19 July 2016

బాతులు

ఎంత పెద్ద కళ్ళో ఆ అమ్మాయివి:
బాతుల్లాగా -

ఒక దగ్గర నిలవవు అవి: గునగునా
అటూ ఇటూ, ఇటూ అటూ -
గాలి చల్లగా వీస్తూ ఉంటే, తెరలుగా
వాన రాలుతూ ఉంటే

క్వాక్ క్వాక్ మంటూ బాతు పిల్లలు
నీ చుట్టూ

నిన్ను ఉన్న చోట నిలువనీయక
నిన్నొదలక -
***
ఎంత పెద్ద కళ్ళో ఆ అమ్మాయివి -
శీతాకాలంలో

నిన్నో వెచ్చని దక్షిణ ప్రదేశానికి
లేపుకుపోయి

దాచుకునే
తెల్లతెల్లని క్వాక్క్వాక్ బాతుల్లాగా!

10 July 2016

ఇక

మంటపై రొట్టెలు కాలుస్తుంది ఆవిడ -
ఎంతో ధ్యాసతో, తీక్షణతతో 
తన కనులు అప్పుడు -

బయట, పల్చటి కాంతితో ఆకాశం -
గాలి. రాత్రిలోకి సాగిపోతూ
చివరి వరసలో కొంగలు -
***
కిటికీలోంచి పొగా, పాత్రల అలికిడీ -
ప్లేటులో ఉంచిన రొట్టెలూ
ఓ మంచినీళ్ల గళాసూ -

ఇక, నీ మరొక దినం ముగుస్తుంది! 

09 July 2016

క్రితం రాత్రి

బాదుతోంది తలుపుల్ని గాలి
దబదబామని -
***
తడచిన రాత్రి: ఊగే ఎర్రని దానిమ్మ పూలు -
మెత్తని చీకటి కాంతి -
బుగ్గలు సొట్టపడేలా ఎవరో నవ్వుతున్నట్టు
ఎవరివో మాటలు మరి

దూరం నుంచి: గాలిలోంచీ, వానలోంచీ -

(ఎవరు వాళ్ళు? అట్లా మాటలతో నవ్వైన
వాళ్ళు?)
***
బాదుతోంది తలుపుల్ని గాలి
దబదబామని

నీలోంచి నిన్ను, బయటకు రమ్మని -
***
నా మాట సరే: వినకు -

లేతెరుపు గోళ్ళతో నిను ఛాతిపై రక్కిన
ఓ తెల్లని పావురపు మాటనైనా
ఒకసారి వినవా నువ్వు?

నిర్వాసితులు

రాత్రంతా వర్షం: హోరున కురిసిన
చీకటి -
***
ధారగా కారే నీళ్ళల్లో, ఊగే లతలు -
గోడకు రాసుకుంటూ, ఆకులు
కొట్టుకులాడే సవ్వడి: నీలో -

తడిచిపోయాయి సమస్థం: లోపల
ఒక ప్రకంపన. నీ చుట్టూ నువ్వే
చుట్టుకున్న చేతులు రెండూ

ఖాళీ విశ్వాలై, వెక్కిళ్ళ రాత్రుళ్ళై  -
***
ఏమీ లేదు -
రాత్రంతా కురిసిన వర్షంలో, వీచిన
చీకటిలో
***
మసకబారిన ఒక దీపం -
నీకై చూసీ చూసీ, ఇక ఒంటరిగానే
మిగిలిపోయిన

ఒక ఖాళీ దోసిలి -

05 July 2016

నిస్సహాయత

మాట్లాడవు నువ్వు: ఒక తలారి మౌనం
నీ కళ్ళల్లో -
***
పొగమంచు అలుముకునే వెన్నెల
రాత్రుళ్ళూ, ఘనీభవించిన
సరస్సులూ, నీడల్లో వేలాడే ఖాళీ
గూళ్ళూ, మరి ఎక్కడినుంచో

తేలివచ్చే ఒక ఆర్తనాదం అతనిలో -
***
మాట్లాడవు నువ్వు: ఒక హంతకుని
నైపుణ్యం నీ మౌనంలో -
***
ఇక రాత్రంతా కురిసిన వాననీటిలో

డగ్గుత్తిక స్వరంతో అతని దేహం
ఏటో కొట్టుకుపోయింది -

04 July 2016

దిగ్బంధనం

ఎన్నో మబ్బులు - 
వాన నీడలూ, నీటి పూలూ
నీలో -

ఎన్నో ఆకులు -
వణికే గాలిలో, లేచే మట్టిలో
కాంతిలో -

ఇక, నెమ్మదిగా
రాత్రిలోకి, తేమలాంటి తన 
శరీరం

చుక్కలతో, నిద్రతో
రాలే పూలరేకులతో, చీకటి
నివాళితో

జారి, ఒదిగి, సాగిపోతే
***
రాత్రంతా 
వానలో తడిచిన పావురం
గూట్లో

మెసిలే శబ్ధం 
నీలో!

01 July 2016

ముసురు

"చివరికొచ్చేసాను" అని అంటుంది
తను -
***
కిటికీ అద్దాలపై వాన గీసిన గీతలు
రాత్రి కాంతిలో తానై -
తడిచిన ఆకులు. కుండీల చుట్టూ
చెదిరిన నీళ్ళు: రాలిన
పూల రేకులతో, కొంచెం బురదతో
ముడుతలు పడ్డ తన 
కనులతో, చేతులతో, నుదురుతో
గాలికి ఊగే నీడలతో -
***
"
చివరికొచ్చేసాను" అని అంటుంది
అమ్మ -
***
ఇక 
బయట చీకట్లో, ఆగకుండా వాన -
సగం తెగిన రెక్కలు
కొట్టుకులాడే నల్లని శబ్ధంతో!