16 August 2015

నివాళి

గాలి మనల్ని పిల్చినప్పుడు
చీకట్లో మిలమిలామంటో నువ్వో నేనో, సీతాకోకచిలుకలమై ఆకాశపు ఆనందంలో.
ఎందుకంటే, మరి రాత్రి అలాగే వచ్చింది మన వద్దకి
తనను తాకమనీ వినమనీ -

మనతో తోడుగా ఎర్రెర్రని పూలు -
మాట్లాడలేదు ఏమీ అవి రాత్రంతా, తలలు వొంచి తమ పరిమళాన్ని పంచే 
పారవశ్యంలో. మనమే మరి, కృతజ్ఞతతో వాటి ముందు మోకరిల్లి
ప్రార్ధించీ, పుష్పించీ -

ఇక ఆ తరువాత, గూళ్ళల్లో
పక్షులు కదిలితే, రెక్కలు మొలిచి ఎగిరాం మనం: నాలోకి నువ్వూ, నీలోకి నేనూ.
మంచు అద్దుకున్న స్వప్నాలూ, గులాబీ కళ్ళ కన్నీళ్ళూ
శిధిల గృహాలూ అప్పుడు మనలో -

పేర్లని కోల్పోయి మిగిలేం చివరికి
చీకట్లో మిలమిలామంటో నువ్వో నేనో: నా అరచేతిలో నీ హృదయంతో, 
నీ అరచేతిలో కొట్టుకులాడే నా ప్రాణంతో, ఓరిమితో, శాంతితో
అశాంతితో, బ్రతకాలాన్న ఒకే ఒక్క కోరికతో -

ప్రేమ? తెలియదు. ద్వేషం? తెలియదు.
పిల్లలు కసురుకున్నాంక, మనస్సు చివుక్కుమని చిన్నబోయిన తల్లి ముఖంలా
జీవితం మారినాంక, ఒక రాత్రిని తాకీ, వినీ మొగ్గై
పూవై ముళ్ళై సువాసనై మబ్బై


వానై, మెరుపై నిప్పై, సర్వం మరచి
క్షణాకాలమైనా అలా జ్వలించిపోయే ఆ పాప పవిత్ర తీవ్రత కాలాల కన్నా
ఇరువురికి ఇరువురూ ఇచ్చుకునే ఒక మెరుగైన బహుమతి
అంతకన్నా ఏమున్నది? 

11 August 2015

Déjà vu

మబ్బులు కమ్ముకుని
చెట్లు గలగలలాడతాయి: నీడలతో, నీ జ్ఞాపకాలతో, నీ మాటలతో.
వాన వాసన అప్పుడు నాలో -

కాల్చివేసిన నిరుటి వేసవి ఎన్నటికీ మానుతుందని నేను అనుకోలేదు. అయినా
ఛాతిపై కమిలిన ఒక ముద్రికను చూసి అడుగుతారు పిల్లలు
'నాన్నా, ఇదేమిటి' అని -

అది, నేను చేజార్చుకున్న నీ ముఖం అని
నీ రంగుతో నీ కాంతితో మెరిసే ఆ సీతాకోకపూవులకు నేను ఎన్నడూ చెప్పలేను.
పాలు తాగుతూ ఒడిలోంచి చేజారి చనిపోయిన ఓ శిశువు గురించి
ఏ తల్లయినా ఏం చెప్పగలదు?

మబ్బులు కమ్ముకుని
చెట్లు స్థంబిస్తాయి అప్పుడు: నీడలతో, రాలిన ఆకులతో, నీవు లేనితనంతో.
కురియక మరలిపోయే వాన తడి ఇక నాలో -

మరి గుర్తుందా
అడిగావు నువ్వు నన్ను సరిగ్గా ఇలాగే ఒకప్పుడు
మబ్బులు పట్టి, పగలు ఒక నైరాశ్యపు వెలుతురుతో భారంగా, అతి నెమ్మదిగా
కదులుతున్నప్పుడు: "రాళ్ళు!
"రాళ్ళు మాట్లాడతాయా?!" ని -

ఇదిగో, ఇప్పుడు చెబుతున్నాను విను
రాళ్లకూ హృదయాలుంటాయి. అవి మాట్లాడతాయి. నవ్వుతాయి. గాయపడతాయి
ఏడుస్తాయి. మరి ఇక, అందుకు సాక్ష్యం?

ఇదిగో. అదే ఈ చిన్న పోయెం!

09 August 2015

అపార్ధం

"ఈ ప్రపంచం
ఒక పూవైతే, ఒక సీతాకోకచిలుకైతే, వాన కురిసే ఒక చల్లని కాలమైతే
ఎంత బావుండును" అని తను అన్నది -

వెనువెంటనే అతను
వానలో ఊగే ఒక పూవుని తెంపీ, గాలిలో కాంతిలో - తనని తాను మరచి -
ఎగిరే ఒక సీతాకోకచిలుక రెక్కలని, విరిచి పట్టుకునీ
ఇచ్చాడు తనకి ప్రేమతో, ఒక బహుమతిగా -

ఇక
తల్లడిల్లే హృదయంతో
వడలిన పూరేకులనూ, నలిగిపోయిన రెక్కలనూ వొణికే వేళ్ళతో తాకుతూ
అన్నది తను అశ్రువులతో
బీటలు వారిన గొంతుకతో -

"ఎన్నటికి అర్ధం చేసుకుంటావు నువ్వు?
నన్ను?"

02 August 2015

సూత్రం

పెద్దగా ఏమీ ఉండదు: నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు -
ఎక్కడో ఏదో విరిగిపడి, లోపల లోతు తెలియని కందకం ఒకటి ఏర్పడి
ఇక, ఒక తపన - లోపల:

తల దాచుకునేందుకు, ఒక గూటి కోసమో
ఒక అరచేయి కోసమో, గూడు వంటి, ప్రమిదె వంటి ఒక శరీరం కోసమో, చివరికి
ఒకే ఒక్క  పలుకరింపు కోసమో

రాత్రుళ్ళలో, ఈ దిగులు కందకాలలో, గోడలపై
వ్యాపించే నీడల్లో, వీచే గాలుల్లో, నేల రాలి దొర్లిపోయే పూలల్లో, ఆకుల్లో
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని

లోపలికి ఒదిగొదిగిపోయి కంపించే క్షణాలల్లో
ఒక తండ్లాట
ఒక యాతన
ఒక శిక్ష -

నిజం. నన్ను నమ్ము

పెద్దగా ఏమీ ఉండదు: నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు -
పాలు తాగే, నెలలు నిండని శిశువుని చివ్వున లాక్కుని వెళ్లిపోతారు ఎవరో.
ఇక కళ్ళల్లో నీళ్ళతో, గుబులుగా

ఆ తల్లి ఒక్కతే అక్కడ, ముసురు పట్టిన
చెట్ల కింద చీకట్లలో ఒంటరిగా, గుక్కపట్టి ఏడ్చే తన పిల్లవాని జ్ఞాపకంతో -
నాతో!

01 August 2015

విశేషణం

మరెక్కడో,  నా ఉనికిని
కుదురుగా మలచినట్లు ఉన్న నీ ముఖంఇక్కడ ఈ చెట్ల కింద చీకట్లలో:
బెంగతో - 

దూరంగా ఎక్కడో
రాళ్ళకు పైగా సన్నగా నీళ్ళు పారే శబ్ధం.
కొమ్మల్లోఉన్నట్టుండీ ఏదో అలజడి. ఉలిక్కిపడి కదిలే పక్షులు. నిన్నటి
వానకు 

ఇంకా మానని నేలారాళ్ళూ ~
ఎవరో భీతిల్లి, నిను చేరినీ చేతిని గట్టిగా పట్టుకుని 
వదలనట్టు, చుట్టూతా ఒక పచ్చి వాసన. బురదలో కూరుకుపోయి, ఇక 
బయటకు రాలేక

నిస్సహాయంగా
నీ వైపు చూసే పురుగులూసీతాకోకచిలుకలూ
పగిలిన బొమ్మలూమన మాటలూ, ఇంకా అంతిమంగాఒక నిశ్శబ్ధం. 
ఎల్లా అంటే

నువ్వు నా చేతిని
వదిలిన తరువాత మిగిలినకమిలిపోయిన 
ఈ చర్మం వలే: ఈ రాత్రి వలే. నీ ఉనికిని కుదురుగా మలచినట్లున్న 
ఈ చీకట్లలో
రాత్రుళ్ళలో

బెంగతో కంపించిపోయే నా ముఖం వలే. మరి

క్షమించాలి నువ్వు.
ఎందుకంటేనిదురలో పక్కకు ఒత్తిగిల్లిఅలవాటుగా
చేయి చాచినప్పుడుఎవరూ తగలకతల్లడిల్లి ఉలిక్కిపడి లేచి, స్థాణువై 
గుక్కపట్టే

ఒక అరచేయి వలే మిగిలిన
ఈ కవితను అంతం చేయడం ఎలాగో, తెలియడం లేదు నిజంగా
నాకు -!