30 January 2011

ఏమౌతుందో ఈ పూట

ఏమౌతుందో ఇక ఈ పూట
మిత్రుల వద్దకు వెళ్ళాలి=

తొలి వేసవి గాలికి
నేల రాలుతున్నాయి పూలు
ఆకులతో, పిల్లల కనులలో=

అరచేతుల మధ్య
పొదివి పుచ్చుకున్న పూలు
నువ్వు నీ హృదయంలో
దాచుకుని
పెంచుకున్న పూవులు
నీ మిత్రులు

రాలిపోతున్నారు
వేదనతో,పిగిలిపోతున్నారు
ఈ లోకపు వాదనలతో=

తొలి వేసవి గాలిలో వాళ్ళు
ఆహ్వానిస్తున్నారు నిన్ను
ఒక పూలతోటలోకి

మధుపాత్రలతో
మరవలేని పాత్రలతో
దిగులుతో

ప్రేమతో
సంతోషంతో
ద్వేషంతో

ఒక మంచుపూల తోటలోకి
సమ్మోహితుడిని
చేస్తున్నారు నిన్ను=

వెళ్ళాలి
ఆలస్యం చేయకుండా
వెళ్ళాలి
తనువంతా గాయమైనా
వెళ్ళే తీరాలి
మళ్ళా తిరిగి రాకున్నా

ఏమౌతుందో ఇక ఈ పూట
ఏమౌతుందో ఇక ఈ వేట=

28 January 2011

మన ముఖాలు**

ఈ రోజు నీ ముఖం నా ముఖంలా అలసటగా ఉంది=

వొదిలివేయబడి, పాడుబడిన ఇంటిలో
ఎవరూ కోయక రాలిపడిన వంటరి మల్లెపూలు
రాబోయే వర్షం తెచ్చిన
గాలిలో, ధూళిలో విలవిలలాడుతున్నాయి
మల్లెపందిరి కింద
కొట్టుకులాడుతున్న మన ముఖాల్ని
దుమ్ము దులిపి ఎవరు తమ కురులలో ధరిస్తారు?
కనులు మూసుకుని
ఎవరు మనల్ని పూర్తిగా శ్వాసిస్తారు?

ఈ రాత్రి*

ఈ రాత్రి
ఆమె దేహం అలసిపోయింది
నిన్నటి లాంటి ఈ రాత్రి
ఈ రాత్రి లాంటి మొన్నటి రాత్రి=

మూడు రోజులుగా
ఆమె దేహం అలసిపోయి
వెళ్ళు వెలుపలికి వచ్చి
వొరిగిపోయిన చెట్టులా
ఆమె మంచంపైకి వాలిపోయింది

జ్వరం. దుఃఖపూరితమైన
సాలేపురుగేదో గూడు కట్టుకుంటున్నట్టు
మోకాళ్ళ మధ్య నొప్పి.
"మోకాళ్ళ మధ్యనుంచి నలువైపులా
నరాలు వీడిపోతున్నట్టు
భరించలేని నొప్పిరా నాన్నా." నా తల్లి
నొప్పిని ఉగ్గపట్టుకుంటుంది.

ఆమె పక్కగా కూర్చున్నాను
ఎడారిలో, వేసవిలో నగ్నంగా నుంచున్నట్టు=
శరీరం: ఆమె శరీరం
నీటిలా ఆవిరైపోతుందా?

ఆమె నిశ్శబ్దంగా పడుకుంది. నిశ్శబ్దం
మహా శబ్దమైన మృదువైన భాష.
ఆమె పలుమార్లు సంబాషించింది, నాతోటి
అటువంటి మహా నిశ్శబ్ద భాషలో
ఇప్పటిలాంటి మునుపటి రోజులలో=

ఆమె నుదిటిపై అద్రుశ్య0గా కదులాడుతున్న
ఒక పొద్దుతిరుగుడు పూవు
ఆమే ఒక పూవు. సూర్యరశ్మి వర్షంలా
కురుస్తున్న దృశ్యం కూడా ఆమె.
ఆమె ఒక యోధురాలు=

రాత్రిలో బయటనుంచి ఒక పిల్లి అరుస్తోంది
ఆమె కోసం
గది బయట అది అసహనంగా తిరుగుతున్న
పదాల సవ్వడి.
నా హృదయంలో కూడా అసహనంగా
ఒక పిల్లి కదులుతుంది

ఆమె కోసం, ఆమె కోలుకుని ఇచ్చే పాల కోసం
పాలలాంటి ప్రేమపూరితమైన జీవితం కోసం=

నీ గురించి*

నీకొక
ప్రేమ కవిత రాయాలనుకున్నాను
నీలాంటి ప్రేమ కవిత: నీ దేహం
నువ్వూ అయిన
ఉల్కాపాతంలాంటి దాన్నేదో
అక్షరాలలో చూద్దామనుకున్నాను.

చుట్టూ దుస్తుల్లా అల్లుకునే కీచురాళ్ళు
తొంగిచూసే గాలీ
అక్కడక్కడా చినుకుల్లాంటి నక్షత్రాలు.

మరెక్కడో ఇవన్నీ=

నీ గురించి మాట్లాడటమంటే
దూరం గురించి మాట్లాడటమని
అతడు చెప్పాడు
నీ గురించి మాట్లాడటమంటే
నక్షత్రాల గురించీ
విశ్వమండలాల గురించీ ఊహించడమేనని
అతడు చెప్పాడు

రాత్రిపూట దారి తెలిసీ తెలియక
తచ్చట్లాడే సీతాకోకచిలుక
మెత్తగా గడ్డిలోంచి జారిపోయే పాము
కదలకుండా, శాపగ్రస్తమైన
శిలాజాల శిల్పంలా మారిన
ఒక రాక్షసా దేవతారూపం నేను=

నిజానికి నేను నీకు
ఒక ప్రేమకవిత రాయాలనుకున్నాను
నువ్వు నగ్నంగా పరుచుకున్న
రాత్రుళ్ళ గురించీ
నీ రక్తపు చెలమలో ఇంకించుకున్న
నాలాంటి దేహం గురించీ
ఒక ప్రేమ కవిత రాయాలనుకున్నాను=

నన్ను నేను గమనించుకుని, వెనుదిరిగిన
సమయంలో, నా ఎదురుగా మిగిలిన

ఒక రక్తపు పలక, రెక్కలు తెగిన సీతాకోక
బలపం, పురాతనమైన
హింసాత్మక కట్టడంలా మారిన గురుతులు=

నిజానికి నేను నీకు
ఒక ప్రేమకవిత రాయాలనుకున్నాను

తలుపులు*

నిన్నటిదాకా ఈ మొక్క ఇక్కడ లేదు

తలుపుచాటు నుంచి తొంగి చూసే పాపలా
ఈ పూట అది, కిటికీ పక్కనుంచి నా వైపు తొంగిచూస్తుంది.
కానీ, ఆ పాప చూపు ఎటువంటిది అయి ఉండవచ్చు?

ఎటువంటిదైనా అయి ఉండవచ్చు.
నువ్వు ఏం చేస్తున్నవనే కుతూహలంతో చూస్తుండవచ్చు
లేదా, నువ్వు విసిరికోట్టిన తరువాత
దిగులుతో బాధతో చూపులతో బదులిస్తుండవచ్చు.
లేదా, తలుపుల మధ్య చేతి వేళ్ళు నలిగి
కనుల రెక్కలు కన్నీళ్ళతో తెగి, ఏడుపు గొంతులో ఇరుక్కుపోయి
సహాయానికి నీవైపు నిస్సహాయంగా
చూపుల చేతులు చాచి ఉండవచ్చు. అవును

ఈ రోజులు సగం మూసినా తలుపులు.
నిన్నటి దాకా ఉండినదేదో ఈ రోజు మాయం అవుతుంది
ఈ రోజు ఉండినదేదో రేపటికోసం
ప్రాణంకోసం విలవిలలాడుతున్న ఈగ చిక్కుకున్న
సాలెగూడులా జిగటగా సాగుతుంది

కనుమరుగవుతున్న ఊపిరిని వెలిగించేందుకు
ఆమె తలుపుల మధ్యకు తన చేతి వేళ్ళను చాచింది.

ఒక శబ్దం. ఒక పదం. విసురుగా మూయబడిన
తలుపుల మధ్య చితికిన చేతి వెల్లూ, చూపులూ. అవును

నిన్నటి దాక ఈ రక్తపు మొక్క ఇక్కడ లేదు.

వర్షం*

వర్షం ఎప్పుడు కురుస్తుందో మీకేమైనా తెలుసా?

నల్లటి మబ్బులు కమ్ముకున్న మధ్యాహ్న సమయంలో
వర్షంలో తిరుగాడే వొంటరి డేగకి తెలియదు
తలపై పుస్తకాలు ఉంచుకుని చెట్ల కిందుగా హడావిడిగా వచ్చే
ఆ అమ్మాయికీ తెలియదు

ఆమె నల్లగులాబి. లేదా ఆమె, కదులాడే మాట్లాడే పోట్లాడే
నల్లగులాబీ పూవుల పొద. క్లుప్తంగా
ఆమె మెలికలు తిరుగుతూ ప్రవహించే నల్లగులాబీల నది.
ఆమె ఒక తుంపర.

"జీవితంలో స్పష్టంగా ఉండాలి. నాకేది కావాలో నేను కూడా
నిర్ణయించుకోవాలి కదా: నేను
జీవితంలో స్పష్టంగా ఉండేదుకు ప్రయత్నిస్తాను, ఇతరులకు
అస్పష్టంగా ఉన్నా సరే- అది సరే
నువ్వెందుకు ఎప్పుడూ నైరాస్యంగా కనిపిస్తావు?"

నేను తిరిగి ప్రశ్నించాను: "వర్షం ఎప్పుడు కురుస్తుందో
నీకేమైనా తెలుసా?"

ఆమె తల ఊపింది. ఎటు వైపో జ్ఞాపకం లేదు.

ఆమె ఎదురుగా కూర్చున్నాను, వర్షానికి తడుస్తున్న రాయిలా
గడ్డిలా ఒక ఎండు మైదానంలా
ఆమె చుట్టూ ఎడారి గాలిలా తిరుగాడుతున్నాను. నెమ్మదిగా
దేహం నల్లటి భూమిలా విస్తరిస్తోంది
దప్పికతో ఆర్చుకుపోయి ఆమె ముందు పరుచుకుంటోంది
లోపల రక్తం పిడచ కట్టుకుపోతోంది.

ఆమె నడిచే వర్షం. అదే అంటాను ఆమెతో, మోహంతో: నువ్వు
గులాబీవి కాదు, గులాబీ రెమ్మల వర్షానివి.
ఆమె నవ్వుతుంది: “metaphors.” ఆమె నవ్వి వెళ్లిపోయింది.
అతడు అనువదించుకోలేకపోయాడు, ఆమె నవ్వునీ, వర్షాన్నీ.
పోనీ ఎవరైనా అనువదించగలరా వర్షాన్నీ? లేక ఒక చినుకునీ?
వర్షంలో తడిచే భూమీ చెప్పలేదు
భూమిపై ఊగే మొక్కలూ చెప్పలేదు, మొక్కలపై వొంగిన
చెట్లూ పలుకలేదు: ఏదీ అనువదించలేని వర్షం.

వర్షం ఎప్పుడు కురుస్తుందో మీకేమైనా తెలుసా?

నల్లటి మబ్బులు కమ్ముకున్న మధ్యాహ్న సమయంలో
వర్షంలో తిరుగాడే వొంటరి డేగకి తెలియదు
తలపై పుస్తకాలు వొంచుకుని చెట్ల కిందుగా హడావిడిగా వచ్చే
ఆమెను గమనించే నాకు కూడా తెలియదు.

ఈ జన్మకి

ముగ్గురు మిత్రులు
ముగ్గురు శతృవులు

మూడు రాత్రుళ్ళు
మూడు పగళ్ళు

మూడు మధుపాత్రలు
మూడు చందమామలు

మూడు జననాలు
మూడు మరణాలు

చాలు ఇక ఈ జన్మకి