29 July 2010

ఇప్పుడు,ఒక ఇప్పుడు మాత్రమే

ఒక అలని అరచేతిలో పట్టుకుని
అలవోకగా అలా ఊపినట్టు
నువ్వు
ఆ గాజుగ్లాసుతో
గాలిలో
కొన్ని పదాలను రాస్తావు :
ఇక
జీవితపు అమృతం అంతా
నీ కలల
బంగారు కాంతి అంతా
ఆ బంగారు
బంగారు పాత్రలో ప్రతిబింబించి
అలలనెలవంకై
ఊగిసలాడతాయి.
ఇక అప్పుడు
ఇక అప్పుడు
నువ్వు బ్రతికి వస్తావు.

ఒక గీతంతో,
ఒక పురాతన శబ్దంతో
భూమిని
పాదాలతో తన్ని
గాలిలోకి
ఎగరబోతున్న
ఒక పక్షి బంగారు
బంగారు చర్యతో,
నువ్వు
జీవం పోసుకుని,
నీలి నీలి కళ్ళతో,
రహస్యకాంతితో
మృత్యుదేవత చేసే
నీలినృత్యంతో
నువ్వు
నిర్బయంగా
నృత్యం చేస్తావు.

ఒక చిరుగాలి
ఒక చిరు
చిరు గాలి
రాత్రిని అందిపుచ్చుకుని
పొలాలకుపైగా,
నల్లటి అశ్వంలా
ఈ సంధ్యాసమయంలోకి
ఒక చిరుకాంతిని
ఒక చిరు చిరుకాంతిని
ఈ రాత్రిని
తన వెంట తీసుకువస్తుంది.
ఇక అప్పుడు
నువ్వు బ్రతికి వస్తావు
ఇక అప్పుడు మాత్రమే
నువ్వు బ్రతికి వస్తావు


ఇక అప్పుడు
నువ్వు జీవితంలోకి ప్రవేశించి,
కలలని రమించి,
అన్నింటినీమించి
సర్వాన్నీ
మొదటిసారిగా ప్రేమించి
నువ్వు
ఇంద్రజాలపు పదాలను
నువ్వు
ఇంద్రధనస్సు పదాలను
విశ్వపు
అంచునుంచి
తేలి వచ్చే
స్వరాలవలె
పాడతావు :
కవిత్వాన్ని
లిఖిస్తావు

మౌనమైన పెదాలతో,
ఈ గాలిలో
కురిసే మంచులో
మానవాళికి ఆవలివైపు
ఆలపించాల్సిన
గీతాలున్నాయి. ఇక
ఈ రాత్రికి నేను
ఒక శిశువు కలలో
మరణించేందుకు సిద్ధపదతాను

ఇక అప్పుడు
నువ్వు
భయాల గురించి మాట్లాడతావు.
ఇక అప్పుడు
నువ్వు
హృదయరహిత
మృగాలుగా మారిన
దినాల గురుంచి మాట్లాడతావు
నువ్వు కన్నీళ్ళ భయాల్ని
భయాల కన్నీళ్ళనీ ఆలపిస్తావు
మొహసింతో,
నువ్వు నీకై
నీ గురుంచి
నన్నుఅలాపిస్తావు.

ఒక సముద్రం నెమ్మదిగా
ఒక జోలపాటతో
నిదురలోకి జారుకుంటుంది .
తన అస్తిత్వపు
చితాభస్మం నిండిన గ్లాసుని
పోదివిపుచుకున్న
బంగారు
బంగారు మనిషికి
శాపమూ
వరమూ
అయిన రాత్రిలో
అతడు
నిశ్శబ్దానికీ
గీతానికీ మధ్య
సముద్రానికీ
సముద్రపోడ్డుకీ
మధ్య తేలుతూ
తనలో తాను
ఊయలలూగుతాడు.
నలుపు
నలుపు జీవితపు
జ్ఞాపకం మార్చిన
నీలి నీలి
నీలాల
నయనాల మధ్య
వలయమై
పోతాడు

ఇక అప్పుడు
ఒక గీతంతో,
ఒక ఆదిమ శబ్దంతో
గాలిలోకి
ఎగిసిపోతున్న
ఒక పక్షి బంగారు
బంగారు సంజ్ఞతో
రంగులమయమైపోయి
తెల్లగా మిగిలిపోతూ
నువ్వు నన్ను
జీవితం వద్దకు
తీసుకువెళ్లేందుకు
నీలి నీలికళ్ళ
ప్రేమదేవత చేసే
నీలి నీలినృత్యంతో
పాదాలు
కలిపేందుకు
నువ్వు నన్ను
తీసుకువెళ్లేందుకు
వస్తావు.
జీవితమైనా లేదా
మృత్యువైనా
మొహసింతో
ఇక ఏమాత్రం బాధించవు,

ఇప్పుడు,ఒక
ఇప్పుడు మాత్రమే మనం
మరో రొజుకై జీవించగలం.

1 comment: