04 September 2012

చప్పట్లు

 రెండు అరిపాదాలు తాకిన నేల ఇది.
     హృదయాన్ని వొత్తిన మట్టి బరువులోంచి నింగికి ఎగురుతాయి
           రెండు నయనాలు. చుట్టుకుంటాయి నింపాదిగానే రెండు చేతులు  నిన్ను  

శరీరంలోంచి తొలచుకు వెళ్ళిపోయే రెండు దూరాలై, దయగల బాహువులై.
     ఇక ఎదురుచూసే నీ రెండు చూపుల్లోంచి వెళ్ళేపోతాయి
           రెండు అరచేతులు, రెండు చప్పట్లుగా రెండు కన్నీటి చుక్కలుగా. చూడు

 ఎవరో వొదిలివేసి వెళ్ళిపోయిన చివరి ఇంటిలో

     శిధిలమైన కుండీలలో వొంటరిగా ఊగే లేత పూలమొక్కలనూ
               నీ అంత దగ్గరై, నీ మరోవైపై ఆ అవతలివైపున తెగి, గాలికి
                      ఊగిసలాడే పూలపాత్రానూ దుమ్ము పట్టిన అద్దాన్నీ నిన్నూ కోసే

కనురెప్పలు లేని ఎర్రటి ధూళి ఈ మధ్యాహ్నపు రాత్రిలో.

భగవంతుడా: ఇక అరచేతుల్లోని ముఖాన్ని నీళ్ళకు వొదిలి
     ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిన, 'నువ్వు' అనే అంతిమ క్షణం ఇదే.

పద ఇక.  వెళ్ళు ఇక
నీ అంతట నీవు
నీ కాంతి దహన
సంస్కారానికి---  

ఉందాం

ఇన్ని రకాల
గుత్తుల గుత్తుల చీకట్లలో
రేణువంత నిప్పును రాజేసి
రెండు అరచేతుల మధ్య

నుదిటిపై తిలకంలాంటి
ఆ సన్నటి జ్వాలను
పదిలంగా దాచుకోవడం

ఆ లిప్త కాంతిలో
మనల్ని మనం
చూసుకుంటూ
బ్రతకడం కొద్దిగా కష్టమే.
అయినా ఉందాం మనం

గదిలో రాలే వానలలో
ఈ గాలిలో ఆ వెన్నెల్లో
సాగరపూల నిశ్శబ్ధంలో

ఈ కత్తుల రాపిడిలో
ఆ లోహ తెరలలో
విష రహదారులలో
ఉందాం మనం ఇక

నా చేతుల్లో నువ్వూ
నీ అరచేతుల్లో నేనూ
దూరంగా పొడిచిన
ఒక తారక తీరాన్ని

చెమర్చిన మన కళ్ళల్లో
భద్రంగా దాచుకుని
బ్రతికించుకుంటూ-

ఉంటూ. మనం.  

03 September 2012

రక్త పిపాసి

చుక్కల పూలు నిండుగా పూచి
తడచిన భూమి నిండుగా వొణికి
పచ్చి బురద వాసన వేసే వేళల్లో

చీకటి ఇళ్ళల్లో మెత్తటి పొరల్లో  
నీ శరీరమంతటి రాత్రిలో
నా శరీరమంతటి పాత్రతో

ఇచ్చాను నేను నీకు సంపూర్ణంగా

నా గుండెను నిండుగా చీల్చుకుని
నీ కంటి నిండుగా నా కన్నీళ్ళూ
నీ ఒంటి నిండుగా నా నెత్తురూ-

రా. రా. రా. త్వరగా.
తాగు ఇక ఒక అమర ప్రేమతో
చివరి చినుకు వరకూ నా
చర్మాన్నీ ఎముకలనీ రక్తాన్నీ

నీ మృత్యుంజయ మహా
మొహంతో తమకంతో మన
శరీరాలంతంటి మహాదీపపు
పునరపి కాంతితో కరుణతో-    

కరుణ

మోసుకుపోతోంది వాన నీరు ఎక్కడికో
తనపై రాలిన ఆకాశాన్నీ ఆకునీ:

మబ్బుల్లేని కళ్ళతో చూస్తున్నాను కానీ
అలాగా ఉండలేకేనేమో
మన ఇరుకు అవస్థంతా-

ఓ నాలుగు చినుకులు రాలి
లోపలంతా చెమ్మగిల్లితే కానీ
తెలియదు, నీకైనా -నాకైనా-

అశ్రువువలె, ఆకాశాన్ని నింపుకున్న
సముద్రమంత చినుకువలె, పసి పసి
కనుల వలె, ప్రతిఘటించక తేలిపోయే
పండి రాలిన, రావి ఆకువలె

ఉండే ఆ ఒక మహాక్షణమే
అనంతమైన శాశ్వతమని.

ఇక కాంతి తాకిన కరుణ ఇచ్చిన ఆ కాలంలో
నువ్వు ఎవరు అంటే
నేనేమి చెప్పేది నీకు
నేనేమి ఇచ్చేది నీకు? 

అడిగినది

చల్లటి పల్చటి పరదా దాల్చిన
ఈ తడిచిన ఉదయాన్ని, ఇక 
దగ్గరగా తీసుకుని  మేలి ముసుగు తొలగించి చూద్దును కదా

పూవు కింద విచ్చుకున్న
రెండు రెమ్మలపై రాలిన
రెండు చినుకుల వలె నీ ముఖం నిండా విషాదం, ఇన్ని కన్నీళ్లు.

తనని దీనంగా కౌగలించుకున్న
ఆ మొండిచేతుల కరకు శిలను
ఓదార్పుగా నిమురుతూ తను
ఏమీ మాట్లాడలేదు, కానీ నేనే
అన్నాను ఇలా:

"ఎక్కడ దాచుకున్నావు యింత
కాలం ఇంత హాలాహలం
నాకు మాత్రం ఇన్నేళ్ళూ
నీ అమృత దేహాన్ని యిస్తో?"

01 September 2012

ఏమైనా కానీ

ఇంకా దాగలేనప్పుడే
ఇంకా ఆగలేనప్పుడే
వచ్చేది తొలుచుకుని
పూవైనా రాయైనా సూర్యుడైనా చంద్రుడైనా నువ్వైనా:

నెత్తురైనా కానీ నిప్పైనా కానీ
మొండి గోడల మీదా కానీ
నిండు గుండెల మీదా కానీ
మిగలకుండా రాయాలి నీ అంతిమ వాక్యాన్నీ

లోకపు నల్లటి నుదిటి పలకపై
నీ తెల్లటి బలపంతో -ఎర్రని
మహాఆగ్రహంతో- ఎందుకంటే

ఇంకా దాగలేనప్పుడే
ఇంకా ఆగలేనప్పుడే, నువ్వు
ఇంకా ఒపలేనప్పుడే, వాళ్ళు
ఇంకా నిను ఆపాలని
ప్రయత్నించినప్పుడే

నీ నాభి నుంచి, నీ కళ్ళ నుంచి
నలుదిశలూ పిక్కుటిల్లేలా
పిగుల్చుకుని వచ్చేది ఆ

తలలు బాదుకుని రోదించి
గుండెలు చరుచుకుని అరిచే
సర్వాన్నీ సవాలు చేసే ఓ
అనాది అంతిమ పొలికేక.

విన్నావా నువ్వు
అరిచావా నువ్వు
దహించుకుపోయే

అటువంటి ఆఖరి
యుద్ధ ప్రకటనను
ఇంతకు ముందు

ఎన్నడైనా
ఎక్కడైనా?     

ఎవరు?

రాత్రి బావి వద్ద కూర్చున్నాను
రాత్రంతా చీకటి కప్పల, బెక
బెకలు వింటూ. అయితే ఇక

నీతో, నీటితో విసుగు చెంది - తటాలున-
రాత్రి బావిలోకి విసురుగా ఒక
వెన్నెల గులకరాయిని విసిరి

బుడుంగున మునిగి
-నీ వేకువ జామున-
వెళ్లిపోయింది ఎవరు?