కొంచెం నీళ్ళు, కొంత
ఆసరా, కొంత కాంతీ కొంత గాలీ మరికొంత నీ స్పర్శా చాలు దీనికి
పచ్చగా నిన్ను
అల్లుకుపోతుందీ లత, పిల్లలు
నిన్ను కౌగలించుకున్నట్టు. ఒక మెత్తదనం
అప్పుడు నీ ఒంట్లో. విచ్చుకునే పూరేకులు అప్పుడు నీ నయనాలలో. మరి నీ హృదయమంతటా ఒక చల్లని పరిమళం -
ఏళ్ళుగా చూడని -
నువ్వు ప్రేమించిన - వారెవరో నీకు ఎదురుపడి నిన్ను
హత్తుకున్నప్పటి ఉపశమనం. ఊరకే పెదాలపై తార్లాటలాడుతూ మెరిసే చిరునవ్వూ. కొంత ఇష్టం.
కొంత ఒరిమీ నువ్వు చేసే
పనులన్నిటిలోనూ కొంత నెమ్మదితనం, కొంత పరిపక్వతా,ఒద్ధికా. మనుషులని
ద్వేషించడం మానివేసి, దయతో వాళ్ళని
దగ్గరికి తీసుకునే అవగాహన ఏదో తెలుస్తుంది నీకు-
ఇక అప్పుడు, లోకం నుంచి అతి స్వల్పంగా తీసుకుని మరింతగా
ఇవ్వడంలోని చిరు ఆనందమేదో నీలో-
ఇవ్వడం వల్ల విముక్తుడవయ్యి, నువ్వు పొందే ఒక
స్వేచ్చేదో, ఒక శాంతేదో, ఒక కాంతేదో నీలో...
మరి అల్లుకుపోయి
చూడరాదు ఒక మనిషిని, కొంచెం నీళ్ళు, కొంత ఆసరా, కొంత
కాంతీ కొంత గాలీ మరికొంత స్పర్శా
మాత్రమే సరిపోయే, పచ్చగా నిన్ను పిల్లల్లా
అల్లుకుపోయే ఒక లతవలే-
No comments:
Post a Comment