01 March 2015

నిరీక్షణ

నీ పెదాలని
     ఒక చినుకుకి అందించినప్పుడు, నీటిగాలి నీ గుండెల్లో:
     నిదుర లేచి రెపరెపలాడే చెట్లు నీ కళ్ళల్లో. మట్టి నవ్వే సువాసన
బాహువులై నీ చుట్టూ -

ఎక్కడిదో ఒక స్మృతి ఛాయ.


నీ అరచేతులలో

     నునువెచ్చని తేమలా చేరే ఒక ముఖం:
     రాత్రి దీపం చుట్టూ ఒక పరిమళ వలయం. రేపటి భారంతో, చీకటి కురులలోంచి 
ఒక శిరస్సు

నీ భుజంపై

     పిచ్చుకై ముణగదీసుకున్నప్పుడు
     మాట్లాడకు. తడచిన దాని రెక్కల ఒంటరితనాన్ని వినునువ్వు లేక
భాష లేదనీ,ఈ భాష
నువ్వే - అని చెప్పు.

నువ్వే. 

అందుకని, నువ్వు ఉన్నందుకని
కల. 

నేను అనే ఒక కల.


అందుకని, ఇక


నిశ్శబ్దాన్ని భగ్నం చేయి.

రొట్టెలని సిద్ధం చేయి. చేతిలో చేతితో, మాటలో మాటతో
అశ్రువులో అశ్రువై, ఇష్టంతో

మన చుట్టూ మనమే చినుకులమై


బాహువులమై

గూళ్ళయ్యి, సుదూర తీరాల స్మృతి ముద్రికలై, మళ్ళా ఒక
జననమై,మళ్ళా
ఒకే  మరణమై -