how am i? నేను ఎలా ఉన్నానా?
సాంధ్యచ్చాయలో మబ్బులు ముసిరి
వీచే హోరు గాలిలో
ఇంటికి వెనుక నిమ్మ చెట్టు పక్కగా
దండేనికి, ఒకటే కొట్టుకులాడుతోంది
వాన రంగులాంటి
అమ్మ చీర: ఆ విసురుకి, మరి ఇక
ఎపుడో, ఆ నిమ్మ ముళ్ళకి చిక్కుకుని
చీర, చినుకులుగా
చీరిపోవచ్చు; మబ్బు తెగిన వాసన
వేయవచ్చు: ఎవరూ తొలగించక మరి
నాని, ఆ దండేనికే
రాత్రై, ఒక్కతే వణుకుతుండవచ్చు
మిణుకుమిణుకుమనే నక్షత్రాల కింద
ఏదో భాషలో, తడిచిన
బరువుకి మూల్గుతుండనూ వచ్చు!
***
how am i? ఎలా ఉన్నానా నేను?
అమ్మ లేని ఇల్లు: మగ్గిన వాసన వేసే
పగుళ్లిచ్చిన గోడలు;
ఆవరణ అంతా చెదురుమదురుగా
రాలి నిండా తడిచిన వేపాకులపైగా
కుంటుకుంటో
మరి బావురుమంటో తిరుగుతోంది
ఎందుకో ఒక ఊదారంగు పిల్లిపిల్ల!
No comments:
Post a Comment