17 November 2016

దిక్సూచి

అదే రాత్రి, అదే గాలి. అదే చీకటి
అతని అరచేతుల మధ్య
తన శరీరపు మసక దీపకాంతి -
బలికోరే లోకాలలో, తన
కాలపు జనన మరణాల శాంతి -
***
ఇక ఓ గులాబీ ముందు మోకరిల్లి
తన చూపుడు వేలిని
గుప్పిట బిగించి అన్నాడతను:

"ఓ నెత్తుటి పూవా, నన్ను ఇక
నీ గూటికి తీసుకువెళ్ళు-"

16 November 2016

పొదుగు

చీకటి పడింది -
చెట్ల కింద ఎగిసిన మట్టీ. ఆకుల్లో
రాత్రీ, గూళ్ళల్లో రెక్కలూ
కొంచెం స్థిమిత పడ్డాయి -

కట్టెల పొయ్యిలోంచి మెలికలుగా
పొగ పైకి చుట్టుకుంటుంటే
తాను అన్నది: "ఇప్పటికే

ఆలస్యమయ్యింది చాలా. చాలిక -
తిరిగిరా ఇకనైనా ఇంటికి -"
***
రాత్రి మరిగింది -
చీకటి చెట్ల కింద దారి తప్పి, ఒక  
కుక్కపిల్ల, ఎందుకో మరి
ఒకటే ఏడుస్తున్నది!

14 November 2016

కమిలి

తెప్పలా ఊగుతోంది ఒక ఆకు, వెన్నెలలో -
***
దాని కళ్ళల్లో దిగులు నీడలు: రాత్రి జీరలు -
నిలేసిన తాడుని తెంపుకోలేక
ఊగిసలాటలోంచి సాగలేక

అక్కడక్కడే, తనలో తాను చిట్లి, ఊగుతూ
విలవిలలాడుతుంది ఒక ఆకు -
ఇక ఆ తరువాత, చెట్ల కింది

చీకట్లలో, అలల వెక్కిళ్ళలో, నీటిశ్వాసలో
తన హృదయంలో, చిట్లిపోయి
చిన్నగా రాలి  కొట్టుకుపోయే
***
కాటుక అంటిన, ఆతని కరుకైన చేతివేళ్ళు -  

12 November 2016

ఎండ

ఏటవాలుగా ఎండ -
చివుక్ చివుక్ మని ఎక్కడినుంచో
ఒక పిట్ట -
రాత్రి పెనవేసుకున్న
లతలు, కోసుకున్న వాటి ముళ్ళూ
లోపల -
***
ఏటవాలుగా ఎండ -
బాల్కనీలో ఒక ఖాళీ గూడు. రాలే
ఆకులు -
చెదిరిన మట్టి -
పగిలి కుండీలు. ఆ పగుళ్ళ నీడల్లో
నీటి కేకలు -  
***
ఏటవాలుగా ఎండ -
చివుక్ చివుక్ మని ఎక్కడి నుంచో
ఒక పిట్ట -
నువ్వు వస్తావని
మరచి, నీకై ఇన్ని గింజలూ నీళ్ళూ
ఉంచడం

మరిచి, వెళ్ళిపోయారు ఎవరో - 

10 November 2016

ముసురు

రాత్రి. చలి -
మసకగా ఓ ఇల్లు. అరుగుపై
చీకటీ, ఒక పిల్లి -
బొమికలు చిట్లినట్టు, రాలే
ఆకుల సవ్వడి -
ఎక్కడో దూరంగా చుక్కలు -
తోడివేసే గాలి -
***
T yrocare 125, Septa D 3
Triazolamలతో
ఇంట్లో ఒంటరిగా ఒక్కత్తే
ఒక అమ్మ -

07 November 2016

అసమర్ధత

ఆ రాత్రే, చెబుదామనుకున్నావు నువ్వు  -

బల్లపై దీపం ఉంచి, పాత్రలను సర్ది
చేతులు రుద్దుకుంటూ తను
అలసటతో నీకై ఎదురుచూసిననాడే
ఆ రాత్రే, ఆ చీకట్లోనే, ఎంతో

చెబుదామనునుకున్నావు నువ్వు. సరిగ్గా
ఎన్నో ఏళ్ళ క్రితం ఇలాంటి
రాత్రిలాగే, చేజారి, గాజుగళాసు భళ్ళున
తన కళ్ళవలే పగిలి, నీరంతా

గదంతా చిట్లి, చీకటి వలే చిందిననాడే!

06 November 2016

లోపల

వర్షపు ధార: సాయంత్రపు చెట్లు -
గుబురు ఆకుల కింద
రాత్రి: పగిలిన కుండీలు, చెదిరిన
మట్టి. రాలిన పూలు -
***
చిట్లిన గుడ్ల చుట్టూ అక్కడక్కడే
తిరుగుతోందో పావురం
నానిన రెక్కలతో, వెక్కిళ్ళతో - 

పరిపూర్ణత

పరిపూర్ణం కాలేదు ఏదీ: ప్రతిదీ
సగంలో తెగిన నీడై -
***
రాత్రిలో, చీకట్లో ఊగే కొమ్మలు
కళ్ళల్లో పూల నీడలు
గోడవారగా ధారగా చినుకులు
ముక్కలైన మబ్బులు -
అలసి, వడలి విరిగిన కాడలు
అన్నం పెట్టే నీ చేతులు -
ఒక కథా, చరిత్రా, భాషాస్మృతి
నన్ను కనే నీ మాటలు -
***
పరిపూర్ణం కాలేదు ఏదీ: సర్వం
కలవరిస్తుంది నిన్నే
రాత్రంతా నా ఛాతిపై మూల్గె
ఒక పసివాడి కాలమై!

05 November 2016

గ్రహింపు

నీ కళ్ళ నిండా నీళ్ళు, వానలో
తడిచిన ఆకుల్లా -
***
మబ్బులు కమ్ముకున్నదెప్పుడో
తెలియలేదు
నీడలు వ్యాపించినది ఎప్పుడో
గుర్తించనేలేదు

గాలికి ధూళి రేగి, చెట్లు వొణికి
రాత్రిలోకి నీవై
చినుకులై రాలి ఇంకిందెప్పుడో
గ్రహించనే లేదు -
***
వానలో నీ కళ్ళు. కళ్ళల్లో నేను -
నేనులో చీకటి -
***
ఇక రాత్రంతా మనిద్దరి మధ్య
వెలసినదేదో బొట్టు
బొట్టుగా రాలే మహానిశ్శబ్ధం!

04 November 2016

మొదలు

నా చుట్టూతా ఒక తెమ్మర, ముఖమల్
వస్త్రమేదో చుట్టుకున్నట్టు -
సాయం సంధ్య. పల్చటి కాంతి -

తిరిగి వచ్చే సవ్వడి ఆకాశమంతటా -
వాటి రెక్కల్లోనెమో అలసట
గొంతుల్లో, పిల్లనగ్రోవులై ఇళ్ళు -

ఇక చీకటి పడుతుంది. ఎక్కడో ఏదో
స్థిమిత పడుతుంది. దీపం
ఒకటి వెలుగుతుంది, చిన్నగానే -
***
లోపలెక్కడో, గూడు చేసుకుని ఎవరో
చిన్నగా పొదిగే చోట, ఒక
కదలిక. తల తిప్పి చూస్తానా, మరి

అక్కడే, తలెత్తి చూస్తూ నువ్వు! 

02 November 2016

...

అది ఎలా ఉంటుందీ అంటే
తల్లి స్థన్యం నుంచి
శిశువుని లాగి విసిరివేసినట్టూ

కంటి పొరపై ఒక మంచుతెర
కమ్ముకుంటున్నట్టూ
రాత్రై ఒంటరిగా మిగిలినట్టూ

చీకట్లో ఆకులేవో రాలినట్టూ
గూడేదో చితికినట్టూ
ఓ నిర్జీవ ముఖం అయినట్టూ

అది ఎలా ఉంటుందీ అంటే
నిన్నే తలుచుకుని
అమ్మ వెక్కివెక్కి ఏడ్చినట్టు! 

01 November 2016

ష్

నువ్వు తాకినట్టు చీకటి 
సద్దుమణిగి ఆకాశం -
ష్! మాట్లాడకు. తోటంతా
నిదురలో ఉన్నది 
రాలిన ఆకులో, రాత్రిలో 
రావిచెట్లపై వొణికే 
పసిమి వెన్నెల ఛాయలో!