నిలువెత్తుగా పెరిగిన ఈ చెట్ల కిందుగా నడుస్తూ ఉంటే, గుసగుసల వంటి ఆకుల సవ్వడి మధ్య నుంచి ఒక పక్షి అరుపు - పరాకుగా నడిచే నిన్నెవరో చప్పున నీ చేయి పట్టుకుని లాగితే, ఉలిక్కిపడి చూస్తావు కదా, అలా ఉంటుంది అప్పుడు నీకు: నిద్రలోంచి ఇంకా పూర్తిగా మెలకువలోకి రానట్టు, మరొకరి కలలోని రంగు ఏదో, కళ్ళను రుద్దుకునే నీ అరచేతుల్లోకి చేరి, నిన్ను విభ్రమ పరచినట్టూ, ఏది కలో ఏది వాస్తవమో పూర్తిగా తెలియనట్టు, తెలియ రానట్టూ-
'అప్పుడు, నాలో ఎవరో చేతిని జొనిపి, నా గుండెను తమ పిడికిట్లో బిగించినట్టయ్యింది', అని నీతో ఎవరో, ఎప్పుడో అన్న మాటో, నువ్వు చదివిన ఒక కవితా వాక్యమో తటాలున స్ఫురిస్తుంది నీకు: ఒక ఎదురు రాయికి మోదుకుని, గోరు చీలిపోగా అప్పటి దాకా స్పష్టత లేని లోకం కాంతులీనుతూ కనిపించినట్టు-
మరిక, ఏమీ చేయలేవు నువ్వు, అప్పుడు: ఈ జీవితపు తపనని అంతా ఒక స్వరంలోకి కుదించి, ఒక ప్రార్ధన వలే, నేలకు తమ శిరస్సులు వంచిన ఆకుల మధ్య నుంచి, నిన్ను నీ మోకాళ్ళపై ఒరిగి పోయేలా చేసిన ఒక గొంతు వలయాలుగా నీ వైపు దూసుకుని వచ్చినప్పుడు-
ఇక ఏమీ చేయలేక, నిస్సహాయుడివై తల ఎత్తి ఆకాశంలోకి చూస్తే కన్నీటి పొర వంటి వెలుతురు. చిన్నగా ఊగే కొమ్మలు. శిశువుల గుప్పిట్లలోని లేతేరుపు రంగు వంటి పూలు. తల్లి చూచుకంపై మిగిలిపోయిన పసి పెదాల తడి వంటి గాలీనూ. ఇక
కనుచూపు మేరా పరచుకున్న ఒక ఎదురుచూపులో, ఆ రాళ్ళ పక్కగా నిలిచిపోయి ఎండిపోతున్న ఓ నీటినవ్వులో, ఒక నీడ, ఖాళీ బాహువులంత ఒంటరిగా మారి , ఇక్కడ నిలువెత్తుగా పెరిగిన చెట్ల కిందుగా ఎదురుపడితే, నేనేం చేయను-?
No comments:
Post a Comment