18 October 2012

దారి

ఆగకుండా ఒక నాదం వినిపిస్తుంది నీలో
     లేత గాలిలో దూరంగా తళతళలాడుతూ ఎగిరే
     సీతాకోకచిలుకల రెక్కల సవ్వడీ నీటి కలకలం
     ఒక మెత్తని శబ్దం నీలో. కనిపించని ఒక సూక్ష్మ

బిందువు వద్ద నుండి ఒక కాంతి జల మొదలయ్యి
     నింపాదిగా శరీరమంతా వ్యాపిస్తోన్న ఒక మహా
     ప్రేమ: అరచేతులతో నీ ముఖాన్ని ఎవరో మహా
     రహస్యంగా పుచ్చుకుని నీ కళ్ళలోకి తీరుబడిగా
     కరుణగా చూసే ఒక మహా కాలం. ఇక

తెలుస్తుంది నీకు నెమ్మది నెమ్మదిగా
     ఈ వేణువుని నీ శ్వాసతో ఊదడం ఎలాగో
     ఈ విశ్వపు వెన్నెల నీ శరీరమై నక్షత్రాలై
     పూలై వానై ధూళై ఎలా ఓ పరవశత్వంతో
     నిన్ను గానం చేస్తుందో: చూడు

సాంధ్యవేళ విరిసిన ఒక చల్లని కాంతిలో నేను.
నేనులో మేను.

ఇక దారి తప్పేది లేదు.   

17 October 2012

అసంపూర్ణం

బిందువునై కూర్చున్నాను ఒక వృత్తంలో. 
     ఎవరిదో శ్వాస నా ఆత్మ చుట్టూ. ఇదే దారో 
     తెలియటం లేదు. నీ శరీరంలో ముఖం 
     కడుక్కుందామనే ఒక కోరిక. తెలుసు 
     చివరికి కన్నీళ్ళతో కడుక్కుంటానని- 

పూలను తాకిన చేయీ, నిన్ను తాకిన కనులూ 
     తిరిగి రావు. శిఖరాగ్రహపు అంచున మెరిసే 
     సీతాకోకచిలుకలూ రాత్రి ఆకాశంలో తడిచిన 
     నక్షత్రాలూ అద్దంపై వాలిన చినుకులూ 
   
నా చుట్టూనూ. 
     రెపరెపలాడే నిశ్శబ్ధాన్ని నిశ్శబ్ధంగా మార్చి 
     మడిచి, ఒక దీపం వెలిగించుకుని, దానిని   
     తలగడలా అమర్చుకుని నిదురించే విద్య 
     ఏదీ లేదు నా వద్ద.
అందుకే చెబుతున్నాను. 

చూడు. ఇటువైపు. నీ వృత్తంలోని
ఈ బిందువు వైపు.

చెదిరిపోయింది గూడు.                    

16 October 2012

రాత్రైతే

రాత్రైతే
వొద్దు వొద్దు అనుకుంటూనే అడుగు పెడతావు
     వెదురు వనాలలోకీ: మసక వెన్నెల పరుచుకున్న
     ఆ మట్టి దారులలోకీ మంచు దీపం వెలిగే వేళల్లోకీ

రాత్రైతే
వొద్దు వొద్దు అనుకుంటూనే ఆగిపోతావు.
     నక్షత్రాలు నిండిన పూల ఆకాశంలోకీ, నిదుర వాసనలోకీ
     చెమ్మగిల్లిన భూమిలోకీ ఆ శాంతి నిశ్శబ్ధంలోకీ.

రాత్రైతే
ఒక మెలుకువలోకి మేల్కొని, ముఖాన్ని కడుక్కుని
     శరీరాన్ని విడిచి ఒక ప్రయాణం మొదలు పెడతావు
     ఒక కాంతి లోకంలోకి, నీడల వెలుగులోకీ-
     అంతిమంగా నీలోకీ.

రాత్రైతే మరి నేను ఎక్కడ ఉంటాను? 

15 October 2012

.

కూర్చున్నాం ఇద్దరం, ఎదురెదురుగా ఖాళీగా
     ఉదయపు ఎండలో గాలికి కొద్దిగా కదిలే 
     తోటలోంచి తెంపుకు వచ్చి పూలపాత్రలో ఉంచిన  
     రెండు తెల్లని గులాబీ పూవుల్లా:  

తనకీ నాకూ తెలియనిదల్లా మమ్మల్ని 
     ఎవరు తెంపుకు వచ్చారన్నదే: అందుకే 
     కూర్చున్నాం అక్కడే ఇద్దరం 
     సాయంత్రం వడలిపోయి రాత్రిలోకి 
     రాలిపోయేదాకా! 

చూడూ 
ఇక రాత్రంతా ఒక్కటే మంచులో    
     పూలు లేని కుండీలలో ఒంటరిగా ఒక చందమామ 
     ఎలా కూర్చుండి పోయిందో.   

14 October 2012

ఈ సాధారణ దినం

వీపు మీద ఎక్కి కూర్చుని|| ఊడలు పట్టుకుని తిరిగే అడవి బాలుడిలా అంటాడు||  'పోనీ నాన్నా, పోనీ గాట్టిగా ఊపు-' అని. ||ఇక అందుకని

ఊగుతాం మేం|| చెట్టు పైనుంచి చెట్టుపైకి|| అడవులలో|| తళతళలాడే సూర్యరశ్మిలో|| వానలలో. ||కాసేపు గడుపుతాం|| కోతులతో|| సింహాలతో|| ఏనుగులతో|| కలకలం చేసే పిట్టలతో|| జలపాతాలతో|| ఆకులపై నుంచి|| చుక్కలుగా జారే రాత్రితో|| వెన్నెలతో|| చల్లటి మంచుతో.|| చెప్పుకుంటాం|| కొన్ని కధలని|| ఇంతకు మునుపు

అనేకసార్లు|| చెప్పుకున్న కధలని|| మరొకసారి కొత్తగా|| నూతన ఉత్సాహంతో:|| ఎగిరే చేపలూ|| మనుషులుగా మారే మృగాలూ|| కొంత మిస్టర్ బీన్|| మరికొంత టాం అండ్ జెర్రీనూ.||

ఇక అలా ఊగీ ఊగీ ఊగీ|| అలా వినీ వినీ వినీ

కలలోంచి కలలోకి జారిపోతూ|| నా వీపుపై నుంచి జారిపోయి|| చల్లగా రెక్కలు ముడుచుకుని|| నిదురిస్తుంది|| నా శ్వేత సీతాకోకచిలుక|| ఒక కాంతి లోకపు|| కమ్మనైన ||పూల ఉద్యానవనాల సువాసనతో:||

ఇక చేసేదేమీ లేక|| నేను లేచి|| అలసిపోయిన|| నా శరీరాన్నీ లేపి|| గదంతా రాలిన ఆకులనీ|| చినుకులనీ|| ధూళినీ||ఊడ్చి|| ఇల్లంతా||తిరుగాడిన|| జంతువులనూ|| పిట్టలనూ ||అడవులకు|| తిరిగి పంపించి|| పిల్లవాడి|| గుప్పిట్లో చిక్కి|| మిగిలిపోయిన||ఒక రంగు రంగుల|| ఏనుగును|| జాగ్రత్తగా విప్పి|| వొదులుతూ|| ఇలా ఇక్కడ|| కూర్చుంటాను|| బయటకు వెళ్ళిన|| నా భార్య కోసం|| ఎదురు చూసుకుంటూ|| ఈ పదాలు రాసుకుంటూ- అంతే!||

మరే పెద్ద|| విషయమూ లేదు || ఈ వేళ!||  (ఇంతకూ ||నేనేం మాట్లాడుతున్నానో|| అర్థం అవుతుందా|| నీకు-?)||     

13 October 2012

11 October 2012

వంట చేసిన ఆ అరచేతులు

ఏ రహదారుల్లోనో తప్పిపోయి
    గుండెను చించుకుని, మధుశాలల్లోంచి ఇంటికి
         వస్తావు కదా నువ్వు, చీకటి గుమ్మానికి అనుకుని
                   ఎదురుచూస్తూ కూర్చుని ఉంటుంది నీ తల్లి

ఖాళీ కళ్ళతో నక్షత్రాలని లెక్కిస్తూ:
     సంజాయిషీ చెప్పుకోవాలనుకుంటావు నువ్వు
          నీ ఖాళీ చేతులని చూపిస్తో: నిను వారిస్తో

గడప వద్దనుంచి గుమ్మాన్ని పుచ్చుకుని
    అతి కష్టంగా లేచి, వొణుకుతున్న చేతులతో కదులుతూ
         తను అంటుంది కదా నీతో: 'పొద్దుపోయింది
వెళ్లు.  వెళ్లి  ఇంత అన్నం తిను.
ఖాళీ కడుపుతో పడుకోకు' అని

ఇక మొదలవుతుంది అప్పుడు

అప్పుటి దాకా ఆగిన గాలి
రాత్రితో రాళ్ళతో నీ కళ్ళలో:

దూరాన నుంచి
     ఇక వినపడుతుంది ఎక్కడో వేల ఆకులు రాలే సవ్వడి.
           నీళ్ళు పారే ఒరవడి. లోపల కొంత చిత్తడి. ఇక ఆ రాత్రి

తొలిసారిగా ఏడుస్తావు నువ్వు వెక్కి వెక్కి
అన్నం వండిన తన వొంటరి అరచేతులు
నీ నిదురలో వొణుకుతూ, తెల్లబడిపోతూ
కనుమరుగవ్వుతుండగా, కన్నీళ్లయ్యి నీ
అరచేతులూ చల్లబడి కంపిస్తుండగా

ఆకస్మికంగా తెలుస్తుంది నీకు

వంట చేసీ చేసీ వడలిపోయిన పగిలిపోయిన తన
      వృద్ధాప్యపు అరచేతులని ఇంతకు మునుపు
       నువ్వెప్పుడూ చూడలేదనీ, కనీసం
       ఓరిమిగానైనా తాకలేదనీ-

మరి
చూసారా మీరైనా ఎన్నడైనా ఎప్పుడైనా
కమిలిన తన అరచేతులనీ, ఎవరూ లేని
అన్నం మెతుకులనీ?