27 April 2015

metaphor

ఈ చీకటి బింబంలో,మసక వెన్నెలలో పడి 
సెలయేటి శబ్ధాలతో 
వెళ్ళిపోతుంది

తన ముఖాన్ని
గుర్తుకు తెచ్చే బెంగటిల్లిన రాత్రుళ్ళతో
ఒక రావి ఆకు ~

ఇక,ఒక స్మృతి దీపం ముందు మోకరిల్లి
ప్రార్ధించే నీడను, ప్రభూ 

ఎవరని కాపాడగలరు?!

22 April 2015

lullabye

రాత్రిలో 
ఆకులకి వేలాడే నీటిబిందువులు నీ కళ్ళు-

రాత్రంతా 
వర్షం: నీలో. ఎదురుచూపులు ఊగిసలాడే ఒక 
ఖాళీ ఊయల అప్పుడు: నీలో -

నీడల లిపీ 
నీతో నువ్వు, నీలో నువ్వూ మాట్లాడుకునే ఒక 
ఒంటరి అనంతం, అప్పుడు: నీలో -

బెంగటిల్లిన 
ఒక గూడూ, తల్లడిల్లే తల్లితనం, కోసుకుపోయే 
ఒక స్వరం, అప్పుడు: నీలో -

శరణు శరణనుచు 
ప్రార్ధించినా, ప్రాధేయపడినా, వేడుకొన్నా, విలవిలలాడినా 
తిరిగి నీ అరచేతుల్లోకే 

కూరుకుపోయే 
ఒక ముఖం, అప్పుడు : నీలో.  ఇవాల్టికీ రేపటికీ మధ్య  తీరం లేక
ఊగిసలాడుతూ సాగే ఒక ఖాళీ పడవ 
అప్పుడు: నీలో -
మరి 

సృజనా
సృజనా 
సృజనా 

చీకటి వేణువుని 
ఊదుకుంటూ ఈ రాత్రి ఇలాగే వెళ్ళిపోతుంది. ఆకులపై గడ్డకట్టి 
ఈ మంచూ అలాగే మిగిలి పోతుంది.
ఒక స్మృతి గీతం 

ఇక నీతోనే మొదలవుతుంది - 

సృజనా 
సృజనా 
సృజనా 
ఇక ఇదే సరియైన సమయం

నీ చేతిని అందించు! 

21 April 2015

రాత్రి

రాత్రి


ఒక స్పష్టతతో, ఒక మెలకువతో
ఒక స్ఫటికపు సాంద్రతతో, లోపలెవరో త్రవ్వుతున్న సవ్వడితో-

అప్పుడు

నువ్వు 


ప్రాంగణంలో రాలే పూలతో
వడలి వెడలిపోయే వాటి పరిమళంతో, నీ గొంతున అడుగంటి
మిగిలిన చివరి శబ్ధంతో -

అవును-
ఇదే నిజం

ఈ లోకాన, ఈ ఆకశాన 
నీ నలుపు నయనాల్లో మునిగిన కాలం ఏదీ, ఉగ్గపట్టుకుని 
బెంగపెట్టుకుని, జీరపోయి 

తిరిగి రాకుండా లేదు-

సృజనా
ఎంత ఒంటరిదీ హృదయం, మరి 
ఎంత ఒంటరివాళ్ళం మనం! 

12 April 2015

రాత్రి ఏం చేసానంటే

8 బీర్లు త్రాగాను 
ఇంద్రధనుస్సులోని 7 రంగులనీ చూసాను 
6సార్లు నీ గురించి తలుచుకున్నాను 
5 గురించి అసలు స్ఫురించనే లేదు 
4 గురిలోకీ వెళ్లాను
3 ముక్కలైయ్యాను 
2 మాత్రమే నిజమని 
1 ఎప్పటికీ విడిగా మనలేదనీ 

అంతిమంగా మనిషికి మనిషే కావాలని
ఇదిగో ఇప్పుడు - నీకు -
చెబుతున్నాను!

ఒకసారి

అతను అన్నాడు -

"నేనొకసారి తనని ముద్దాడాను.  అప్పటినుంచీ నేను
నా చూపును కోల్పోయాను. నా చూపులకు దూరంగా తననీ కోల్పోయాను"

తను అన్నది -

"నేనొకసారి ప్రేమించాను
అప్పటినుంచీ నేను శిధిలాలలో జీవిస్తున్నాను.
అప్పటినుంచీ శరణార్ధినై నేను, నావి కాని ప్రదేశాలలో తిరుగాడుతున్నాను"

ఎవరో  ఇలా కూడా అన్నారు -

"More than one, more into one
Is none"


ఆ తరువాత ఆ రాత్రంతా ఆ ముగ్గురు
ఒకరి చీకట్లో మరొకరు తల దాచుకుని

రూపాలూ రంగులూ మారే చందమామను చూస్తూ గడిపారు. ఇక తెల్లవారేసరికి

అక్కడ మిగిలింది ఎవరో, వాళ్ళ లోపల నుంచి వెళ్ళిపోయింది ఎవరో
ఎవరికీ తెలియలేదు!

11 April 2015

ఇటువైపు చూడవు నువ్వు

ఇటువైపు చూడవు నువ్వు. ఎందుకంటే
     నూతనమైనది ఏదీ నీకు కనిపించకపోవచ్చు. ఆఖరకు ఒక పదం కూడా ఒక్క ప్రతీక కూడా -
     అవే మూసిన తలుపులు. అవే వెలసిన గోడలు. వాటిపై పిచ్చిగీతలు -

నువ్వు చూడవు వాటివైపు. ఎందుకంటే మరి అవి 
     ఏ పసివేళ్ళూ లేక వడలిపోయిన రంగులో, లేక ఎవరూ లేని రాత్రుళ్లో, రాత్రుళ్ళలో
     ఆగిపోయిన శ్వాసలో, నువ్వు లేవని తెలసి ఇక నిన్ను పిలవలేక
     స్థాణువై చిట్లిన పెదాలో, తెలియదు ఎవరికీ - 
 
ఎందుకంటే
ఎవరితోనూ మాట్లాడవు అవి - ఎందుకంటే
ఎవరి ముందూ తమ చరిత్రలు విప్పుకోవు అవి. ఎందుకంటే
ఎవరి ముందూ, తమ గాధలు చెప్పుకోవు అవి. ఎందుకంటే
ఎవరి ముందూ, కన్నీళ్లు పెట్టుకోవు అవి. చివరిగా

ఎందుకంటే

నీ అరచేతుల్లోంచి జారిపోయిన గాజు పుష్పాలు అవి
     ఏ ప్రదర్శనశాలలోనో ఇమడలేక తప్పిపోయి, దారి తెలియక బిక్కుబిక్కుమనే పిల్లలు అవి
     గూళ్ళు రాలిపోయి, గుడ్లు చితికిపోయి అక్కడక్కడే అల్లల్లాడే పిచ్చుకలూ, తల్లులూ అవి -

అంతిమంగా 
స్వప్నాలలో, గోడలలోంచి నీడలు తొలుచుకు వచ్చి కమ్ముకునే వేళల్లో
నువ్వు గుర్తుకు వచ్చి, తటాలున లేచి కూర్చుని
దడదడలాడే  గుండెతో వణికిపోయే నేను - అవి. 
     
అవును.
వాళ్ళు చెప్పేదే నిజం. సృజనా, నూతనమైనది ఏమీ లేదు. ఎప్పటిలాగే
ఇటువైపు చూడవు నువ్వు ! 

10 April 2015

నువ్వు ఉన్నందుకే

అలసిపోయాను.
     ఈ రాత్రి - ఆఖరకు దీపం వెలిగించుకునే ఓపిక కూడా లేదు. అప్పటిదాకా వీచి
ప్రాణం పోసిన గాలి నిశ్చలంగా మారినట్టు
చీకటి ఇంత కుదురుగా, కరకుగా చిక్కగా

నుదురుని బలంగా
     ఒక రాయికేసి మోదుకున్నట్టు ఉంటుందని తెలిసింది ఈనాడే.  సృజనా, సృజనా
తడి ఆరి, ఎండి పగిలిపోయిన పెదాలు.
పగటి నిప్పుల్లో దగ్ధమయిన కనులు
ఏ మాత్రమూ ఆశనివ్వని నక్షత్రాలు

వడలి, వొంగిపోయిన లతలు.
     పక్షులు వొదిలివేసిన గూడు. వ్యాపించి జలదరింపజేసే నీడలు. పగిలిన కుండీలు.
ఇక హృదయమొక తెగిన పూలకొమ్మై
అరచేయి అంచున ఆఖరి శ్వాసతో

ఊగిసలాడే ఒక చిన్ని ఎరుపు పూవై
ఈ సమయమై, రెండు అరచేతుల మధ్య ముఖాన్ని కుక్కుకునే ఒంటరితనమై
చివరికి నువ్వై -

సృజనా, అవును
అలసి పోయాను.
ఇదంతా నువ్వు ఉన్నందుకే. ఇదంతా నువ్వు ఉండి
ఇక్కడ లేనందుకే

09 April 2015

ఇప్పటికీ ఇక్కడ

వెళ్ళడానికి నువ్వు వెనుదిరిగినప్పుడు
నీకు ఇద్దామని తెచ్చి, నా అరచేతుల్లో దాచినవేవీ నీకు చూపించనేలేదు-

సాయంత్రం అయ్యింది. ఆఖరు కాంతి.
గాలికి తెలుపు వస్త్రాలేవో కొట్టుకులాడుతున్నట్టు కళ్ళల్లో ఏవో తెరలు.చెట్ల కింద
ఆకులపైనుంచి రాలే తేమ. పీలికలై, సగం రాలి, కొమ్మల్లో ఊగే ఒక గూడు-

ఆ గూటిలో ఉండాల్సిన గుడ్లు ఏమయ్యాయని
ఎన్నడూ నువ్వు అడగనే లేదు. తల్లడిల్లుతూ అక్కడక్కడే గిరికీలు కొట్టిన పక్షులను
ఎన్నడూ నువ్వు చూడనే లేదు. కానీ, కదిలీ కదలక -ఆనీ ఆనక- నీ చేయి పక్కగా
రెక్కలు లేని ఒక పిచ్చుక పిల్ల రోదించే వాసనతో-

ఇక, నువ్వు వచ్చి, వీడ్కోలు చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయినప్పుడు
నీకు ఇద్దామని తెచ్చి, నీకు ఇవ్వలేక

నా అరచేతుల్లో నలిగి
నెత్తురోడి తలలు వాల్చేసిన పూల సమాధుల్లేవో,
ఇప్పటికీ ఇక్కడ భద్రంగా - 

08 April 2015

స్మృతి

నీ నుదుటిన
ఒక వాన చినుకు. చిగురాకంత గాలి అప్పుడు నీలో: గూళ్ళల్లో సర్దుకుని
బెదురుగా  ఎదురుచూసే పిచ్చుకలు నీ కళ్ళు. కంపించే
ఒక సాయంత్రం, మబ్బులు గుమికూడిన ఆకాశం
 
మసక చీకటీ, ఎవరిదో ఒక అశ్రువు చితికిన కాటుకై -

ఎవరిదో మరి అప్పుడు
నిను తాకే - పురాజన్మల సువాసన. ఎవరివో  మరి అప్పుడు, నిన్ను రహస్యంగా హత్తుకునే
బాహువులు. ఎవరివో మరి అప్పుడు, చిన్నటి మాటలు: ఎవరివో మరి అప్పుడు
నిన్ను స్మరించే పెదాలు -

మరి ఎవరిదో
ఒక ముఖం

అప్పుడే, వెనుక నుంచి నిన్ను అతి మృదువుగా పిలిచినట్టూ
సన్నటి నవ్వుతో అప్పుడే

ఎవరో నీ మెడను దాదాపుగా తాకినట్టూ, ఎవరివో పెదాలు
అప్పుడే, నిన్ను ఆనీ ఆననట్టూ, అప్పుడే ఎవరిదో ఒక శ్వాస నిను తాకీ తాకినట్టూ
నీలో - ఒక గగుర్పాటు. ఒక అలికిడి. తల తిప్పి చూసేలోపల
అక్కడ ఎవరూ లేక

నీలో కలిగే
ఒక గుబులు. ఒక తపన. నీ శరీరమంతా, నీ లోపలా, జీవన్మరణ సీమల్లోని మహాశూన్యం-
నీ నుదిటిన

జ్వలిస్తో దిగబడే
ఒక స్మృతి ముద్రిక. శిలువ వేయబడే ఒక దైనందిన చర్య.  ప్రేమ . ఇక
అక్కడే చివరిగా

వాన వెలసిన నిశ్శబ్ధంలో
ఎవరిదో ఒక రాత్రి నిద్రలో, నువ్వు నెమ్మదిగా సద్దుమణిగే వేళల్లో పుష్పించే
నీలో మిగిలే, చినుకంత

శ్వేత స్వప్నచ్ఛాయ - 

07 April 2015

నీలాంటి చీకటి

ఒక సమాధిని తవ్వుతున్నట్టు ఉంది
     పగటి నిప్పులు పడ్డ కళ్లల్లో రాత్రి చినుకులు ఏవైనా రాలి చల్లబడతాయేమోనని
     ఒక్కడినే ఇక్కడ ఈ బాల్కనీలో కూర్చుంటే -

ఈ సమాధి ఎవరికి అని అడగకు.
     చీకట్లో కూర్చుని చేతివేళ్ళు విరుచుకునే ధ్వనుల్లోంఛి వెళ్ళిపోయింది ఎవరు
     అని అడగకు. వొంగిపోయిన శిరస్సు కింది వొణికే నీడలు
     వెతుకులాడేది ఎవరినీ అని అడగకు. గాలి - ఉండీ లేని

ఈ గాలి - ఆగీ ఆగని ఈ గాలి - ఉగ్గబట్టి అక్కడక్కడే తిరుగాడేది
     ఎవరి కోసమో అని అడగకు. ఎక్కడిదో ఒక నీటి స్మృతీ, మట్టి వాసనా, చుక్కల కింద
     స్థబ్ధుగా నిలబడిన చెట్లూ, చెట్ల కొమ్మల్లోని నిశ్శబ్ధం, మరి

నిశ్శభ్ధాన్ని చెల్లాచెదురు చేసి
     కొమ్మల్లోంచి ఆకస్మికంగా ఎగిరిపోయే ఒక పక్షీ గుర్తుకు తెచ్చేది
     ఎవరినీ అని కూడా అడగకు. సృజనా ఊరకే చదువు-

నిశ్చలమైన సరస్సులో బిందువొకటి రాలి
     వలయాలు వలయాలుగా విస్తరించుకున్న ప్రకంపనల్లో, ఎవరో తమ ప్రతిబింబాన్ని
     క్షణకాలం చూసుకుని, చిన్నగా వేలితో తాకి వెళ్ళిపోయిన సవ్వడి-
     కనుల కింది ఏర్పడ్డ రాత్రి వలయాల్లో ఎవరో కదిలిన సవ్వడి

ఇష్టమైన ముఖాన్ని ఆఖరిసారిగా చూసుకుని
     అరచేతులతో సమాధిలోకి మట్టి వొంపిన సవ్వడి. రెక్కలు విరిగిన సవ్వడి. సన్నగా
     కోసుకుపోతున్న సవ్వడి. లీలగా, ఎవరో ఏడుస్తున్న సవ్వడి. లోపలంతా
      ఇక - మిగలబోయే - బావురుమనే ఒక ఖాళీ సవ్వడి
నువ్వు అనే సవ్వడి

సృజనా - అవును.
నిజంగా ఇక్కడ ఏమీ లేదు. బ్రతికి ఉండగానే మనుషులని నింపాదిగా కొరుక్కుతినే
నీలాంటి చీకటి తప్ప -