తెరవని తలుపులు నీవి.
అందుకనే ఎవ్వరూ రారు నీ వద్దకు. "అవసరం కోసం కాకుండా ఇద్దరు కలవచ్చు. కొంతసేపు మాట్లాడుకోవచ్చు. ఊరకే, రికామీగా, అట్లాగా... " అని నువ్వు నమ్మావు కానీ, లోకం అట్లా లేదనీ, నువ్వు అనుకున్న వాళ్ళెవ్వరూ అలా లేరనీ తెలసి వస్తుంది. వాళ్ళ అవసరాలకే నువ్వు అనీ, నీ కోసం ఎవ్వరూ ఎదురు చూడరనీ, నువ్వు ఎప్పట్లాగే నీ గోడలతో, నీడలతో, నీడల్లో కనిపించే కథలతో బ్రతకాల్సి వస్తుందనీ అర్థం అవుతుంది. ఏం లేదు. కాలిక్యులటేడ్ ప్రపంచం. హెచ్చువేతలూ, కూడికలూ. నువ్వు నీ కవితల్లో వాంతి చేసుకున్నట్లు, మరికొందరు తమ భయాలనీ, బలహీనతలనీ, లెక్కలనీ, తమ మతాన్నీ, తమ సిండ్రోమ్లనీ వాంతి చేసుకునే డస్ట్బిన్ నువ్వు. తాగిన తరువాత కక్కుకున్న దానికన్నా దుర్గంధం. తట్టుకోలేవు. అలా అని పట్టుకోలేవు వాళ్ళని. విప్పి చెప్పాలేవు. ప్రతి ఒక్కడూ ఒక రియల్ ఎస్టేటై, ఏజెంట్ఐ, చిట్ఫండ్ ఖాతా లెక్కలై, పెళ్ళాం పిల్లలూ బాంక్ బాలెన్సు లెక్కలై తిరుగు కాలం. ఇతరులతోనూ, ఆఖరికి తమతో తాము రాజకీయాలు చేయు కాలమ్. మనుషుల్లో మనుషుల్లేక, మనుషులు అపార్ట్మెంట్లై, ఒట్టి జీతాలై టీయే డీయేలై, ఆధ్యాత్మిక సేల్స్మెన్లై దిన దిన ప్రవర్ధమానమయ్యే కాలం. సాయంత్రం బార్లల్లో దూరి, ఎవరి భుజములు వారే కొట్టుకుని, గృహాములకు పోవు కాలం. పోయే కాలం. బంగారమూ, నగలూ, టీవీలో సీరియల్సూ, పట్టు చీరలూ అయ్యి, స్త్రీలు చచ్చిపోయే కాలం. పురుషులేమో పచ్చనోట్లై, పిల్లలేమో పెట్టుబడులై, స్టేటస్ సింబల్సై, ప్రదర్సన శాలలై రాంకులుగా మారి అలరాడు కాలం. అమ్ముకునే కాలం. అమ్మబడు కాలం. అమ్మలు లేని కాలం. నాన్నలు లేని కాలం. ఎవరూ ఒక అరచేయిగా మారని కాలం. ఎవరూ - నిన్ను చూచే ఒక నయనంగా మారని కాలం . కళ్ళు లేని కాలం. కన్నీళ్లు లేని కాలం. పంచుకోడానికి మరొరు దొరకని కాలం. అంతా వినిమయ ఇంద్రజాలం. వెరసి ఇది ఒక యమపాశం. అంతా కలిసి, వెరసి ఇది
గంధా హై, పర్ దందా హై యే కాలం.
వ్యాపారమే పాపం, పుణ్యం, స్వర్గం నరకం, మోక్షం అయిన కాలం.
క్యా కరేంగే?
తెరవని తలుపులా?
తెరవని తలుపులు కాదురా నాయనా, చూద్దామంటే
సమాధులు తప్ప, అసలు
ఇళ్ళే లేవు ఇక్కడ!
గంధా హై, పర్ దందా హై యే కాలం.
వ్యాపారమే పాపం, పుణ్యం, స్వర్గం నరకం, మోక్షం అయిన కాలం.
క్యా కరేంగే?
తెరవని తలుపులా?
తెరవని తలుపులు కాదురా నాయనా, చూద్దామంటే
సమాధులు తప్ప, అసలు
ఇళ్ళే లేవు ఇక్కడ!
No comments:
Post a Comment