02 July 2022

దాచుకోలేనివి

 

మరి ఒకటే ఉండేది, అప్పుడు నాకు
స్కూలు జత-
తెల్లని షర్టు జేబు చినిగి

వేలాడుతో ఉండేది. ఇక కాలర్ పైన
ఎప్పుడూ, చిక్కగా
కాటుకలాంటి, మట్టి మరక–

ఎప్పుడైనా, ఏవైనా జేబులో భద్రంగా
దాచుకుందామా
అంటే, వీలు పడేదే కాదు

మరమరాలో, చేతివేళ్ళ చుట్టూ వెలిగే
పసుపు రంగు
నల్లీలో, రేగు పండ్లో, ఉప్పు

జల్లిన జామ ముక్కలో! నా పిర్రలు
కనిపించేలా
చినిగిన చెడ్డీ చూసి, పక్కున

నవ్వే వాళ్ళు, నా స్నేహితులో లేక
తోటి పిల్లలో,
అడపాదడపా టీచర్లో, నువ్వో!

నా అరచేతుల్నిండా నిన్ను నువ్వు
పోసుకుని,
జాగ్రత్తగా దాచుకొమ్మన్నావు కానీ,

చూడు, ఇప్పటికీ లోపల అదే మనిషి!
ఏమీ దాచుకోలేక,
కారే ముక్కుని, ముంజేతితో

తుడుచుకుని, అర్థంకాక నీవైపు అట్లా
చూసే, ఇప్పటికీ
జేబుల్లేని, జాగ్రత్త లేని మనిషి–

“పెన్సీల్ ఇవ్వవే, రాసుకుని మళ్ళా
ఇచ్చేస్తాను” అని
ప్రాధేయపడ్డ మనిషే ఇక్కడ

ఇప్పటికీ నీ ముందు, నిన్ను జేబుల్లోకి
కుదించుకుని మరి
తిరగలేకా, చిరుగుల్ని దాచలేకా! 

______

ఈమాట జులై సంచికలో ప్రచురితం

No comments:

Post a Comment