23 June 2015

దీపం

వెలిగించిన దీపం చుట్టూ గుండ్రటి కాంతి సరస్సు

నువ్వు లేవు కనుక
సరస్సులో నా ముఖాన్ని చూసుకుంటాను
ఎవరో వొదిలి వెళ్ళిన నీడలను జాగ్రత్తగా తాకుతాను. ఎందుకో నవ్వుకుంటాను

గుమ్మానికి అవతలగా చెమ్మగిల్లిన రాత్రి.
రాత్రికి అవతలగా నేను రాసుకునే, నీకు ఎన్నటికీ చేరలేని లేఖలు.
అలల్ని చెరిపే ఈ గాలి, నా ఎదురు చూపులను తాకలేదు. నా శ్వాసను వినలేదు-
అందుకే - ఇక, నువ్వు లేవు కనుక

వెలిగించిన దీపం చుట్టూ ఉన్న
వలయపు ద్వారాలలోంచి, నీకు ఎన్నడూ తెలియని లోకాలలోకి
నెమ్మదిగా వెళ్ళిపోతాను నేను !

22 June 2015

వెళ్ళకు

అర్థరాత్రి అలజడిగా లేచిన పక్షులతో ఎవటు మాట్లాడతారు?

అంత తొందరగా వెళ్లిపోకు
వాటిని ఓదార్చి నిదురపుచ్చి వస్తాను. ఆ తర్వాత మనం
గదిలో, మంచంపై పక్షుల్లా మారవచ్చు
పక్షుల కలలలోకి గూళ్ళల్లా వెళ్ళవచ్చు.

అంత తొందరగా నన్ను వదిలి వెళ్ళిపోకు.

ప్రేమ 2

ప్రతి రోజూ రాత్రి నువ్వు  ఎవరూ చూడని పురాతన కట్టడంలో మంట వేసుకుని
కనిపించని వాళ్ళు చెప్పే వినిపించని కథలని వింటావు.

సాలీళ్ళూ, గబ్బిలాలూ, వృక్షాలలో మెసిలే నిదురంచని పక్షులూ, దయ్యాలూ.
ఇక రాత్రంతా గాలి సర్పంలా నీ పరిసరాల్లో తిరుగాడుతూ ఉంటుంది.
ఇక రాత్రంతా నువ్వు ఎవరూ గమనించని పురాతన కట్టడంలో

నీ శరీరంతో  నువ్వు మంట వేసుకుని
రెండు నిద్ర మాత్రలతో, గుప్పెడు సిగరెట్లతో, మణికట్టుపై చల్లగా వాలే బ్లాడుతో
నువ్వు

ఎవ్వరికీ కనిపించని వాళ్ళు చెప్పే
వినిపించని కథలను రాస్తావు.

ప్రేమ

రాత్రంతా మేలుకుని నువ్వు నీతో మాట్లాడుకుంటావు. నిన్ను ఎవరూ వినరు
నీకు ఎవరూ బదులివ్వరు ~

కిటికీలకు ఆవలగా చీకట్లలో మెరిసే నక్షత్రాల మసక కాంతిలో ఎవరిదో పాదాల సవ్వడి
నిన్ను సన్నటి గాలిలా తాకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు
పొదలలో మెదిలే పిల్లీ, నిండుగా కదిలే మొక్కలూ, ఎవరో
వదిలివేసిన ఒక గాజు కన్నూ నిన్ను నిర్లిప్తంగా చూస్తాయి.

అందుకని నువ్వు
రాత్రంతా మేలుకుని చూపుడు వేలితో గాలిలో లేఖలు రాస్తావు
నీకై నువ్వు - నీలో - ఒక సమాధిని తయారు చేసుకుంటావు.
ఆపై తొలి వెలుతురులో

నీ తోటలోని గాజు కన్నుని తుడుచుకుని, నీ కంటిలో అమర్చుకుని
నీలో నువ్వు మరణిస్తావు.

20 June 2015

ఒక ప్రశ్న

ఈ కొమ్మల మధ్యగా
చలికాలపు ఎండా ఆకుల నీడా చిన్న గాలీ కదులాడే గూటిలో
సగం పొదిగిన గుడ్లను

నువ్వైతే వొదిలి వెళ్లావు కానీ
నేను

ఎలా వొదిలి వెళ్ళగలను?

19 June 2015

రాత్రి

నా కనుపాపను
సన్నటి మంటలా నీ నాలిక అందుకుంటుంది.
ఇక ఈ రాత్రి ఎక్కడికీ వెళ్ళదు -

నీ రూపంలో
మరణం ఇక్కడ ఉంది. జననం
ఇక్కడ ఉంది.

ఇక ఈ రాత్రికి, నేను ఎక్కడికీ వెళ్ళను.

పక్షులు

ఈ సాయంత్రం
చెట్లన్నీ గూళ్ళకి తిరిగి వచ్చిన పక్షుల కలకలంతో నిండిపోతాయి

చీకటిలో సముద్రాన్ని వింటున్నట్టు
అరుపులతో అలలలాంటి ఈ పక్షులు చిన్న పిల్లల్లా గొడవ చేస్తాయి -
పగలంతా ప్రయాణించి, ఆహారం వెదుక్కుని, తమకై
తమలాంటి గూళ్ళకై తిరిగి వచ్చాయవి. ఇక

మరికొంత సమయం తరువాత, ముప్పిరిగొన్న ఈ చెట్లల్లో
పక్షుల రెక్కల్లో అనంతమైన నిశ్శబ్దం అలుముకుంటుంది
కొంత ప్రశాంతమైన చీకటీ కమ్ముకుంటుంది -

మరి ఈ సాయంత్రం
తిరిగి వచ్చిన ఇన్ని పక్షుల మధ్య, తిరిగిరాని ఒక పక్షి ఏమైందో
నీకు ఏమైనా తెలుసా?

నీ నయనం

చీకటిలో నీ కన్ను గుండ్రటి పాలరాయలా మెరుస్తోంది.
కొంత కోరికా కొంత బాధా, కొంత నిస్సహాయతా ఉన్నాయి దానిలో.
అలసిపోయింది అది. కమిలిపోయింది అది -

కొంత నిదురా, కొంత స్పర్శా, కొంత ప్రేమా
కొంత శాంతీ కావాలి దానికి. దా -నా కంటిని కౌగలించుకో.
దానికి కొంత రాతి బాష తెలుసు.

ఇక రేపు ఉదయం మనం కన్నీళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు.

18 June 2015

ఒక ఆకు

ఎవరూ లేని నా గదిలో - వొంటరిగా - చెట్టు లేని ఒక ఆకు.
నిన్నటి వరకూ అది ఒక ఆకాశం, వర్షం, జీవంతో తొణికిసలాడే భూమీ.
నిన్నటి వరకూ అది ఒక పాప, నవ్వులతో విరగబూసే ఒక స్త్రీ
పిల్లల్ని భుజాలపై ఎక్కించుకుని ఆటలాడే ఒక తండ్రీ -

అయితే, ఒక సాయంకాలపు రాత్రి అది అనాధగా మారింది.
గూటినుంచి తరిమి వేయబడగా దారి తప్పిన పిట్టలా మారింది. మరణానికి చేరువై,
బయట వీచే గాలిని తాకలేక పాలిపోయింది. కమిలిపోయింది -

ఏమీ లేదు
హీనులు, అకారణంగా ఒక చెట్టుని కొట్టివేసారు. మరో ఆకు

ఎవరూ లేని నా గదిలో ఈ పూట పూర్తిగా శిధిలమయింది.