18 June 2013

యాదృచ్చికం

1
జూకాల మాదిరి వేలాడే లతలతో పసుపు పచ్చని చుక్కల పూలు: కిందుగా ఊగుతూ నీడలు-

పూవులలో దాగి, దూరంగా ఉన్న నిన్ను తాకి, నీ గుండెల్లో భద్రంగా ముడుచుకునే సువాసన, ఒక పాపాయి తన తల్లి యెదలో ముడుచుకుని పడుకున్నట్టు, నీలో నువ్వు వొదిగి, నీ చుట్టూ నువ్వే చేతులు చుట్టుకుని, ఇరు వైపులా పుడమిని వినేందుకు చెవులొగ్గిన చెట్ల కింద, వీడిపోతున్నమంచులో, విచ్చుకునే కాంతిలో నువ్వు- 

నిశ్శబ్ధం ఒక సీతాకోకచిలుకై, ఈ నేలని ఆనుకుని ఎగురుతున్నట్టు, విత్తనాన్ని వీడి వెలుపలకి వచ్చే తొలి ఆకు కొద్దిగా చలించినట్టూ, కనిపించని పావురపు ఈక ఏదో నెమ్మదిగా తేలుతూ నేలపైకి వాలినట్టూ, మట్టిపై ఆనీ ఆనక కదిలే నీ పాదాలూ, ఆ మువ్వల సవ్వడీ-

ఇక మరి రాత్రంతా కురిసిన వానకి శుభ్రమయ్యి నవనవ లాడే, తెరిపి పడ్డ ఆకాశాలు నీ నయనాలు. నీ చేతి వేళ్ళ చివర్లలో పొంచి ఉన్న ఇంధ్రధనుస్సులు. గుబాళించే తోటలై మెరిసే నీ పెదాలపై, ఇక ఎన్నటికీ అడుగిడలేని ఒక తోటమాలిని నేను. అలవోకగా నవ్వుతూ నువ్వు తల తిప్పితే, సరస్సులన్నీ ఒక చోట చేరి, నీ ముఖమై 

తెరలు తెరలుగా గాలి- పూర్వజన్మలన్నీఒక్కసారిగా గుర్తుకు వచ్చినట్టూ, జనన మరరణాల రహస్యమేదో తెలిసిపోయినట్టూ, అంతా ఒక సుగంధపు కాంతి, ఒక శాంతి. మూసిన హృదయంలోంచి పక్షులేవో రెక్కలు విదుల్చుకుని ఎగిరి పోయినట్టు ఒక విభ్రాంతి. మరొక నిండైన స్థబ్ధతా-పేరు లేని ఒక దిగులూ, బెంగ కూడానూ- ఇక

చేతివేళ్ళల్లో చేతివేళ్ళమయ్యీ  ఒక ప్రమిదెను కాపాడుకునే అరచేతులమయ్యీ, రాత్రుళ్ళల్లో మెరిసే మిణుగురు పురుగులమయ్యీ, వెన్నెల ఛాయాలో వెలిగే నెగడులమయ్యీ , ఒక ఆదిమ తపనతో మోకాళ్ళ మధ్య మోకరిల్లిన శిరస్సులమయ్యీ, దైవిక అశ్రువులమయ్యీ, నీలోంచి నేనూ, నాలోంచి నువ్వూ తల తిప్పి చూస్తే

పసిడి జూకాల కిందుగా వేలాడే లతలతో, నీడలతో ఊగుతూ నువ్వూ, నేనూ, పూలూ పిల్లలూ, మనమైన ఇతరులూ, ఆ చల్లటి కాంతిలో, ఇష్టంతో, రాలిన పూలనేవో ఏరుకుంటూ, వేళ్ళతో ఇసుకలోకి నక్షత్రాలని లాగుతూ, పాదాలతో నీళ్ళను చెదుపుతూ, ఒక కలలోంచి మరొక కలలోకి, ఒకరి కలలోంచి మరొకరి కలలోకి, నాలోంచి నీలోకీ, నీలోంచి నాలోకి వెడుతూ, సమూహాలేవో, సంస్కృతులు ఏవో, విశ్వ కాల గమనాలేవో ఇలా-

మరి చిన్నా, తెలుసా ఏమైనా నీకు, ఇంతకు మునుపు తారస పడ్డామా మనం ఇలా, ఎప్పుడైనా, ఎక్కడైనా? 

No comments:

Post a Comment