28 May 2015

ఇది, ఇలా

సాయంత్రం అయ్యింది.
మబ్బులు కమ్మి, ఇటుక పొడి వంటి కాంతి చుట్టూతా.
     వేసవి గాలి: అయినా కొంత సంతోషం ~

నువ్వు నాటిన బచ్చలి తీగ
బాల్కనీ ఊచలకి అల్లుకుని ఊగుతుంది, అక్కడక్కడే ఎగిరే
     పక్షుల్లాంటి ఆకులతో, కొంత సంతోషంతో ~

కుండీల మధ్య చిన్ని స్థలంలో
ఒక చిన్న గూడును ఏర్పరచుకుని ఒక తెల్లని పావురం
     రెండు గుడ్లని పొదుగుతోంది: దాని కళ్ళల్లో

నువ్వూ, కొంత సంతోషం:  కొంత శాంతితో
 ~ పచ్చని జీవితంతో, అలా జీవించడంలో ~

సాయంత్రం అయ్యింది.
మబ్బులు కమ్మి, వేగంగా గాలులు వీచి, ఇటుక పొడి వంటి కాంతి
     ఇక నెమ్మదిగా చీకటి తేమతో, రాబోయే
ఒంటరి రాత్రితో: అయినా, కొంత ఆనందం ~

మొక్కల్లో, పూచిన ఎర్రని
చిన్ని చిన్ని పూలల్లో, పరచుకున్న ధూళిలో, చిగురించబోయే
     చినుకు వాసనలో, అంతటా

ఏదో జన్మించబోతున్న
ఒక సంరంభం. కోలాటం: ఒక లాలిత్యమైన నిశ్శబ్ధ ఉత్సవం ~

సృజనా
నువ్వు లేవు కానీ, చూడూ
ఇక రాత్రంతా ఇక్కడ  వాన కురియబోతోంది!

26 May 2015

అసంపూర్ణం

గూడు.
శరీరంలోంచి శరీరం వెళ్ళిపోయి మిగిలే ఒక కరవు
పారతో ఎవరో కడుపులో త్రవ్వుతున్నట్టూ, ఎవరో ఈ చీకట్లలో ఉగ్గపట్టుకుని
     చిన్నగా ఏడుస్తున్నట్టూ, ఇష్టమైన ముఖంపై తెల్లని వస్త్రం కప్పుతున్నట్టూ ~

కాలం.
పగిలిపోయిన గాజుగ్లాసు ముక్కలలో మెరిసే వేసవి రుతువు
ఎవరూ నీళ్ళు పోయక, వడలి మిగిలిపోయే మొక్కలు, నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయే
      పిచ్చుకలు:  ఒక పదం తట్టి అంతలోనే మాయమయినట్టూ, ఒక

వాగ్ధానం
పెదాల చివర ఆగిపోయినట్టూ, నీలో
ఎవరో ఒంటరిగా మిగిలిపోయినట్టూ ~

అంతం.
ఇక అతనొక్కడే అక్కడ, కవిత్వం వంటిదేదో వ్రాయలేక, ఏడవలేక
నీడలు సర్పాలై ప్రాకే ఆ బాల్కనీలో, త్రాగీ త్రాగీ త్రాగీ, ఇంకా దాహం తీరక, చేయి జొనిపి
     హృదయాన్ని పెరికి రాత్రిలోకి విసిరి కొడితే, తెల్లవారుఝామున

తన ముఖం
అతని కలలోకి చల్లగా, మబ్బులు కమ్మిన మసక జాబిలై, కొంత
బ్రతికించే వెన్నెలై, కన్నుల్లోకి తల్లి పాల చుక్కలై, జ్వరపీడిత నుదిటిపై అరచేయై వచ్చి
      అట్లా మిగిలిపోయింది ~ 

04 May 2015

నీ హృదయం

ఎక్కడెక్కడో తిరిగావు ఇన్నాళ్ళు
నీ హృదయం తప్పిపోయిందనీ, ఎవరైనా దొరికితే తెచ్చిస్తారని, ఎప్పటికైనా
సాంత్వన లభిస్తుందనీ, విరామంగా కూర్చుందామనీ ~

ఈ లోపల
పెద్దవాళ్ళయిపోతారు నీ పిల్లలు. తలుపులు తీసుకుని ఎటో
వెళ్ళే పోతారు: కొన్నిసార్లు నీకు అసలేమీ చెప్పకుండా, కనీసం
నువ్వు ఉన్నావనే స్పృహ కూడా లేకుండా ~

ఒక పగలు గడుస్తుంది
ఒక సాయంత్రంమూ దాటిపోతుంది. పల్చటి చీకట్లలో, వేసవి గాలికి
రెపరెపలాడుతుంది ఖాళీ గూడు: ఎప్పుడో - ఆకస్మికంగా ఎవరో మరి
నిన్ను పిలిచినట్టయితే

గుండె కొట్టుకోవడం
ఆగిపోయినట్టయ్యి తల తిప్పి చూస్తావు కానీ అక్కడంతా నిశ్శబ్ధం
గుక్కెడు మంచినీళ్ళు లేని మనుషుల సముద్రం. నల్లటి నీడలే అప్పుడు నీలో:
కదులుతో, మెదులుతో, ఏడుస్తో ~

ఎక్కడెక్కడో తిరిగావు కానీ ఇన్నాళ్ళూ
ఇదిగో ఇప్పుడు చెబుతున్నాను విను:

సృజనా
నీ హృదయమే
నిను వెంటాడే ఒక క్రూరమృగం. అద్దం లేని ఒక అద్దం. బ్రాంతీ
ఎప్పటికీ కనుగొనలేని ఒక ఇల్లూ, ఇంకా

ఇప్పటికీ నిను బ్రతికించి ఉంచే
ఒక అద్భుతమైన అబద్ధం! 

01 May 2015

simile

వొరిగిపొయిన ఒక పచ్చటి చెట్టు ఏదో - చీకట్లో 
తెరచి ఉంచిన ఒక కిటికీ - నీలో 
బల్లపై ఒక కందిలి: మనిద్దరికీ - 

సరిగ్గా అప్పుడే, ఎవరో వెళ్ళేపోతారు చెప్పకుండా 
ఆ వెలుతురు వలయంలోంచి
నిన్ను రాత్రిలోకి త్రోసివేసి -

ఇక రాత్రంతా
ఎదురుచూపులతో - రెండు ఒంటరి అరచేతులు 
దాహంతో - రెండు పెదవులు 
స్థాణువై - ఒకే ఒక్క ముఖం

మూసిన కిటికీకి ఆవలగా  
నిర్లక్ష్యంగా ఊగిసలాడే చీకటి జూకాల సవ్వడులని
నిస్సహాయంగా వింటో ~