17 July 2018

vignettes

1
కొంచెంసేపు వర్షం కురిసి, మరి
ఆగిపోయింది -
నా చుట్టూతా ఇక, కొలవలేని
ఒక నిశ్శబ్దం;

ప్చ్; నువ్వెప్పుడూ ఇంతే!


2
కదలక నిశ్చలంగా చెట్లు; కూడా
మరి రాత్రీ, ఆకాశం -
గాలిలో తేమ ఏదో పలువరిస్తోంది -

చెప్పు నాకు, నీ పేరేనా అది?


3
బాల్కనీ అంతా వాన వాసన -
రాత్రంతా ఆకాశం
ఇక్కడ కక్కుకున్నట్లు!

తడచి ముద్ధయ్యి, వొంటరిగా
చూడు, చూడు ...
ఓ పూలకుండీ, ఓ కవితా

వాటిని వ్రాసే ఈ మనిషీ!

4
తడచిన చెట్ల నల్లటి బెరడు
అతనికి, ఆమె
శరీరాన్ని జ్ఞప్తికి తెస్తాయి;

తన శరీరపు వాసననీ, తేమనీ
చివరిగా పోటెత్తే
వర్షాన్ని కూడా! ఇక మరి

అతనిలో ఆకస్మికంగా, లక్షల
ఆకులు, నిప్పుతో
రెపరెపలాడుతోన్న సవ్వడి!

5
వీధి దీపాలు కొట్టుకులాడతాయి
చల్లటి గాలి అల ఒకటి
అతనిని చరచి వెళ్ళిపోతుంది -

ఎప్పటిలాగే అతనొక్కడే అక్కడ
దీపస్తంబం కింద
వొంటరిగా; ఎదురుచూస్తో -

6
వర్షం కురిసి, చీకటి ఛారికను
వొదిలి వెళ్ళింది;
మెరుస్తో ఈ రహదారులు -

గాయపడి, వ్యాఘ్రం వలెనో,
హృదయంవలెనో
గర్జిస్తో మరీ రాత్రీ, చీకటీ!

నెత్తురోడుతో అడుగుతాడు
అతను: ఎటు
మనం అనే గూటికి దారి?

7
అతను, ఒక దీపాన్ని స్వప్నించాడు
ఒక పరిమళాన్నీ,
జీవితంలా, వాన చినుకులా

ఒక కవితలా లేక అచ్చు ఆమెలాగా
జ్వలించే ఒక
దీపశిఖనీ కలగన్నాడు; మరి

సరిగ్గా ఘడియలోనే, ఎప్పటిలాగానే
ఎవరో ఎక్కడో
ఎందుకో, అతనికి నిశ్శబ్దంగా

అంతిమ వీడ్కోలు పలుకుతారు!

8
వర్షంలో తడచి, ఇళ్ళన్నీ నిశ్చలంగా
నిలబడి ఉన్నాయి;
వాటన్నిటిలోనూ ఒక శాంతి భావన,

అరతెరచిన నోర్లతో అలా నిదురిస్తున్న
శిశువుల వలే
ఉన్నాయి అవి; అవే, ఆ ఇళ్ళు!

మరి మనం కూడా కలతలు లేని ఒక
నిద్రకి అర్హత
పొంది ఉన్నాం అని అనుకుంటా;

అదెంత క్షణికమైనా! అనంతమైనా!

9
మబ్బులు తొలిగిపోయాయి; ఇంకా
చీకటిగానే ఉంది,
అయినా కొన్నిటిని నువ్వు

చూడగలవు; రబ్బరు చెప్పులతో
ఇంటికి పరిగెత్తుకెళ్ళే
ఓ పిల్లవాడినీ, ఆ చప్పుళ్ళనీ,

వేచి చూసే అతని తల్లినీ, ఇంకా
వీధిలో ఆగిన
మొక్కజొన్న బండ్లపై రాజుకునే

నిప్పునీ, పొగనీ, ఏవేవో మాటలనీ!
పర్వాలేదు, ఇది
బానేవుంది: నువ్వు ఇచ్చిన

నిలుపుకోలేని వాగ్దానం వలెనే!
_______________
*అనుసృజన

No comments:

Post a Comment