31 October 2016

ప్రార్ధన

ఇదేనా నువ్వు అడిగినది?
ఆకంత రాత్రిలో
బిందువంత నిద్రనేనా?
పుష్పించే కలలో
ఒక చినుకు పిలుపునేనా?
పిట్ట గొంతు కింది
నునుపైన ఓ స్పర్శనేనా?
ఆ చల్లటి గాలినేనా?
***
ప్రార్ధనై వేలాడుతున్నది
ఒక గూడు: మాటై
మంత్రమై, వెన్నెలై, ఒక
శరీరమై. మరి ఇక
ఇదే సరియైన సమయం -

నువ్వు  తిరిగి రావొచ్చు! 

26 October 2016

ఊహించనిది

ఎంతో రాత్రిలో తన ఇంటికి వచ్చి
తలుపు తట్టాడు అతను -
(తను తెరుస్తుందని, అస్సలు
ఊహించలేదు అతను)
 
బయట చల్లటి గాలి. శరీరంలోపల
మంచు. ఎంతో ఆకలి . మరి
ఎక్కడో చిన్నగా మిణుకుమనే
రెండు గవ్వలాతని కళ్ళు -

ఎంతో రాత్రై వచ్చి తన తలుపులు
తట్టాడు అతను సందిగ్ధంగా
(తన పాదాల సవ్వడినీ, తన
శరీర సువాసననీ ఊహిస్తూ)
***
ఇకా తరువాత, ఎక్కడో దూరంగా
చెట్లల్లో, ఆ మసక వెన్నెల్లో
తడిచి ఊగే నీడలు: గూళ్ళు -

నిద్రలో చిన్నగా పక్కకు ఒత్తిగిల్లి
స్థిమితపడే  రావి ఆకులు!

పదం

రాత్రి, తేలిపోయే ఒక మబ్బు. గాలీ -
అందుకే, తనని తాకితే

చెట్ల కింద, మసక వెన్నెల నీడల్లో
ఆ కనుల చీకట్లలో చెమ్మ -

నీ కోసం ఎదురుచూస్తూ మరెక్కడో
పసిపిల్లయి ఒక అమ్మ!

22 October 2016

అక్టోబర్ రాత్రి

అక్టోబర్ రాత్రి -
తెరలు తెరలుగా గాలి. ఎంతో రద్దీగా
రహదారి -
ఇటు నుంచి
అటు దాటలేక, మనిషిలోని మనిషి
ఆగిపోతే
అక్టోబర్ రాత్రి -
దాటడమెలాగో తెలీదు తాకటమెలాగో
అర్థం కాదు -
***
సగంలో ఆగిన
ఫ్లైవోవర్ కింద, ఎటు పోవాలో తెలీక
చక్రాలకింద

నుజ్జయింది
ఓ కుక్కపిల్ల. పేగులు బయల్పడిన
నీ హృదయమేనా
అది?

20 October 2016

ప్రతిధ్వని

రాత్రి -
ఏ ముళ్ల తీగల్లోనో చిక్కుకుని
చీరుకుపోయి
రెక్కలు కొట్టుకుంటూ
నువ్వు -

నింగిలో
నెత్తురు చుక్కలు. నేలపై
వాన చినుకులు -
అవే, నీ కళ్ళు: గాలై, ఒక
గాయమై -
***
ఎవరో
మంచినీళ్ళై గొంతు దాకా
వచ్చి, ఆంతలోనే
వొలికిపోయిన, ఒక మహా
శబ్ధం!   

19 October 2016

ఇక్కడ

చీకట్లో
జ్వలించే నిప్పుల అంచుల్లో
ఆ ఎరుపూ నలుపూ
రంగుల్లో
నువ్వూ, నేనూ -

ఓ మాగ్ధలీనా, తాకు -

ఇక నెమ్మదిగా, భస్మిపటలం
అవుతుందీ రాత్రి
ఓ హృదయం
ఈ దినం!

16 October 2016

నిస్సహాయత

సెగ సోకిన గులాబీ వలే, వడలి
తన ముఖం -
***
వేడిమి గాలి: తన చేతివేళ్ళల్లో -
పెదాలపై దాహం -
చేజారిన పింగాణీ పాత్రా, ఆగిన
రాత్రీ తన దేహం -
ఇక నలిగిన గుడారం వలే తను
అక్కడే మంచంపై
ముడుచుకుని వొణుకుతుంటే
***
ఎదురుగా అతను, నిరత్తురడై
ఒక వస్త్రం కాలేక -
ఏమీ చేయలేక, వేలి అంచుతో
కమిలి చెమ్మగిల్లిన

ఓ లిల్లీపూవును అట్లా తుడుస్తో!

13 October 2016

అలజడి

మునిమాపు వేళలోకి రాలిన నీ శిరస్సు
ఒక పొద్దుతిరుగుడు పూవు -
చిట్లిన సవ్వడి  చేసే సన్నటి రాత్రి
కొమ్మలు నీ చేతులైతే మరి

నీడలతో వొణికే నీటి చెలమలేమో
నీ కళ్ళు: (అనాధల మల్లే) -
ఇక, ఏదో చెప్పాలని కష్టంగా నువ్వు
నాలికతో నీ పగిలిన పెదాలని

తడుపుకుంటే, ఇష్టంగా రాసుకున్న
పలకని ఎవరో తుడిపివేసినట్టు
నీలో ఒక నిశ్శబ్ధం: ఎంతో నొప్పి -
లోపల ఎక్కడో, స్మశానంలో

నేలను తాకి ఆకు చేసే అలజడి!  

12 October 2016

అస్పష్టత

ఈ రాత్రి నుంచి మరొక రాత్రికి
ఒక చందమామ -
అలసిపోయినదే, కళ్ళల్లో కొంచెం
ధూళితో, నీళ్ళతో -
ఇక వాటితో, ఆ కనురెప్పల నీడల్లో
ముఖం కడుక్కుంటూ
ఇట్లా, గొణుక్కుంటాడు అతను
తనలో తాను -
***
" నీతోనే ఇక, కుంకుమ రెక్కలు
ఎగిరే కాంతిలోకి
మరణ జననాల మధ్య చలించే
ఒక విస్మృతిలోకి!"

09 October 2016

ఏమీ లేనిది

రాత్రి. నేలంతా తడిచి, గాలంతా
తడిచి, ఒక పరిమళం -
గాలి నీ చుట్టూ ఓ సీతాకోకచిలుకై
ఎంతో తేలికగా ఎగిరే శబ్ధం -
ఆకులూ, పల్చటి కాంతిలో ఊగే
లతలూ,  నీడలూ, గూళ్ళల్లో 
ఒదిగిన పిట్టలూ ఇక నీ లోపల -
***
అన్నం ఉడుకుతోంది, ఈ రాత్రై
ఒక పాత్రై, తాను వేలితో
చిదిమి చూసే ఒక మెతుకై!       

స్థితి

చీకట్లో మెరిసే పూలను చూపిద్దామనీ
వాటిలో కమ్ముకున్న మబ్బులనీ
కురిసే తుంపరనీ, వీచే గాలినీ, ఖాళీనీ

నీకు ఇద్దామనీ వచ్చాను నేను. కానీ
అప్పటికే నిద్రపోయి ఉన్నావు నువ్వు -

పగిలిన పలకవై, బలపమై, చీకట్లోని
ఖాళీవై, నేల వాలిన గాలివై ఒక
మబ్బువై, ఎంతో అలసిన అమ్మవై!

06 October 2016

ఒడ్డు

ఎంతో అలసి పోయి ఉన్నాయి నీ కళ్ళు
నీట మునిగిన పాలరాళ్లల్లా -
***
నీటిపై కొట్టుకుపోతూ, దేనికో తట్టుకుని
ఆగిన ఎండు కొమ్మల్లా నీ చేతులు -
నానిన ఒక కాగితమై నీ శరీరం, నువ్వూ -
(వాటిపై అలుక్కుపోయిన పదాలూ
వాటి శబ్దాలూ, ఇక నేను) మరి అందుకే

ఇంకో దినం గడిచింది. రాత్రి అయ్యింది -
ఎంతో అలసటగా ఒక చేయి నీలో
ఒక పక్షై ముడుచుకుంది. అలసిన దాని
హృదయం చిన్నగా విశ్రమించింది -
(అలుక్కుపోయిన వాటిని అది దిద్దింది)
***
ఎంతో రాళ్ళయిన అతని కనులు - ఇక
తడిచాయి: నీటిలో, తేటగా!

05 October 2016

స్ఫటికం

పూవు మీద వెన్నెల వాలినట్టు, ఎంతో
తేలికగా తను నీతో, నీ పక్కగా -
***
ఎంతో తేలికగా ఒక పూవు: చీకటి కమ్మిన
ఆకాశాన్ని నింపుకుని, వర్షాన్ని
తన కళ్ళల్లో దాచుకుని -
ఎంతో బరువుగా ఒక నువ్వు: ఊగే తెరలై
లోపలి రాలేని గాలై, ఇకెప్పటికీ
తెలవారని ఒక రాత్రివై -
***
పూవు ఎవరు? రాత్రి ఎవరు? మౌనమైన
పూలల్లో చేరిన కన్నీరు ఎవరని
నువ్వు అసలే అడగకు -
***
వెన్నెల నీడల్లో ఆకు ఒకటి కదిలినట్టు
ఎంతో తేలికగా నీ పక్కగా తను -
***
నీ రాత్రై, గాలై, గాలిలో తడబడే నీలో
ఓదార్పుగా నిలబడ్డ గూడై!