ఒక మహా మృదువైన క్రూరత్వం, నీలో -
లేదా, మాటిమాటికీ
చెట్టు బెరడును గీకుతూ ఆడే
ఒక పిల్లిపిల్ల ఉత్సాహం నీలో -
ఆడుకున్నంతసేపూ ఆడుకుని, ఇక
ఆ తర్వాత, బొమ్మని
విసిరి కొట్టి వెళ్లిపోయే, ఒక పాప
నీలో; నీలోనే మరి, మహా నైపుణ్యం
కలిగిన, ఒక శస్త్ర
వైద్యురాలు కూడా! నొప్పసలు
తెలియకుండా కోత. నిలువునా, మరి
ఎంతో ఒద్దికగా, లేతగా,
గాజు ముక్కని సగానికి కోసినట్లు -
***
ఒక నిస్సహాయ క్రూరత్వం, నీలో -
ఈ ఎండమావి లోకంలో, మనుషుల్లో
ఓ జలాశయం కోసం
ఎదురుచూసే నీ ఎడారి కన్నుల్లో,
రక్కిన గీతల రాత్రుల నెత్తురుతో
ఇట్లా బెరడై మిగిలిపోయిన నాతో!
No comments:
Post a Comment