24 July 2010

మృత్యుకాంతి

మృత్యు శీతల కాంతి వెలుగుతోంది ఇక్కడ
బంగారు రంగు నీడలలో,
ఇక ఎప్పటికీ వెళ్ళలేని ఇళ్ళ వలయపు దారుల్లో
ఇక ఎన్నటికీ చేరుకోలేని
పురాతన శాంతి గాధల వంటి
ఆ స్త్రీ బాహవుల ఎదురుచూపుల్లోకి
ఎవరూ లేని, ఎవరూ రాని
మృత్యు శీతల కాంతి గీతం జ్వలిస్తోంది ఇక్కడ
జన్మ నివ్వని, చనుబాలు తాపని
చివరిదాకా ఎదురుచూసి కడగంటి చూపు మిగలని
అనేక తల్లులుగా చీలిపోయిన
ఒక తల్లి శూన్య విషాదం విల విలలాడుతోంది ఇక్కడ.
కన్ను చివర నిలిచి, కన్నుని వీడలేని
తల్లి పాల వంటి కన్నీటి చుక్క
నిస్సహాయత విల విలలాడుతోంది ఇక్కడ.

ఇక ఉన్నదల్లా ఒక్కటే
ఎడ తెగని ఈ నిర్వికార లోకంలో, నీకై
నీకు నువ్వు నిర్మించుకున్న
రహస్య బలిశాల వద్ద నువ్వు మాత్రమే
అనేకంగా వికసించి,
దారి తెన్ను లేక అన్ని చోట్లా నిస్పృహగా
రాలిపోయేచోట
మృత్యు శీతల కాంతిలో, స్నేహితులు లేని
చీకటి ద్వారాలలోంచి బయల్పడే
ఒక మార్మికమైన ప్రేమ శాంతిలో
ఇక ఉన్నదల్లా ఒక్కటే
ఇక మిగిలినదల్లా ఒక్కటే
ఎవరో వెలిగించి వోదిలివేసిన ప్రమిద కాంతి ఒక్కటే.

ఉన్నావా? నువ్వు ఉన్నావా ఇక్కడ?
పిల్లల కళ్ళ పూల పందిర్లలో
ఒక నిష్కపట ఎదురు చూపులో, మసక నీడల్లో
వృక్షాల కింద తళతళ లాడే
నీటి చెలమల వెలుతుర్లో
ఉన్నావా, నువ్వు ఉన్నావా ఇక్కడ?
ఉన్నావా, నువ్వు ఉన్నావా ఇక్కడ?
ఒక అపరిచితుడి ఆలింగనపు అంతిమ అస్తిత్వంలో
కరడు గట్టిన నిర్లక్ష్యాలలో
ప్రియమైన వాళ్ళ నిరాదరణలో
ఉన్నావా, నువ్వు ఉన్నావా ఇక్కడ?

ఉండనీ, ఉంటే ఉండనీ,
పూలహారంలో దారంలా
కన్నీటి చుక్కనీ కన్నీటి చుక్కనీ కలుపుతూ
అదృశ్యంగా నువ్వలా ఉండిపోతే ఉండనీ
ఉండనీ, నువ్వలా ఉండిపోనీ,
ఎవరో వెలిగించి వొదిలివేసిన దీపంలా,
నువ్వు ఉంటే ఉండనీ. సాగనీ,
రహదారి పక్కన మూర్చిల్లుతూ, అర్ధరాత్రిలో
లుంగలు చుట్టుకుపోయే
అతడి జీవితంలా, మరణాన్ని హత్తుకొని కదలిక లేక
అంతిమ శ్వాసకై
ప్రపంచపు కొన అంచుని పట్టుకుని
జీవన్మరణ తెరల మధ్య
ఊగిసలాడుతున్న ఆమెను వదలలేకా, ఉండాలేకా
చూడలేక, చూస్తూ బ్రతకలేకా, ఆమె చుట్టూ
నడియాడుతున్న వాళ్ళ హృదయ దిగులు ధ్వనుల్లా
బ్రతుకు సాగితే సాగనీ
మృత్యు శీతల కాంతిలో, ఈ సమయం
ఇలా పగిలిపోతే పగిలిపోనీ .

ఇక ఆ తరువాత
అంతకుమునుపు మిగిలే ఒక అంతిమ కాంతి
ఒక అంతిమ శాంతి
ఎప్పటికీ మిగిలి ఉండే మృత్యుశీతల కాంతి.

1 comment: