14 January 2018

సరిహద్దు

ఎంతో ఇష్టంగా ఒక ముఖాన్ని పుచ్చుకున్నావు; ఒక ప్రమిదెను అందుకున్నట్టు!

కనుచూపుమేరా చీకటి. తీరాన్ని తాకి అక్కడే ఉండలేక, ఒడ్డుకేసి తలలని బాదుకునే అలల ఘోష. గాలిలో ఏదో ఉప్పటి వాసన; బహుశా, ఇసుక తెరలుగా మారిన, నీ కళ్ళల్లో కావొచ్చు. దూరంగా ఎక్కడో లీలగా జాలరుల పాట. ఒక శోక గీతమై, హృదయపు కోతై, ఈ రాత్రిని రెండుగా చీల్చే ఒక గీతై, మెత్తగా కోసుకుని పోతో; ! హ్మ్ ఇదంతా నీకు తెలిసినదే; ప్రాచీనమైన ఒక గాధనే. చీకట్లో మెరిసే నక్షత్రాల పరివేదనే! తగలబడే కాగితాలలోని శరణార్ధుల అక్షరాల  ఆక్రందనలే !
***
ఎంతో ప్రాణంగా, ఒకరిని హత్తుకున్నావు; శిశువులా నిదురించావు; ఏదో కలతై ఇక కలలో దిగ్గున లేచి చూస్తే, నీ ఎదురుగా ఊగే ఒక ఖాళీ ఊయల. చెల్లాచెదురుగా పడి ఉన్న, సగం గీసిన చిత్రాలు. నేలపై విరిగిన ఓ బొమ్మై, కాళ్ళూ చేతులూ మొండెం లేని నువ్వు!

No comments:

Post a Comment