28 December 2013

గదులు

ఆగీ ఆగీ ఒక గాలి వీచి వెళ్ళిపోతుంది ఇక్కడ, నీలో నువ్వు నిమగ్నమయ్యి ఉన్నప్పుడు, ఎవరో భుజం తట్టి పలుకరించినట్టు, నీకు ప్రియమైన వాళ్ళెవరో ఎదురుపడి ఎలా ఉన్నావు అని ఆత్మీయంగా కౌగలించుకున్నట్టూ-

చూడు ఇటు.

కాంతి పచ్చిక పరకల్లా పరచుకున్న గదులు. వర్షానంతర నిశ్శబ్ధం పరచుకున్న గదులు. వర్షానంతర నిశ్శబ్ధంలోకి, ఆకుల అంచుల నుంచి చినుకులు రాలి సవ్వడి చేసే గదులు. పసి పాదాలు తిరుగాడిన గదులు. ఎంతో ఒరిమిగా ఎంతో ఇష్టంగా తను సర్దుకున్న గదులు. కాంతితో కడిగిన గదులు. తను ఇప్పటికీ కడగలేని, సర్దుకోలేని నేను నిండిన గదులు. గాలితో ఊపిరి పీల్చుకునే గదులు-

నువ్వు పడుకునే గదులు. నువ్వు రాసుకునే గదులు, నువ్వు ప్రేమించే గదులు. సన్నగా ఎవరో నవ్వినట్టు కూడా ఉండే గదులు. ఆగీ ఆగీ ఒక గాలి వీచి వెళ్లిపోయే, నిన్ను నీలోపల నుంచి వెలుపలకి తెచ్చే గదులు, చిన్న గదులు. నీ చిన్ని తల్లి వంటి, తన శరీరం వంటి గదులు.ముడతలు పడి, అప్పుడప్పుడూ సన్నగా కూడా కంపించే గదులు-

మనం పెంచుకున్న గదులు, మనం తెంపుకోలేని గదులు, మన వెంటే పిచ్చుక పిల్లలై ఇన్ని బియ్యం గింజలకై తిరుగాడే గదులు.అన్నం వాసన వేసే గదులు, తలారా స్నానం పోసుకుని, సాంభ్రాణి పొగలతో నీ చుట్టూ తిరిగే గదులు. నువ్వు బ్రతికి ఉండే గదులు.ఒక గాలి వీచి, నక్షత్రాలని లోపలకి తెచ్చి నీ ముందు కళ్ళాపి చల్లే గదులు. నువ్వు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపని గదులు, ఇంతకు మునుపు నువ్వు ఎన్నడూ గమనించని గదులు -

మరి, అటువంటి గదులని చూసావా నువ్వు ఎన్నడైనా? 

నా చీకటి

తల నిండుగా చీకటి - శిరోజాల మీద నుంచి
చినుకుల వలే 
ఒళ్లంతా రాలే
చిక్కటి చీకటి-

తల ఎత్తి చూస్తే 
ఏ కనులలోనూ కాంతి కనిపించని 
చీకటి- 

నిన్ను నువ్వే హత్తుకుని
భయంతో
ముడుచుకుని పడుకునే చీకటి

లేని బాహువుల 
బావురుమనే చీకటి 
నీ అంత ఎత్తూ 
పొడవూ ఉండే 
చీకటి 

నీ వాసన వేసే చీకటి 
నీ ఒంటరితనపు  
మేలి ముసుగు కప్పుకుని
నీ ముందు 
కూర్చున్న చీకటి
చిన్న చీకటి 

కడుపంతా తరుక్కుపోయే చీకటి
సమాధి వంటి చీకటి 

ఒక మనిషి లేని చీకటి 

ఒక చేయి లేని చీకటి 

కళ్ళు పోయి తడుముకునే చీకటి 

చిక్కటి 
చిన్నటి 
కంపించే చీకటి - 
కరగని చీకటి 
మూలిగలోకి చొచ్చుకుపోయి రోదించే చీకటి

దయ లేని 
దాహం తీర్చని చీకటి 
మరచి పోనివ్వని చీకటి
మరపు రానివ్వని చీకటి   

మరి ఇంతకూ 

నువ్వు ఎక్కడ?     

18 December 2013

వి/స్మృతి

1
ఏమీ రాయలేక, ఇక్కడ కూర్చున్నాను -

లోకంపై ఒక నులి వెచ్చని పొర కమ్మినట్టు, చుట్టూతా కాంతి
చలికి వణికిన శరీరాన్ని
ఎవరో పొదుపుకున్నట్టు-
2
ఆ పొదుపుకునే చేతులేవో
అక్షరాల్లోనే కానీ, నిజానికి
ఇక్కడంతా ఖాళీ - స్థబ్దత-

ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక మిగిలే ఒక
నిశ్శబ్దం. గోడలను చుట్టే
గాలీ నేలపై పారాడే ధూళీ

వొదిలి వేసిన పిల్లల బొమ్మలూ, విరిగిన పలకలూ
ఉండ చుట్టిన కాగితాలూ
లీలగా ఇంకా వినిపించే
మాటల ప్రతిధ్వనులేవో...
3
ఏమీ రాయలేక, ఇక్కడ ఇలా -
పదాలు ఉగ్గపట్టినట్టయ్యి...
తలుపులు తెరిచి చూస్తే

కిటికీలకు రెపరెపలాడే తెల్లని పరదాలు -

సగం అల్లుకున్న గూళ్ళు
చితికిన పావురపు గుడ్లు
అతి పల్చగా నీ ముఖంపై
వ్యాపించే ఒక సాలెగూడు...
4
ఇక, ఇక్కడ ఎడారిగా మారిన స్నానాల గదిలో
గోడకి మిగిలిన ఒక ఎర్రని
బిందువు. అంతిమంగా
ఒకే ఒక్క ప్రతీక - ఇలా...
5
'దుస్తులు విప్పి, శిరోజాలు ముడుచుకుని, నుదుటిపై బొట్టుని
గోడకి అతికించి, నీ వైపు
సాగిన ఆ అరచేయి ఇక

ఇంకా ఇక్కడ వ్యాపిస్తోన్నట్టూ, నీ మెడ వెనుకగా చేరి, తాకి
నిన్ను ఒక జలదరింపుకు
గురి చేస్తున్నట్టూ...'- మరి

నిన్నేమీ రాయనివ్వనట్టూ
నిన్నేమీ చేయనివ్వనట్టూ
చలికి వణుకుతూ నీలో ఒదిగిన ఒక  శరీరాన్ని, నిర్ధయగా

ఎవరో పెకల్చివేసినట్టూ
విదిల్చి విసిరివేసినట్టూ...
7
కాలంపై ఒక నల్లని బెరడు కమ్మినట్టు, ఇక్కడో ఖాళీ-

ఇక - ఇక్కడ
ఈ శరీర రాహిత్యంలో, ఈ ప్రాచీన వి/స్మృతిలో, మనంని    
వ్రాయడం ఎలా? 

16 December 2013

bricolage

1
చుట్టూతా ఝుంకారం వంటి ఒక చీకటి - తూనీగ పాదాల కింద
వలయాలుగా విస్తరిస్తున్న
నయన తరంగాల వలే---
2
ఇక ఎవరు ఏ మాట మాట్లాడినా
కొంత కాటుక వాసన. తడచిన కనురెప్పల వాసన-
వొణికే పెదాల వాసన. అర్థరాత్రిలో

కాగితాలు తగలబడి వెలిగే, నలుపూ
ఎరుపూ కలగలసిన వాసన-
మనం రాసుకున్న మాటలు
చుట్టూతా చిట్లి,నుసియై ఆపై

రాత్రి చెమ్మతో నలిగిన, నల్లని
వాసన. సవ్వడీ: అంతిమంగా
చెంపలపై కన్నీరు ఆవిరయ్యిన

ఒక ఖాళీతనం, ఒక నిశ్శబ్ధం, ఒక శాంతీ-
2
మోకాళ్ళ చుట్టూ చేతులు కట్టుకుని
ముఖాన్ని దించుకుని
రాత్రంతా వెలిగిన, ఒక

తెల్లటి దీపం, ఆనక ఎప్పటికో ఆరింది-

ఎర్రని పూవుల వలే విచ్చుకున్న
ఆ రెండు కళ్ళూ తిరిగి
రెండు నిండు మొగ్గలై
క్షణకాలం, మంచం అంచున అతని చేతి వద్ద ముడుచుకు పోయాయి-

అప్పుడు అక్కడ, వానలో
నానిన ఒక తోట వాసన-
తోటని కమ్మిన పొగమంచులో తిరిగే ఒక మనిషి వాసనా-

అతనిలోని పొగమంచులోకి
తప్పిపోయిన, రెండు కనుల
రెండు కలల పూల వాసనా- 
3
ఇద్దరినీ కమ్మిన చీకటి చుట్టూ, మాటలానంతర నిశ్శబ్ధం లాంతరు చుట్టూ
ఝుంకారం వంటి
ఒక కాంతి తరంగం-
4
అప్పుడు, అక్కడ, చితి వలే మండుతున్న అతని నుదిటిపై
సీతాకోకచిలుక వలే
వాలిన ఒక అరచేయి-

ఆ అరచేయి కిందుగా నిండుగా ప్రవహించే నదులు.
నిదురోతున్న పిల్లలు-
వీచే ప్రాణవాయువులు

మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, కదలి పోతున్న మేఘాలూ
ఋతువులూ, జనన మరణ
రహస్య ఉద్యాన వనాల
కాలాలూ,తల్లి పాలిండ్లని

లేత పిడికిట బిగించి, పాలు త్రాగే
పసి పెదాల లోకాలూ, వాటిపై
నర్తించే ఆదిమ శబ్దాలూ-
5
మరిక నువ్వది చూసి ఉండవు.

పాలు తాగిన మాటని- నిదురోతున్న ఒక మాటని. తన కురులను
తనే వృత్తాలుగా చుట్టుకుంటూ
ఒత్తిగిల్లిన మాటనీ, ఆ గాలినీ నీ
గడప ముందు ఆగి,తన రెక్కల్ని

విదుల్చుతూ, నిన్ను చూసే
ఒక చిన్ని పక్షినీ, దాని
గొంతుకనీ, ఆ కళ్ళనీ...

అందుకే
6
ఇక, ఇప్పుడు నీ చుట్టూతా
శిశువు గొంతుకలో ఊరుతున్న తొలి మాట వంటి ఒక కాంతి-
వేణువులోకి
సంశయంగా

అడుగిడిన ఒక ఊపిరి, ఊదేవానికి ప్రాణం పోసినట్టు, ఇక ఇక్కడ

నిదురించే ఒక మనిషీ (అతనే), వానలో వెలిగిన ఒక దీపమూ
దీపంలో ఒదిగిన గాలీ
మబ్బులూ నక్షత్రాలూ
ఇక ఒక మాటానూ -
7
మరి, ఇంతకూ తెలుసా నీకు?

ఉవ్వెత్తున ఎగిసే వరి పైరులపై, చుట్టూతా ఝుంకారం వంటి ఒక చీకటిలో
అలలు అలలుగా తేలిపోయే
తూనీగ పాదాల తాకిడికి
వలయాలుగా విస్తరిస్తున్న

ఆ లేత పసిడి వన్నెల - ఆ మన, ఆ అనామక, ఆ మన, మనం అనే -
ఆ మాటా, ఆమని ప్రదేశం?