29 June 2018

ధ్వని, 3 కవితలు


1
|| ప్రతిధ్వని ||

నీ చేతులు వానని జ్ఞప్తికి తెస్తాయి,
వాన తడిపిన మట్టినీ
మట్టి తడిచిన ఆ సువాసననీ -

నీ మాటలేమో రాళ్ళని రుద్దుకుని
సాగే నీటి పాయలు -
ఎంతటి అందమైన శబ్దం అది!

'రంగుల శబ్దంవి కదా నువ్వు' అని
అన్నాను నేను నీతో,
వానేదో రాత్రేదో తెలియని రోజు!
***
ఇప్పుడు చూడు; వానాగిపోయాక
వీధి దీపాల కాంతిలో,
నా చట్టూతా మార్మ్రోగుతున్న

రాలిన ఆకుల మహానిశ్శబ్దం!

2
|| ఎన్నడైనా ||

నువ్వో ఉత్తరం వ్రాస్తావా నాకు?
ఎన్నడైనా?
అందుకే ఎదురు చూస్తాను,

ఇక్కడ; ప్రియమైన ఈ రాత్రి వద్ద
పొరల పొరల గాలితో,
చీకట్లో, చుక్కల వర్ణమాలతో!

( మరి ఎందుకు అలా అంటే)

ఎదురు చూడటమే కదా ఎవరైనా
చేయగలిగినది,
ముఖ్యంగా ఈ మూగకాలంలో!
***
అవతల ఎక్కడో, ఎగుడు దిగుడు
మైదానాలలో, అట్లా
వానకు తడిచే చెట్లు శోకించేది

ఏమిటో, మరి ఎవరికి తెలుసు?

3
|| పాత కుర్చీ ||

వానకి తడిచిపోయింది
వరండాలోని
పాత వెదురు కుర్చీ,

దాని నుంచి రాత్రంతా
మక్కిన వాసన,
బహుశా చీకటిదేమో ...

బద్దలు చీలిపోయి,మరి
కొన్ని విరిగీ,
గోడకి అట్లా ఆ కుర్చీ...
***
తెల్లవారింది; అయినా
అతనినెవరూ
పలకరించనే లేదు!

No comments:

Post a Comment