08 October 2012

ఆరిపోనివ్వకు

1.
ఈ రాత్రి ఒక పూవూ కాదు
     అలా అని ఒక ఇల్లూ కాదు. నీడల పొదలలోంచి
             సరసరా నీ వైపుకు పాకే సర్పంతో పోల్చనా దీనిని?

2.
ఉద్యానవనంలో రాలిన చందమామకి
      చీకటి ఆనవాలు తెలియలేదు. వెన్నెల నీళ్ళల్లో
               పాదం ఆడిస్తూ కూర్చున్న నీకు, పరిసరాల్లో దాగిన
సర్ప నాలిక కదలికలు తెలియలేదు.

తొలి అడుగులు వేసే పసిపాప ఈ గాలి
       కొద్దిగా జాగ్రత్తగా పుచ్చుకో తన వేలిని-
                 నిన్ను వొదిలి ఏ వానో లాక్కు వెళ్లిపోగలదు తనని.

3.
సరే. తెలిసింది కదా నీకు.

ఈ రాత్రి ఒక పూవూ కాదు, పసి నవ్వూ కాదు.
     గాడాంధకారం నింపుకున్న మబ్బులు తీవ్రతతో
           భూమి పైకి ఒంగి నిన్ను పరిహసించే కాళ రాత్రి.

బాటసారీ, దేహధారీ

4.
వెలిగించుకున్నావా ఒక దీపం?
అట్టే పెట్టుకో మరి నిన్ను నువ్వు
ఆ రెండు అరచేతుల మధ్య-

5.
ఇక
ఆరిపోనివ్వకు.
నీ హృదయాన్ని.      
        

06 October 2012

అయోమయం


రంగులు మారే చక్రాల్లాగా ఉంటాయి తన కళ్ళు. గుండ్రంగా తిప్పిందా వాటిని, ఇక మరి
        తిరిగి గిరగిరా నీ తల నిలువలేవు ఒక చోట .ఇక తన తనువంటావా, మరి
                 చిలికి తీసుకోనేవచ్చు తన వొంటిలోంచి వెన్నముద్దలనీ తెల్లని మబ్బులనీ.

అయితే ఉంచలేవు
తన శరీరంపై కుదుటుగా నీ వేలిని ఒక చోట. సర్రున జారే పోతుంది. అది
                సరే కానీ, తన జుత్తులోంచి  కుంకుడు వాసన. అది కాకపోతే                
                 చల్లటి నీళ్ళు ప్రవహిస్తూన్న పొలాల పక్కన వీచే
                 కొబ్బరి తోటల పరిమళం తన తలలో నుంచి - (కేరళా కుట్టి కదా మరి తను)
                     
మరే, ఉన్నపళంగా
స్పృహ తప్పటమంటే ఏమిటో తెలుస్తుంది
     తను నిన్ను ఆమాంతం కావలించుకుని ముద్దుపెట్టుకున్నప్పుడు
              తెగిన నీ పెదాలకి తెలుస్తుంది, ఒక వసంతం తన దంత క్షతాలతో
               నీకు ఒక మండు వేసవి గాలిని ఎలా పరిచయం చేయవచ్చో.

ఇక తను మోహంతో నిను గాట్టిగా చుట్టుకుని
       వదలకుండా నిను పెనవేసుకున్న సంగతి అంటావా
                కొండచిలువల కౌగిలి నెమలీకలతో సమానం: మురుగా ఇక

ఆ తరువాత ఏమిటంటే చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే నీకు
                  బ్రతికుండగానే నిను వీడి నీ ప్రాణం తనతో
                  దైవం వద్దకు మిరుమిట్లు గొలిపే కాంతితో
                  గన్నేరుపూల మత్తుతో వెళ్లిపోవడం తెలుస్తుంది- ఇంతా చేసి

ఆనక తీరికగా అంటుంది కదా తను:
'మీ మగవాళ్ళకెందుకు ఎప్పుడూ అదే యావ
      కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా'  అని. మూర్ఖుడిని అందుకే మరి

ఇంతకాలం అందుకే నాస్తికుడని మరి. ఇక      అందుకే                  
మరి ఇదిగో రాస్తున్నానీ నాలుగు పదాలు ఈ ఉదయం
ఈ కాలపు ఆలయపు మండపంలో ఇలా జ్ఞానోదయమై

చిరునవ్వుతో కూర్చుని, మరి అంతలోనే ఏమీ తెలియని అయోమయంతో.  

05 October 2012

అయోమయం

రంగులు మారే చక్రాల్లాగా ఉంటాయి తన కళ్ళు. గుండ్రంగా తిప్పితే
     మరి గిరగిరా తిరిగి నీ తల నిలువలేవు ఒక చోట .ఇక తనువంటావా. మరి
               చిలికి తీసుకోవచ్చు తన వొంటిలోంచి వెన్ననీ తెల్లని మబ్బులనీ. అయితే ఉంచలేవు

తన శరీరంపై కుదురుగా నీ వేలిని ఒక చోట. సర్రున జారే పోతుంది. అది
                సరే కానీ, తన జుత్తులోంచి కుంకుడు వాసన. అది కాకపోతే                  
                         చల్లటి నీళ్ళు ప్రవహిస్తున్న పొలాల పక్కన వీచే
                         కొబ్బరి తోటల పరిమళం తన తలలో నుంచి - (కేరళా కుట్టి తను)
                       
మరే, ఉన్నపళంగా
స్పృహ తప్పటమంటే ఏమిటో తెలుస్తుంది
     తను నిన్ను ఆమాంతం కావలించుకుని ముద్దుపెట్టుకున్నప్పుడు
              తెగిన నీ పెదాలకి తెలుస్తుంది, ఒక వసంతం తన దంత క్షతాలతో
               నీకు ఒక మండు వేసవి గాలిని ఎలా పరిచయం చేయవచ్చో.

ఇక తను మొహంతో నిను చుట్టుకుని
       వదలకుండా నిను గాట్టిగా పెనవేసుకున్న సంగతి అంటావా
                కొండచిలువల కౌగిలి నెమలీకలతో సమానం: మురుగా ఇక

ఆ తరువాత ఏమిటంటే చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే నీకు
                  బ్రతికుండగానే నిను వీడి నీ ప్రాణం తనతో
                  దైవం వద్దకు మిరుమిట్లు గొలిపే కాంతితో
                  గన్నేరుపూల మత్తుతో వెళ్లిపోవడం తెలుస్తుంది- ఇంతా చేసి

ఆనక తీరికగా అంటుంది కదా తను:
'మీ మగవాళ్ళకెందుకు ఎప్పుడూ అదే యావ
      కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా'  అని. మూర్ఖుడిని అందుకే మరి

ఇంతకాలం అందుకే నాస్తికుడని మరి. ఇక      అందుకే                    
మరి ఇదిగో రాస్తున్నానీ నాలుగు పదాలు ఈ ఉదయం
ఈ కాలపు ఆలయపు మండపంలో ఇలా జ్ఞానోదయమై

చిరునవ్వుతో కూర్చుని, మరి అంతలోనే ఏమీ తెలియని అయోమయంతో.       

04 October 2012

చివరికి.

ఒక పొగమంచుని శ్వాసించాను
      గుండెలోకి గుప్పెడు గులాబీలను హత్తుకున్నాను
                      చీకటి తొలిగి వెలుగు నిన్ను తాకే వేళకి

ఏదీ ఏదీ కాదని తెలుసుకున్నాను
      నీ చేతివేళ్ళ మధ్య నా జీవితాన్ని ఉంచుకున్నాను
                        చిరునవ్వుతో లోకంతో దాగుడుమూతలు

ఆడటం ఎలాగో నేర్చుకున్నాను
      ఒక తేలికైన శ్వాసను లయగా పీల్చడం తెలుసుకున్నాను
      ఇక్కడే ఎక్కడో ఒకచోట, ఉన్నచోట ఉండటం అభ్యసించాను

ఒక పొగమంచునీ, నీ శరీరాన్నీ శ్వాసించాను
నీటి తుంపరలు రాలి నీ కనులు తడిచే వేళల్లో
రెక్కలు మొలుచుకువచ్చి

నీడలతో కడిగిన నేలపైని గూటిలోంచి
తిరిగి నీ వద్దకే ఎగిరిపోయాను!          చివరికి.
              

ఒక రాత్రి (not for decent people)*

నిజం చెబ్తివా తమ్మీ/ తరిమి తరిమి కొడతరు/ కొంత ఒంట బట్టించుకో/ ఒంటిని/ మరీ చూడకు/ దానిని అలా/  దేవుని మీద నమ్మకం లేదనుకో/ అటువైపు తిరగకు/ ప్రవచనాలు వినకు/ ఊరికే ఉడుక్కోకు/ పీకల దాకా  తాగినా/ చివర కంటా లాక్కున్నా/ శరీరంలోంచి పోరు/ ఈ మనుషులు/ గుళ్ళూ గోపురాలూ/ మహాత్ములూ/ స్వామీజీలూ/ పిత్రులూ పుత్రులూ

ఒక్కోనికి ఒక్కో లెక్క/ ఒక్కోనికి ఒక్కో తిక్క/ నిజం చెబ్తివా తమ్మీ/ నీ గుద్ద పగలకొట్టి/ ఎళ్ళ దెంగుతరు/ మనుషులు వొద్దంటే/ మరిక నీ ఇష్టం కానీ/ నీ నోట్లోని మాట/ నాలిక దాటొద్దు/ నాలికపై మాట/ పెదాల్ని నమ్మొద్దు/ అన్నా, నిజం చెబ్తున్నా

అసలే నమ్మొద్దు / కవిత్వం రాసే వాళ్ళని/ కుదిరితే ఉంచుకో/ రెండు రాళ్ళు/ ఎప్పుడూ నీ దగ్గర/ పదాలని పగల/ కొట్టడానికైనా/ నీ నోరు పగల/ గొట్టుకోడానికైనా

చూస్తివా అన్నా/ మనల్ని/ నిన్నసలే నమ్మ/ తాగి మాట్లాడని వాడు/ ఆడదానితో తొంగొని దాచేవాడు/ పక్కా దొంగానాకొడుకు/ నువ్వూ నేనూ/ ఇద్దరమూ అంతే/ ఇంతకూ/ నవ్వినావా అన్నా/ ఏడ్చినావా అన్నా/ ఎన్నడైనా?/ నిజ్జంగా? / కళ్ళల్లో నెత్తురు కారేటట్లు?

చూడన్నా ఇక్కడ/ ఈ లోకపు మాధర్చోతుగాళ్ళు/ తుంపిన పూలను/ మా యమ్మ పూలను/ నా చెల్లి పూలను/ నా నేల పూలను/ నా నీటి పూలను / థూ ... ఇస్కీ/ మర్యాదస్తులందరూ/ ....గుడిచిపోయే వాళ్ళే/ ఇంతకీ అన్నా/ నా బుగ్గపై/ జారిన నీళ్ళు/ బూతెట్లయ్యింది/ నీకు?/ 

తెచ్చుకున్నావా నువ్వు/ ఉంచుకున్నావా నువ్వు/ రెండు రాళ్ళు/ రెండు రాళ్ళు/ రెండు రాళ్ళు/ ఈ లోకాన్ని నిలువునా/ పగుల కొట్టేందుకు?

ఇక చూడన్నా/ ఈ చీకటిని ఎట్లా/ ఆ రెండు చుక్కలు/ నా గొంతుని ఎట్లా/ ఈ రెండు మందు చినుకులు / వెలిగిస్తున్నాయో/ మండిస్తున్నాయో...

అన్నా/ వెలుగుతున్నావా/ నువ్వు?
_________________________________________________________________________________

a polyphony of voices, not entirely mine. but perhaps, the agony is singular.          

03 October 2012

నిప్పు పూలు

నిప్పులతో అల్లిన పూలు ఇష్టం నీకు
వెన్నెలైనా మరిగిన దీపమై వెలగాలి

ఏదో ఒక చెట్టు కావాలి. ఏదో ఒక నీడ
నీ చుట్టూతా తిరగాలి. గాలిలో
ముఖాన్నీ వానలో శరీరాన్నీ
అద్దుకుని తుడుచుకోవాలి.
ఆపై నీ నుదుటిన ఒక ఎర్రని
తారకని దిద్దుకోవాలి. చూడు

అరచేతిలో ఒక తేనీరు పాత్రతో
కనుల నిండుగా  ప్రశాంతతతో
ఉదయపు కాంతిలో
కూర్చున్నావు కానీ

తిలకాన్ని అద్దుకున్న నీ
   బొటన వేలిని చూసుకో ఒక్కసారి

ఎవరిదో నిండైన శరీరం
చిటికెడంత నెత్తురై నీ వేళ్ళ మధ్య చితికి

మాటలు లేని ఒక నల్లని రాత్రై నిలిచి ఉంటుంది.     

01 October 2012

ఇలా: ఒక్కోసారి


ఒక మహారాత్రి జలపాతన్నీ ఒక చీకటినీ వింటావు నువ్వు
ఒక్కడివే - ఎవరితోనూ ఉండలేక, నీతో ఎవరూ ఇమడలేక

తారు రహదారుల పక్కగా మెరిసే మధుశాలలలో
అలసిన మనుషుల ఉరుముల ధ్వనులతో, ఆ
అరచేతులు ప్రాణప్రదంగా పోదివి పుచ్చుకునే-
వానకు తడిచిన సూర్యరశ్మితో నిండిన- పాత్రలలో.

వెలిగిపోతారు వాళ్ళు, ఆ గరకు గడ్డాల మనుషులూ
నలిగిన స్త్రీలూ, గాలికి అల్లాడే ఆకులతో ఆ కొద్ది
క్షణాలలో దివ్య జ్ఞానంతో, దివ్యకాంతి లోకాలలో

మమేకమై ఉంటారు పూర్తిగా వాళ్ళు పశువులతో
పక్షులతో, పురుగులతో, కుక్కలతో, కప్పలతో
మట్టి అంటుకున్న పవిత్రమైన దుస్తులతో, నేలలో
వెలిగిన చెట్లలో గాలిలో దీపాలలో. సరే సరే ఇదేమీ

పెద్ద విషయం కాదు కానీ, నువ్వొకసారి ఆ చీకటి
పాదాలకి ప్రణమిల్లి అంటావు కదా ఆ జనులతో:
"చుక్కలని పిండి,  వెన్నెలని చిలికి
ఇచ్చిన మధుపాత్ర కదా ఈ జీవితం.

మరి త్రాగడం ఎలా దీనిని?  నేను అనే
నువ్వైన మగ్గిన ఈ ద్రాక్షా సారాయిని-?"
ఇక అంటారు వాళ్ళు తమలపాకులతో
ఎర్రబారిన దంతాలతో, తెల్లని కనులతో-

"...................................................
....................................................
....................................................
....................................................

ఇక ఆలోచించకు, తాగింది చాలు ఇక
వెళ్ళు ఇంటికి. చూస్తుంటారు నీకోసం
నీ తల్లో నీ పిల్లల్లో నీ భార్యో, బంధువో
శత్రువో మిత్రుడో.నిరాశపరచక వెళ్ళు-
వెళ్ళిపోవడమే అంతిమం ధర్మం యిక్కడ-"

మరి
తెలుసా నీకు ఆ రాత్రి నేను
ఆ చీకటి నీళ్ళల్లో కురుస్తూ
     ఎక్కడికి వెళ్ళానో?