02 January 2018

ఒకనాడు

ఒకనాడు, ఏ ఏటి ఒడ్డునో
చేరగిలబడి,
నీటిని తదేకంగా చూస్తావు,

నీలో, ఊగిసలాడే అలలు,
వాటి చప్పుడు;
ఉఫ్మని ఎగిరే, తూనీగలు ...

నీ బరువుకు నలిగిపోయిన
ఒక పసుపుపూవు,
పశ్చిమాన క్రుంగె సూరీడు!

నీళ్ళల్లో నువ్వో, నీలో మరి
నీళ్ళో, నీడలై
ఎటో తేలిపోయే వెల్తురు...
***
ఒకనాడు, ఏ ఏటి ఒడ్డునో
లేచి నిలబడి,
చేతులు దులుపుకుంటే,

తన ముఖాన్ని తాకిన నీ
అరచేతుల్లోంచి,
చుక్కలై నేల రాలే, మరి

ఎవరివో బేల అశ్రువులు!

No comments:

Post a Comment