31 January 2012

ఇక ఏమీ చేయలేను

ఆకస్మికంగా ఆ పూవు మిరుమిట్లు గొలుపుతూ విచ్చుకుంది

పైన ఎగిరే పిట్టల రెక్కల్లో మేఘావృతం, కింద ఆకుల ఆవరణలో నీడల వలయం
ఎగిరే పిల్లల పాదాల కింద పగులుతున్న గాలి బలపం
కొద్దిగా నన్ను తాకుతున్న నీ నవ్వు పరిమళం

చిన్న జల్లు మొదలయ్యింది: ఇంకేం చేయగలను
నా విధికి నన్ను నేను సమర్పించుకుని
మిరుమిట్లు గొలుపుతూ విచ్చుకున్న, నిండు వానగా మారిన

నీ ముఖంలో, సాయంత్రంలో, ఆనక రాత్రిలో
నిండుగా తడిచి తడిచి, నిండుగా మునిగి మునిగి చివరకు నివ్వెరపోయి స్థాణువయ్యి

ఇక ఈ రోజుకు ఇదే మరణం, ఇదే జననం. ఇక ఇదే
సర్వజన్మ పాపపుణ్యాల పరమ పవిత్ర మోక్షం-

(ఇక ఏమీ చేయలేను, ఇక ఏమీ కాలేను. ఇంతకూ

నీ వదనం ముందు మోకరిల్లి శరణు కోరానా
మోహగ్రస్తుడనయ్యానా, శాపగ్రస్తుడనయ్యానా

జీవించి ఉన్నానా మరణించి ఉన్నానా

లేక జనన మరణాల మధ్య ఆ నిశ్శబ్దంలో
ఆ రంగుల కాంతిలో సంచరిస్తున్నానా -?)

30 January 2012

యిద్దరు స్నేహితులు

ఆ నీలి నీళ్ళల్లో నిలబడ్డారు ఆ యిద్దరు స్నేహితులు

రాత్రికి ఇటువైపుగా ఒకరు, రాత్రికి అటువైపుగా మరొకరు
కళ్ళల్లో ధూళితో, దూరంతో ఇక తిరిగి ఎన్నటికీ తాకలేని
విడిపోయ్యే అరచేతులయ్యిన ఆ యిద్దరు-

ఇవ్వడానికీ ఏమీలేవు ఇద్దరికీ, ఇటువైపుగా కానీ అటువైపుగా కానీ:
అందుకే ఇద్దరి మధ్యలో పూసిన నిశ్శబ్ధం పూవులోంచి
చెరో రెమ్మను తెంపుకుని ఇరువురిగా వెళ్ళిపోయారు ఇరువురు అందరిలోకీ-

ఇక ఆ రాత్రంతా రెండు రెమ్మలని కోల్పోయిన ఆ రోజా పూవు ఒక్కటే
వానలో గాలిలో విలవిలలాడిపోయింది రాత్రిలో రాత్రిగా మిగిలిపోయింది రాలిపోయింది

ఇంతకూ ఇరువురినీ ఇరువురిగా మార్చిన తను ఎక్కడ? తన తనువు ఎక్కడ?

29 January 2012

ఎందుకు 3

ఇలాగే తెల్లవారింది ఆనాడు కూడా- నువ్వు లేవక మునుపే, అందుకే

తోటలోంచి కొన్ని కనకాంబరం పూలనూ, దవనంనీ తెచ్చాను
పూలపాత్రలో నీళ్ళు మార్చాను

పాలు తెచ్చి నీకై తేనీరు తయారుచేసాను, ఆపై ఒక్కడినే నీ పక్కగా కూర్చుని
నిదురించే నీ ముఖంలో కదిలే లిల్లీపూల వనాలను చూసాను
ఊయలలూగే నీ ఊపిరిలో, నీ ఛాతిలో ఇరుక్కుని ఆ నీళ్ళలో ఆకై తేలిపోయాను
నుదిటిపై దొర్లే శిరోజాల మాయలో బందీని అయ్యాను
తాకాలని అనిపించే తాకలేక, నిన్ను లేపాలనిపించి లేపలేక ఆ ఇంటి నిశ్శబ్దంలో
నేనూ ఎగురలేని పావురాళ్ళూ ఆయమయంగా తిరిగాము
నీ చుట్టూతే బెదురు బెదురు బ్లులక్ బ్లుక్ శబ్దాలు చేసుకుంటూ-

ఇక ఆ తరువాత ఏ ఇంటిలోనైనా, ఏ కంటిలోనైనా చూసానా
మరువం దవనం కూడి ఏ అరచేతులలోనైనా విరిసిన కనకాంబరం పూలనీ?
తోటలో ఎగిరే పిచ్చుకలని? అటువంటి దినాలనీ?

ఇలాగే తెల్లవారింది ఆనాడు కూడా, నువ్వు లేని ఈనాడు కూడా- కాకపోతే
హృదయంలో ఒక శ్మశానం, సమాధిగా మారిన తోటలో
ఎవరూ పలుకరించని అతడి శరీరం, లోనంతా శిలగా మారిన ఎవరిదో మౌనం

తగలబడుతుంది, రాలిపోతోంది ఎక్కడో ఏదో నింపాదిగా, నిర్దయగా: సరే సరే

వెళ్ళిపోయావు. వెళ్ళేపోయావు. ఎందుకు అని అడగను కానీ, ఎందుకు?

28 January 2012

ఎందుకు 2

ఈ వీచే గాలి నీ నామాన్ని స్మరిస్తుంది

రాలే పూలు ఇక నయనాలలోకి దిగే
ఆకుపచ్చ ముళ్ళు: ఇక ఈ తోటలోకి నీళ్ళు చల్లే వాళ్ళెవ్వరూ రారు

ఆ గువ్వొక్కటే కూస్తుంది
ఆకులని కోసే వేసవిని, వేసవిని కోసే రాత్రినీ-

సరే సరే: ఇంతకూ నువ్వెందుకు వెళ్ళిపోయావు?

ఎందుకు 1

అరచేతుల మధ్య ప్రమిదె కాంతిని కాపాడుకున్నట్టు
నేను నీ ముఖాన్ని చూసుకున్నాను

ఎందుకు వెళ్లిపోయావు నువ్వు నా వదనాన్ని వొదిలి?

27 January 2012

కవిత గురించి ఒక అ/కవిత

కవిత ఎలా రాయాలో చెప్పు అని
ఆ నూనుగు మీసాల యువకుడు రాత్రంతా రాత్రిని అడిగాడు

నీటిలోని ముఖాన్ని
అరచేతుల్లోకి తోడుకుని, అద్దంలోకి విసిరివేసావా ఎన్నడైనా
ముఖంలోని అద్దాన్ని
అదిరే పెదవులతో అందుకుని, పరికించావా ఎన్నడైనా? నేను అన్నాను.

ప్రతీకలు ఎలా, పదాలు ఎలా
పోలికలని పోలికలతో పోల్చడం ఎలా? అని నెత్తురు నిప్పులు ఎగిసే శరీరంతో

అమాయకంగా మళ్ళా ఆ కుర్రవాడే అడిగాడు
తన ఎదురుగా కూర్చున్న ప్రేయసిని మాటలతో మాత్రమే తాకే ఆ కుర్రవాడు

మధుపాత్ర ముందు మాటలు వొద్దు
తలలో తురిమే పూలను, పోట్లాలలోనే దాచేయవద్దు: చెప్పాలనుకున్నదేదో చెప్పు
అడగాలనుకున్నదేదో అడుగు: కోరుకోవటం పాపమేదీ కాదు ఇక్కడ
పరమ పవిత్రమైన పుణ్యమేదీ లేదిక్కడ. చూసావా నువ్వు, విన్నావా నువ్వు
తను వొదిలిన నిట్టూర్పు నీ చుట్టూతా ఎగిరే చప్పుడు? అడిగాను నేను, అడగక-

కవిత ఎలా రాయాలో చెప్పు, కవిత ఎలా రాయకూడదో చెప్పు
అని పాపం పిల్లవాడు, అరచేతుల్లో ముఖాన్ని దాచుకునే ఆ

నూనుగు మీసాల కుర్రవాడు రాత్రంతా ఆ రాత్రినే అడిగాడు, తన ముందు
తన ముందే కూర్చున్న ఆ నీలి కళ్ళ యువతిని వొదిలి:

ఏడవటం వచ్చా నీకు? కన్నీళ్ళని వడగట్టడం వచ్చా నీకు? నీలోని ఇంకొకరిని
కలుసుకోవడం వచ్చా నీకు? ఆ ఇంకొకరిలోని నిన్ను పసిగట్టడం వచ్చా నీకు?
నీకు నువ్వు చచ్చిపోవడం తెలుసా నీకు? తిరిగి ఇద్దరై ముగ్గురై నలుగురిలోకి
జన్మించి అందరినుంచీ బహిష్కరింపబడటం తెలుసా నీకు?

ఇవేమీ అడగలేదు నేను అతడిని, అతడి రాత్రిని, రాత్రిగా మారిన తననీ, ఆ తనువునీ-

అడగలేక, చెప్పలేక ఇక నేను కాంతిని వీడి, రాత్రిని తాగి
నా దుస్తులని నేను మూటకట్టుకుని అక్కడే
ఆ శిధిలాలలోకే మళ్ళా వెళ్ళిపోయాను ఎప్పటిలానే ఇలా గొణుక్కుంటూ:

ఎవరు చెప్తారు నీకు, నువ్వే ఒక కవితవని, తనే ఒక కవిత అని
ఇంతకు మించి ఇక్కడ మరేమీ లేదని, మరేమీ దొరకదనీ?-

డైరీ

ఆకులని విడిచి ఇంకా రాత్రి వెళ్ళిపోలేదు
రివ్వున తిరిగే గాలిని వెన్నెల ఇంకా వొదలలేదు: అరచేతుల్లో తన ముఖం ఇంకా ఆరలేదు

ఒక చలి మంటను వేసుకున్నాను ఇక్కడ రాత్రంతా
నా వాళ్ళ శరీరాలతో, వాళ్ళ పదాలతో వాళ్ళే అయిన మాటలతో-

మాట్లాడుకున్నవి పెద్దగా ఏమీ లేవు, అన్నీ అసంగతులే

తెచ్చుకోవాల్సిన సరుకులు, నెలకయ్యే ఖర్చులూ
భరించిన అవమానాలూ, భరించాల్సిన చికాకులూ ఎంతకూ తీరని అప్పులూ
కొన్ని భయాలూ కొన్ని భాధాలూ
కొన్ని ప్రేమలూ కొన్ని ద్వేషాలూ, అన్నీ ఇటువంటి మామూలు మాటలే
ఇటువంటి మామూలు మనిషిగానే

సదా వెన్నంటి ఉండే తనతోనే తన శరీరంతోనే చెప్పుకున్నాను మౌనంగా
చెమ్మగిల్లి వొణుకుతున్న కన్నుల్లాగా, నన్ను చుట్టుకున్న చేతులలాగా-

నిదురలో తటాలున ఉలిక్కిపడతారు పిల్లలు
ఎక్కడో చీకట్లో విలవిలా రెక్కలు కొట్టుకుంటాయి పావురాళ్ళు
చరుస్తోంది కిటికీ అద్దాలని ఒక సన్నటి జల్లు: ఉండీ ఉండీ తెగుతాయి కలలో కీచురాళ్ళు

ఇక ఇదే సమయం. వెలుతురికి మంచుదీపం వొలికే వేళ్ళల్లో
నెమ్మదిగా చందమామ మాయం అయ్యి, ఇరువురిలో ఇరువురు మాయం అయ్యి
ఒక్కరిగా మిగిలే తొలి కాంతి వీచే సమయం, అంతా ఒక రహస్య కాలం-

సరే సరే. ఇవన్నీ నీకు చెప్పుకునేంత పెద్ద విషయాలేమీ కావు. కాకపోతే

యుగాల తరువాత నేను నిదుర నీడలో సొమ్మిసిల్లాను: మరి నువ్వో?