30 July 2011

నీడలు

నాకేమీ తెలీదు

నీడల నాలికలపై
ముద్రిత పదాన్ని

నువ్వొక పలకతో
నువ్వొక కలతతో
కలలతో

ఇటు వస్తే చూసిపో
ఒకసారి, ఒక్కసారి
ఒకేసారి

దారిపై రాలిన పూలను
పూలపై రాలిన
వానను

వానలో దాగిన మోమునూ
ఏరుకుని అల్లుకునే
తోటమాలిని:

ఎందుకంటే అతడు
తన నీడనూ నిన్నూ

శరణుజొచ్చే
సప్తరంగుల కాలం
ఆసన్నమయ్యింది.

29 July 2011

నిష్క్రమణ

చిట్లుతాయ్ నీ కళ్ళల్లో
నీటి బుడగలు

చెంపపై ముద్రితమైన
అరచేతి ఎరుపుకీ, అతడికీ
కన్నీళ్లు లేవు
కళ్ళూ లేవు


దీపం లేదు దేహంలో
కరుణ లేదు మదిలో

అతడిలో అతడి రాకలో
ప్రతిపాదనలలో:

జరుగు: నక్షత్రమండల
నృత్యాలు కావాలి నీకు:

ఇక్కడ నుంచి, అతడి
అక్కడినుంచి అతడి
అతడి నుంచి

నిష్క్రమించాల్సిన
సమయమిదే=



మరణే మరణం

దినము దిగులు
చుట్టుకున్నాయి సరీసృపాల్లా
రెండు కళ్ళను:

నువ్వు వచ్చే వార్తావిషం
విలాపం మింగాను ఇప్పుడే

వదన వ్యసనంలో వాదనకు
వివాదం లేదు

నీ వాక్కు ఒక్కటే
గూడు అల్లుకుంటుంది ఇక్కడ
దేశప్రేమతో దేహద్వేషంతో:

సరే: స్పర్శించాను నిన్ను
సరే: ముద్దాడాను నిన్ను
సరే: రమించాను నిన్ను
సరే: పదాలలో, దాహలలో
ప్రతిష్టించాను నిన్ను

ఇదంతా నా ఒక్కడి పాపమేనా?
ఇదంతా నా ఒక్కడి ప్రేమేనా?

సరే: నిన్ను వొదిలివేసాను నేనే
సరే: నిన్ను గాయపర్చాను నేనే
సరే: నిన్ను పాషాణహృదితను
పరాన్న అంకితను చేసాను నేనే
సరే: నా హృదయాన్ని తీరికగా
నములుతూ నీకు వీడ్కోలు
పలికాను నేనే: సరే

ఇదంతా నా ఒక్కడి
లలాట లిఖితమేనా?
ఇదంతా నా ఒక్కడి
మోహశాపమేనా?

విషంతో విచిత్రంగా మారినవాడికి
ఇష్టంతో స్వహింసను స్వీకరించి
అక్షరాలతో కాలాన్ని అమావాస్య
పౌర్ణమిలతో నింపేవాడికి

ఇప్పుడా మళ్ళా నీ ఆగమన
సమాచారం?
ఇప్పుడా మళ్ళా నిన్ను తలచే
మరణ విహారం?

ఇక ఏ చీకటి వనాలలోకి
పారిపోవాలి అతడు
నువ్ ఉన్నన్నాళ్ళూ?
ఇక ఏ మంచుగాలులలోకి
వెడలిపోవాలి అతడు
నువ్ నీ కన్నీళ్ళతో అతడిని
తడిపినన్నాళ్ళూ?

నువ్ చెప్పలేవు. నేను నీ
రహస్యాన్ని విప్పలేను
నీ పునరాగమనాన్ని
తట్టుకోలేను

వదన వ్యసనంలో వాదనకు
ఆస్కారం లేదు

అంతిమ పరిష్కారం లేదు:

నీ పదం ఒక్కటే, నీ వార్తావిషం
ఒక్కటే నిండింది ఇక్కడ:

ఇక దినానికీ దిగులికీ
నీ దయలేని బహురూపమే

శోకం శ్లోకం శరణం
నిమిషనిమిష
మరణే మరణందాసోహం

28 July 2011

నువ్ లేక

గదంతా నువ్వు లేని గాలి
నిన్ను తాకిన సూర్యరశ్మి
లేదు ఇక్కడ, ఎక్కడా

పెదాలు లేని వస్తువులు
రంగులు లేని బొమ్మలూ
ఇంటినిండా=

గోడలని తాకి చూపులు
తిరిగి ప్రతిఫలిస్తున్నాయ్
అద్దాలు చిట్లిన
పదాలు లేని
నేత్రాలనే

ఇక్కడే ఎక్కడో నువ్ ఉండాలి
మౌనంగానో, కోపంగానో
నిశ్చలంగానో, నిర్విరామంగా
కదులుతూనో

ఎప్పుడైనా ఎక్కడైనా
నువ్ ఉండాలి:

గదంతా నువ్ లేని గాలిలో
ఊపిరాడక కిటికీ అంచున

ఓ సీతాకోకచిలుక రాలిపడింది
ఇప్పుడే. రా త్వరగా. నువ్ లేక

నువ్వు లేని మరో
మృత్యువు లేదు=

25 July 2011

ఇదే/ఇదే

తేనెటీగల గూటిలో
ఇరుక్కున్నాను

చిక్కటి చీకటి రాలే
అందం ఇది

నయన ద్రోహం
పెదాల దాహం

సరిపోవు పదాలు
ఈ ముద్రిత
గదులకి

నాభిలో అణిగిపోయిన
అణుగారిపోయిన భాష
నాదీ నీదీ

భోరున, భళ్ళుమని
ఫేటీల్మని ఎడ్చారా
ఎవరైనా ఇక్కడ?

పాపాల ప్రదేశం ఇది
నవ్వడం నేరమే
ఏడవడం నేరమే

మొసళ్ళు తిరిగే
సరస్సులో
స్నేహితులను
నమ్ముకున్న

ఆదిమ వానరాలు
నువ్వూ నేను

హృదయ భక్షిత
రాక్షస లోకంలో

ఒకరినొకరు
అరచేతులలో
పుచ్చుకుని

తిరిగే ఆత్మసంచారులం
నువ్వూ నేనూ

రా ఇకనైనా. రాత్రి వానలో
రాతి వనంలో
వాన చీకటిలో

చెమ్మగిల్లిన నయనం
నీకోసం దీపమై
వెలుగుతోంది

చిరునవ్వుతో మనం
కలుసుకోవాల్సిన

సమయం, వలయం
ఇదే. ఇదే.

24 July 2011

కావాలా/ నువ్వు

కావాలా నువ్వు
పిల్లలకీ స్త్రీలకీ?

నీ లోకం లేదిక
నీ లోకం నీ కాలం

లేదే లేదిక, రాదిక

గోడపై పిల్లలు గీసిన
రంగుల వంకర గీతల్లో
వాళ్ళు రాయని

పదం నువ్వు. ప్రేమించలేవ్
పిల్లలని. కామించలేవ్

కనీసం స్త్రీలని: కలలో
మెరిసే
వీధులలో, వీధులలో ఎదురుపడే
శిధిల ముఖాలలో, కళ్ళల్లో

తిరిగే మృతులకి కావాలి
నువ్వు, నీ నిశ్శబ్దాలు
:

అన్నీ ఉండి ఏమీ
లేదిక్కడ:
వెదుకుతూ నిన్ను
వెంటాడే పిలుపులో
దాగిన స్మితవదనం
ఎవరిదో చెప్పు?

23 July 2011

ఒక/స్థితి

నువ్వొక క్షతగాత్రుడివి, నలుగురినీ
చీల్చి పరిహసించే వాడివి

కావాలి వాళ్లకి, పూలు అల్లే పదాలు
పదాలు అల్లే మెత్తని పెదాలు

నాలిక ఊసరవెల్లని, వాళ్ళ పెదాలు
దాటని కీలుబొమ్మని ఎన్నడూ

వాళ్లకు చెప్పలేదు. నువ్వేమైనా
చెప్పావా వాళ్లకి

మది వేరని, నిశ్శబ్దం వేరని?
నవ్వు వేరని, నవ్వుతూ

దిగమింగుకున్న దుక్కం వేరని?
నువ్వు వేరని, నువ్వు

కాగితశిల్పివి కావని?
శిలాశాసనకర్తవి కావని?

ఎవరో మెడపై వేళ్ళ చివర్లతో
నిమిరితే ఒళ్ళు జలదరించి

నిశిరాత్రుళ్ళ వెంట తిరుగుతూ
ఆకుల చివర్లనుంచి రాలే

అక్షరాలని ఏరుకునే భిక్షువని?
నిరంతర పదనిశ్శబ్ధ
శాపగ్రస్థుడవని?

ఏమీ అనకు వాళ్ళని. పదాలు
పూలుగా కోరేవాళ్ళని
పూలరేకుల వెనుక దాగిన
చీకటి నీడలు చూడలేనివాళ్ళని
అద్రుష్టవంతులని

వెన్నెలశాలలలో విహరించే
నిర్ముఖ యాత్రికులని
మౌనమోహాలు లేని శబ్ధ
ఆడంబరులని=

ఇనుప దంతాలతో వాళ్ళు
నిన్ను నమిలివేయక మునుపే

లేచి వెళ్ళరా ఈ కంకాళాల
కరాళ జీవాల మధ్య నుంచి
మృత్యుకాంతి తెలియని
అంధ బంధువుల నుంచి
ఎముక హస్తాల ఎడారి
చూపులలోంచీ:

నీ మధుశాల దివ్యకాంతితో
ఎదురుచూస్తోంది నీకోసం

నీకిక ఈ లోకంతో ఏం పని?