28 August 2012

ఋణం

మొద్దుబారిన నాలికతో అద్ది
      చెబుతున్నాను యుగాల బానిస పదాలని పరభాషలో

ఎండలతో, వెన్నెలతో
గాలులతో, వానలతో
రేపటి వాచకపు కళ్ళతో వింటున్నారు పిల్లలే నిన్నటిని
తిరిగి తిరిగే రేపటికి-

నలుపు పలకపై పలుకలేని వాక్యాలు నావి
            ఎదురుగా చెక్క కుర్చీపై
తెగనరికిన చెట్టు నీడనై కూర్చుని

చెబుతున్నాను అవే-కర్మ కర్త క్రియ- మళ్ళా
మళ్ళా అవే పన్నెండు పునరుక్త కాలాలలో-
నాలికకీ చెవులకీ సంబంధం  లేని లోకాలలో
         
            కన్నీళ్లు అంటని వాక్య నిర్మాణాలలో
నెత్తురు తాకని పద బంధాలలో
ఇరుకిరుకు వ్యాకరణ చట్రాలలో

యంత్ర పునరుక్తిగా రూపుదిద్దుకునే
పరమ రూపంలోకి, మాతృ పదాన్నీ
వాక్య ఋణం లేని నన్నూ వాళ్ళనీ

పంపించుకుంటూ
అనుకుంటాను కదా
ఇక ఇలాగా:

                           దేవుడు మరణించెను. కానీ
                           ఇంకనూ వ్యాకరణము బ్రతికి
                           యుండెను. ఆమెన్.  

కాదు

సంధ్య వేళ ఓ వాన చినుకు ఆకులలోంచి జారడమూ
అది నేలను తాకి మట్టిలోకి ఇంకే శబ్ధాన్ని వినడమూ
ఎదురుగా నిన్ను తాకి చూడటమూ
                   ఇవన్నీ కూడా ఒక్కటే- ఇక

రేపు మొలకెత్తే విత్తనంలోని
అశాంతిగా కదిలే
చిగురాకులనూ పూలనూ
ఆపడం ఇక నీ వల్లా కాదు
           ఇక నా వల్లా కాదు.

27 August 2012

ఎలా చెప్పడం ఇక దీనిని

ఇక కొత్తగా దొంగలూ దళారులూ ఎవరూ రారు దోచుకునేందుకు
      నీ గూటిలోకి ఒక నక్షత్ర ప్రసారం, అనుదిన అనుమాన దిన దిన
       సర్పచూపుల నాటక పాత్రలై వొచ్చాక-

నువ్వొక నయన వాచకివి
అతనొక ఆస్థి అస్థికల పద
     రాజకీయ రహస్య త్రంత్రి. ఇక అందుకే రాలతాయి
     కొమ్మలపై వాలాల్సిన పిట్టలు విద్యుత్ తీగలపై వానలో -
ఇక పెట్టుబడులుగా నువ్వు బాంకు ఖాతాలలో పొదిగిన
నీ బ్రాండెడ్ కార్పోరేట్ పిల్లలు ఉంటేనేం ఇక్కడ
వాళ్లకు విదేశమే వినోదమై మాతృదేశమై తరతరాలుగా
    తరలిపోయే పిత్రు సంహారులైతేనేం అక్కడ?

ఇక కొత్తగా దొంగలూ దళారులూ ఎవరూ రానక్కరలేదు నిజంగా
నిన్ను నీ శరీరంలోంచి దోచుకునేందుకు- చాలిక నీకు
ఒక ముఖపుస్తకం ఒక అంతర్జాల మాయా కామ నగ్న చిత్ర పటం.
చూడు. నీ హృదయ స్థావరంలో ఒక సాయంత్రం, యంత్రమై

చితాభస్మపు కాలుష్య మంత్రమై
పరమపద సోపానంతో ఎలా
నీ సహచరి ముఖంలో ఒక
మహా లయ అమావాస్యయై ఉదయించిందో ఒక ఆకస్మిక వృద్ధాప్యంతో!

పరదాలు

ఎర్రటి మట్టి మాలలలోంచి
ఎగురుతోంది గాలి, రాణులు
స్నానమాడిన కొలను వద్ద

తెల్లటి బాతులు నడిచిన
ఆ దారులలోనే ఉన్నాయి
ఇప్పటికీ పచ్చని ఆకులు

రాత్రి బావిలో తొణికిసలాడే
నిండు చంద్రుడు, వానలో
తడిచి వణికిన తల్పం ఇదే

తడి పాదాలతో నీకు పైగా
నడిచి వెళ్ళిన రాణీవాసపు
రహస్య స్త్రీలు రారిక నీవైపు

పరదాలు దాచుంచిన
ఆ మందిరాలలోంచి
స్మృతి చరిత్రలలోంచి.

25 August 2012

రాత్రిదీపం

రాత్రి రాతి పుష్పాన్ని
తల దగ్గర దీపంలా వెలిగించుకుని
పడుకున్నాను నిస్తేజమైన కళ్ళతో
ఇలా

కిటికీ ఆవలగా చీకటి రెక్కల
శీతల సవ్వడిని వింటూ ఒక
మృత్యు భ్రాంతితో:

ఈ చీకటికి అవతలివైపు
వానలు రాలే వేళల్లో ఏం
చేస్తున్నావు నువ్వు?

22 August 2012

ఎలా?

అన్నంలో నెయ్యి కలిపి మెత్తగా
ఆకాశంలోని జాబిలిని చూపిస్తూ
గోరుముద్దలు పెట్టేది అమ్మ, చీకట్లో వీచే అరటి తోటలై
ఆవరణలో విరిసే వేపచెట్ల వెన్నెలై
ముఖాన్ని రెపరెపమంటూ తాకే తన నుదిటి కురులై-

జాబిలీ అక్కడే ఉంది కానీ చూపించిన
తన చేతివేలు నా చేతిలో కలం అయ్యి
యిక్కడే ఉంది కానీ అమ్మే లేదు యిక

తన చుక్కల చీరనే పాదాల నుండి
శిరస్సుదాకా నిండుగా కప్పుకుని ఓ
రాత్రి మా కంచం ముందు తొలికిన
పాత్రై అన్నం మెతుకులై మంచి నీళ్లై వెళ్ళిపోయిన నా మీ అమ్మ- భాయీ

ఎలా దిగమింగుకోను ప్రతి రాత్రీ
ఈ అనాధ అన్నంముద్దనూ
గోధుమ రొట్టేలనూ, తను లేని
ఈ ఏకాకి చీకటి గదుల నర హంతక కర్కశ నీడలనూ?

పర్లేదు

దయగానే ఉండు, పర్లేదు
విసిరిన రాళ్ళని పూలుగానే అందుకో
నెత్తురు హారాలుగానే అలంకరించుకో
దయగానే ఉండు, పర్లేదు

రాత్రైతే నిన్ను నువ్వు దాచుకోడానికి
నీలో నువ్వు ఒక నీటి నిశి పందిరిని
అల్లుకో: అది కన్నీళ్ళసమాధి అయినా
సరే, గాయాల లోగిళ్ళు అయినా సరే -

పర్లేదు
దయగానే ఉండు లోకంతో జనంతో:
గుర్తుంచుకో- దీపం చుట్టూతానే
నువ్వు చూడలేనంత చీకటి ఆగి
దాగి ఉంటుంది. ఆరిపోయి కూడా

మిగిలిపోయి నలుమూలలా సాగే
ఆ దీపపు ధూపం నీవే! సమయం
ఆసన్నమయ్యింది, యిక మూయి

నీ నీలి పద నీలాల కనులను-