17 January 2019

no option

ఎందుకనో, ఒకోసారి గుర్తుకు వస్తావు నువ్వు -
ఏం చేయాలో తెలియదు
అప్పడు. లోపల ఏదో పట్టేసినట్టు, pain!

ఎదురుగా గోడలపై నీళ్లు అలికినట్లు నీడలు -
ఒక పొరలాంటి కాంతి,
అది కన్నీరులాగా ఉన్నదీ అంటే నమ్మవు

కదా నువ్వు. అవును, నువ్వే. ఋతువు మారే
కాలంలో వీచే గాలి,
చల్లదనం, వేడిమీ; కలగలసి రెండూ మరి

ఒకటేసారి, పూలరేకుల్లో గాజురజను జొనిపి
గుండెల్లో కూరి, మెలి
తిప్పినట్టు, గాలీ, కాంతీ, చలించే ఆకులూ

ఇంకా నువ్వూ! అంతే: ఇంకేమీ లేదిక్కడ ...
***
ఒకోసారి గుర్తుకు వస్తావు నువ్వు; ఎందుకనో -
స్కూలు నుంచి ఏడుస్తో
పోతున్నాడో పిల్లవాడు ఒక్కడే ఎందుకో,

దారే మరి గుక్కపట్టే ఆ పిల్లవాని ముఖమై!

|| baby ... ||

చుక్కలుగా రాత్రిని ఒంపుకుంటున్నాను
కళ్ళల్లోకి
eye drops వేసుకుంటోన్నట్లు

చర్మాన్ని ఓపికగా వొలుచుకుంటోన్నాను
చాపగా మార్చి
శయనించేందుకూ, రాలేందుకూ

బాకుతో ఛాతిని చీలుస్తో ఉన్నానిక; ఒక
పాత్రలోకి చేర్చి
శాంతితో తాగి, అన్నీ మరిచేందుకు ...
***
baby , did I ever tell you that, కళ్ళలోని
అగ్నీ, దహనం
నెత్తురు రుచి మరిగిన వెన్నెలా మరి

త్రవ్విపోసే ఆ పూలబాకూ నువ్వేనని?

|| ఇంకా ||

సాయంసంధ్య; మంచులాంటి వెలుతురు. బహుశా, ఈ గాలి 
ఇంత చల్లగా ఎందుకు
ఉందో, వొణికే ఆకుల మధ్య ఆరుస్తోన్న ఆ పక్షికి

అస్సలు తెలియకపోవచ్చు; (తెలుసునేమో! ఎవరికి తెలుసు?)
మారుతోన్న ఋతువు.
రాలుతోన్న పూవులు. నీలో, ఎంతో తడిచిన నీడలు;

చిక్కటి మబ్బులు కమ్ముకున్న రాత్రుళ్ల గురుతులు; ఎవరివో
కళ్ళూ, శరీరం చేసే
సరస్సు అంచున, గాలికి రావి ఆకులు కదిలి, ఇక

జలదరించి, జలజలా ఎవరి శరీరంలోంచో రాలే శబ్దాలూనూ!
అంతిమంగా, మరి
మరుపే లేని కాలం ఏదో ఇలా, దయ లేక మళ్ళా

నిన్ను నీకే వొంటరిని చేసి కుదిపివేసి వొదిలివేస్తే ...
***
సాయంసంధ్య; పొగలాంటి వెలుతురు. ఎన్నో జన్మల క్రితం
ఒక సరస్సు అంచున,
ఇలాగే, అలలపైకి రాళ్లు విసురుతో ఉన్నాను

"చీకటవుతోంది; చాలిక. పోదాం రా ఇంటికి" అనే ఒకే ఒక్క
ఆ పిలుపు కోసం. చూడు;
ఇంకా అక్కడే, ఆగిపోయి వేచి ఉన్నాను నేను!

ఎంతో ...

చీకటిలో, మ్రాగన్ను నిద్రలో, ఇక 
పొగమంచులో
మరి ఎందుకో, నువ్వు ఒక్కడివే ...

ఓ మంచు బిందువే మరి ఓపలేని
ఎంతో బరువై,
తలను వాల్చిన ఓ తెల్లని పూవు

నీ ముఖమై ఈ ఛాతిలోకి క్రుంగితే
లోపలెక్కడో, ఆ
ఒత్తిడికి కమిలిపోయిన వెలుగు -

ఖాళీ కనుల ధ్వనులు. తరంగాలు
"నువ్వు" అనే
వీడని, ఈ నెత్తుటి ముద్రికలు!
***
చీకట్లో, మ్రాగన్ను నిద్రలో, ఎవరో
తాకినట్లయ్యి
ఉలిక్కిపడి లేచి, ఎవరూ లేక

నిస్తేజంగా, అతనొక్కడే, ఎందుకో!

ఛారికలు

ఎండ వెలిగిన గోడపై, నీడల ఛారికలు,
తెల్లని కాగితంపై
పిల్లలు పెన్సిళ్ళతో గీతలు గీసినట్లు -

అవును; ఇది చలికాలమే. రాత్రి అంతా
మంచు తెరలు వీచి,
ఉదయాన సరస్సులు నిశ్చలమయ్యే

లోకమే. కానీ అడగకు! గడ్డ కట్టినది ఏదో
లోపల అసలు ఏదైనా
చలనంతో జీవించి ఉన్నదో లేదో,

మంచుపేటికలో విగతమైన ముఖంలోని
తాజాదనం, మరి
బ్రతుకు చిహ్నమో కాదో, నువ్వు లేని

లోకాల శ్వేతస్మృతుల మృతప్రాయమో!
***
ఎండ వెలిగిన గోడపై, నీడల ముద్రికలు -
ఎవరివో కనులు వెలిగి
ఆరిపోయినట్లూ, అశ్రువులు ఎండినట్లూ!

ఆచ్చులి*

ఏడుస్తో వచ్చావు ఇంటికి సాయంత్రం; 
నీ ముఖమేమో మరి
ఎవరో ఉండ చుట్టి విసిరి వేసిన
 
ఒక తెల్లని కాగితం -

హృదయంలోనేమో గాలికి దొర్లే కాగితం
చేసే శబ్దాలు; బహుశా,
నేలపై పొర్లి ఆపై గాలిలో తేలిపోయే

అక్షరాలు; అశ్రువులు!

'పడ్డాను నాన్నా' అనైతే చెబుతావు కానీ
చిట్లిన నీ మోకాళ్లపై
చెక్కుకుపోయి నెత్తురోడే, రెండు

చందమామలు. కాళ్ళు

విరిగి కూలబడ్డ రెండు జింకపిల్లలు!
****
ఏడుస్తో వచ్చావు ఇంటికి సాయంత్రం;
నిన్ను వదిలి వచ్చాను
కానీ, నిన్నా, ఈ వేళ అంతా, చలి

నిండిన ఈ దినంలో

ఈ ఎండలో, నా లోపల బెంగగా మరి
రెండు పావురాళ్ళు;
చిరిగిన ఒక కాగితం. రెపరెపమంటో

ఉప్పగా వీస్తో - ఇక

నెత్తురెండిన ఒక తెల్లని రుమాలు!
_______________
* పిల్లవాడి నిక్ నేమ్