01 August 2015

విశేషణం

మరెక్కడో,  నా ఉనికిని
కుదురుగా మలచినట్లు ఉన్న నీ ముఖం, ఇక్కడ ఈ చెట్ల కింద చీకట్లలో:
బెంగతో - 

దూరంగా ఎక్కడో
రాళ్ళకు పైగా సన్నగా నీళ్ళు పారే శబ్ధం.
కొమ్మల్లో, ఉన్నట్టుండీ ఏదో అలజడి. ఉలిక్కిపడి కదిలే పక్షులు. నిన్నటి
వానకు 

ఇంకా మానని నేలా, రాళ్ళూ ~
ఎవరో భీతిల్లి, నిను చేరి, నీ చేతిని గట్టిగా పట్టుకుని 
వదలనట్టు, చుట్టూతా ఒక పచ్చి వాసన. బురదలో కూరుకుపోయి, ఇక 
బయటకు రాలేక

నిస్సహాయంగా
నీ వైపు చూసే పురుగులూ, సీతాకోకచిలుకలూ
పగిలిన బొమ్మలూ, మన మాటలూ, ఇంకా అంతిమంగా, ఒక నిశ్శబ్ధం. 
ఎల్లా అంటే

నువ్వు నా చేతిని
వదిలిన తరువాత మిగిలిన, కమిలిపోయిన 
ఈ చర్మం వలే: ఈ రాత్రి వలే. నీ ఉనికిని కుదురుగా మలచినట్లున్న 
ఈ చీకట్లలో
రాత్రుళ్ళలో

బెంగతో కంపించిపోయే నా ముఖం వలే. మరి

క్షమించాలి నువ్వు.
ఎందుకంటే, నిదురలో పక్కకు ఒత్తిగిల్లి, అలవాటుగా
చేయి చాచినప్పుడు, ఎవరూ తగలక, తల్లడిల్లి ఉలిక్కిపడి లేచి, స్థాణువై 
గుక్కపట్టే

ఒక అరచేయి వలే మిగిలిన
ఈ కవితను అంతం చేయడం ఎలాగో, తెలియడం లేదు నిజంగా
నాకు -!

No comments:

Post a Comment