23 April 2018

|| కాలం ||

వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది
ఆ మెట్లన్నీ దిగి
ఆయాసంతో రొప్పుతో అమ్మ,

అగ్నికీలలవలే ఎండ; గాజుపెంకులు
రాలినట్టు మరి
దారంతా మెరుస్తో, కోసుకుపోతో -

గేటు పక్కగా పెరిగిన వేపచెట్టు; ఎన్నో
ఆకుల్ని రాల్చి,
తనలో తానే వొదిగీ వొంగీ ఇక

ముడతలు పడి; పక్షులు కూడా లేవు
ఇప్పుడు. అన్నీ
ఖాళీ అయిన గూళ్ళూ , ఎండిన

కొమ్మలూ; ఎప్పుడైనా గాలి వీస్తే రాలే
సన్నటి దుమ్మూ,
రాత్రుళ్ళు ఏర్పడే వొంటరి తేమా!
***
వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది
ఇక పంటి బిగువున
తనని తాను ఆపుకుని, తలని

తిప్పుకున్న అమ్మ కళ్ళలో, కంపిస్తో
పగిలిపోయే నీటి
బుడగలు; గుక్కపట్టే శిశువులు!

No comments:

Post a Comment