23 March 2017

be

నీ అరచేతుల నిండా వెల్లులి వాసన,
నా ముఖాన్ని ఇక 
ఆ చేతులతో నిమిరినప్పుడు,

వొలిచిన రెమ్మలేమో ఇకా ఉదయపు
పల్చటి ఎండలో
నేలపై మెరుస్తో, మరి పొట్టు,

రాలిన ఆకుల వలే,గాలికి ఊయల
ఊగుతో; చూడు,
ఋతువు మారింది. మరొక

వేసవి, కొమ్మల్లోంచీ,కుళాయిపై ఆగి
అరిచే కాకీలోంచీ
కొత్త కుండలోంచీ, చల్లటి

నీళ్ళై నీ చేతులలోంచి జీవధాతువై
మరో వేసవికై, ఇట్లా
వొలిచిన వెల్లుల్లి రెమ్మలై,

నీ అరచేతుల్లో ఒదిగిన నేనూ ఇంకా
కూర్చుని నిన్ను
గమనించే పిల్లల ముఖాలై!
***  
నీ అరచేతుల నిండా ఒక సువాసన
జీవన శ్వాసై మరి
పరిపక్వమైన ఒక మెలకువైతే

నీతో ఇట్లా ఉండటం బావుంది!

No comments:

Post a Comment