28 February 2015

'తోడు'

ఒక నీలి మేఘచ్చాయ
     నీ దూరం ఇచ్చే పరిమళం. ఇక, నీ పరిమళంలో ఒక ఒంటరితనం-
     నీ బాహువులు బావురుమని
     నా ఒడిలో రాలే సాయంత్రాలు
     
నువ్వు ఇచ్చే
     ముసురు పట్టిన దినాలు. గాలిలో సుళ్లు తిరిగే ఎగిరిపోయే ఒక ఆకూ
     రాలే చినుకుల్లో ఉగ్గ పట్టుకునే
     ఒంటరి రాత్రుళ్ళూ, రాత్రుళ్ళలో
   
తాకలేని ఇద్దరి మధ్యా
నిలిచిపోయే చప్పుళ్ళూ

ఇవే, ఇవే 
     నువ్వూ, నేనూ: కాందిశీకులమై, నలుమూలలా దేవులాడుకునే క్షణాలు.
     శరణుజోచ్చే క్షణాలు. ముకుళితమైన
     అరచేతులు. పూడుకుపోయిన గొంతూ

గొంతు మధ్యగా
ఒక గాటు - బొట్టు బొట్టుగా నెత్తురు. ఇదే , ఇదే 
నువ్వూ నేనూ. 

ప్రేఏమని నమ్మకు. ఒక స్పర్శని వొదలిపోకు-
     తల్లి లేని కాలాలలో, నిలువ నీడ లేని చోటుల్లో
     నిన్ను నువ్వు మరచిపోకు.
ఇక

ఓ నేత్ర సారధీ, 'తోడు' అంటే, ప్రస్థుతానికి ఇది:

నీ  శరీర మేఘచ్చాయలో, రాలిన పరిమళపు దూరాలలో
తలలు వాల్చే పూవుల నీడల్లో
సద్దుమణిగి కంపించే చీకట్లు! 

26 February 2015

నాకు తెలుస్తుంది

నాకు తెలుస్తుంది
   
నేను లేనప్పుడు నువ్వు వచ్చి వెళ్ళిపోవడం.
     నువ్వు వొదిల్చినవేమీ ఉండవు కానీ, గది అంతా ఒద్దికగా
     నేల ఏమో పరిశుభ్రంగా, నువ్వు తెరచిన కిటికీలలోంచి పూసిన కాంతితో -

నాకు తెలుస్తుంది

నువ్వు చెప్పకపోయినా -
     నేను కూర్చుని చదూకునే బల్లా, పడుకునే మంచమూ
     మడత పెట్టబడిన దుప్పటీ, కూజాపై బోర్లించ బడ్డ గ్లాసూ
     బాల్కనీలో కుండీల వద్ద తచ్చాట్లాడీ తచ్చాట్లాడీ

లోపలికి వచ్చి చూసిపోయే పిచ్చుకలూ, ఉండీ ఉండీ
రాత్రి వీచే గాలీ, కదిలే లతలూ
తీగపై చలించే మన దుస్తులూ

వీటన్నిటికీ నీ సువాసన -
అలలపై వెన్నెల చలించినట్టు, అంత చీకట్లోనూ సెలయేటి ఒడ్డున ఎవరో
సంచిరిస్తున్నట్టూ, మెల్లిగా
అస్పష్టంగా పిలుస్తున్నట్టూ-

నాకు తెలుస్తుంది, మరి
నువ్వు రాకపోయినా

నిలువెత్తు అద్దంలో, ఎవరిదో ఒక రూపం
- చూసేలోపల - చేతికందకుండా పొగమంచై కదిలి పోవడం, రూపు దిద్దుకుంటూ
ఒక కవిత మాయమవ్వడం

అంతిమంగా
అద్దంలో తన స్వీయ ప్రతిబింబం కనిపించక
ఒక మనిషి

ఎదురుచూపులతో అంధుడై
అరచేతుల మధ్య ముఖం లేని మొండెంతో
అలా మిగిలి, పగిలిపోవడం!  

15 February 2015

...

సాయంత్రం.

నీ చుట్టూ
క్షణం క్రితం దాకా నీతో ఉండి, ఇప్పుడు లేని వాళ్ళ సవ్వడి.
ఉదయపు అలలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి, గులక రాళ్ళని తాకే సవ్వడి.
ఇసుకలోకి అలలు ఇంకి, నీలో ఊటలా ఉబికే నీళ్ళ వాసన చేసే అలికిడి-

అవును.
ఆ సాయంత్రమే, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నీలోపలి తీరాన వీచిన యూకలిప్టస్ చెట్లు.
అవును - ఆ సాయంత్రమే ఎవరో నిన్ను వొదలలేక వొదులుతూ
ఏడుస్తూ నిను వీడి, నీ ఛాతిని కుంకుమ నీళ్ళలో ముంచి, నిన్ను

పూర్తిగా ఆర్పివేసిన రోజులు. చీకట్లలలో ఒక స్మృతి నక్షత్రమై మెరుస్తో
వాళ్ళు నిన్ను

రాజేసిన రాత్రుళ్ళు. వాళ్ళు నిన్ను తపింపజేసిన
రాత్రుళ్ళు. వాళ్ళు నిన్ను
శిలువ వేసిన రాత్రుళ్ళు-

అవును.

ఒక దిగులు సాయంత్రం.
జరగాల్సింది ఏదో జరిగిపోయింది. నీతో, ఒక జీవితంలాంటిది ఏదో
గడచిపోయింది. అంతమూ

అయ్యింది. రాసుకున్న కాయితాన్ని చించి
నిస్సహాయతతో నలువైపులా విసిరి వేసి, రాత్రిలోకి చెల్లాచెదురుగా
నలువైపులా రాలిపోయే వేళయ్యింది -

అవును.
నువ్వన్నది నిజం - గులకరాళ్ళ వంటి కనుల మాగ్ధలీనా -
తిరిగి వెళ్ళలేం
మనం

ఎప్పటికీ!

13 February 2015

Déjà vu

దినం మొత్తం అతనలా కూర్చుని ఉంటాడు, కిటికీ పక్కన
మంచంపై - ఎదురెండ సోకి వాడిన ముఖంతో, గాలికి ఎగిసి వలయాలుగా తిరిగి
మళ్ళా అక్కడే ధూళిలో రాలిన ఒక కాగితపు ఉండ వలే -

ఉదయమూ వెళ్లిపోతుంది. మధ్యాహ్నమూ కరిగిపోతుంది.
గింజలకై పావురాళ్ళు అతని ముందు తిరిగీ, తిరిగీ నిరాశతో ఎగిరివెళ్ళిపోయే
సమయమూ ఆసన్నమయ్యింది. "వస్తారా ఎవరైనా తిరిగి"

అని అతను నీడల్ని అడిగే లోపల, ఒక ఊహతో తెరపి పడే లోపల

రెక్కలు కొట్టుకునీ, కొట్టుకునీ, తెగిన ఏ రెక్కో తగిలి
ఇన్ని నీళ్ళు ఉంచిన ముంత వొలికే పోతుంది. నీళ్ళకు తడిచి, గాలికి ఎండీ
బాల్కనీలో ఒక పక్షి ఈకా, మంచంపై ఒంటరి చేయీ
చీకట్లో  ఒక చెట్టూ, దుమ్ములో ఒక కాగితమూ అలా

స్పృహ తప్పి పోతాయి. "జీవితంలో అద్భుతం ఏదీ లేదు.
ఇట్లా నీకై వేచి చూసే ఒక జీవిత కాలపు శిక్ష తప్ప" అని అతను తనలో తాను
గొణుక్కుని, మళ్ళా మరొక దినం, మరొక మధ్యాహ్నం

ముఖం, కళ్ళూ చిన్నబోయి, వడలిపోయి, దుమ్ములో
గింజుకులాడే ఒక పాలిపోయిన ఆకై పోయీ, చివరికి
రాత్రిలో. చివరి శ్వాసతో మిణుకు మిణుకుమంటున్న

ఒక నెత్తురు దీపమూ, దానిని కాపాడే, తిరిగి నింపాదిగా
దానిని ఆర్పే అరచేయీ అయిపోయి, ఒక్కడై మిగిలిపోయి...   

09 February 2015

గంధా హై పర్ దందా హై యే

తెరవని తలుపులు నీవి.

అందుకనే ఎవ్వరూ రారు నీ వద్దకు. "అవసరం కోసం కాకుండా ఇద్దరు కలవచ్చు. కొంతసేపు మాట్లాడుకోవచ్చు. ఊరకే, రికామీగా, అట్లాగా... " అని నువ్వు నమ్మావు కానీ, లోకం అట్లా లేదనీ, నువ్వు అనుకున్న వాళ్ళెవ్వరూ అలా లేరనీ  తెలసి వస్తుంది. వాళ్ళ అవసరాలకే నువ్వు అనీ, నీ కోసం ఎవ్వరూ ఎదురు చూడరనీ, నువ్వు ఎప్పట్లాగే నీ గోడలతో, నీడలతో, నీడల్లో కనిపించే కథలతో బ్రతకాల్సి వస్తుందనీ అర్థం అవుతుంది. ఏం లేదు. కాలిక్యులటేడ్ ప్రపంచం. హెచ్చువేతలూ, కూడికలూ. నువ్వు నీ కవితల్లో వాంతి చేసుకున్నట్లు, మరికొందరు తమ భయాలనీ, బలహీనతలనీ, లెక్కలనీ, తమ మతాన్నీ, తమ సిండ్రోమ్లనీ వాంతి చేసుకునే డస్ట్బిన్ నువ్వు. తాగిన తరువాత కక్కుకున్న దానికన్నా దుర్గంధం. తట్టుకోలేవు. అలా అని పట్టుకోలేవు వాళ్ళని. విప్పి చెప్పాలేవు.  ప్రతి ఒక్కడూ ఒక రియల్ ఎస్టేటై, ఏజెంట్ఐ, చిట్ఫండ్ ఖాతా లెక్కలై, పెళ్ళాం పిల్లలూ బాంక్ బాలెన్సు లెక్కలై తిరుగు కాలం. ఇతరులతోనూ, ఆఖరికి తమతో తాము రాజకీయాలు చేయు కాలమ్. మనుషుల్లో మనుషుల్లేక, మనుషులు అపార్ట్మెంట్లై, ఒట్టి జీతాలై టీయే డీయేలై, ఆధ్యాత్మిక సేల్స్మెన్లై  దిన దిన ప్రవర్ధమానమయ్యే  కాలం. సాయంత్రం బార్లల్లో దూరి, ఎవరి భుజములు వారే కొట్టుకుని, గృహాములకు పోవు కాలం. పోయే కాలం.  బంగారమూ, నగలూ, టీవీలో సీరియల్సూ, పట్టు చీరలూ అయ్యి, స్త్రీలు చచ్చిపోయే కాలం. పురుషులేమో పచ్చనోట్లై, పిల్లలేమో పెట్టుబడులై, స్టేటస్ సింబల్సై, ప్రదర్సన శాలలై రాంకులుగా మారి అలరాడు కాలం. అమ్ముకునే కాలం. అమ్మబడు కాలం. అమ్మలు లేని కాలం. నాన్నలు లేని కాలం. ఎవరూ ఒక అరచేయిగా మారని కాలం. ఎవరూ - నిన్ను చూచే ఒక నయనంగా మారని కాలం . కళ్ళు లేని కాలం. కన్నీళ్లు లేని కాలం. పంచుకోడానికి మరొరు దొరకని కాలం. అంతా వినిమయ ఇంద్రజాలం. వెరసి ఇది ఒక యమపాశం. అంతా కలిసి, వెరసి ఇది

గంధా హై, పర్ దందా హై యే కాలం.
వ్యాపారమే పాపం, పుణ్యం, స్వర్గం నరకం, మోక్షం అయిన కాలం.
క్యా కరేంగే?

తెరవని తలుపులా?
తెరవని తలుపులు కాదురా నాయనా, చూద్దామంటే
సమాధులు తప్ప, అసలు
ఇళ్ళే లేవు ఇక్కడ!

04 February 2015

ఆ ఇల్లు

నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు ఇప్పుడు
పాతబడిపోయింది ఆ ఇల్లు ఇప్పుడు
తలారబోసుకునే ఒక ముసల్ధానిలా, మగ్గిపోయి రాలిపోయే వేపాకులతో
వొంటరిగా నిలబడి ఉంటుంది ఆ ఇల్లు-

రంగులు వెలసిపోయిన గోడలూ, ఆవరణలో
పగిలిన పలకలూ, చెవులు రిక్కించి, మరి నీ
చేతి కోసమో, నీ మాట కోసమో ఒక ముదుసలి వలే ఎదురుచూస్తూ, గాలికి
బడబడా కొట్టుకునే గేటూ, అలజడిగా కదిలే

నీడలూ, మొక్కలూ, వీధుల్లో రికామీగా అరుస్తూ పిల్లలు -

నిజం.
నువ్వు వెళ్ళని ఆ ఇంట్లో ఏమీ లేదు ఇప్పుడు.

సాయంకాలపు ఎండ వాలిన గరకు చర్మం లాంటి
చికిలించిన కళ్ళ చుట్టూ ఏర్పడిన గీతల్లాంటి, తన
కంపించే పెదాల లాంటి, కుంగిన మోకాళ్ళతో నొప్పులతో, నడవలేని పాదాలలాంటి
అప్పుడప్పుడూ నిర్లిప్తంగా కదిలే ఆ కిటీకీలు తప్ప

ఆ ఇంట్లో ఒక అమ్మ ఉందా?  ఆ ఇంట్లో ఒక అమ్మ ఉండిందా? మరి
నీకు తను ఎప్పుడైనా గుర్తుకువచ్చిందా, ఆ
ఇల్లే అమ్మనా, అమ్మనే ఆ ఇల్లా అని మీరు

ఆ ఇంటిని కానీ, ఈ కవితను కానీ

ఎన్నడూ అడగకండి!