30 June 2022

ఎత్తా … *

మరి ఎప్పుడూ, నీ వెనుకే ఒక పిల్లవాడు
అంబాడుతూ
తిరిగేవాడు; నోట్లో ఒక పీక
 
ఉంగరాల జుత్తూ, మెరిసిపోయే కనులూ
వెన్నెలవంటి
నురగలాంటి, అలల నవ్వూ –
 
“ఎత్తా, ఎత్తా” అని ఇక నీ వెంబడే, నువ్వు
పని నుంచి
వచ్చిన సాయంత్రాల్లో, తనని
 
ఎత్తుకోమనీ, చేతులు చాచి, తలుపులు
చూయించి,
ఎక్కడికో తనని తీసుకుపొమ్మనీ!
***
ఆ సాయంత్రాలు చల్లని గాలులై వీచేవి
అప్పుడు; ఆ
చిన్ని పిడికిళ్ళల్లో నెగళ్లు వెలిగేవి
 
అప్పుడు. నీ రెండు చెంపలనీ, తన
అరచేతుల్లో
పుచ్చుకుని, పళ్ళు సరిగా రాని
 
నోటితో నీ ముఖాన్ని ముద్దాడితే, నీ
కాలం అంతా
అమృతమయమైన ఉమ్ము!
 
నీ చుట్టూ విత్తులు మొలకెత్తే వాసన,
పాల సువాసన –
గాలికి వరికంకులు ఊగే శ్వాస –
 
పీక తీసి, మాటల్లేని ఏవేవో శబ్దాలతో
ఏదో వ్యక్తపరిస్తే,
ఆలయంలో గంటలు చిన్నగా
 
మ్రోగినట్లు, అది నువ్వు విన్న తొలి
దైవిక గీతం,
పరిమళపు ప్రార్ధన! ఆలాపన –
***
ఇప్పటికీ, నీలోపల నువ్వే అయిన
ఒక పిల్లవాడు,
నీలోలోపల దాగుని, నిను
 
తొంగి చూస్తో, ఆసక్తిగా నిను గమనిస్తో
పిలిచినా రాక,
వెళ్ళిపోతోన్నప్పుడు వెంబడిస్తో!
***
హృదయం లోపలా, వెలుపలా మరి
నిర్మానుష్యమై,
‘ఎత్తా’, అనే తోటి మనిషి లేక
 
రాత్రిలో, ఖాళీ వీధిలో, పాలిపోయిన
నీడవై నువ్వు
మిగిలిననాడు, విరిగిన ఒక
 
పెన్సిల్తో, అట్టలేని పుస్తకంలో ఏదో
తదేకంగా గీసే,
మధ్యలో తలెత్తి నిను చూసే
 
నీలోని, ఆ నిష్కల్మషపు పిల్లవాడే
లేకపోయి ఉంటే,
ఏమైయుందువు నువ్వీ పాటికి?!
_____________
ఎత్తా = ఎత్తుకో

16 May 2021

 నిన్ను నువ్వు స్వప్నిస్తూ

_________________________________

నిన్ను నువ్వు స్వప్నిస్తూ నన్ను కలగంటావు

మృత్యువుకై సాగిపోతూ
నా అరచేతుల మధ్య క్షణకాలం ఆగి విశ్రమించే 
నీ చేతికి శతాబ్దాల అలసట తెలుసు 

ఆ క్షణిక సమయంలోనే, 
నువ్వు కూడా స్వప్నిస్తావు: నీరెండలో, నీటిలో 
రెక్కలు విదిల్చే ఒక కాంతి పక్షిని -

నువ్వు కూడా ఒక బుజ్జి నెత్తురు పిట్ఠవి! 

రాత్రి తర్వాత రాత్రి 
ఒక ప్రమిదెకై తపిస్తూ, నిన్ను నువ్వు స్వప్నిస్తూ 
నన్ను కలగంటావు!

రహదారి

 రహదారి

____________

సాయంత్రం పూట, వర్షపు తూనీగలు నల్లటి మేఘాల రెక్కలతో 
కొమ్మలలోకి జోరబడుతున్నవేళ
ఆమె రహదారిని దాటేందుకు ప్రయత్నిస్తుంది. నుదిటిన 

గాలికి చిందరవందర అవుతున్న కురులతో, మూడేళ్ళ పాప కనులతో
విస్తృతంగా రాక్షసంగా కదులాడుతున్న 
వాహనాలను దాటి ఆవలివైపుకు చేరేందుకు ఆమె 
తడబడుతుంది -

సహచరుడు లేని దిగులు సాయంత్రం. అరచేతిలో మరో అరచేయి లేని,
గోరువెచ్చనిదనం లేని, దు:ఖాన్ని 
మునిపంటితో నొక్కి పెట్టిన సాయంత్రం. భుజాన బాగ్ తో

అలసిన దేహంతో, పని నుంచి నిస్సతువుగా ఇంటికి వెళ్ళాల్సిన 
సాయంత్రం. ఆమె రెండు అడుగులు 
ముందుకు వేసి, నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది ...

"ఇది అడవికన్నా చిక్కనైన ప్రదేశం. క్రూరమృగాల కన్నా వేగంగా 
వాహనాలు సంచరించే విరామం లేని ప్రదేశం.
ఇటువంటి రహదారిని దాటటం ఎలా?" అని  తనలో తాను 

సంబాషించుకుంటూ, చాలా కాలం క్రితం, అతడూ ఆమె చేతులు 
పుచ్చుకుని, అంత వేగపు వాహనాల వరదను 
అత్యంత సునాయాసంగా దాటిన క్షణాలను జ్ఞాపకం 
చేసుకుంటుంది -

ప్రేమలేని దయరహిత సాయంత్రం. పెదాలు ఇతర పెదాలను తాకలేని
నిశ్చేష్టమైన నిశ్శబ్దపు సాయంత్రం.
ఒంటరిగా బయలుదేరి ఒంటరిగానే ఇక ఇంటికి చేరుకోవాల్సిన

ఒంటరి బాహువుల సాయంత్రం. ఆమె ముందుకు కధలలేకా
వెనక్కు వెళ్ళలేకా, ఉన్నచోటనే 
నిలబడి ఎదురుగా నిర్దయగా మారుతున్న రోజును 
స్తబ్దుగా గమనిస్తూ అనుకుంటుంది:

"రహదారిని దాటడం ప్రేమను ఈది ఒక దరికి శాంతితో చేరటం వంటిది. 
సమయం లేదిక: కదిలే తెమ్మరని 
ఆసరాగా పుచ్చుకుని, మసకబారుతున్న ఆకాశంలో మెరుస్తున్న 

నక్షత్రాలు, మేఘాల మధ్య ముడుచుకుంటుండగా, చప్పున రహదారిని 
దాటాలి. సమయం లేదిక. చీకటి మంచు 
గాడమయ్యే వేళకి ఇంటికి చేరుకొని, సహచరుడు లేని పడకపై

నిర్లిప్త కరుణతో విశ్రమించాలి ఇక. సమయం లేదిక. ఎలాగోలాగా జీవితాన్ని 
త్వరితంగా దాటాలిక:"

ఆ తరువాత, కనిపించని ముళ్ళు రాలుతున్న కంపించే శీతలగాలితో పాటు
పెదాల అంచున వికసిస్తున్న చిర్నవ్వుతో
ఆమె ఒక నిర్లక్ష్యపు విసురుతో, సాయంకాలమూ రాత్రీ కాని 
కర్కశ సమయంలోకి

ఈ పదాలతో పాటు రహదారిని దాటుతుంది.

మధ్యాహ్నపు అమ్మ

 మధ్యాహ్నపు అమ్మ

__________________________

నల్లటి నీడలు తెల్లటి నీటి పాయల్లా తన వేళ్ళ చివర కదులుతుండగా
నేను అమ్మ మధ్యాహ్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను
ఇంటి వెనుక జామ చెట్టు వృద్ధాప్యంతో వొంగి , జ్ఞాపకాలలో కోల్పోయిన తనని చూస్తుండగా
నేను అమ్మ మధ్యాహ్నం దుస్తులు ఉతకడాన్ని చూస్తాను

మరెక్కడో మరొక వృద్ధుడు, అలల్ని అరచేతిలో పట్టుకుని వాటిని పిట్టల్లా మార్చే
తన మనవరాల్ని చూసేందుకు సముద్రంలోకి వెడుతుండగా
మరెక్కడికో వెళ్ళలేని ఇక్కడి అమ్మ ఇక్కడే మౌనంగా దుస్తుల్ని నీటిలో ముంచుతుంది
తన ప్రియుడికి ఎన్నటికీ తిరిగి ఇవ్వలేని పుస్తకంలో రంగు మారిన రావి ఆకులా
అమ్మ దుస్తుల్ని తన ముందు పరుచుకుని, తన రెండు హస్తాలతో

అప్పుడే జన్మించిన శిశువుని తుడిచినట్టు, మరణించిన తన తల్లితండ్రుల శరీరాల్ని
శ్మశానానికి తీసుకువెళ్ళే ముందు, ప్రేమతో బాధతో నిశ్శబ్దంగా కడిగినట్టు
అమ్మ దుస్తుల్ని తన ముందు పరచుకుని, తన రెండు హస్తాలతో వాటిని శుభ్రం చేస్తుంది

అమ్మ మధ్యాహ్నం ఒంటరిగా దుస్తుల్ని ఉతుకుతుంది
తనని వొంటరిగా వదిలివేసిన వాళ్ళ దుస్తుల్నీ, తనని ఇక్కడ ఒంటరిగా వదిలివేసి
మరెక్కడో తన అస్తిత్వపు ఊసైనా లేక కదులాడుతున్న వాళ్ళ దుస్తుల్నీ
అమ్మ మధ్యాహ్నం ఒంటరిగా శుభ్రం చేస్తుంది
మరుపైనా లేని సమయంలో, ప్రేమించినవాళ్ళకీ కోల్పోయినవాళ్ళకీ 
తేడా లేని సమయంలో, అమ్మ
ప్రేమించిన వాళ్ళ దుస్తులనీ, ప్రేమించలేని వాళ్ళ దుస్తులనీ నీటిలో 

ముంచుతుంది. వాళ్ళ చొక్కల్నీ, పాంట్లనీ, లోదుస్తులనీ ఒకదాని తరువాత మరొకటి 
శుభ్రం చేస్తూ, నుదిటిపై చిట్లిన 
చెమటను తుడుచుకునేందుకు క్షణకాలం ఆగుతుంది

సరిగ్గా ఆ క్షణాన వొంటరి మధ్యాన్నం స్రవించే నెత్తురు గులాబీగా మారుతుంది
సరిగా ఆ క్షణాన ఆకాశపు తీగపై ఆరవేసిన మేఘాలు పచ్చి గాయాలుగా మారతాయి
సరిగ్గా ఆ క్షణాన అమ్మ గర్భంలో ఈ కవిత ఊపిరి పోసుకుంటుంది

సరిగా ఆ క్షణాన అమ్మ శరీరంలో ఒక దిగులు గీతం కదులాడుతుంది. ఆ తరువాత
అప్పుడే ఆర్పివేయబడ్డ ప్రమిదెలు 
వెలుతురు వాసనను గాలిలో వదిలినట్టు, అమ్మ దుస్తుల్ని ఉతకడం పూర్తిచేసి, 

వర్షానికీ బాధకీ వాటిని వోదిలివేసి ఇంటిలోకి వెళ్ళిపోతుంది.

ఇక ఈ రాత్రి

 

ఇక ఈ రాత్రి ఇక్కడ విశ్రమిస్తాను. ఎంటువంటి ఆరోపణలూ లేకుండా ఇక ఈ రాత్రి అస్తిత్వాన్ని అంగీకరించి శిరస్సుని ధూళి నిండిన పాదాల వద్ద ఆన్చి నిలిచిపోతాను

కనిపించని ఉనికి ఏదో నిర్దేశించిన దారి ఇది. క్షణక్షణం రహస్య స్వరం ఏదో రమ్మని పిలిచిన కరుణ లేని దారి ఇది. సమయపు సంకేతాల్ని అనువదించుకునేందుకు గులాబీలను వొదిలి ముళ్ళను హృదయంలో దింపుకున్న అంతులేని తపన ఇది

ఇక ఈ రాత్రి ఏది ఏమిటని అడగను. ఇక ఈ రాత్రి ఎవరు ఎవరనీ అడగను 

జీవితాన్ని వెదుకుతూ జీవితాన్ని కోల్పోయాను. అర్థాన్ని వెదుకుతూ అర్థాన్నీ కోల్పోయాను. ఉండేందుకు, ఏమీ కోరని ఈ భూమిపై అలా ఉండేందుకు అనేక పర్యాయాలు మరణించాను. తిరిగి చేరుకునేందుకు, ఎప్పటికీ చేరుకోలేనంత దూరమూ వెళ్ళిపోయాను. తుంపులు తుంపులుగా నలుదిశలూ వీడిపోయాను 

ఇక ఈ ఒక్క రాత్రి, మట్టిని రక్తపు పెదాలతో ముద్దాడే పాదాలు నావి, అవి చేసే అలికిడి ఎవరిది అని అడగను. శూన్యపు కాంతిని వలలై చుట్టుకునే కనులు నావి, అవి చూసే చూపు ఎవరిది అని అడగను. ఇక్కడ ఈ గాలిలో వికసించిన అస్తిత్వపు పూవు నాది, దాని ఎరుక ఎవరిది అని అడగను. విరిగిపోయాను. పూర్వీకుల ధూళిలో కలసిపోయాను. అలసిపోయాను. ఇక ఎటువంటి ఆరోపణలూ లేకుండా ఈ రాత్రి జీవితాన్ని అంగీకరించి శిరస్సుని వడలిపోయిన పాదాల వద్ద ఆన్చుకుని ఇక్కడే ఆగిపోతాను.  ఇక ఇక్కడే, 

 అలలపై వొదిలిన ప్రమిదెలా ఆగి, సాగిపోతాను.

25 February 2021

చివరిగా

కిటికీ అంచున ఒదిగి కూర్చున్న తెల్లని పావురానివి నువ్వు -

మాట్లాడాలి ఎవరైనా నీతో.  మెత్తగా నిమిరి, పూవులంత తేలికగా ఏమైనా మాట్లాడాలి నీతో -

వీచే గాలి అంటే ప్రేమ నీకు. సెలయేళ్ళు కావాలి నీకు. తోడుగా ఉండాలి ఇన్ని మొక్కలు పిచ్చుకలూ పిల్లలూ నీకు, అందుకే ఎదురుచూస్తావు ఉదయాన్నే ఒక మాటకై మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని, నీలో నువ్వు ముడుచుకునీ -

తేలిపోతాయి మెల్లగానే మబ్బులు. సాగిపోతాయి మెల్లగానే పక్షులు. ఆ పసుపుపచ్చటి ఎండలో, ఆ పసుపు పచ్చటి గాలిలో ఎగిరిపోతాయి మెల్లగానే తోటలోని సీతాకోకచిలుకలు. తెరిచిన తలుపులోంచి వాలే పసుపు పచ్చని లేత ఎండ, తాకుతుంది నీ పసుపచ్చని చేతిని రంగులేని ఒంటరితనంతో  -

తిరిగి తిరిగి, తిరిగి - మళ్ళా మళ్ళా ఎవరూలేని ఒక నల్లని సాయంత్రమే చివరిగా,  భళ్ళున పగిలే గాజుపాత్రగా మిగిలిపోయే ఒక రాత్రే చివరిగా! కొంత నిప్పూ, కళ్ళ వెంబడి కొంత నీరూ, శరీరంలోకి మరి కొంచెం కొంచెంగా పేరుకునే ఖాళీ గదుల దిగులు: నీలో. చివరిగా!

నిన్ను నువ్వే కౌగలించుకుని మరణించిన రాత్రిలో, బ్రతికి ఉన్నావా? ఎలా ఉన్నావు అని నిన్ను అడిగిందెవరు?

19 November 2020

మూడవ అధ్యాయం

చాలా కాలం క్రితం: ఎంత దూరమైన కాలం అంటే, ఇంకా ఇక్కడే ఈ క్షణానే ఉండినంత దగ్గరగా ఉన్న దూరమైన కాలంలో తన ఇంటి ముందు ఉన్న బాదం చెట్టు కింద కట్టి ఉన్న రాతి వలయంపై కూర్చుని అతను తొలిసారిగా ఆమెను గమనించాడు. అది ఆమె ఉండే ఇల్లు. ఆమె కూడా అతనిని గమనించింది కానీ, పరిశీలించలేదు. ఆమె గేటు తీసుకుని బయటకు వెళ్ళిన క్లుప్త సమయంలో సుదీర్ఘంగానూ, సాధ్యమైనంతగానూ ఆమె రూపాన్ని కళ్ళతో అనువదించుకున్నాడు. ముఖ్యంగా తన వదనం


తెల్లటి తాకిడి కలిగిన కాగితం. కాగితపు మెత్తదనం కలిగిన జాబిలీ. మాట్లాడే వెన్నెల. ఆ తరువాత కనులు. వరి పొలాలు హోరున వీచే కళ్ళు. అప్పుడతను గ్రహించలేదు: తన ముందే ఆ రెండు కళ్ళూ రెండు కమిలిన నెత్తురు బావుల్లా మారి నెమ్మదిగా, మరణపు సరిహద్దుల దాకా గడ్డ కట్టుకుపోతాయని.

|| కళ్ళు తెరువు. ఒక్కసారి. నువ్వెందుకు కళ్ళు మూసుకుంటున్నావు? ఒక్కసారి, కనురెప్పలను గట్టిగా తెరువు ... మరణించకు,  వొదిలి వెళ్ళిపోకు ... ఒక్కసారి, ఒకే ఒక్కసారి కదులు, కనీసం చేతి వేళ్ళనైనా కదుపు ...ఒక్కసారి. ఒకే ఒక్కసారి ... || 

పాలిపోయిన ముఖంతో ఆసుపత్రి గది. మందుల వాసన. అదో రకమైన అనిశ్చితమైన వాసన. ముఖానికి ఊపిరిని అందించేందుకు ప్రయత్నిస్తున్న ఆక్సీజన్ మాస్క్. నరాలలోకి దిగబడిన సూదులు. అతను పాలిపోయిన ముఖంతో తన మంచం పక్కగా నిలబడి ఉన్నాడు. అదే సూర్యరశ్మి. పల్చటి తెరలానూ, తేలికయిన బంగారపు రంగుతో, కిటికీలోంచి సాలెగూడు వలే లోపలి అల్లుకునే సూర్యరశ్మి. అదే గాలి. మృదువైన గాలి. సిక్నెస్. పరచితాపరచిత వాతావరణం. ఈ దృశ్యాన్ని ఇంతకు మునుపే ఊహించాడా? ఇంతకు మునుపే జీవించినట్లు: ఈ జీవితమంతా ఈ సమయమంతా ఈ క్షణాలన్నీ ఇంతకు మునుపే గడిపి మరొక్కసారి, లేదా అనేక సార్లు తిరిగి జీవిస్తున్నట్లు, ఒక ఘాడమైన సిక్నెస్ లాంటి అనుభూతి -

|| నువ్వు కళ్ళు తెరవాలి. నువ్వు ఎలా కళ్ళు మూసుకోగలవు? నువ్వొకసారి కళ్ళు ఎందుకు తెరవవు? ఒక్కసారి, ఒకే ఒక్కసారి, నీ కనురెప్పలను ఎందుకు విప్పవు? ఒక్కసారి, ఒకే ఒక్కసారి, బలంగా గాఢంగా నీ కళ్ళను ఎందుకు తెరవవు? కనులు తెరువు ఒక్కసారి, లేదా నేను వాటిని నా నెత్తురుతో తడుపుతాను నీ కనుపాపలు కనిపించేదాకా: నేనొక ఉన్మాదిని, కళ్ళు తెరువు నువ్వు, ఒకే ఒక్కసారి ... || 

ఈ ఆసుపత్రి. ఆ గోడలు. సమాధులలోంచి నిల్చోబెట్టినట్లు. ఈ గోడలనూ, ఈ మందులనూ ఈ మంచాన్నీ ఈ ముఖాలనీ ఇంతకు మునుపు చూసాడు. చాలా చాలా దగ్గరిగా. ఎక్కడ? అతను తన్నుకులాడాడు తనలో తాను, బలంగానూ అసహనంగానూ అశాంతిగానూ, ఈత రాక నీట మునుగుతూ ఊపిరికి తన్నుకులాడే ఒక మనిషిలాగానూ -


< నాకు అబార్షన్ అయ్యింది: ఒకసారి. నాన్నకు తెలియదు. ఏం జరిగిందో, నాకూ తెలియదు. అన్నయ్య స్నేహితుడు . రాత్రి. అమ్మా నాన్నా లేరు. నిశ్శబ్దం. బాధ కూడానూ. అతను ... నాకు ఏం జరుగుతుందో కూడా తెలీలేదు. నొప్పి ఒక్కటే. ఇప్పుడు కూడా నొప్పే తలచుకుంటే ... ఆ చీకటి భయం. ఇప్పుడు కూడా, రాత్రిపూట అప్పటిలాంటి చీకటి చుట్టుకుంటే భయం వేస్తుంది. బాధ వేస్తుంది. నొప్పి కూడానూ. ముఖ్యంగా ఆ ఆసుపత్రి గదులు, ఆ మందుల వాసనా, మరీ ముఖ్యంగా ఎదగని పిండం: ఇంకా చేతులూ కళ్ళూ కాళ్ళూ సరిగ్గా ఏర్పడని పిండం. అప్పుడిక నేనే ఒక పిండం అయ్యీ ... >
         
ఒక లేత స్పర్శ. ఒక చెమ్మగిల్లిన నయనం. బరువుగా జారిన కన్నీటి చుక్కలు కూడానూ. మరి అతను ఏం చేసాడు? అతని ఎదురుగా కూర్చుని, తన గాయాల్ని ఆమె అతని ముందు విదిల్చినప్పుడు అతను ఏం చేసాడు? ఆమె మౌనంగా తల వంచుకుని, ఆ చెట్ల కింద, ఆ నీడలలో ఎక్కడో కలుక్కుమంటున్న నొప్పితో మౌనమైనప్పుడు, తనే నీడ లేని ఒక చెట్టుగా మారిపోయింది. అతను ఆ గాయాల వృక్షం కింద కూర్చుని తల ఎత్తి ఆమె వైపు చూసాడు: అవే కళ్ళు. కళ్ళల్లో అవే నదులు. ఆ నదులలో తేలిపోతున్న తన శరీరం. సంతోషాన్నీ దుఃఖాన్నీ విషాదాన్నీ బాధనీ అంతం లేని నొప్పినీ, శరీరంపై జరిగే అత్యాచారాల్నీ, శాంతినీ అశాంతినీ, అసంఖ్యాక కోతల్నీ, చంపుకోలేని ప్రేమల్నీ వొదులుకోలేని మనుషుల్నీ, గాయపరచలేని ప్రియుళ్ళనీ ఇంకా అనేకానేక విషయాలని దాచుకున్న శరీరం. అనేక విషయాలయిన శరీరం, ఆ శరీరం ఒక యుద్ధ ప్రదేశం. అల్లకల్లోలమైన ఒక సముద్రం. మరొక రోజు మరొక సమయంలో ఉద్వేగంగా శాంతిగా కాంతిగా కదులాడే ఉషోదయపు సూర్యరశ్మి: తన శరీరం -

|| నువ్వు ఎలా తీసుకోగలవు ఇంత దుఃఖాన్ని, నీలోకీ, నీ శరీరంలోకీ? || 

ఒక నగ్నదేహం మధ్యాహ్నపు సూర్య కిరణాల వొత్తిడికి అతని పక్కగా కదిలింది. ఒక చిరునవ్వులా కూడానూ. తన చేయి చల్లగా అతడిని దగ్గరగా హత్తుకుంది. దగ్గరగా. మరింతగా దగ్గరగా, ఎంతగా అంటే తన రక్తంలో కలుపుకునేంతగా: తను ఇలా అంది అతనితో -

< ఎప్పుడూ ఇలాగే ఉంటావా? నన్ను వదలకు. నన్ను వొదిలి వెళ్ళకు. నాకు ప్రేమభరితమైన జీవితం లేదు. నాకు ప్రేమ కావాలి: రోజూ.  నన్ను నన్నుగా , నా శరీరాన్నీ నన్నూ, ఈ పెదాలనీ పాదాల్నీ పదాలనీ ప్రేమించు. నన్ను వొదిలి వెళ్ళకు. నేను ఎవరిని నమ్ముకుంటాను? నమ్మిన ప్రతీసారీ గాయపడ్డాను. తిరిగి కోలుకోలేనంతగా, తిరిగి ఈ లోకం లోకి రాలేనంతగా తిరిగి మనుషులపై ప్రేమనూ, నమ్మకాన్నీ పెంచుకోలేనంతగా గాయపడ్డాను. శ్రీ, నేను మనుషులని నమ్ముతాను. నేను మనుషులని ప్రేమిస్తాను. ఇన్ని గాయాలు నా శరీరాన్నీ హృదయాన్నీ కోసివేసినా నేను జీవితాన్నే నమ్ముతాను. నిన్ను ప్రేమిస్తాను. నన్ను వొదిలి వెళ్ళకు - ఎన్నటికీ ... >

మరొక రోజు. మరొక సమయం. మళ్ళా తన శరీరం నిండా లెక్క లేనన్ని కోతలు. అతడు ఆ వేళ వాటిని లెక్క పెట్టదలుచుకున్నాడు. తన గాయాలలోంచి పూల సుగంధాల సీతాకోకచిలుకలని నిర్మించి ఇవ్వదలిచాడు. కానీ, అన్నిటి కంటే ముందు ఒక ప్రాధమిక ప్రశ్న: ప్రేమ అంటే ఏమిటి? అదొక కాలమా? అదొక భాషనా? అదొక నిశ్శబ్ధమా? రేపు - ఒకప్పుడు మనం బ్రతికి ఉన్నామని - గుర్తు చేసుకునేందుకు, మనం ఇప్పుడు చేసుకునే ఒక గాయమా? అతని తోచలేదు. గాయాలలోంచి ఒక ఇల్లు నిర్మించి ఇవ్వడం ఎలాగో, ఇంటికి రెక్కలు తొడిగి, మృదువుగా నిమిరి అలా గాలిలోకి వొదిలి వేయడమెలాగో అతనికి తోచలేదు. తను అడిగినది ఎలా ఇవ్వాలో, ఎలా సాధ్యమో తెలియక అతనికి దిక్కు తోచలేదు. తెలుసునేందుకు, అతను ఆమెని వొదిలి, ఆమెను మళ్ళా గాయపరచి పారిపోక మునుపు ఆ ముస్లిం గులాబి ఇలా కూడా అంది:

< మనుష్యులని ప్రేమించకుండా నేను ఉండలేను శ్రీ. నాకు తెలియదు ఎందుకో కానీ, ప్రేమించకుండా నేనుండలేను. నేను మనుషులని ఇష్టపడతాను: వాళ్ళ వైరుధ్యాల తోటీ, విశ్వాసఘాతాల తోటీ, వాళ్ళ నిర్ధయాల తోటీ, ద్రోహాలతోటీ నేను వాళ్ళని ఇష్టపడతాను. శ్రీ, నిన్ను ఇష్టపడతాను. నువ్వు నా పట్ల చూపించే ఈ ప్రేమా కన్సర్న్ రేపు ఉండక పోవచ్చు. రేపు నువ్వు నన్ను ఇంత ప్రేమగా రమించక పోవచ్చు. ఒట్టి శారీరక సంబంధం మాత్రమే మన మధ్య ఆఖరి వెలుతురై ఊగిసలాడుతుండవచ్చు. అది ఎప్పటికీ సాధ్యమే: ఎప్పటికీ శాశ్వతమైన సంబంధాన్ని నేను ఊహించ లేను కానీ, ఆశించడం? ఎలా దీనిని ఆపడం? >

|| కనులు తెరువు. మరణించకు. ఒక్కసారి కనులు తెరువు. చూడలేను ఈ తెల్లని గోడలు. కాంచలేనీ కరుణ లేని పడకలు. వెళ్ళకు. ప్లీజ్ స్టే. ఒక్కసారి కళ్ళు తెరువు ... ||                              

రక్తం కావాలి. ఈ శరీరం కోసం. మనుష్యులని ఇష్టపడిన ఆ శరీరం కోసం. మరొక రోజు, మరొక సమయంలో ఆమె కడుపులోని బిడ్డ వాంతి చేసుకున్నప్పుడు, ఆ ద్రవం తన జీవితంలోని అయిష్టా భరితమైన వైవాహిక సంబంధంలా ఊపిరి తిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు, వొకే ప్రశ్న. ఒకే ఒక్క ప్రశ్న. తను బ్రతుకుతుందా లేదా? మూసుకున్న కళ్ళను అలాగే కప్పి ఉంచుతుందా?

< నా భర్త. బహుశా, ప్రేమిస్తాడేమో నన్ను. కానీ ధైర్యంగా నాకై ఉండలేడు. భయస్తుడు. నేను అతడిని ప్రేమిస్తున్నానా? లేక అంగీకరించడానికి అలవాటు పడిపోయానా? దేహమొక్కటే అప్పగిస్తున్నానా? ఏమో? ఇష్టపడుతుండవచ్చు. అతనితో అనుభవాన్ని అప్పుడప్పుడూ ఇష్టపడతాను కనుక. అతని తల్లి, ఒక ఫ్రస్తేటడ్ వుమన్. తన ఎన్నో ఏళ్ల అయిష్ట భరిత, అశాంతి నిండిన జీవితాన్ని నాపై చూపిస్తుంది. నేనూ మనిషిననీ స్త్రీననీ తనకి అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుందనుకో, ఒక నిర్లిప్త నిస్సహాయ సమయ రహిత సమయంలో--- కానీ తను మాత్రం ఏం చేయగలుగుతుంది? పాతికేళ్ళ తన యాంత్రిక జీవితంతో, పాతికేళ్ళ తన యాంత్రిక దినచర్యలతో? >

అవన్నీ సరే కానీ ఇప్పుడు రక్తం కావాలి. ఆమె హృదయం మరి కొంత కాలం ఉండేందుకు రక్తం కావాలి. బి పాజిటివ్. ఆసుపత్రిలో రక్తం లేదు. కొనుక్కు రావాలి. ఎక్కడైనా త్వరగా. అందరూ ఉండీ ఎవరూ లేక మిగిలిపోయిన తనకి ఇప్పటికిప్పుడు రక్తం కావాలి.   బి పాజిటివ్. మూడు రాత్రుళ్ళగా కొట్టుకులాడుతున్న ఆ గదిలోంచి బయట పడేందుకు తనకి రక్తం కావాలి. ఆనక చెబుతుంది తను, జీవితం గురించి. ప్రేమ గురించి. ఈ జీవన సంక్లిష్టతల గురించి. ఉద్వేగం గురించీ, శాంతి అశాంతుల గురించీ. కానీ ముందు ఆమెకి రక్తం కావాలి. బి పాజిటివ్. మంచంపై అలా పడిపోయి తను - చెట్లనూ, మొక్కలనూ వానలనూ మనుషులనూ జంతువులనూ ప్రేమలనూ ప్రేమ ఘాతుకాలనూ ఇష్టపడిన ఆమె శరీరం రక్తంకై, తిరిగి ఈ భూమిపైకి వచ్చేందుకు ఒక ప్రార్ధన చేస్తుంది -

తను తిరిగి ఇక్కడికి రావాలి. తిరిగి ఈ మనుషులని ప్రేమించాలి. తిరిగి గాయపడాలి. మళ్ళా ఇష్టపడాలి. మళ్ళా చావు బ్రతుకుల్లో కొట్టుకులాడాలి. అన్నిటికంటే ముందు రక్తం కావాలి. బి పాజిటివ్. ఎక్కడైనా కొనుక్కు రావాలి. త్వరగా. తిరిగి తనను ఈ మట్టిపైకి రప్పించేందుకు, ఈ మట్టిపైనా ఈ జీవితాలపైనా తన పద పాద స్పర్శ  మోపేందుకూ, ఈ మనుషులని మరింతగా అనువదించుకునేందుకూ, తనకి రక్తం కావాలి. కొద్దిగా. బి పాజిటివ్. చూడు. ఒక శరీరంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. సంభాషించవచ్చు. ప్రేమించవచ్చు. ముద్దాడవచ్చు. రమించవచ్చు. నిన్ను నీవు ఒక స్పర్శ లా మార్చుకుని తనని తాకవచ్చు. అనేకానేక విషయాలను సాధ్యం చేయ వచ్చు. తను: ఆ చేతులూ పెదాలూ పాదాలూ కనులూ తొడలూ చేతివేళ్లూ తిరిగి ఈ భూమిపై కదులాడాలంటే ముందు, ముందుగా  రక్తం కావాలి. అత్యవసరంగా రక్తం కావాలి ...

చదువరీ, ఇవ్వగలవా నువ్వు కొంత రక్తం, తనని చూచేందుకూ, మరింత జాగ్రత్తగా తనని గమనించేందుకూ, తనని ప్రేమించేందుకూ, తనని బ్రతికించుకునేందుకూ?    
______________________________________________________________________
26.09.1997