30 August 2010

స్వయంకృతాపరాధం

నిన్ను వొంటరిగా వోదిలివేసే విషయాలుంటాయి

చీకటితో అల్లుకున్న రహదారుల వెంట తిరుగాడుతూ
ఏకాంతపు చందమామనూ, అక్కడక్కడా ఆకాశంలో దిగబడి
అలా ఉన్న నక్షత్రాలనూ నువ్వు పరికిస్తున్నప్పుడు

నిన్ను మాత్రమే అర్థరాత్రిలో గాయపరిచే విషయాలుంటాయి

నీ అస్తిత్వపు పూవు నుంచి మొలకెత్తే రక్తాన్ని గమనించే ఆనందం కోసం
నిన్ను లోతుగా పొడిచే స్నేహితులను
నువ్వు మూగ కళ్ళతో చూస్తున్నప్పుడు, నీ కన్నీళ్ళని తాకే,
నిన్ను ప్రేమించీ, నిన్ను వొదిలి
మరో రుతువులోకి, మరొక కారణంతో వెడలిపోయిన ఆ స్త్రీ ఒంటరి
చేయి నీ పరిసరాల్లో రహస్యంగా కదలాడుతూ ఉంటుంది

వర్షమూ ఉంటుంది, కొంత గాలీ ఉంటుంది
నిన్ను అబ్బురపరిచే కొంత నొప్పీ ఉంటుంది. నీ మంచిని కోరే వాళ్ళ
పెదాలపై వికసించే నల్లటి నవ్వులలో
కొంత నువ్వు చేసుకున్న స్వయంకృతాపరాధం కూడా ఉంటుంది

నిన్ను ఒంటరిగా వోదిలివేసే క్షణాలలో
నిన్ను ఒంటరిగా గొంతు నులిమివేసే క్షణాలలో...

1 comment:

  1. చాలా బాగా నచ్చింది.

    ముఖ్యంగా
    "నీ అస్తిత్వపు పూవు నుంచి మొలకెత్తే రక్తాన్ని గమనించే ఆనందం కోసం
    నిన్ను లోతుగా పొడిచే స్నేహితులను
    నువ్వు మూగ కళ్ళతో చూస్తున్నప్పుడు, నీ కన్నీళ్ళని తాకే,
    నిన్ను ప్రేమించీ, నిన్ను వొదిలి
    మరో రుతువులోకి, మరొక కారణంతో వెడలిపోయిన ఆ స్త్రీ ఒంటరి
    చేయి నీ పరిసరాల్లో రహస్యంగా కదలాడుతూ ఉంటుంది"

    ReplyDelete