ఎదుగుతావు
నువ్వు: ఎంతో చక్కగా, ఆరోగ్యకరంగా,
లేత ఎండలోని ఒక మొక్కలాగా. మిలమిలా
మెరుస్తూ,
ఎన్నో మాటలు కూడా చెబుతావు నువ్వు,
అడవిలో చెట్లగుంపు మధ్యగా జలజలా పారే ఒక సెలయేరులాగా,
దాని సవ్వడిలాగా. ఒక ఇంద్రజాలికుడివి నువ్వు
మరి అప్పుడు. ఒక ఇంధ్రధనుస్సువి కూడా
నువ్వు, అప్పుడు. అబ్బురంతో చూస్తాను నిన్ను నేను; జింకలాగా దుమికే, పరిగెత్తే, కుదురసలే లేని ఉడతలాంటి నిన్ను
-
నీ
అరచేతులు, గాలిలో దిశలు మారుతూ నాట్యం చేసే పిట్టలు అప్పుడు.
నీ పెదిమలు, మాటల్ని పరిమళంతో నవ్వే లేత ఎరుపు పూరేకులు!
ఇక నీ కళ్ళు, అవి
తెల్లని చేపపిల్లలు. క్షణకాలం ఆగి, వెను వెంటనే
తటాలున కదిలి ఎటో వెళ్లిపోయే కుందేలు
పిల్లలు కూడా నీ కళ్ళే. తోటల్లో, గాలికి చిన్నగా హాయిగా ఊగే పూల నీడలూ,
వాటి సంరంభం కూడా ఇక నీ
కళ్ళలోనే, నీ చిట్టి పొట్టి
మాటలలోనే -
మరిక
, ఇలా ఎన్నో చెప్పి, ఎన్నో చేసీ, ఎంతో నవ్వీ, చిన్నపాటి
తూగుతో నువ్వు రాత్రిలోకీ, అమ్మ ఒడిలోకి నిద్రవై
జారితే, నాకు ఎందుకో, ఊగీ
ఊగీ నిశ్చలమయ్యే, వెన్నెల్లో తడిచిన వరికంకి ఒకటి జ్ఞాపకం వచ్చింది.
వాన గాలికి చూరుపై ముడుచుకునే, ఒక బుజ్జి పిచుక
కూడా గుర్తుకు వచ్చింది. చలి రాత్రుళ్ళల్లో, నెగడు
చుట్టూ చేరి, చేతుల్నీ, హృదయాల్నీ మరి వెచ్చబరుచుకున్న ఆప్తమైన
క్షణం కూడా ఏదో సువాసనై
లేతగా సోకింది. కాలం అలా ఆగిపోయింది.
ఇక అప్పుడు, బయటా, నా లోపలా నీరెండ
లోని యూకలిఫ్టస్ చెట్ల వాసనా, మసక కాంతీ, కరుణా,
లాలస. ఎరుకతో, అశృవులతో శుభ్రమై, నిర్మలంగా మారిన నయనాలూ -
***
ఇలాగే
ఎదగాలి నువ్వు: ఎంతో చక్కగా, సహజంగా,
జీవితం మరి ఒక తురాయి
చెట్టై, వేనవేల పూలై నీలోంచి ఇతరులకై
భళ్ళున, తళతళా వికసించేటట్లు, పూలవానలో, ఆ రంగుల్లో ఈ
లోకాన్ని తడిపేటట్లు -
కన్నా,
ఇలాగే వెళ్ళిపోవాలి, ఇలాగే విముక్తం కావాలి నేను: మరి, కృతజ్ఞతతో, ప్రేమతో,
నదులలాంటి చల్లని నీ అరచేతులలో, నిన్నే
చూస్తూ, ఇంతకాలం నేను తపించిన, నాకు
లభించని, శాంతితో!