రాత్రిలో
ఆకులకి వేలాడే నీటిబిందువులు నీ కళ్ళు-
రాత్రంతా
వర్షం: నీలో. ఎదురుచూపులు ఊగిసలాడే ఒక
ఖాళీ ఊయల అప్పుడు: నీలో -
నీడల లిపీ
నీతో నువ్వు, నీలో నువ్వూ మాట్లాడుకునే ఒక
ఒంటరి అనంతం, అప్పుడు: నీలో -
బెంగటిల్లిన
ఒక గూడూ, తల్లడిల్లే తల్లితనం, కోసుకుపోయే
ఒక స్వరం, అప్పుడు: నీలో -
శరణు శరణనుచు
ప్రార్ధించినా, ప్రాధేయపడినా, వేడుకొన్నా, విలవిలలాడినా
తిరిగి నీ అరచేతుల్లోకే
కూరుకుపోయే
ఒక ముఖం, అప్పుడు : నీలో. ఇవాల్టికీ రేపటికీ మధ్య తీరం లేక
ఊగిసలాడుతూ సాగే ఒక ఖాళీ పడవ
అప్పుడు: నీలో -
మరి
సృజనా
సృజనా
సృజనా
చీకటి వేణువుని
ఊదుకుంటూ ఈ రాత్రి ఇలాగే వెళ్ళిపోతుంది. ఆకులపై గడ్డకట్టి
ఈ మంచూ అలాగే మిగిలి పోతుంది.
ఒక స్మృతి గీతం
ఇక నీతోనే మొదలవుతుంది -
సృజనా
సృజనా
సృజనా
ఇక ఇదే సరియైన సమయం
నీ చేతిని అందించు!
No comments:
Post a Comment