23 January 2023

  

పర్వీన్

స్కూలుకి ఎలా వెళ్ళవచ్చు?

వేకువఝామున స్నానం చేసిన చందమామల్లాగా 
లేదా, స్నానం చేసి అల్లరి చేసే చందమామల్లాగా వెళ్ళవచ్చు -
గాలికి ఊయలలూగే అశోకా చెట్లల్లాగా, గుంపుగా
గుబురు పొదల మధ్య సవ్వడి చేసే చిన్ని పక్షుల్లాగా వెళ్ళవచ్చు - లేదా

చిన్నారి యోధుల్లా, చిక్కటి అడవిలో దారి ఏర్పరచుకుంటూ
సాగిపోయే వేటగాళ్ళలాగానూ వెళ్ళవచ్చు - కానీ,
చాలాసార్లు, నడిచే మొక్కల్లాగా, కళ్ళల్లో ముళ్ళతో
బడికి కాకుండా పనికి వెడుతుండవచ్చు. ఎలా అంటే

ప్రతి ఉదయం
ఆకుపచ్చని జాబిలిలా లేదా
తెల్లగా నవ్వే ఆకుపచ్చని జాబిలిలా, పర్వీన్ లా - 
మరి పర్వీన్ ఎవరు?

ఆకుపచ్చని పరకిణీతో, చీపురు కట్టల రెక్కలతో
CIEFL లో చెత్త బుట్టలను  శుభ్రం చేసే అయిదేళ్ళ అమ్మాయి -
ఇంద్రధనుస్సులేవీ లేని సీతాకోకచిలుక - కళ్ళను
లోకమంత విశాలంగా విప్పార్చి చూసే నీటి చినుకు - 

మరి, పనికి ఎలా వెళ్ళవచ్చు?

కళ్ళ కింద లోకమంతా వానై రాలి పడుతున్నప్పుడు
రోజంతా తిండి లేక, రాత్రి నిదుర రాక, పాకపైనా  
పాకలోకీ, జనగణమనలాంటి సవ్వడి వలే, గులకరాళ్ళ వలే 
జారి పడుతున్న వర్షపు చినుకులకి దూరంగా ఒక మూలకి వొదిగి 
రాత్రి రెక్కలలోంచి, రెక్కలు నరుక్కునే పగటిలోకి

ఆకుపచ్చటి లంగా జాకెట్తో పర్వీన్ లా వెళ్ళవచ్చు -

తనకీ ప్రపంచం తెలుసు - గోళీకాయలా. కానీ ఒకటే రంగు
పేరేమీ లేనిది. పర్వీన్ లా, ఉనికి తప్ప అస్థిత్వం ఏమీ లేనిది -

మరి, ఇక తన ప్రపంచం ఏమిటి?

మొదటిది పని. చీపురు కట్టలు. లేదా
లతల్లా విచ్చుకున్న వేళ్ళ మధ్య శుభ్రమయ్యే ఎంగిలి పాత్రలు
పాలిపోయిన ఆకులలాంటి అరచేతులపై
చెంపలపై ఎర్రని గాయపు కోతలు - 

రెండొవది ఆకలి. వాసనొచ్చే అన్నమైనా
బూజు పట్టిన బ్రెడ్డు తునకైనా చాలు - ఆకలి తీరాలి. రెండు
చిట్టి అరచేతులతో కడుపుని, లేదా 
ఈ విశ్వమంతటి ఆకలిని నొక్కిపెట్టడం అసాధ్యం -

మరా క్షణాలలో, తన ప్రపంచం ఏమిటి?

రోదించడం. ఆకలిని తట్టుకోలేక, కుత్తుక తెగిన పావురంలా
చుట్ట చుట్టుకుని కొట్టుకులాడటం. తప్పదు. పోనీ
కనీసం మంచినీళ్ళు? పాకలోకి చొచ్చుకు వస్తున్న

నీటి కత్తుల మధ్య, అన్నం మెతుకులాంటి
ఒక నీటి బిందువైనా ఉండదు. తన చెంపలపై
జారే ఎంతో బరువైన కన్నీళ్ళలో,  నక్షత్రంలాంటి 
ఒక నీటి చినుకైనా ఉండదు. తను - ఆ పర్వీన్

ఆకుపచ్చని పర్వీన్ -
కమిలిపోయిన నెత్తురు కనుల పర్వీన్, ఆమె ప్రపంచం -
కలలు తప్ప మరేమీ లేని అన్నంలాంటి కనుల పర్వీన్
చిక్కని గంజిలాంటి కనుల పర్వీన్, చల్లని రొట్టెముక్క
దేహం గల పర్వీన్ , ఆమె ప్రపంచం -

అయితే, మరణం కంటే ఘాడమైన, హింసాత్మకమైన జీవితం కింద
తన లోకం లిప్తకాలం పాటు, వాన వెలిసాక విచ్చుకునే
సూర్యపుష్పం వలే, ఒకే ఒక్క క్షణం మెరుస్తుంది - 
తను నిజంగా నవ్విన క్షణాలలో, అయిదేళ్ళ వయస్సు, 
చిట్లిన విత్తనంలా ఫక్కుమని నవ్విన క్షణాలలో -

మరి, పర్వీన్  ఎప్పుడు నవ్వుతుంది?

ఆకుపచ్చని గడ్డిలో కలసిపోయి లేదా
తనే, విశాలమైన పచ్చిక మైదానంలా మారిపోయి
రోగగ్రస్థమైన కుక్కపిల్ల ఒకటీ, గుడ్డిదైన
కుక్కపిల్ల మరొకటీ - రెండిటితోనూ, వీచే గాలిలో

పరిగెడుతూ ఆడుకుంటున్నప్పుడు, సర్వం మరచి

వాటితో కలగలసిపోయి, స్వేచ్ఛగా పొర్లుతున్నప్పుడు
ప్రపంచమంతా ఒకే సవ్వడితో నిండిపోతుంది -
ఆకాశం నుంచి భూమి దాకా, ఎండిన మట్టిపై రాలే 

చినుకుల శబ్దంలాంటి నవ్వుతో, పర్వీన్ నవ్వుతో 

ప్రపంచమంతా, ఫక్కుమని ఫెటీల్మని పేలిపోయి
కనుల ముందు బూజుబూజుగా రాలిపడుతుంది
ఒక కన్నీటి బిందువులో బరువుగా మునిగిపోతుంది - మరి

పొరలు పొరలుగా, గాలి తెరల్లా విస్తరించుకుంటున్న ఆ శబ్దం 
నవ్వు - పర్వీన్ నవ్వు - ఆ సవ్వడి
కన్నీటి బిందువులు రాలిపడుతున్న సవ్వడి
కనులు పిగిలిపోతున్న సవ్వడి

స్వేచ్చదా, లేక రేపటి నిర్భందానిదా?
________________________________
మొదటి సంపుటి 'కొన్ని సమయాలు' లోంచి 

08 August 2022

ఆకృతి

త్తిగిల్లి ఒకవైపుకి, నిద్రపోతోంది
అమ్మ. బుగ్గ కిందుగా
మణికట్టు. శిశువు పిడికిలిలా
 
అరచేయి. పక్కగా పెయిన్ బామ్ -
కృతిమంగా
మగ్గపెట్టిన మామిడిపండులా
 
నలిగి, తన చర్మం. మసక బల్బు
వెలుతురులో
రోడ్డు పక్కగా వానలో నిండా
 
తడిచి, మూలుగుతున్న రెండు
కుక్కపిల్లల్లాగా
ఉన్నాయి, మూతపడ్డ తన
 
బరువైన కనురెప్పలు. జలుబై
శ్వాస సరిగ్గా
ఆడని, ఆగీ ఆగీ వినిపిస్తోన్న
 
తన గురక మాత్రమే, నీకు ఇక
మరెవరిదో
ఒకప్పటి యాతననీ, వణికిన
 
రాత్రినీ గుర్తుకు తెస్తుంది!
***
త్తిగిల్లి ఒకవైపుకి, నిద్రపోతోంది
అమ్మ. నానిన
ఆకుల వాసనేదో గదిలో. తన
 
నిద్రలోనూ ముఖంలోనూ, వాన
ఆగాక బయల్పడే
మృదువైన వెలుతురు, గాలి -
 
బహుశా, తన కలల్లో, ఎన్నటికీ
నేను చూడలేని
పగిలిన బొమ్మలూ, ఒక ఇల్లు!
***
త్తిగిల్లి ఒకవైపుకి, నిద్రపోతోంది
అమ్మ. అలసి
కుంచించుకుపోయి, అట్లా
 
రంగు వెలసిన నారింజ చీరలో
క్రమేణా క్షీణిస్తూ 
అయినప్పటికీ వెలుగుతూ 
 
మట్టి ప్రమిదెలాగా, అమ్మ!

06 July 2022

ఆచ్చులి ...

 

ఏడుస్తో వచ్చావు ఇంటికి సాయంత్రం; 
నీ ముఖమేమో మరి
ఎవరో ఉండ చుట్టి విసిరి వేసిన
 
ఒక తెల్లని కాగితం -

హృదయంలోనేమో గాలికి దొర్లే కాగితం
చేసే శబ్దాలు; బహుశా,
నేలపై పొర్లి ఆపై గాలిలో తేలిపోయే

అక్షరాలు; అశ్రువులు!

'పడ్డాను నాన్నా' అనైతే చెబుతావు కానీ
చిట్లిన నీ మోకాళ్లపై
చెక్కుకుపోయి నెత్తురోడే, రెండు

చందమామలు. కాళ్ళు

విరిగి కూలబడ్డ రెండు జింకపిల్లలు!
****
ఏడుస్తో వచ్చావు ఇంటికి సాయంత్రం;
నిన్ను వదిలి వచ్చాను
కానీ, నిన్నా, ఈ వేళ అంతా, చలి

నిండిన ఈ దినంలో

ఈ ఎండలో, నా లోపల బెంగగా మరి
రెండు పావురాళ్ళు;
చిరిగిన ఒక కాగితం. రెపరెపమంటో

ఉప్పగా వీస్తో - ఇక

నెత్తురెండిన ఒక తెల్లని రుమాలు!
_____________
* పిల్లవాడి నిక్ నేమ్

04 July 2022

ఎవరు?

 

నిమ్మకాయ రంగు దుస్తులు వేసుకుని
కూర్చున్నావు,
ఒళ్ళో చేతులు చాపుకుని -

ఎదురు చూస్తున్నావా ఎవరికోసమైనా?
ఎండలో, గాలిలో
ఊగే తూనీగలు నీ ఎదురుగా -

ఏదో ఆలోచిస్తావు. ఒకోసారి, తల వంచి
ఫోన్ చూసుకుంటావు,
ఆనక 'నో' అని తల విదుల్చుతావు -
***
నిమ్మకాయ రంగు ఎండలో, కూర్చుని
లేచావు; నీ తేనె
కళ్ళలో, ఇసుక తెరలూ, కూలిన

భవంతీ, తెగ నరికిన చెట్టూ. నీడ లేక
ఇంతసేపూ నువ్వు
ఎదురు చూసింది, ఎవరికోసం?

02 July 2022

నీ వేళ్ళతో గాలి

 

అందరూ గెలలు కోసుకున్నాక,  తెగ నరికిన 
అరటి చెట్టులాగా అమ్మ - 
***
పల్చటి చలికాలపు ఎండ. ఎండిపోయిన తన  
వేర్ల వంటి శరీరం, ఒకప్పటి 
మట్టి వాసనతో, ఇప్పుడిక నీటి దాహంతో -

రాలిపోగా మిగిలిన, పీచువంటి  తెల్లని జుత్తుని
అప్పుడప్పుడూ, వొణికే 
బొమికల వంటి చేతివేళ్ళతో త్రోసుకుంటో

"కాళ్లల్లో గడ్డలు: నడవలేకపోతున్నాను. మొన్న
నీళ్లు పడుతూ కళ్ళు తిరిగి
పడిపోతే, అదృష్టం, దెబ్బలేమీ తగల్లేదు, 

కానీ, భయంగా ఉందిరా." అంటోంది. అప్పుడు
తన కళ్ళల్లో పగిలిన పావురం 
గుడ్లు. గొంతులో రెక్కలు విరుగుతోన్న శబ్దం -

నిర్జీవమవుతున్న ఒక ఒంటరి ఊయల, నీడలు 
నిద్ర మాత్రలయ్యి, గొంతు 
చుట్టూ బిగుసుకునే ఆవరణ ఇక మరి, తన 

హృదయంలో, calcium లేక చిట్లే ఆ శరీరంలో!
***
నలుపు తెలుపు అస్పష్ట చిత్రంలాంటి గృహం - 

గుమ్మం ముందు తార్లాటలాడే ఒక పిల్లి: మరో 
మార్గం లేక, తాను రోజూ 
ముందు గదిలో sedate అయ్యే టీవీ, ఫోన్ 

thyroid, cholesterol, vitamin B 12, Uric acid కో  
మందుల ప్లాస్టిక్ డబ్బా, 
ఎంతో మృత్యువుని నింపుకున్న మంచంతో

ఐదారేళ్ళ పాప కళ్ళతో, అట్లా చూసే అమ్మ!

దీవెన

ఎదుగుతావు నువ్వు: ఎంతో చక్కగా, ఆరోగ్యకరంగా, లేత ఎండలోని ఒక   మొక్కలాగా.  మిలమిలా

మెరుస్తూ, ఎన్నో మాటలు కూడా చెబుతావు నువ్వు, అడవిలో చెట్లగుంపు మధ్యగా జలజలా పారే ఒక సెలయేరులాగా, దాని సవ్వడిలాగా. ఒక ఇంద్రజాలికుడివి నువ్వు మరి అప్పుడు. ఒక ఇంధ్రధనుస్సువి కూడా నువ్వు, అప్పుడు. అబ్బురంతో చూస్తాను నిన్ను నేను; జింకలాగా దుమికే, పరిగెత్తే, కుదురసలే లేని ఉడతలాంటి నిన్ను

నీ అరచేతులు, గాలిలో దిశలు మారుతూ నాట్యం చేసే పిట్టలు అప్పుడు. నీ పెదిమలు, మాటల్ని పరిమళంతో నవ్వే లేత ఎరుపు పూరేకులు! ఇక నీ కళ్ళు, అవి తెల్లని చేపపిల్లలు. క్షణకాలం ఆగి, వెను వెంటనే తటాలున కదిలి ఎటో వెళ్లిపోయే కుందేలు పిల్లలు కూడా నీ  కళ్ళే. తోటల్లో, గాలికి చిన్నగా హాయిగా ఊగే పూల నీడలూ, వాటి సంరంభం కూడా ఇక నీ కళ్ళలోనే, నీ చిట్టి పొట్టి మాటలలోనే -

మరిక , ఇలా ఎన్నో చెప్పి, ఎన్నో చేసీ, ఎంతో నవ్వీ, చిన్నపాటి తూగుతో నువ్వు రాత్రిలోకీ, అమ్మ ఒడిలోకి నిద్రవై జారితే, నాకు ఎందుకో, ఊగీ ఊగీ నిశ్చలమయ్యే, వెన్నెల్లో తడిచిన వరికంకి ఒకటి జ్ఞాపకం వచ్చింది. వాన గాలికి చూరుపై ముడుచుకునే, ఒక బుజ్జి పిచుక కూడా గుర్తుకు వచ్చింది. చలి రాత్రుళ్ళల్లో, నెగడు చుట్టూ చేరి, చేతుల్నీ, హృదయాల్నీ మరి వెచ్చబరుచుకున్న ఆప్తమైన క్షణం కూడా ఏదో సువాసనై లేతగా సోకింది. కాలం అలా ఆగిపోయింది. ఇక అప్పుడు, బయటా, నా లోపలా నీరెండ లోని యూకలిఫ్టస్ చెట్ల వాసనా, మసక కాంతీ, కరుణా, లాలస. ఎరుకతో, అశృవులతో శుభ్రమై, నిర్మలంగా మారిన నయనాలూ -

***

ఇలాగే ఎదగాలి నువ్వు: ఎంతో చక్కగా, సహజంగా, జీవితం మరి ఒక తురాయి చెట్టై, వేనవేల పూలై నీలోంచి ఇతరులకై భళ్ళున, తళతళా వికసించేటట్లు, పూలవానలో, రంగుల్లో లోకాన్ని తడిపేటట్లు -

కన్నా, ఇలాగే వెళ్ళిపోవాలి, ఇలాగే విముక్తం కావాలి నేను: మరి, కృతజ్ఞతతో, ప్రేమతో, నదులలాంటి చల్లని నీ అరచేతులలో, నిన్నే చూస్తూ, ఇంతకాలం నేను తపించిన, నాకు లభించని, శాంతితో

నీడ

అమ్మ, ఉద్యోగానికి వెళ్ళేది -
అన్నం, పప్పు
ఇవి మాత్రమే చేసేది -

మధ్యాహ్నం స్కూల్ నుంచి
వస్తే, నాకు
ఆ వంటగదిలో, ఒక

నీడ కనపడేది; చిరిగిన ఒక
పర్సులాగా
ఉండేది ఆ నీడ, నల్లగా!
***
అమ్మ, ఉద్యోగానికి వెళ్లడం
లేదిప్పుడు -
అయినా, అన్నం పప్పూ,

కానీ, కర్రీ పాయింట్లో; ఇంకా
అదే, నల్లని
ఆ ప్రేమారాహిత్యపు నీడ

చిరిగిన పర్సులో దాచుకున్న
అతని

ప్రియమైన ముఖంలాగా! 

బంతిపువ్వు

 

అప్పుడు, నీ కాళ్ళు వొణుకుతాయి -
క్షణకాలం, గుండె
ఆగిపోతుంది. పెదాలు ఎండి

తల దించుకుంటే, పైన ఆకాశంలో
మబ్బులు: నల్లగా -
పెద్దగా వీచిన గాలికి వేపపూలు

జలజలా రాలతాయి. ఎక్కడో, వాన -
దాని తడీ వాసనా
నీలోనా, వెలుపలా? తెలియదు -

ఎప్పటికో “వెళ్ళనా?” అని వినపడి
మరి తలెత్తి చూస్తే,
ఆక్కడే ఒక చక్కని ముఖం, ఇక

తేటగా, వాన వెలిసి, మబ్బుల్లోంచి
బయటపడి మెరిసే
సూర్యబింబంలా, చినుకులు

ఆగి, గాలికూగే బంతిపువ్వులా!

____________________________

 ఈమాట జులై సంచికలో ప్రచురితం

https://eemaata.com/em/issues/202207/29024.html

దాచుకోలేనివి

 

మరి ఒకటే ఉండేది, అప్పుడు నాకు
స్కూలు జత-
తెల్లని షర్టు జేబు చినిగి

వేలాడుతో ఉండేది. ఇక కాలర్ పైన
ఎప్పుడూ, చిక్కగా
కాటుకలాంటి, మట్టి మరక–

ఎప్పుడైనా, ఏవైనా జేబులో భద్రంగా
దాచుకుందామా
అంటే, వీలు పడేదే కాదు

మరమరాలో, చేతివేళ్ళ చుట్టూ వెలిగే
పసుపు రంగు
నల్లీలో, రేగు పండ్లో, ఉప్పు

జల్లిన జామ ముక్కలో! నా పిర్రలు
కనిపించేలా
చినిగిన చెడ్డీ చూసి, పక్కున

నవ్వే వాళ్ళు, నా స్నేహితులో లేక
తోటి పిల్లలో,
అడపాదడపా టీచర్లో, నువ్వో!

నా అరచేతుల్నిండా నిన్ను నువ్వు
పోసుకుని,
జాగ్రత్తగా దాచుకొమ్మన్నావు కానీ,

చూడు, ఇప్పటికీ లోపల అదే మనిషి!
ఏమీ దాచుకోలేక,
కారే ముక్కుని, ముంజేతితో

తుడుచుకుని, అర్థంకాక నీవైపు అట్లా
చూసే, ఇప్పటికీ
జేబుల్లేని, జాగ్రత్త లేని మనిషి–

“పెన్సీల్ ఇవ్వవే, రాసుకుని మళ్ళా
ఇచ్చేస్తాను” అని
ప్రాధేయపడ్డ మనిషే ఇక్కడ

ఇప్పటికీ నీ ముందు, నిన్ను జేబుల్లోకి
కుదించుకుని మరి
తిరగలేకా, చిరుగుల్ని దాచలేకా! 

______

ఈమాట జులై సంచికలో ప్రచురితం

ఎంపిక ...

 

భగవంతుని ముందు అరచేతులు
ముకుళించినట్లు
చేతులు చాపి ఉన్నాను, రాత్రిలో–

ఒక చేతిలో ప్రేమా, మరొక చేతిలో
కన్నీళ్లూ ఉన్నవి;
దేనిని ఎన్నుకోవడం? దేనిని

వదులుకోవడం? రెండు చేతుల్లోనూ
అదే ముఖం,
లోకంలోని అన్ని సరస్సుల్లోనూ

ఒకే జాబిలి ప్రతిఫలించినట్లు, ఇక
ఆ అగ్నిలో
నువ్వు దగ్ధమయ్యి, నీ చూపు

పూర్వజ్ఞానం లేని సృష్టిలోకి, ఒక
తల్లి చేతుల్లోకీ
తొలి బిడ్డలాగా వొదిగినట్లూ…

కాంతి; నొప్పి. బ్రతికి ఉన్నావన్న
స్పృహ. వాసన,
బొడ్డు తాడు తెగిన, వాసన-

భగవంతుని ముందు అరచేతులు
ముకుళించినట్లు
చేతులు చాపి ఉన్నాను, రాత్రిలో–

ఇదొక మృత్యువు ఊయల; రెండూ,
అన్నీ కూడా
నీవే అయినప్పుడు, కన్నీళ్ళూ

ప్రేమా ఒకటే అయినప్పుడు, మరి

ఎలా నేను, ఒకదానిని ఎంచుకోడం? 

___________
ఈమాట జులై సంచికలో ప్రచురితం


30 June 2022

నమ్మిక

గడిచిపోతుంది మరొక రోజు ఇలాగే –
వ్యాపించిన చీకటిలో
బహుశా, ఎవరిదో హృదయం
 
దప్పికతో, దాహార్తియై నీకోసమే మరి
ఎదురు చూస్తోంది;
ఎవరది? అని అడగకు. బహుశా
 
నీ సహచరి కావొచ్చు. గుమ్మం వద్ద
కాళ్ళను వొత్తుకుంటో
కూర్చునే, నీ తల్లి కావచ్చు. లేక
 
నువ్వే, నీలోంచి వెలుపలికి నడిచి
ఒక బాలుడివై, మరి
బొమ్మలతో, కాగితాలతో, రంగుల
 
పెన్సిల్స్ తో నీకై వేచి ఉండవచ్చు!
చిర్నవ్వుతో, ప్రేమతో
ఎవరో, నిన్ను తమలోకి దయగా
 
ఆహ్వానించేందుకు, తోరణమై, నీలో
ఊగేందుకూ, లీలగా
పలికేందుకూ, ఓరిమిగా ఎదురు
 
చూస్తుండి, ఉండే ఉండవచ్చు –
***
గడిచిపోతుంది ఒక జీవితం ఇలాగే –
చింతించకు అసలే –
చాలు కదా నీకు నువ్వూ, మరి
 
నీ కోసం ఒకరు వేచి ఉంటారు అనే
ఊహా, నిన్ను చిలికి
చిలికి, నీలోన అమృతమై ఉబికే
 
ఆ రూపం, ఆ ముఖం, నిన్నూ ఇంకా
నీ హృదయాన్నీ
బ్రతికి ఉంచే, ఆ పచ్చని గాయం!

అభీష్టం

ఒక్కసారి, ఆ అరచేతుల్ని గట్టిగా
పట్టుకుని
కూర్చుంటే, చాలనిపించేది –
 
ఇంకేమీ వొద్దు. చాలు ఇది. బ్రతికి
ఉండొచ్చు
ఇంకోపూటకి, అని అనిపించేది –
***
ఒక్కసారి, ఆ చేతుల్ని తిరిగి మళ్ళీ
తాకేదాకా
బ్రతికి ఉంటే బావుండు, అని
 
అనిపిస్తోంది: ఒకే ఒక్కసారి, గోరు
ముద్ద చేసి,
తిను అని చాపినట్లున్నా చిన్న
 
అరచేతిలో, తల్లిని కరచి పట్టుకు
పడుకున్న
బిడ్డలాగా, ఆ అరచేతుల్లోనే ఇక
 
నిశ్చింతగా వెళ్ళిపోగలిగితే, ఎంతో
బావుండు,
చాలిక ఈ జీవితం అని కూడా
 
లీలగా, శాంతితో అనిపిస్తోంది –

ఎత్తా … *

మరి ఎప్పుడూ, నీ వెనుకే ఒక పిల్లవాడు
అంబాడుతూ
తిరిగేవాడు; నోట్లో ఒక పీక
 
ఉంగరాల జుత్తూ, మెరిసిపోయే కనులూ
వెన్నెలవంటి
నురగలాంటి, అలల నవ్వూ –
 
“ఎత్తా, ఎత్తా” అని ఇక నీ వెంబడే, నువ్వు
పని నుంచి
వచ్చిన సాయంత్రాల్లో, తనని
 
ఎత్తుకోమనీ, చేతులు చాచి, తలుపులు
చూయించి,
ఎక్కడికో తనని తీసుకుపొమ్మనీ!
***
ఆ సాయంత్రాలు చల్లని గాలులై వీచేవి
అప్పుడు; ఆ
చిన్ని పిడికిళ్ళల్లో నెగళ్లు వెలిగేవి
 
అప్పుడు. నీ రెండు చెంపలనీ, తన
అరచేతుల్లో
పుచ్చుకుని, పళ్ళు సరిగా రాని
 
నోటితో నీ ముఖాన్ని ముద్దాడితే, నీ
కాలం అంతా
అమృతమయమైన ఉమ్ము!
 
నీ చుట్టూ విత్తులు మొలకెత్తే వాసన,
పాల సువాసన –
గాలికి వరికంకులు ఊగే శ్వాస –
 
పీక తీసి, మాటల్లేని ఏవేవో శబ్దాలతో
ఏదో వ్యక్తపరిస్తే,
ఆలయంలో గంటలు చిన్నగా
 
మ్రోగినట్లు, అది నువ్వు విన్న తొలి
దైవిక గీతం,
పరిమళపు ప్రార్ధన! ఆలాపన –
***
ఇప్పటికీ, నీలోపల నువ్వే అయిన
ఒక పిల్లవాడు,
నీలోలోపల దాగుని, నిను
 
తొంగి చూస్తో, ఆసక్తిగా నిను గమనిస్తో
పిలిచినా రాక,
వెళ్ళిపోతోన్నప్పుడు వెంబడిస్తో!
***
హృదయం లోపలా, వెలుపలా మరి
నిర్మానుష్యమై,
‘ఎత్తా’, అనే తోటి మనిషి లేక
 
రాత్రిలో, ఖాళీ వీధిలో, పాలిపోయిన
నీడవై నువ్వు
మిగిలిననాడు, విరిగిన ఒక
 
పెన్సిల్తో, అట్టలేని పుస్తకంలో ఏదో
తదేకంగా గీసే,
మధ్యలో తలెత్తి నిను చూసే
 
నీలోని, ఆ నిష్కల్మషపు పిల్లవాడే
లేకపోయి ఉంటే,
ఏమైయుందువు నువ్వీ పాటికి?!
_____________
ఎత్తా = ఎత్తుకో

16 May 2021

 నిన్ను నువ్వు స్వప్నిస్తూ

_________________________________

నిన్ను నువ్వు స్వప్నిస్తూ నన్ను కలగంటావు

మృత్యువుకై సాగిపోతూ
నా అరచేతుల మధ్య క్షణకాలం ఆగి విశ్రమించే 
నీ చేతికి శతాబ్దాల అలసట తెలుసు 

ఆ క్షణిక సమయంలోనే, 
నువ్వు కూడా స్వప్నిస్తావు: నీరెండలో, నీటిలో 
రెక్కలు విదిల్చే ఒక కాంతి పక్షిని -

నువ్వు కూడా ఒక బుజ్జి నెత్తురు పిట్ఠవి! 

రాత్రి తర్వాత రాత్రి 
ఒక ప్రమిదెకై తపిస్తూ, నిన్ను నువ్వు స్వప్నిస్తూ 
నన్ను కలగంటావు!

రహదారి

 రహదారి

____________

సాయంత్రం పూట, వర్షపు తూనీగలు నల్లటి మేఘాల రెక్కలతో 
కొమ్మలలోకి జోరబడుతున్నవేళ
ఆమె రహదారిని దాటేందుకు ప్రయత్నిస్తుంది. నుదిటిన 

గాలికి చిందరవందర అవుతున్న కురులతో, మూడేళ్ళ పాప కనులతో
విస్తృతంగా రాక్షసంగా కదులాడుతున్న 
వాహనాలను దాటి ఆవలివైపుకు చేరేందుకు ఆమె 
తడబడుతుంది -

సహచరుడు లేని దిగులు సాయంత్రం. అరచేతిలో మరో అరచేయి లేని,
గోరువెచ్చనిదనం లేని, దు:ఖాన్ని 
మునిపంటితో నొక్కి పెట్టిన సాయంత్రం. భుజాన బాగ్ తో

అలసిన దేహంతో, పని నుంచి నిస్సతువుగా ఇంటికి వెళ్ళాల్సిన 
సాయంత్రం. ఆమె రెండు అడుగులు 
ముందుకు వేసి, నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది ...

"ఇది అడవికన్నా చిక్కనైన ప్రదేశం. క్రూరమృగాల కన్నా వేగంగా 
వాహనాలు సంచరించే విరామం లేని ప్రదేశం.
ఇటువంటి రహదారిని దాటటం ఎలా?" అని  తనలో తాను 

సంబాషించుకుంటూ, చాలా కాలం క్రితం, అతడూ ఆమె చేతులు 
పుచ్చుకుని, అంత వేగపు వాహనాల వరదను 
అత్యంత సునాయాసంగా దాటిన క్షణాలను జ్ఞాపకం 
చేసుకుంటుంది -

ప్రేమలేని దయరహిత సాయంత్రం. పెదాలు ఇతర పెదాలను తాకలేని
నిశ్చేష్టమైన నిశ్శబ్దపు సాయంత్రం.
ఒంటరిగా బయలుదేరి ఒంటరిగానే ఇక ఇంటికి చేరుకోవాల్సిన

ఒంటరి బాహువుల సాయంత్రం. ఆమె ముందుకు కధలలేకా
వెనక్కు వెళ్ళలేకా, ఉన్నచోటనే 
నిలబడి ఎదురుగా నిర్దయగా మారుతున్న రోజును 
స్తబ్దుగా గమనిస్తూ అనుకుంటుంది:

"రహదారిని దాటడం ప్రేమను ఈది ఒక దరికి శాంతితో చేరటం వంటిది. 
సమయం లేదిక: కదిలే తెమ్మరని 
ఆసరాగా పుచ్చుకుని, మసకబారుతున్న ఆకాశంలో మెరుస్తున్న 

నక్షత్రాలు, మేఘాల మధ్య ముడుచుకుంటుండగా, చప్పున రహదారిని 
దాటాలి. సమయం లేదిక. చీకటి మంచు 
గాడమయ్యే వేళకి ఇంటికి చేరుకొని, సహచరుడు లేని పడకపై

నిర్లిప్త కరుణతో విశ్రమించాలి ఇక. సమయం లేదిక. ఎలాగోలాగా జీవితాన్ని 
త్వరితంగా దాటాలిక:"

ఆ తరువాత, కనిపించని ముళ్ళు రాలుతున్న కంపించే శీతలగాలితో పాటు
పెదాల అంచున వికసిస్తున్న చిర్నవ్వుతో
ఆమె ఒక నిర్లక్ష్యపు విసురుతో, సాయంకాలమూ రాత్రీ కాని 
కర్కశ సమయంలోకి

ఈ పదాలతో పాటు రహదారిని దాటుతుంది.

మధ్యాహ్నపు అమ్మ

 మధ్యాహ్నపు అమ్మ

__________________________

నల్లటి నీడలు తెల్లటి నీటి పాయల్లా తన వేళ్ళ చివర కదులుతుండగా
నేను అమ్మ మధ్యాహ్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను
ఇంటి వెనుక జామ చెట్టు వృద్ధాప్యంతో వొంగి , జ్ఞాపకాలలో కోల్పోయిన తనని చూస్తుండగా
నేను అమ్మ మధ్యాహ్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను

మరెక్కడో మరొక వృద్ధుడు, అలల్ని అరచేతిలో పట్టుకుని వాటిని పిట్టల్లా మార్చే
తన మనవరాల్ని చూసేందుకు సముద్రంలోకి వెడుతుండగా
మరెక్కడికో వెళ్ళలేని ఇక్కడి అమ్మ ఇక్కడే మౌనంగా దుస్తుల్ని నీటిలో ముంచుతుంది
తన ప్రియుడికి ఎన్నటికీ తిరిగి ఇవ్వలేని పుస్తకంలో రంగు మారిన రావి ఆకులా
అమ్మ దుస్తుల్ని తన ముందు పరుచుకుని, తన రెండు హస్తాలతో

అప్పుడే జన్మించిన శిశువుని తుడిచినట్టు, మరణించిన తన తల్లితండ్రుల శరీరాల్ని
శ్మశానానికి తీసుకువెళ్ళే ముందు, ప్రేమతో బాధతో నిశ్శబ్దంగా కడిగినట్టు
అమ్మ దుస్తుల్ని తన ముందు పరచుకుని, తన రెండు హస్తాలతో వాటిని శుభ్రం చేస్తుంది

అమ్మ మధ్యాహ్నం ఒంటరిగా దుస్తుల్ని ఉతుకుతుంది
తనని వొంటరిగా వదిలివేసిన వాళ్ళ దుస్తుల్నీ, తనని ఇక్కడ ఒంటరిగా వదిలివేసి
మరెక్కడో తన అస్తిత్వపు ఊసైనా లేక కదులాడుతున్న వాళ్ళ దుస్తుల్నీ
అమ్మ మధ్యాహ్నం ఒంటరిగా శుభ్రం చేస్తుంది
మరుపైనా లేని సమయంలో, ప్రేమించినవాళ్ళకీ కోల్పోయినవాళ్ళకీ 
తేడా లేని సమయంలో, అమ్మ
ప్రేమించిన వాళ్ళ దుస్తులనీ, ప్రేమించలేని వాళ్ళ దుస్తులనీ నీటిలో 

ముంచుతుంది. వాళ్ళ చొక్కల్నీ, పాంట్లనీ, లోదుస్తులనీ ఒకదాని తరువాత మరొకటి 
శుభ్రం చేస్తూ, నుదిటిపై చిట్లిన 
చెమటను తుడుచుకునేందుకు క్షణకాలం ఆగుతుంది

సరిగ్గా ఆ క్షణాన వొంటరి మధ్యాన్నం స్రవించే నెత్తురు గులాబీగా మారుతుంది
సరిగా ఆ క్షణాన ఆకాశపు తీగపై ఆరవేసిన మేఘాలు పచ్చి గాయాలుగా మారతాయి
సరిగ్గా ఆ క్షణాన అమ్మ గర్భంలో ఈ కవిత ఊపిరి పోసుకుంటుంది

సరిగా ఆ క్షణాన అమ్మ శరీరంలో ఒక దిగులు గీతం కదులాడుతుంది. ఆ తరువాత
అప్పుడే ఆర్పివేయబడ్డ ప్రమిదెలు 
వెలుతురు వాసనను గాలిలో వదిలినట్టు, అమ్మ దుస్తుల్ని ఉతకడం పూర్తిచేసి, 

వర్షానికీ బాధకీ వాటిని వోదిలివేసి ఇంటిలోకి వెళ్ళిపోతుంది.

ఇక ఈ రాత్రి

 

ఇక ఈ రాత్రి ఇక్కడ విశ్రమిస్తాను. ఎంటువంటి ఆరోపణలూ లేకుండా ఇక ఈ రాత్రి అస్తిత్వాన్ని అంగీకరించి శిరస్సుని ధూళి నిండిన పాదాల వద్ద ఆన్చి నిలిచిపోతాను

కనిపించని ఉనికి ఏదో నిర్దేశించిన దారి ఇది. క్షణక్షణం రహస్య స్వరం ఏదో రమ్మని పిలిచిన కరుణ లేని దారి ఇది. సమయపు సంకేతాల్ని అనువదించుకునేందుకు గులాబీలను వొదిలి ముళ్ళను హృదయంలో దింపుకున్న అంతులేని తపన ఇది

ఇక ఈ రాత్రి ఏది ఏమిటని అడగను. ఇక ఈ రాత్రి ఎవరు ఎవరనీ అడగను 

జీవితాన్ని వెదుకుతూ జీవితాన్ని కోల్పోయాను. అర్థాన్ని వెదుకుతూ అర్థాన్నీ కోల్పోయాను. ఉండేందుకు, ఏమీ కోరని ఈ భూమిపై అలా ఉండేందుకు అనేక పర్యాయాలు మరణించాను. తిరిగి చేరుకునేందుకు, ఎప్పటికీ చేరుకోలేనంత దూరమూ వెళ్ళిపోయాను. తుంపులు తుంపులుగా నలుదిశలూ వీడిపోయాను 

ఇక ఈ ఒక్క రాత్రి, మట్టిని రక్తపు పెదాలతో ముద్దాడే పాదాలు నావి, అవి చేసే అలికిడి ఎవరిది అని అడగను. శూన్యపు కాంతిని వలలై చుట్టుకునే కనులు నావి, అవి చూసే చూపు ఎవరిది అని అడగను. ఇక్కడ ఈ గాలిలో వికసించిన అస్తిత్వపు పూవు నాది, దాని ఎరుక ఎవరిది అని అడగను. విరిగిపోయాను. పూర్వీకుల ధూళిలో కలసిపోయాను. అలసిపోయాను. ఇక ఎటువంటి ఆరోపణలూ లేకుండా ఈ రాత్రి జీవితాన్ని అంగీకరించి శిరస్సుని వడలిపోయిన పాదాల వద్ద ఆన్చుకుని ఇక్కడే ఆగిపోతాను.  ఇక ఇక్కడే

 అలలపై వొదిలిన ప్రమిదెలా ఆగి, సాగిపోతాను.