13 January 2018

నారింజ

నారింజను వొలిచే ఆ చేతివేళ్ళని
చూసావా ఎపుడైనా?
కంటిపై నీటిపొరని తుడిచినట్టు,

ఎంతో ఒద్దికగా ఓ మూల పట్టుకుని
మరెంతో సున్నితంగా
ఇంకో మూలదాకా నిన్ను వొలిచే,

సుకుమారమైన తన చేతివేళ్ళని?
మరి సూర్యరశ్మినీ
పుప్పొడినీ నింపుకున్నా కళ్ళనీ?

ధ్యాసతో ముడుచుకున్న పెదాల్నీ
వొంచిన తన తలకు
పైగా వీచే, పల్చటి గాలి తెరల్నీ?

పిచ్చుక రెక్కలని విదిల్చినట్టున్న
ఆ చేతి కదలికల్ని?
నీపై చిల్లే, తొనల్లోని తడివంటి

వేసవి ఆగమన, తన మాటల్నీ?
***
నారింజని వొలిచే ఆ చేతివేళ్ళని
చూసావా ఎపుడైనా?
నిన్ను, సమూలంగా వొలిచినా

బద్ధబద్దగా నిను చీల్చినా, మరి
నీ దాహాన్ని తీర్చి,
నిన్ను మరో వేసవికి సిద్ధం చేసే

జీవధాతువైన, ఆ నారింజని? 

No comments:

Post a Comment