08 November 2020

నువ్వు

 తల తిప్పి చిన్నగా నవ్వుతావు నువ్వు -


ప్రేక్షకుడిని నేను; ఆ ఇంద్రజాలంలో
క్షణకాలం ఆగి,
ఏది వాస్తవమో ఏది స్వప్నమో మరి

ఇక పోల్చుకోలేక, తెలియరాక -

వయస్సు మీద పడుతోంది నీకూ, నాకూ;
నుదిటిపైగా నీ జుత్తు
కొంచెం నెరసి, నా గడ్డం పూర్తిగా ఇక

తెల్లని గీతలయ్యీ; అయినప్పటికీ,

నువ్వు నింపాదిగా కదిలినప్పుడూ, ఏదేదో
చెబుతో, నీ అరచేయి
అలవోకగా ఒక పిచ్చుకై ఎగిరినప్పుడూ

విభ్రమం నాలో. తొలిసారిగా పిల్లవాడొకడు
ఇంద్రజాల ప్రదర్శన
చూసి స్థాణువైనట్లు; తనని తాను మరి

మరచిపోయినట్లు. అంతా కొత్త, అంతా

నామ్నీకరణం తెలియని తొలి మానవుని
అవస్థ; దవనం వీచినట్లు,
చలిరాత్రిలో గాలికి లిల్లీలు ఊగినట్లు,

ఏదో జీవన లాలాసా, మృత్యువూ అర్థం
అవుతోన్న గగుర్పాటు;
నీతో కన్న శిశువుని తొలిసారిగా చూసి

నవ్వినట్లూ, ఏడ్చినట్లూ, నిశ్శబ్దమయినట్లు -
***
తల తిప్పి చిన్నగా, ఓరిమిగా నవ్వుతావు
నువ్వు , బిడ్డకి తొలిసారిగా
స్నానం చేయించి నవ్వుతోన్నట్లు -

నీ నుంచి అదే వాసన, అదే భాష ...

ఒక కవితను కన్నట్లూ, పాలు తాపినట్లూ,
ఏ సంధ్యా సమయానో, ఏ
నదీ తీరానో నన్ను అట్లా దయతో

నీతో, మృత్యువుకి తీసుకుపోతోన్నట్లు!

No comments:

Post a Comment