల గురించీ చెబితే
ఏడో అతను - ధాన్యాన్నీ, ఆ నేలనూ, పండించిన శరీరాలని
త్రవ్వుకుపోయే రాబందులనీ గుర్తించమని వేడుకుంటాడు -

నీ నోట్లికి వెళ్ళే ప్రతి గింజ పైనా ఒక రక్త లిఖిత చరిత్ర ఉందనీ
ఏదీ శూన్యంలోంచి వచ్చి శూన్యంలోకి పోదనీ చెబుతాడు-
కొంత కార్యచరణుడివై, ఈ లోకకాలంలో సంచరించాల్సి ఉందనీ
అది నీ ప్రాధమిక కర్తవ్యమనీ చెబుతాడు. అరచేతుల్లో ఒక అద్దం ఉంచుతాడు-  

సరే. సరే. సరే. మరేం లేదు.

ఇదంతా పాతదే. ఇదంతా బియ్యపు గింజల కథే.
బియ్యాన్ని నువ్వు గుప్పిళ్ళతో తీసుకుంటున్నప్పుడు
బియ్యంతో కలగలసిపోయిన ఎండిన వేపాకులు
నలిగిపోయి చేసే అనాధల ఆక్రందనలే-

అయితే, ఆ శబ్ధాలు మరిప్పుడు

ఎటువైపు నిలబడి ఉన్నాయో
ఏ ఏ కథలని వింటున్నాయో -
నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనే అనుకుంటున్నాను.          

ఆట

ఏదో చెప్పాలని అనుకుంటావు
ఇంతకుముందు ఎవరూ చెప్పనిదీ, ఎవరూ సూచించనది కూడా-

అప్పుడు, గోడలపై నీడలు
అగ్నికీలల వలే రెపరెపలాడుతూ ఎగబాగుతూ  ఉంటాయి
లేత ఎండలో తూనీగలు సీతాకోకచిలుకలతో ఎగురుతూ ఉంటాయి.
ఇక పిల్లలే, పొలోమని అరుస్తో వాటి వెంబట.
ఇక ఒక కుక్కపిల్లే తోకూపుకుంటో

వాళ్ళ వెంటా, తెల్లటి మబ్బులా సాగే
గాలి వెంటా, గాలిలా కొట్టుకుపోయే మబ్బుల వెంటా
పూలల్లా రాలే చినుకుల వెంటా, గునగునా పరిగెత్తుకుపోయే ఆకుల వెంటా
రేగే ధూళి వెంటా, పొదలలోంచి తప్పించుకుని సరసారా పాకిపోయే

ఒక పచ్చని పచ్చి వాసన వెంటా
కొంగు కప్పి తన లోకాన్ని తడవకుండా కాపాడుకుంటున్న
ఒక తల్లి వెంటా, తన పాదాల వెంటా, బయట లోకమంతా వాన కురస్తా ఉంటే
లోపల మబ్బులు పట్టి కూర్చున్న నీ వెంటా

సరిగ్గా అప్పుడే  
ఇంతకుముందు ఎవరూ చెప్పనిదీ, ఎవరూ సూచించనది కూడా
నువ్వు చెప్పాలని కూర్చున్నప్పుడే

ఎవరి వెనుక ఎవరో
ఎవరి పదాల వెనుక మరెవరో అని తెలియక నువ్వు
సతమతమౌతున్నప్పుడే, ఇదొక ఆట అని మరచి  
నువ్వు గంభీర మౌతున్నప్పుడే 

మరి, సరిగ్గా అప్పుడే, సరిగ్గా అక్కడే-!  

31 August 2014

మెరుగు

ఏవో కొన్ని పదాలని అనుకుంటాను
'ఒక దీపం అనీ, ఒక పూవు అనీ, ఒక వాన అనీ, ఒక వెలుతురు అనీ
ఒక 'నువ్వు' అనీ. అన్నీ ఇట్లాంటివే -

అవి కొన్నిటిని సూచిస్తాయని అనుకుంటాను
'దీపం దీపాన్నీ, పూవు పూవునీ, వాన - చినుకులనీ
వెలుతురు కాంతినీ, నువ్వు అనే పదం
నిన్నే'ని సూచిస్తాయని అనుకుంటాను -
అలా కాకపోయినా

'దీపం ఒక పూవునీ, పూవు ఒక తుంపరనీ
వాన ఒక కాంతినీ, ఆ ఒక్క కాంతి కరుణనీ
ఆ కరుణ చివరికి 'నిన్ను'ని చూపిస్తాయనే అనుకుంటాను - లేక
నువ్వే ఆ కాంతివనీ

ఆ కాంతే నీలోంచి తుంపరగా
వానగా, పూలుగా, చీకట్లో వెలిగించిన దీపంగా మారిందనీ
రెండు అరచేతులు లేక గాలికి వణుకుతుందనీ

ఇలా - ఏవేవో ఊహిస్తాను: ఊహించినవే రాస్తాను

రాసిన వాటినే అవి
సూచిస్తాయని కూడా అమాయకంగా అనుకుంటాను-
ప్రతి పదంలో ఒక ముఖం ఉందనీ, ఆ పూర్ణబింబాన్ని
నా అరచేతుల్లో ఒడిసిపట్టుకుని

గుండెలకు హత్తుకుని, ఎంతో ఇష్టంగా
మాట్లాడదామని కూడా అనుకుంటాను.
మరి ఎలా తెలుసు నాకు, ముఖం స్థానంలో ఒక సమాధి ఉండవచ్చుననీ
ఒకరిని ఊహించి ఆత్రుతగా తలుపులు తెరిస్తే

అక్కడ మరొకరు లోపల ఊహించలేనన్ని గదులతో
మరిన్ని మూసిన తలుపులతో, గర్భ కుహరాలతో ఎదురౌవ్వచ్చుననీ
తాళం చెవులు లేక, మాట్లాడే పెదాలూ లేక
నేను స్థాణువై మిగిలిపోవాల్సి ఉంటుందనీ?!

అవును
నువ్వన్నదే నిజం.
మౌనాన్ని మరింత మెరుగు పరచగలిగేటట్లైతే తప్ప, అస్సలు మాట్లాడకు!

30 August 2014

విను

నింపుతారనుకున్న ఒక మట్టికుండ పక్కగా
కూర్చుని ఉన్నాను, చెవులాన్చి. మరి
దాని శరీరం లోపలికి చొచ్చుకుపోయి తోడేసే ఒక గాలి,  వ్రూమ్మంటూ- 

మరి, ఎలా ఉంటుంది
నీ లోపలికి నీళ్లై వస్తారనుకున్న వాళ్ళంతా గాలై 
చివరికు నిన్నూ, నీకు మిగిలిన ఖాళీతనాన్ని కూడా ఖాళీ చేసి

నిన్ను తోడుకుపోతున్నప్పుడు?

దా తండ్రీ దా. విను.

రూమీ కాదు,హఫీజ్ కాదు. చూసేదానినంతా
పూర్వ వాచకాల అల్లికలోకి మలిచి
శాంతుడివై ఆనందించే నీతో నాకేం

పని కానీ, దా తండ్రీ దా విను - ఈ వేణువు.
ఒక దీపం. ఒక చీకటి.
ఒక గాలి. ఒక నిప్పు-

ఒక జన్మ ఓ మృత్ర్యువూ.
ఒక వానా, ఒక కరవు-
మరి నీ శరీరానికీ, నా శరీరానికీ మించినది ఏమైనా ఉంటే చెప్పు తండ్రీ
ఇక, వస్తాను నీ వద్దకి

ఒక అనాధయై తిరుగుతున్న
ఈ మట్టికుండలోని గాలితో, అనంతంతో
ఆది మరియు అంతం అయిన

నాతో: నీతో - మరి నీ వద్దకు -

29 August 2014

అనుకున్నాను

అవును. అప్పుడు, నిన్ను కలుసుకుందామనే అనుకున్నాను-

నువ్వు వెళ్ళిపోయేలోపు ఒకసారి చూద్దామనే అనుకున్నాను
నువ్వు ఎలా ఉన్నావోనని అడుగుదామనే అనుకున్నాను
నీ పక్కన కూర్చుని నీ మాటలు విందామనే అనుకున్నాను
నీ అరచేతులలోకి నా అరచేతులని వొదిలివేసి
కాసేపు నిశ్శబ్ధం అవుదామనే అనుకున్నాను

నీ శరీర వనంలో వీచే గాలినీ, ఆ సవ్వడినీ కాసేపు శ్వాసించి
విందామనే అనుకున్నాను. నీ కనుల సెలయేటి అలజడుల్లో
నా ముఖం చూసుకుని, కడుక్కుందామనే అనుకున్నాను
నా నుదిటపై నిన్ను, ఒక పవిత్ర చిహ్నంలా దిద్దుకుందామనే అనుకున్నాను
నీ పెదాలపై నా పేరు మరొకసారి వినబడితే
చిన్నగా నవ్వుకుందామనే అనుకున్నాను-

నీ పూల తోటల్లో, నీ వర్షాల్లో, నీ ఋతువుల్లో
నీ లలిత వర్ణ లోకకాలలలో కాసేపు తిరుగాడి
నాకు నేను శుభ్రపడదామనే అనుకున్నాను

అవును. ఇది నిజం-

నిన్ను కలిసి, నాకు నేను తారస పడదామనే అనుకున్నాను
నిన్ను కలిసి, నేను ఇంకా బ్రతికే ఉన్నానని
నాకు నేను రూడీ చేసుకుందామనుకున్నాను
ఒక్కసారి నిన్ను కలిసి, నిన్ను చూసి, నిన్ను తాకి, నిన్ను శ్వాసించి
నెమ్మదిగా, వచ్చిన సవ్వడే లేకుండా వెళ్లిపోదామనే అనుకున్నాను
ఇవి కాక, వేరే పదాలు వ్రాసుకుందామనే అనుకున్నాను

అవును. ఇది నిజం.
'అప్పుడు, నిన్ను కలుసుకుందామనే అనుకున్నాను'
అలా అని నేను ఇప్పుడు చెబుతున్నానంటే
నువ్వు నన్ను- అస్సలే - నమ్మకు మరి!

28 August 2014

ఏమీ లేదు

చీకట్లోకి చూస్తూ
వాన కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటాను-

ఎండిన రాత్రి.
బెంగటిల్లిన పసిపాపల ముఖాల వంటి పూవులూ, ఆకులూ
ఆగి ఆగి వీచే గాలికి తడబడుతూ కదిలే లతలు.
ఊగే నీడలు-

నిజానికి
నీకు చెప్పడానికి ఇక్కడేమీ లేదు.
చీకట్లోకి చూసే, ఆకాశంలోకి ఆర్తిగా సాగిన రెండు ఖాళీ అరచేతులు
రాత్రి  ముందు మోకరిల్లిన రెండు కళ్ళు. రెండు శూన్యాలై వేలాడే పాదాలు-
ఇక, ఎవరో పారతో తవ్వి పోస్తున్నట్టు, ఒంటరిగా ఊళ పెట్టే శరీరమో, నేనో-

మరి ఇదేమిటి అంటావా?

ఒక రాత్రిలోకి
రాత్రంతా ఎదురు చూసుకుంటూ కూర్చుంటే
మట్టి పూలను పొర్లించుకుంటూ, ఆకులతో, గాలితో, నీడల్ని కుదిపే పరిమళంతో
చెట్లలోంచి వానైతే వచ్చింది కానీ

నువ్వే తిరిగి రాలేదు -

25 August 2014

చూడండి

'పూల మొక్కలను ఎందుకు పెంచుకుంటావు?' అని అడిగేవాళ్ళకి నిజంగా ఏం చెప్పాలో తెలియదు -

ప్రతి ఉదయాన్నే లేచి, వాటికి నీళ్ళు చిలుకరించి, కొత్త ఆకులు ఏమైనా వచ్చాయా లేదా, లేక మొగ్గలు ఏమైనా తొడిగాయా లేదా అని చూసుకోవడం, వాటి సమక్షంలో కాస్త కాలం గడపటం, వాటి లోకంలోని సౌందర్యం, దానిలోని ఆనందం ఎలా చెప్పాలో తెలియక, చాలాసార్లు విభ్రాంతితో అతను మీ వైపు అయోమయంగా చూసి ఉంటాడు -

ఈ మొక్కలు ఒట్టి మొక్కలు కావనీ, పిల్లల చేతుల్లా మిమ్మల్ని పిలిచే, గాలికి కదులాడే ఈ ఆకులు, ఒట్టి ఆకులు కావనీ, మీకొక కూతురు ఉండి ఉంటే, తన ముఖంలా, వెన్నెల ఒదిగినట్టుగా ఉండే ఈ మొగ్గలు, ఏమాత్రం ఒట్టి మొగ్గలు కావనీ, ఏ రాత్రో మీరు

ఒంటరిగా గుండెను తడుముకుంటున్నప్పుడు, మీ పక్కగా ఉండి, మీ వైపు తలలొగ్గి మిమ్మల్ని వినే ఈ లతలూ, పూవులూ, వాటి నీడలూ, ఏ మాత్రం ఒట్టి లతలూ పుష్పలూ కావనీ, ఒకటి రెండు రోజులు మీరు లేక, అవన్నీ నీళ్ళు లేక ఎలా ఉన్నాయోనని

అతను పడే ఆదుర్థా, ఒట్టి కంగారు మాత్రమే కాదనీ, ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి "మొక్కలకి నీళ్ళు మరచిపోకు. పిట్టలకి కొన్ని బియ్యం గింజలూ..." అని అతను మళ్ళీ మళ్ళీ చెప్పటం పిచ్చితనం కాదనీ, అవన్నీ మీరేననీ, మిమ్మల్ని ఇంకా బ్రతికి ఉంచేవి అవేననీ

వినిమయ ఇంద్రజాలంలో పడి, చాలా విషయాలు మరచిపోయిన మీకు, ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక విస్మయంతో అతను మీవైపు, చాలాసార్లు ఖచ్చితంగా చూసే ఉంటాడు. లేదా స్థాణువై మూగవాడైపోయీ ఉంటాడు - ఇప్పటికీ కూడా

అవన్నీ అతనికి ఒక పొడిగింపు అనీ, "పూవులూ మొక్కలతో గడపటం అంతా ఒక సెంటిమెంటల్ ట్రాష్" అనే మీకు అవి అతని అస్థిత్వంలో భాగమనీ, ఈ లోకానికీ అతనికీ ఉన్న సంబంధమే, వాటికీ అతనికీ ఉంటుందనీ, "వాటి లోకంలోకి ఒకసారి వచ్చి చూడండి. వానలోకి ఒకసారి చేతిని చాచి చూడండి. బంధాల నుంచి పారిపోవడం కాదు, ఒక అనుబంధం మొదలు పెట్టి చూడండి. ఇతరాన్ని ఒక్కసారి ప్రాణంగా ఇష్టపడి చూడండి" అని

ఇప్పటికి కూడా మీకు చెప్పలేక, ఈ మొక్కలనూ, ఆకులనూ, మొగ్గలనూ, పిట్టలనూ, కమ్ముకున్న మబ్బులనూ, వీచే గాలినీ, కురిసే నాలుగు చినుకులనూ, ఎలా మీ కోసం కొంత ఒరిమిగా వ్రాస్తున్నాడో చూడండి.

24 August 2014

నాకు తెలియదు

"పొద్దువోయింది
ఇగ ఇంటికి బో బిడ్డా. కాలం మంచిగ లేదు
నీ కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. నీ తల్లో, తండ్రో, పెళ్ళామో, పిల్లలో...

ఎంత తాగినా
ఎక్కిన లోకం దిగదు. వోయిన ప్రాణం తిరిగి రాదు

లోకం గిట్లనే ఉంటది బిడ్డా
దాంతో పెట్టుకున్నా, లంజతో పడుకున్నా ఒక్కటే. ఏదున్నా బతకాలె. పొయ్యెలిగించాలె-
కళ్ళలో నెత్తురుతో నేను బ్రతకతల్లే?

పో బిడ్డా.
జర భద్రంగా ఇంటికి బో-" అని నిన్న రాత్రి  తను చెబితే
ఆ చితికిన మనుషుల జనతా బార్ నుంచి
రాత్రి ఏ ఒకటింటికో చేరాను: మరి అది

ఇంటికో
మరి అది
ఇల్లో కాదో నాకు తెలియదు. 

అప్పుడప్పుడూ

అప్పుడప్పుడూ
వెళ్లిపోదామనే అనుకుంటావు ఈ లోకం మధ్య నుంచి

తాకీ తాకక
అసలు వచ్చిన ఆనవాలు కూడా లేకుండా
ఒక తెమ్మరలానో, పల్చటి ఎండలానో, నీటి తుంపరలానో
చెట్ల కింద నుంచి సాయంత్రానికి వెళ్ళిపోయే నీడలానో, కొలనులోని తామర పూవులానో

అప్పుడప్పుడూ
వెళ్లిపోదామనే అనుకుంటావు ఈ మనషుల మధ్య నుంచి-

వీళ్ళంతా
ఒట్టి ప్రతిబింబాలనీ, బోలు శబ్ధాలనీ, మాన్పుకోలేని
గాయాలనీ, ముసుగులు వేసుకుని తిరిగే పాములనీ, తోడేళ్ళనీ
నరమాంసం రుచి మరిగి - రాత్రికి నీ వద్దకు - పదే పదే తిరిగి వచ్చే పులులనీ
నవ్వే, ఏడ్చే, నడిచే మర్మావయాలనీ

వీళ్ళంతా, ఎప్పటికీ
ఇన్ని మంచి నీళ్ళు తోడుకోలేని బావులనీ
మట్టికుండా, గాలీ, వాన వాసనా, వెలిగించిన పొయ్యీ
ఉడికే మెతుకుల శబ్ధాలూ, నీళ్ళని పీల్చుకునే మట్టి కదలికా, పూల రేకుల కరుణా
తెలియని వింత జీవాలనీ, మృగాలనీ

అన్నిటినీ మించి
అద్దంలో నిన్ను నువ్వు చూసుకునే క్షణాలు వాళ్ళేనని, వాళ్ళు తప్ప
మరో మార్గం, గమ్యమూ లేదని తెలిసీ
అప్పుడప్పుడూ

వెళ్ళిపోదామనే అనుకుంటావు
నీలోంచి నువ్వు ఈ లోకంలోకీ, ఈ కాలంలోకీ, స్వర్గం నరకం
పాపం పుణ్యం, శాపం శోకం, మోక్షం జ్ఞానం, జననం మరణం, బ్రతుకు పరిమళమూ
వేదనానుబంధమూ అయిన ఈ మనుషులలోకి

అప్పుడప్పుడూ-

23 August 2014

దూరం నుంచి వచ్చేవాళ్ళు

అలసిపోయి చాలా నెమ్మదిగా నీ వద్దకి వస్తారు వాళ్ళు -

ఒక వృక్షమేదో నరకబడి బరువుగా నేల కొరిగినట్టు, శరీరమంతా 
విలవిలలాడే ఆకులై చలించి, నీ పక్కగా పడుకుండి పోతారు వాళ్ళు-
మన అమ్మలో, పిల్లలో, మన స్త్రీలో లేదా మన స్నేహితులో 

ఎవరో ఒకరు - గాలి లేని పగళ్ళలో కాంతి లేని రాత్రుళ్ళలో 
నీడలు కమ్ముకునే మధ్యాహ్నాలలో నిలువ  నీడ లేని సాయంత్రాలలో
హటాత్తుగానో, అతి నెమ్మదిగానో, నీ పక్కన చేరి, బేలగా 
నీ కళ్ళల్లోకి చూసే వాళ్ళు. అడగకనే అన్నీ అడిగేవాళ్ళు 

చెప్పకనే అన్నీ చెప్పేవాళ్ళు. నీ అరచేతిలో మరొక అరచేయై, వణికే చేతివేళ్ళయి  
చెమ్మై, నీ గుండెలోని బుగులు కపోతాలై, నీలో ఒదిగి 
నిరంతరం, నీటిబుడగలు పగిలే శబ్ధాలను చేసేవాళ్ళు
నిరంతరం, నీటి బుడగల లోకాన్ని నీకు చూయించే 

వాళ్ళు. వాళ్ళే 
నీలో నాటుకుని, నీ తనువంతా పుష్పించే వాళ్ళు. పుష్పించడంతో నిన్ను 
రుధిరమయం చేసేవాళ్ళు. నీలో, నీకు కొంత కష్టం కొంత ఇష్టం 
అయ్యేవాళ్ళు. నీకు కొంత బలమూ, మరి కొంత బలహీనతా 
అయ్యేవాళ్ళు. నీకు కొంత ప్రేమా చాలా చాలా నిస్సహాయతా 
అయ్యేవాళ్ళు . నిన్ను వొదలని వాళ్ళు. వొదులుకోలేని వాళ్ళు 
వాళ్ళు. వాళ్ళే 


అమ్మలో, పిల్లలో, స్త్రీలో, భార్యలో, ప్రియురాల్లో లేక స్నేహితులో

చాలా అలసిపోయి, చాలా పగిలిపోయి, మరో దారి లేక, మరో దిక్కు కనపడక
సమసిపోదామని, పొర్లిపోదామని, ఈ లోకపు గట్టు ఏదో దాటి 
నీలోకి దుమికి కొట్టుకుపోదామనీ, ఆనవాలు లేకుండా వెళ్లి 
పోదామనీ నీ వద్దకు వస్తే, అటువంటి వాళ్ళని ఎన్నడూ 

'ఎందుకు?' అని అడగకు. పొరబాటున కూడా ఎన్నడూ 
ముఖం దాచకు. చాచిన చేతినీ, తెరచిన ఛాతినీ, నీ ఇంటి 
తలుపులనూ నీ తోటి దేహసారికి ఎన్నడూ మూయకు
జాగురూకత లోకపు సంకెళ్ళ రీతిని, అస్సలే పాటించకు -

ఎందుకంటే మిత్రుడా, ఈ పూటకు ఇక 
ఇదే, మనకు మిగిలిన ఆఖరి మధువు!

22 August 2014

రెండు

ద్వేషం నిండిన వాళ్ళతో మాట్లాడటం ఎట్లాగా అని, కిటికీలూ తలుపులూ మూసిన ఇంటిలో 
నేనొక్కడినే, నాలో నేను చాలా తర్కించుకుంటూ కూర్చుంటాను. 
చాలా మధన పడుతూ కూడా ఉంటాను. 
చెబుదామని కూడా అనుకుంటాను చాలా -

'జీవితం చాలా తాత్కాలికమనీ, నీకూ నాకూ మధ్య విడదీయలేనంతగా బిగిసిపోయిన ఈ  
చిక్కు ముడులన్నీ ఎక్కువ కాలం ఉండవనీ, మనం నిజమని 
అనుకునేవన్నీ మరి కొంత కాలానికి ఎవరికీ గుర్తుండవనీ 
ఆఖరికి నువ్వూ నేనూ కూడా మిగలమనీ' - 

ఎలా చెప్పాలో తెలియక, నాకు నేను పరిమితమయ్యి, నాతో నేనే ఒక సంభాషణయ్యి
'ఇవతలి వాళ్ళూ, అవతలివాళ్ళూ అని లోకాన్ని చూడటం, ఒక 
అసంపూర్ణ వీక్షణ' అని నీతో చెప్పాలనీ చెప్పలేక, ఇక నేనే 
ఒక 'ఇవతలా- అవతలగా' చీలిపోయి, రెండుగా మారిపోయి 

నువ్వు ఊహించుకునే ఒక ద్వేషంలోకి, నేనే ఒక చీకటిగా మారిపోయి, ఊపిరందక తలెత్తి చూస్తే
ఇల్లంతా నీలాంటి చీకటి. ఇల్లంతా నాలాంటి చీకటి. ఇంటి బయటి కాంతినీ
ఊయల ఊగే గాలినీ, అల్లుకునే లతలనీ, అరిచే పిట్టలనీ, రంగుల పూలనీ 
లోపలి రానివ్వక బంధించిన తలుపులూ, కిటికీల 
దిగ్బంధనం. బావురుమనే ఊపిరాడనివ్వనితనం-

ఇక, ద్వేషం నిండిన వాళ్ళతో మాట్లాడటం ఎట్లాగా అని - నాకు నేనే - నా ఇంటి తలుపులూ
కిటికీలూ మూసుకుని, నేనొక్కడినే, నాలో నేను చాలా తర్కించుకుని 
మధనపడీ, తపన పడీ లేచి అసహనంగా కిటికీలూ తలుపులూ తెరిస్తే 

గదిలోకి వరదలా పొర్లుకు వచ్చే వెలుతురు. వాన చినుకుల తడి
చినుకుల కాంతిలో పొదగ బడుతున్న రంగుల పూల పరిమళం-
చిట్లుతున్న విత్తనాలూ, తొలి చివుర్ల జీవన ఉత్సాహమూ, ఇంకా 

నేను. నేను అనే నువ్వునువ్వు అనే సమస్థం - ఒక శాంతి లోకం, కాలం. 

21 August 2014

దీపశిఖ

1
ఇది నేను నీకు
ఎప్పుడో ఇవ్వాల్సిన ఒక కానుక.
2
నువ్వు
ఒంటరిగా కూర్చున్నప్పుడో
నీతో నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడో

నువ్వొక్కదానివే
నీలోకి నువ్వు, లోలోపలికి ముడుచుకుపోయి
మూలకు ఒదిగిపోయి
ఒక పావురమై
చీకటి గూట్లో పడుకున్నప్పుడో

లేక
ఆ ఒక్క క్షణం ముందు
నా చీకట్లో, నువ్వు ఒక దీపం వెలిగించి
గూట్లో పెట్టినప్పుడో-
3
రెండు వేళ్ళని
దగ్గరగా చేర్చి, నెమ్మదిగా నులిమి వొదిలితే
ఒక పూవు

తనని వదలమని
నిను అర్థిస్తూ తల వాల్చినట్టు
కనపడని దూరాలకు
ఒక పక్షి ఎగిరిపోయినట్టూ
ఆరిపోయే కాంతి -

ఇక
ఒక తెల్లటి పొగ
క్షణకాలం నన్ను అల్లుకుని, బహుశా
నిదురించిన నీ శరీరాన్ని
మరొకసారి గుర్తుచేస్తూ మాయమయితే
4
క్షమించు.

ఇక్కడంతా
పూలు తెగిన చీకటి.
ఇక్కడంతా, తల్లి పాలకై నోరు తెరిచి
అలానే చనిపోయిన
ఒక శిశువు కనులలోని నిశ్శబ్ధం -
ఇక్కడంతా
క్షణకాలం క్రితం వరకూ
ఆ తల్లి స్థన్యానికై వెదుకులాడిన ఆ శిశువు చేతుల తండ్లాట -

ఇక్కడంతా
5
ఇదంతా
నేను నీకు ఎప్పుడో ఇవ్వాల్సిన
నేను అనే
ఒక మృత్యు కానుక. 

20 August 2014

ఒక పెర్సనాలిటీ డెవలప్మెంట్ పోయమ్

మనుషులపై కోపం ఉండటం తప్పేమీ కాదు, అది నిన్ను అంధుడిని చేయనంత వరకూ. లోకంతో కటినంగా వ్యవహరించడం తప్పేమీ కాదు, అది నిన్ను స్పర్శా రాహిత్యంగా మార్చనంతవరకూ. మరి, అవన్నీ నీ పట్ల కోపంగానూ, కటినంగానూ ఉన్నాయా అంటే మరి ఇటు చూడు. ఇప్పుడు

నీ చుట్టూ చెట్లు ఉన్నాయి. పూసిన పూవులూ ఉన్నాయి. నీళ్ళు చిలుకరించిన ఆవరణలూ అప్పుడే లేచిన పిల్లలూ ఉన్నారు. చల్లగా వీచే గాలీ, వెడుతూ వెడుతూ ఎవరో నిన్ను చూసిన స్నేహపూర్వకమైన నవ్వూ ఉంది. తినడానికి అన్నమూ, తాగడానికి నీళ్ళూ, తల దాచుకోడానికి ఒక గూడూ, దానిలో పక్షి పిల్లలూ ఉన్నాయి. వాటి రెక్కల్లో కొంత గోరువెచ్చదనం ఉంది. ఇష్టమూ ఉంది. అన్నిటినీ మించి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. నువ్వు ఇంకా బ్రతికి, చూడవలసిన ఉత్సవమేదో, చేయవలసిన పనులేవో, వొదిగిపోవాల్సిన వేదన ఏదో మిగిలే ఉన్నాయి-

నిర్వచనాలదేముంది? ఎన్నైనా చెప్పవచ్చు. సత్యానిదేముంది? ఎంతైనా వ్యాఖ్యానించవచ్చు. ప్రేమంటే ఇష్టం లేకపోతే, ఆ పదం వాడకు. కానీ, లోకంపై కోపంతో మనుషులనూ, మనుషులపై కోపంతో లోకంనూ చిన్నబుచ్చకు. మరీ అంత కటినంగా ఉండకు. బిడ్డా, కొంత ఓరిమి ... కొంత ఓరిమి పట్టు ...  

ఇంకొద్దిసేపట్లో, కనిపించేవన్నీ నిజమనిపించేవన్నీ మంచు తెరల వలే ఎలా కరిగిపోతాయో చూడు-  

a noem and a cautionary tale

ముందే చెబుతున్నాను
ఇదొక చెత్త పొయమ్. ఆపై నీ ఇష్టం.  

(ఇదొక మెటఫర్. 
ఇందులో కనిపించేది ఏదీ
ఏది కాదు.) 

రాత్రి రేకులు విచ్చుకోగా 

అడగకుండా వచ్చిన వెన్నెల
చెప్పకుండానే   
వెళ్లిపోయింది-

(ఇక)


ఉన్నదంతా ఒక్కటే


చీకటీ,గాలీ,వాన చినుకులూ 

పూల పరిమళం 
ఇంకా, తన శ్వాస.

19 August 2014

రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను

రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను.

అప్పుడు నా పైన ఆకాశం కొద్దిగా కుంగి ఉండింది. అప్పుడు నా పాదాల కింది నేల కొద్దిగా పగుళ్లిచ్చి ఉండింది. అప్పుడు నా చుట్టూ గాలి చాలా ఒంటరిగా, తల్లి లేని పిల్లి పిల్లలా బావురుమంటూ తిరుగాడుతూ ఉండింది. అప్పుడు నువ్వు రోజూ చూసే చీకటే, నెత్తురు వలే నా ముఖంపైకి చిలకరించబడి ఉండింది. అప్పుడు బాల్కనీలోని ఈ మొక్కలూ, పూలూ, లతలూ అన్నీ విగతజీవులై నన్ను భయభ్రాంతుడిని చేస్తూ ఉండినై -

అవును. రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను.

అప్పుడు నా కళ్ళు కొంత తడిగా ఉండినాయి. అప్పుడు నా బాహువులు ఖాళీగా ఉండినాయి. అప్పుడు నా శరీరం వానకి నేల రాలిన గూడు అయ్యి, పగిలిన గుడ్లు అయ్యీ ఉండింది. అప్పుడు నా గొంతు రెక్కలు కొట్టుకుంటూ అరిచే తల్లి పావురం అయ్యి ఉండింది. అప్పుడు నా తలపంతా నువ్వై, 'నువ్వు ఎక్కడా? ఎక్కడా-?' అని ప్రతిధ్వనిస్తూ ఉండింది. 

అవును - రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను. అవును - రాత్రి నీ కోసమే, నన్ను కనే ఒక రాత్రి కోసమే ఫోన్ చేసాను. అవును - రాత్రి, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుందామనే, నన్ను నేను కనుక్కుందామనే, నేను బ్రతికి ఉన్నానో లేనో తెలుసుకుందామనే 

నా కోసమే, నీ కోసమే - నేను నీకు ఫోన్ చేసాను. 

17 August 2014

అందుకే

నేను
నీ వాడినని ఎన్నడూ చెప్పలేదు
పూలల్లో దారం గుచ్చుకుంటూ నువ్వూ,  ఎన్నడూ అడగనూ లేదు-

ఇక
ఈ సాయంత్రాన్ని చీకట్లోకి తురుముకుని
నువ్వు చినుకులని వినే వేళ, రాత్రి దారుల్లో నెత్తిన రుమాలుతో
ఒక్కడే 

ఒక బాటసారి.
శరీరం తప్ప ఆత్మ అంటూ ఏమీ లేని దేహధారి.
నీ సువాసనలో కాలి బూడిదై, చుక్కలు ఇంకిన చినుకులతో, గాలితో

రాలే ఆకులతో
గులకరాళ్ళకు పైగా, చిన్ని చిన్ని చివుక్ చివుక్ శబ్ధాలు చేసుకుంటూ
తనలో తాను మాట్లాడుకుంటూ

బహుశా
ఇటువంటి ఒక కవితను వ్రాసుకుంటూ
చీకట్లలో, పక్షులు బెంగగా ముడుచుకున్న చెట్ల కింద నుంచి
వణుక్కుంటూ, గొణుక్కుంటూ
తనలో తాను నీరై పారిపోయే మనిషి -

బహుశా అతనికి
నువ్వూ, ఎన్నడూ తన దానివని చెప్పనూ లేదు. బహుశా,  అతనూ
ఎన్నడూ నిన్ను, 'ఎందుకు?' అని అడగనూ లేదు.

బహుశా, అందుకే
పూలల్లో దారం గుచ్చుకుంటూ, చిన్నగా పాడుకుంటూ
గడప వద్ద దీపపు కాంతిలో వెలిగిపోయే
-నువ్వు-

మరెక్కడో
తెంపబడిన పూల చీకట్లలో నేను! 

అతి సాధారణమైన

ఆదివారం,ఉదయం వేళ. 

ఆడుకుంటూ పిల్లలు. సగం తెరచిన కిటికీలోంచి గాలి. నేలపై వెలుతురు. బాల్కనీలో, బియ్యం గింజల చుట్టూ తిరుగుతూ పిచుకలు. సన్నగా ఊగుతూ లతలు. మట్టి కుండీలలో మొక్కలు. డైనింగ్ టేబుల్పై, ఒక గాజు గ్లాసు నీళ్ళల్లో నువ్వు ఉంచిన రెండు గులాబీలూ, వాటికి మిగిలిన రెండు రెమ్మలూ. మరి అవి నీ కళ్ళూ, కదిలే నీ కనురెప్పలూ -


ఉదయం, మధ్యాహ్నంగా మారుతున్న వేళ 

ఆడుకుంటూ పిల్లలు. తెరచిన తలుపులలోంచి గాలి. ఊడ్చిన గదులు. మెరిసే గోడలు. వంటగదిలో అన్నం ఉడికే చప్పుడూ, ఇంకా నీవే మరి కొన్ని మాటలూ. అప్పుడు, ఆడుకునే పిల్లలకి స్నానాలూ, నెత్తికి కుంకుడు వాసనలూ, నోట్లో ఉప్పూ, కంట్లో నీళ్ళూ, వాళ్ళని చూస్తూ ఒక మూలగా ఉగ్గపట్టుకుని నేనూ-

ఇక ఉదయం, మధ్యాహ్నమైన వేళ 

ఇంత అన్నం తిని ఒక దగ్గరిగా ఒదిగిన పిల్లలు.తెరచిన కిటికీలలోంచి, కొమ్మల్లో ఒక దగ్గరిగా ముడుచుకున్న పిట్టలు. గాలికి కదిలే వాటి ఈకలు. ఆ పక్షులని గుండెపై వాల్చుకుని, నునుపైన వాటి మెడల్లో తల ఆన్చి, వాటి చేతివేళ్లని పట్టుకుని పడుకుంటే, నా కలలోకి వచ్చే

పిల్లలు కదులాడే నీ నిండైన కళ్ళూ, వాటి గుండె చప్పుళ్ళూ, ఆ గుప్పిట్ల తోటలల్లో, ఆ పొదరిళ్ళలో, వాన కురిసిన ఆ పచ్చి చెట్ల సువాసనల్లో ఇరుక్కుపోయిన నేనూ నా చేతివేళ్లూ, ఈ అక్షరాలూ, ఒక మధ్యాహ్నం, ఒక జీవితం, ఒక క్షణం అను ఈ ఒక అతి సాధారణమైన కవిత- 

16 August 2014

లాంతరు

రావి ఆకులు గలగలా కదిలినప్పుడు, అలలు ఒడ్డుకు నింపాదిగా
కొట్టుకుని వస్తున్నప్పుడు, సాయంత్రంలో
ఆ నారింజరంగు కాంతిలో, చల్లటి గాలిలో

నువ్వొక్కడివే తల దించుకుని నడుస్తూ వస్తున్నప్పుడు
తటాలున నీకొక ముఖం జ్ఞాపకం వస్తుంది -

ఎవరితోనైతే ఉందామని అనుకున్నావో, ఎవరితోనైతే కలిసి
నవ్వుదామనీ, నడుద్దామనీ, మంచు కురిసే
రాత్రుళ్ళలో, గాట్టిగా కావలించుకుని పడుకుందామనీ
కరడు కట్టిన కాలంలో కలిసి రోదిద్దామనీ

కొంత జీవిద్దామనీ, మరి కొంత మరణిద్దామని అనుకున్నావో
ఆ ముఖం! అవును అదే ముఖం.
నువ్వే వదిలివేసావో, తనే నిన్ను
మరచిపోయిందో కానీ, ఇప్పుడు

రావి ఆకులు చిక్కటి రాత్రిలోకి మునగదీసుకుంటున్నప్పుడు, చీకటి
ఒక వ్యాఘ్రమై నువ్వు వచ్చే దారిలో
పొంచి చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు

నీ చేతిలో ఒక లాంతరూ, ఒక ఖడ్గమూ, శాంతి ముద్రా అయ్యి
నిన్ను పూల సువాసనతో, అతి సునాయాసంగా
తేలికగా, ప్రమాదభరితమైన ఈ దారిని దాటించి

మరో దారిలోకీ, మరో లోకంలోకి, రోజా పూల వంటి చినుకులలోకి
నీ కాలాన్ని అలలపై కాగితం పడవ చేసి
వొదిలివేసిన ఆ ముఖం, అవును అదే -
ఆ ముఖం ... ఆ ఒకే ఒక్క ముఖం ...

లాంతరు వంటి ముఖం, కాంతి వలయం వంటి, వెలుగు వాసన వంటి ముఖం
తెప్పవంటి  ముఖం, వాన వంటి ముఖం
గాలి వంటి ముఖం, ఊపిరి వంటి ముఖం
శిశువుకు తల్లి పాల వంటి, ఒడి వంటి

జోలపాట వంటి తన ముఖం, ఇప్పుడు ఎక్కడ?      

13 August 2014

అతిధి

తన ఇంటికి వెళ్లాను-

అప్పుడు చప్పున తన ముఖం వికసించింది. నన్ను లోపలకి రమ్మని పిలిచి
కూర్చోమన్నది. మంచి నీళ్ళు తాగుతావా
కాఫీ పెడతాను. టిఫిన్ చేసావా అని పాపం

ఆదరాబాదరాగా తను కిందా మీదా అయ్యింది.
కలగాపులగం అయ్యింది. కంగారు పడింది- 
నేను అప్పుడు అన్నాను

"ఇప్పుడేమీ వద్దు. నేను తినే వచ్చాను.
ఇంతకూ నువ్ టిఫిన్ చేసావా?" అని
తదేకంగా తన ముఖంలోకి చూసాను.

అప్పుడు
ఆ ఇంటి ఆవరణలోని వేపచెట్టు చలించి, పాలిపోయిన ఆకులు
రాలాయి. ఎక్కడిదో గాలి, హృదయాన్ని
చెక్కేలా నింపాదిగా వీచింది. పిల్లి ఒకటి

గోడపై నుంచి కడిగిన గిన్నెల మధ్యకు దూకగా
అవన్నీ చెల్లాచెదురై పెద్ద శబ్ధం చేసాయి-
ఇంటి వెనుక ఆరవేసిన దుస్తులు కూడా

ఒకదానికి మరొకటి ఒరుసుకుని ఏవో గొణిగాయి.
ఆనక నిశ్చలమయ్యాయి. ఇక వరండాలో
నేలపై, తను అప్పటిదాకా దువ్వుకున్న

దువ్వెనలో ఇరుక్కుని, తొలిగిన జుత్తే ఆ ఎండలో, నేలపై 
తెల్లగా, మెల్లిగా, తన చేతివేళ్ళ వలే
వణుకుతూ, వేపాకులతో దొర్లిపోతూ-

ఏమీ లేదు.
ఈ ఉదయం ఇంటికి వెళ్లాను.
ఒక అతిధి వలే అమ్మను చూసొచ్చాను. 

11 August 2014

నేనే

1
నిరంతరం
నిన్ను నీకే విసుగు కలిగించేలా చేసే దైనందిన వ్యాపకం - అందుకే
ఎక్కడికైనా
తప్పించుకు పోదామని అనుకుంటావు. నిన్ను నువ్వు పూర్తిగా
మరచి పోదామని కూడా.
2
తోటలో పూలతో గడపటం సాంత్వన అనుకుంటావు. పూలని
కిలకిలా నవ్వే శిశువులుగా ఊహిస్తావు. లేదా, కిటీకీ పక్కన కూర్చుని
మబ్బులు కమ్మిన మధ్యాహ్నం, గాలి మునివేళ్ళని తాకుతూ
ఒక వానని స్వప్నిస్తావు. కలలోని చినుకులతో ఆడుకుంటావు

లేదా రాత్రుళ్ళని చల్లగా కప్పుకుని నక్షత్రాలని విందామని కూడా -
అవి నీకు చెప్పే, నీకు తెచ్చే యుగాల భూమి కథలనీ మట్టి వాసననీ
నీ హృదయంలోకి ఇంకించుకుందామనీ, అతీతమైనదేదో అర్థమయితే

నీ కనులలోకి
ఊటలా నీరు ఊరితే, పూలని స్వప్నించే ఒక పచ్చని చెట్టు ఒడిలో
నిదురోదామనీ

తిరిగి
కనులలో పూల రంగులతో, పూల చినుకులతో నిదుర లేచి
తప్పటడుగులతో
ఈ లోకంలోకి బ్రతకడానికి బయలుదేరుదామనీ -
3
నిరంతరం

నీపై నీకే చికాకు కలిగేలా చేసే రోజూవారీ ప్రదర్సనశాలలో ఎక్కడో తప్పిపోతావు.
పూలూ, నక్షత్రాలూ, వాన కురిసే సాయంత్రాలూ
అమలినమైన ప్రేమలూ, శరీరాలకు అతీతమైన
ఆత్మల కోసం వెదికీ వెదికీ వేసారిపోతావు-

అవన్నీ
వాచాకాలపై వాచకాలు అనీ, ఒక నాటకం అనీ
నీలోకి నెమ్మదిగా చేరే, నిన్ను నీ నుంచి దూరం చేసే ఒక మహామాయాజాలం అనీ
భాషలోకి రాని సత్యమేదీ లేదని గ్రహిస్తావు-

ఇదే లోకం అనీ
పాపం పుణ్యం, శాపం శోకం, వేదం వాదం, కర్మా కర్తా క్రియ అంతా మనిషేననీ
ఇంతా చేసి, తప్పించుకుపోదామనుకున్న ఆ మనుషులే
మనకు చివరికి మిగిలే పరమ సత్యమనీ, వారితోనే జననమనీ, మరణమనీ
వాళ్ళే జనన మరణాలనీ తెలుసుకుంటావు ఒక దినాన

మధుశాలల్లో
రద్దీ రహదారుల్లో, వాళ్ళ మోసాలలో వాళ్ళ అమాయకపు ఇష్టాలలో, నీకు ఎదురేగి
నిన్ను బలంగా కౌగాలించుకునే బాహువుల్లో
వాళ్ళ నవ్వుల్లో, ఆ ఒక్క వ్యక్తికై నువ్వు ఎంతో దూరం ప్రయాణించే కన్నీటి దూరాల్లో
వేసవి ఎడారుల్లో

వర్షాకాలపు నదులలో
వాళ్ళ నాట్యాలలో, వాళ్ళ యుద్ధాలలో, వాళ్ళ దినదిన కార్యాకలాపాలలో, కాలకృత్యాలలో
వాళ్ళ సువాసనల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో
వాళ్ళే ఋతువులైన ఒక మహా కాలంలో

ఇతరమే తాననీ
తానే ఇతరమనీ -
4.
 నిరంతరం
నీపై నీకే విసుగు కలిగించేలా, నిరాసక్తత పెంపొందించేలా చేసే ఈ యాంత్రిక
దినదిన యధాలాపపు వ్యాపకంలో
నిన్ను నువ్వు పూర్తిగా గుర్తుంచుకోవడమే అంతిమ మార్గమని బోధపడి

మేలుకొని, లేచి కూర్చుని
ఇలా, ఒక పాటని వింటూ...
5
నువ్వూ వింటున్నావా, నేనే అయిన ఈ గీతాన్ని?   

10 August 2014

ఈ వేళ ఎందుకో

ఈ చీకట్లో, ఈ గాలిలో, ఈవేళ ఎందుకో

చెట్ల కింద నాకై ఎదురుచూస్తూ, కురులను వెనక్కి తోసుకునే నువ్వూ
నీ ముఖమూ, నీ చేతివేళ్ళ కదలికలూ జ్ఞాపకం వచ్చాయి-
ఆపై వెనువెంటనే, వెల్లువలా కమ్మివేసే, నన్ను నిలువెల్లా

దహించివేసే, దాహార్తిని చేసే, త్రికాలాలను ఏకం చేసే

దవనం వాసన వేసే నీ శరీరమూ, నీ గొంతూ, కనకాంబరం పూలూ జ్ఞాపకం వచ్చాయి-
ఆపై, ఒకప్పుడు నన్ను కావలించుకున్న నీ రెండు చేతులూ
నన్ను నిర్ధయగా వేటాడాయి. ఇకా తరువాత నీ రెండు కళ్ళూ
నా శిరస్సుపై ఉన్న ఒకే ఒక గూటిని కూల్చివేసాయి-

ఈ చీకట్లలో, ఈ గాలిలో, ఈ నక్షత్రాలలో, ఈ రాత్రి శబ్దాలలో, ఊగే నీడల్లో
కనుచూపుమేరా అనంతంగా సాగిన
డస్సిపోయిన ఈ ఒంటరి రహదారిలో

ఈ వేళ ఎందుకో
నువ్వే గుర్తుకువచ్చావు.
నేనే ఎక్కడో, తప్పిపోయాను-

08 August 2014

అంతే

'అప్పుడేం మిగలవు ఇవన్నీ

గాలులు వీచే సాయంత్రాలూ, సాయంత్రాలలో వీచే స్త్రీలో పూలో, మరి  
పూలల్లో, పిల్లల్లో వానల్లో వాగుల్లో, అలలుగా 
తెరలు తెరలుగా పోర్లిపోయే వెన్నెల రాత్రుళ్ళో  

అప్పుడేం మిగలవు ఇవన్నీ. 

నువ్వేం కప్పుకున్నా, విప్పుకున్నా 
నువ్వెన్ని జలతారు దుస్తులు వేసుకున్నా, ప్రదర్శించినా, ప్రవచించినా  
అంతా ఇప్పుడే మరి
అంతా ఇక్కడే మరి-

నిజం చెబుతున్నాను నేను 
అప్పుడేమీ మిగలవు ఇవన్నీ. ఇక్కడ లేని మరో లోకం లేదు' అని నేను అంటున్నానంటే 
నువ్వు నన్నునమ్ము మరి- 

ఎందుకంటే, అప్పుడు 

ఎప్పటిలా, ఒక మధ్యాహ్నం 
కొమ్మల్లో ఒక కాకి రికామిగా అరుస్తూ ఉంటుంది. 
నువ్వు ఎప్పుడూ కూర్చునే

ఆ కుర్చీ ఒక్కటే , చెట్ల కింది నీడల్లో 
ఖా
ళీ
గా
.
.
.
అంతే. 

తాకాలని

ఈ నగరం తాకని, ఏ వెన్నెల వానో కురిసే రాత్రిలో తడిచే పూలను
సున్నితంగా పరికించినట్టు, నీ చేతివేళ్ళని
తాకాలని అనుకుంటాను -
అవే

నిద్దురలో ఒక పక్కకి ఒత్తిగిల్లి, నాకు తెలియని భాషలో కలవరించే నీ చేతివేళ్ళు -
అద్దంపై పొగమంచుని తుడిచి ముఖాన్ని చూసుకున్నట్టు
అప్పుడొక

గగుర్పాటు. ఉదయమంతా పొగచూరి, మసిబారి, ఇప్పుడిక ముడుతలు పడి
వెక్కి వెక్కి ఏడ్చి నిదురలోకి జారిన, పసిపాపల వంటి నీ
చేతివేళ్ళు -

చీపుర్లు అయిన చేతివేళ్లు. వంట గిన్నెలయ్యిన చేతివేళ్ళు. దుస్తులయ్యిన చేతివేళ్లు.
సబ్బూ, రుబ్బురోలు పత్రమూ, గదులూ మలమూ మూత్రమూ ఏర్పరిచిన
పసుపుపచ్చ
మరకలనూ
శుభ్రం చేసే

శ్రమా అయిన చేతివేళ్ళు. నువ్వు కక్కుకున్నప్పుడు మట్టికుండై నిన్ను నింపుకున్న
చేతివేళ్లు. అన్నం పెట్టే చేతివేళ్లు. నీకు నీళ్ళు తాపించే చేతివేళ్లు.
అప్పుడప్పుడూ
తలుపు చాటున

కండ్లల్లో నీళ్ళు కుక్కుకునే చేతివేళ్లు. అప్పుడప్పుడూ మూగవోయె చేతివేళ్లు. నుదురుని
అరచేతిలోకి వంపుకుని రాత్రంతా కూర్చునే చేతివేళ్లు.
నిన్ను శపించలేని చేతివేళ్లు.
నిన్ను దీవించే చేతివేళ్లు -

నిన్ను ప్రేమించీ, ప్రేమించీ, గరకుగా మారి, ఇప్పుడిక ఒక కలత నిద్రలో
పెరడులో ఆరవేసిన దుస్తులు రెపరెపా కొట్టుకుని, ఒక ముళ్ళతీగకు చుట్టుకుని
ఆగిపోయినట్టున్న, నీ చేతివేళ్లు-
తిరిగి గాలికి కదిలి

తను కొద్దికొద్దిగా చిరుగుతూ, ముల్లుతో ఉండా లేకా, పూర్తిగా వొదిలి వెళ్లిపోలేకా
మరింతగా చీలిపోయే నీ చేతివేళ్లు.
చీకట్లో దీపాన్ని వెలిగించే చేతివేళ్లు.

అదే దీపాన్ని ఆర్పుతూ మరెవరివో చేతివేళ్లు. ఇక మరి ఎక్కడిదో ఒక గాలి ఇక్కడ
వీచీ వీచీ, ఇక వీయలేక వెళ్ళిపోతే
కాలం స్థంబించిన ఆ క్షణాన

ఈ నగరం తాకిన, ఏ వానా కురియని రాత్రిలో సొమ్ముసిల్లిన నీవంటి, అమ్మవంటి
నీ చేతివేళ్ళని తాకాలని అనుకుంటాను. తాకుతాను.
ఇంత ఎరుకతో
నిన్ను తాకాక

తాకడమంటే, తాను ఇతరమవ్వడం అని తెలిసాక, తాకడమే శోక నివారణ అని తెలిసాక
ఇక మునుపటిలా, నేను, నేనులా
ఎలా ఉండగలను?     

03 August 2014

అయిపోయినవి

(Is it over? He mumbled
To himself)
*
ఆ తరువాత రోజు
ఏవీ గుర్తుకు లేవు
రాత్రంతా నీ శరీరం నా శరీరానికి అద్దిన సువాసన తప్ప. పూల తాకిడి తప్ప-
*
ఉదయాన్నే, పొగమంచు వీచే సరస్సు ఒకటి జ్ఞాపకం వచ్చింది
దానిలో తీరాన, నిశ్చలంగా ఆగి ఉన్న పడవ ఒకటి జ్ఞప్తికీ వచ్చింది
పడవలోని ఒంటరితనం, సరస్సులోని చల్లదనం

రెండూ ఒకేసారి తెలిసి వచ్చి, అరచేతుల్లోని ముఖం వొణికి
రాలిపడి, వీచే గాలికి ధూళితో ఎటో కొట్టుకుపోయింది
కొంత నొప్పిగా అనిపించింది. రావాల్సిన వాళ్ళు ఎవరో

వస్తానని చెప్పి రాకుండా గాయపరచినట్టూ అనిపించింది-
*
ఆ తరువాతి రోజు
ఏవీ గుర్తుకులేవు
రాత్రంతా నీతో మిళితమయ్యి, నీతోనే వెళ్ళిపోయిన నా శరీరపు
అశ్రు వాసన తప్ప
*
Is it really over? Between us?

(Now
He couldn't even utter
Those words
To himself
Anymore)
*
ఆmen!

02 August 2014

నీ గది

తళతళలాడింది నీ గది: ఆనాడు. అప్పుడు, ఇంకా మబ్బు పట్టక మునుపు -

నీకు నచ్చిన
అగరొత్తులను వెలిగించి నువ్వు కూర్చుని ఉంటే, నీ చుట్టూతా
నిన్ను చుట్టుకునే

సన్నటి, పొగల లతలు:
అవి, నా చేతివేళ్ళు  అయితే బావుండునని ఊహించాను నేను, ఆనాడు:
అప్పుడు

చిరుగాలికి, చిన్నగా కదిలాయి
కర్టెన్లూ, నేలపై నువ్వు చదివి ఉంచిన దినపత్రికలూ, నువ్వు రాసుకున్న
కాగితాలూ

పచ్చిక వలే
నీ ముఖం చుట్టూ ఒదిగిన నీ శిరోజాలూ, చివరిగా నేనూనూ. "కొమ్మల్లోంచి
ఒక గూడు రాలిపోయింది
సరిగ్గా

ఇటువంటి
వానాకాలపు మసక దినాన్నే. చితికిపోయాయి గుడ్లు - వాటి చుట్టూ
గిరికీలు కొట్టీ కొట్టీ
అలసిపోయాయి

రెక్కలు. తెలుసా నీకు?
అమ్మ ఏడ్చింది ఆ రోజే " అని చెప్పాను నేను. "నాకు తెలుసు" అని అన్నావు
తిరిగి పొందికగా నీ గదిని

సర్దుకుంటూ నువ్వు:
నేలపై పరచిన తివాచీ, తిరిగిన ప్రదేశాల జ్ఞాపకార్ధం కొనుక్కు వచ్చిన బొమ్మలూ
పింగాణీ పాత్రలూ

ఓ వెదురు వేణువూ
ఇంకా సముద్రపు తీరం నుంచి నువ్వు ఏరుకొచ్చుకుని దాచుకున్న శంఖమూనూ.
ఇక నేనూ పొందికగా

ఆ వస్తువుల మధ్య
సర్ధబడీ, అమర్చబడీ, బొమ్మగా మార్చబడీ నువ్వు ముచ్చటగా చూసుకుంటున్నప్పుడు
ఎక్కడో అలలు

తెగిపడే వాసన -
తీరాలలో అవిసె చెట్ల హోరు. ఒడ్డున కట్టివేయబడిన పడవలు అలజడిగా కొట్టుకులాడే
తీరు. కళ్ళల్లో కొంత
ఇసుకా, ఉప్పనీరూ-

మరి, తళతళలాడి
ఆనక మబ్బుపట్టి, ఈదురు గాలికి ఆకులూ, పూవులూ, ధూళీ రాలడం మొదలయ్యిన
ఆనాటి నీ గదిలో

ఇక ఇప్పటికీ ఒక వాన కురుస్తూనే ఉందా?  

01 August 2014

ఎక్కడ?

నీ ఇంటికి దారి మరచిపోయాను నేను: ఆనాడు -

నగర రహదారులు 
అజగరాల వలే వ్యాకోచించి, తిరిగి చుట్ట చుట్టుకుంటున్న వేళ, దీపస్థంబాలు 
ఉరికొయ్యలై 

వేలాడుతున్న వేళ
దివి నుంచి భువికి కారు మబ్బులు చేతులు చాస్తున్న వేళ, దారి పక్కన 
లోకం లుంగలు చుట్టుకుని 

కడుపుని కావలించుకుని మూలుగుతున్న వేళ, రివ్వున కోసుకుపోయే 

నుసులేవో కళ్ళలో పడి 
చూపులు నెత్తురయ్యే వేళ, మృతశరీరం వలే కాలం మంచుగా మారే వేళ
నాతో నేను విసిగి 

దారి తప్పి, నీ ఇంటిని 
మరచి, ఎంతకూ భూమిలో కరగని - చిరిగిన ఒక ప్లాస్టిక్ కవర్నై, పూవునై  
కొట్టుకుపోతున్న వేళ

కనుగొన్నావు 
నువ్వు నన్ను ఆనాడు, ఆ చీకటి రాత్రుళ్ళలో, వెలుగుతున్న ఒక ప్రమిదెవై
పసుపు పచ్చని 

శరీరమై, మొగలిపూల 
సువాసనవై, పసిపిల్లలు కట్టుకునే ఇసుక గూడువై, నేను ఆడుకుని, పగులగొట్టి 
విసిరి వేసే ఒక 
మట్టి బొమ్మవై - 

ఇక ఇప్పుడు ఇక్కడ 
నీ నెత్తురు అంటిన అరచేతుల్లో, నీ ముఖాన్నీ, తన ప్రతిబింబాన్నీ, దారినీ  
చూసుకుంటూ అతను

ఇల్లే లేక, కానరాక  
ఇలా అంటున్నాడు, సంధ్యవేళ మసక చీకట్లలో, చినుకుల ఝుంకారంలో, ధూళిలో  
ఈ కొన్ని పదాలతో:

'నీ ఇంటికి, నీ వద్దకీ ఇప్పటికీ దారి మరచిపోయి ఉన్నాను నేను. 
త్రొవ్వ  ఎక్కడ?'  

31 July 2014

నేను. 1

I am 
Mood swings 
I am 
Hypomania 
I am Euphoria
I am inflated self-esteem
I am poor judgment
I am rapid speech
I am racing thoughts
I am aggressive behavior
I am agitation 
I am irritation
I am increased physical activity
I am risky behavior

I am 
Spending sprees 
I am unwise financial choices
I am increased drive to perform or achieve goals
I am increased sex drive
I am decreased need for sleep
I am easily distracted
I am careless 
I am dangerous use of drugs or alcohol
I am delusions 
I am a break from reality 

I am sadness
I am hopelessness
I am suicidal thoughts 
I am anxiety
I am guilt
I am sleep problems
I am fatigue
I am loss of interest in activities people consider as enjoyable
I am irritability
I am chronic pain without a known cause
And finally

I am you

టేకు చెట్ల నీడల్లో

ఆనాడు, ఆ టేకు చెట్ల కింద కలుసుకున్నాం మనం -

మబ్బులు కమ్ముకుని ఉన్నాయి ఆనాడు
నీ ముఖంపై.
ఉండుండీ గాలి చల్లగా వీస్తే

నన్ను పట్టుకున్న నీ చేతులు కంపించాయి. తల ఎత్తి
నేను చూడలేని నీ కళ్ళు
తడిగా మారి ఉంటాయి-

కాంతి లేని మన శరీరాలపై నీడలు నిశ్చలంగా, అప్పుడు -
అక్కడక్కడే తిరిగి
ఆగిన ఒక తూనీగ

వైపు నెమ్మదిగా సాగుతూ ఒక తొండ - ఇక మన పాదాల కింద
మరికొద్దిగా కుంగుతూ
మట్టి. విరిగిన
గాజులు -

మరి ఎక్కడో కొమ్మలు విరిగి పడుతున్న చప్పుడు.
ఆకులు విలవిలలాడి
చేసే చప్పుడు
అప్పుడు -

"ఇదేనా ఆఖరు సారి? మనం చూసుకోవడం?" అని
నువ్వు అన్నప్పుడు
తల ఎత్తి చూస్తే

టేకు ఆకు అంతటి కంత నీ హృదయ స్థానంలో -
ఇక మరి, ఒక
నిలువెత్తు టేకు
నా స్థానంలో

ఎవరో అంటించబోతున్న, ధగ్ధమవ్వబోతున్న, బూడిదవ్వబోతున్న
ఒక నిలువెత్తు టేకు
అప్పుడు

ఆనాడు, ఆ టేకు చెట్ల నీడల్లో మనం కలుసుకున్నప్పుడు-
ఇక ఇప్పుడు, ఇక్కడ
మిగిలింది
ఏమిటి

టేకు చెట్లు లేని ఆకాశం కింద, ఈ నగరంలో నీకూ నాకూ?

30 July 2014

ఆనాడు

రాత్రంతా మెత్తటి వాన: ఆనాడు-
పూర్తిగా ఆరకా, మానకా, చెక్కుకుపోయిన మోచేయి సలుపుతున్నట్టుగా ఉండి
నిన్ను నిద్రపోనివ్వని వాన.

అప్పుడు, ఆ రాత్రిలో, తలుపులు బార్లా తెరచి
కూర్చున్న నీ పసుపు వీపుపై మసక నీడలు. ఆ నీడల దాకా సాగిన నా అరచేయి
అక్కడే తెగి, ఆగిన

ఒక సందిగ్ధా సమయం: ఆనాడు -
అప్పుడు, "వొద్దు. అప్పుడే దీపం వెలిగించకు. అప్పుడే ఈ చీకటిని ఆర్పకు. చూడు-
I was only seven then...
When I was repeatedly

Violated  by my maternal uncle.
మరి ఆ రోజూ ఇలాగే, గోడల వెంట బల్లుల్లా వాన నీళ్ళు - బంక బంకగా. రక్తం.
ఇంకా, మరి రాత్రంతా పాలు లేక ఆ పిల్లే

పాపం అరుస్తూ వానలో-". అని అన్న
నీలోకి, నీళ్ళకి తడిచి ఒరిగిపోయిన పచ్చిగడ్డి. కిటికీ అంచులలో ఆఖరి శ్వాసతో
ఊగిసలాడే గూళ్ళూ

రెక్కలు రాని పిచ్చుకలూ
పూలపాత్రలోంచి పక్కకి ఒలికి ఒరిగిపోయిన రెండు పూవులూ. నీ కళ్ళూ. నేను
తాకలేని నీ చేతులూ, నువ్వూ

చితికిపోయిన నీ ఏడేళ్ళ యోనికి
కుట్లు పడి, జ్వరంతో వొణికి వొణికి వెక్కిళ్ళతో మన గదిలో ముడుచుకుని ముడుచుకుని
రాత్రంతా బెంగగా ఏడ్చి

ఆనక ఎప్పుడో నిద్రలోకి జారుకున్న ఒక పసివాన: ఆనాడు - 

29 July 2014

మరొక ముఖం

నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆడుకోడానికి నీకో ముఖాన్ని ఇస్తాను. మరొక ముఖంతో నేను ఇంకెక్కడో కూర్చుంటాను -

నువ్వు ఆ ముఖంతో బంతాట ఆడుకోవచ్చు. పూలతో అలకరించుకోవచ్చు. కడిగి పౌడర్ రాసి, అలమరాలో పింగాణీ బొమ్మల పక్కగా పెట్టుకోవచ్చు- లేదా టెడ్డీబేర్లా, నీ పక్కన చక్కగా ఒద్దికగా  పడుకోబెట్టుకుని 

కావలించుకోవచ్చు. ముద్దాడవచ్చు. కొరకవచ్చు. చీకటిలో దాని చెవిలో ఏవో గుసగుసలాడి దాన్ని చప్పరించవచ్చు. రాత్రి రహస్యాలు చెప్పవచ్చు. దాని జుత్తు చెరిపి పెద్దగా నవ్వవచ్చు. లేదా ఉదయాన 

నువ్వు దానిని నీతో పాటు పమేరియన్లా వాకింగ్కి తీసుకెళ్ళవచ్చు. నీ బ్యాగ్లో లిప్ స్టిక్ పక్కన వేసుకుని ఆఫీసుకి వెళ్ళవచ్చు. అప్పుడప్పుడూ బయటికి తీసి కారు అద్దంలో చూసుకుంటూ నీ బుగ్గలకీ, సున్నా చుట్టిన నీ పెదాలకీ రాసుకోవచ్చు. సెల్ఫోన్లా తీసి మాట్లాడుకోవచ్చు. వీకెండ్ సాయంత్రాలు నీతో పబ్లకీ పట్టుకెళ్ళవచ్చు. నీ వోడ్కా గ్లాసులోకి అది ఒక నిమ్మతొనలా పనికీ రావొచ్చు. తూలే, ఊగే నీ చేతికి అది మరొక చేయీ కావొచ్చు - అందుకే 

నువ్వు ఒంటరిగా లేనప్పుడూ, ఒక బాడ్జీలా, ఒక ఆధార్ కార్డులా, ఒక ఐడెంటిటీ కార్డులా, సోషల్ సెక్యూరిటీలా, పాస్పోర్ట్లా , నీ స్నేహితులకి ప్రదర్శించే నీ మెడలోని నగల్లా, నీ వేలికి ధరించే వజ్రపుటుంగరంలా, నీకు పనికివచ్చే ఏమీ పలుకని నా ముఖాన్ని నీకు ఇస్తాను. 

మరొక ముఖంతో - కళ్ళూ పెదాలూ ముక్కూ చెవులూ వాసనా లేని ముఖంతో - నేను ఇంకెక్కడో కూర్చుంటాను. 

మరి ఎప్పుడైనా, ఎక్కడైనా మొండెం లేని ముఖంతో ఏడ్చే ఒక మనిషిని చూసావా నువ్వు ఎన్నడైనా? 

నిబద్ధత 2.

నీకు ప్రియమైన వ్యక్తి ఇంటి దాకా వెళ్లి, తలుపు తట్టబోయి, ఆగిపోయి
నువ్వు తిరిగి వెనక్కి వచ్చేసినట్టు ఉండే దినాలు -

పంజరంలో అక్కడక్కడే ఇరుకుగా తిరుగాడే రామచిలుక వలే
నీ గుండెలో ఏదో గుబులు. నీలో తచ్చాట్లాడే
ఎవరివో మసక పాదాలు. మబ్బులు కమ్మిన
ఇళ్ళల్లో, ఆ చీకట్లలో, గాలికి కదిలే పరదాలు-

"Man has stopped being a Church, a refugee camp
Perhaps, for a long time. And God
Perhaps was killed at the same time

నాప్కిన్స్ తెచ్చావా. కొద్దిగా పాలు కాచి, బ్రెడ్డు వేసి ఇస్తావా?
బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. లేవలేను..." అని
నువ్వు అడిగితే, జ్వరతీవ్రతతో కొనసాగిన
రెండో దినాన గొణుక్కుంటూ లేస్తాను నేను:

"నీకు అత్యంత ప్రియమైన వ్యక్తి ఇంటి దాకా వెళ్లి తలుపు తట్టబోయి చూస్తే
అక్కడ, ఇంతకూ, ఒక వ్యక్తీ లేడు, తోటా లేదు
తలుపులూ లేవు చివరాఖరకు ఒక ఇల్లే లేదు-"

ఒక మనిషి - కనీసం తనకైనా - మిగిలి ఉన్నాడా
ఇం

కూ? 

నీ తలుపులు

ఎన్నిసార్లు తట్టానో ఆనాడు, నీ తలుపులు -

అప్పట్లో
నీ ఇంటి ముందు మసక చీకట్లో, ఎక్కడిదో ఇంత వెన్నెల పడి
ఊరికే చలించే మొక్కలు

శీతాకాలపు రాత్రుళ్ళలో
వొణికి వొణికి గూళ్ళలో ముడుచుకుపోయిన పావురాళ్ళు. పూసిన
పసుపు పూవులూ

గోడలపై నీడలూ, ఇంకా
నేను కూర్చున్న చోట, నా ఖాళీతనంలో, నాలో, అప్పట్లో
గది చూరుకి నువ్వు

వేలాడదీసిన
గాజు గంటలు:
గాలి గంటలు -

నువ్వు లేని బోలుతనంతో, ఇప్పటికీ నాలో ప్రతిధ్వనించే శబ్ధాలు -

ఎన్నిసార్లు తట్టానో ఆనాడు
నువ్వు తీయని, నువ్వు తీయలేని
నీ తలుపులు -