ఒక రోజు ఆమె నా గదిలోకి వచ్చింది: అంది కదా
"ఏమిటిదంతా అస్థవ్యస్థంగా?
నీ గదిని శుభ్రం చేయాలి." (సంవత్సరాల క్రితం
నాలోకి జొరబడి నన్నుశుభ్రం చేసినట్టు)-
నేను సరేనన్నాను. అంది కదా తను:
"కాళ్ళు దులిపి మంచంపై పెట్టుకో. నా పని అయ్యేదాకా
నువ్వు కిందకి దిగకూడదు."
నేను ఆమె ఆజ్ఞని శిరసావహించాను. ఎందుకంటే
మీకు తెలుసు, ఆమె నాకు ప్రియురాలి కన్నా
మరింత ఎక్కువగా తల్లి వంటిదని. ఇంకా నిజంగా
ఆమె ముందు నేను బాలుడనని- యిక తరువాత
దుమ్ముపట్టిన కుక్కపిల్లలా ఆ మంచపై
ముడుచుకు కూర్చుని నేను, ఆమెని గమనించాను
మట్టి పరిమళపు వొత్తిడితో కదిలిన గాలిలా
ఆమె గదంతా తిరుగాడింది.
విశ్వంలోని విశ్వాలని క్రమంలో పేర్చుతున్నట్టు
వస్తువులను సర్ధుతూ, ఒక పాత గుడ్డతో
సర్వాన్నీ తుడుస్తూ అడ్డం వచ్చిన వాటిని
పిల్లి పిల్లలను రెండు వేళ్ళతో పుచ్చుకుని
జాగ్రత్తగా పక్కకి పెట్టినట్టు ఉంచుతూ తనే
గదంతా వర్షపు నీటిలా పారాడింది.
నేను పిల్లిపిల్లనై (తను తీసి పక్కకు పెట్టిన)
తనను గమనించాను. లేత ఎండలో
వేగంగా కదులాడే పిచ్చుకల పాదాలలా
రాత్రుళ్ళలో అలలలో చెలరేగే వెన్నెలలా
కదిలే తననూ, తన పూజిత పాదాలనూ
తన అల్లికల పాదాల కదలికలనూ
అబ్బురపడే పిల్లి కళ్ళతో గమనించాను-
రాత్రి ఆకాశపు అద్దాన్ని మంచుతో తుడిచినట్టు
ఒక పాత బనీనుతో తను నా గదిని
తన శ్రమతో అడవులని తడిపిన తుంపరలా
కడిగివేసింది: అంత సమయమూ నేను
రెండు కాళ్ళ చుట్టూ రెండు చేతులు చుట్టుకుని
నా జీవితం కళ్ళల్లో మెరిసే దయతో
తననూ, తన పాదాలనూ తన ముఖాన్నీ గమనించాను
బహుశా ఒక కుక్కనై ఉంటే, ఆమె ఆజ్ఞలను దాటి
ఆమె పాదాలను సంతోషంతో నాకి ఉందును: తన
చుట్టూతా ఎగురుతో గిరీకీలు కొట్టి ఉందును-
ఆ తరువాత ఆమె అంది: " అప్పుడే కిందకి దిగకు
గది తుడిచాను, తడి ఆరాలి కదా-"
అవును. తడి ఆరాలి. అది నిజం. అదే నిజం
అందుకే ఇప్పటికీ యిక నేను
గదిలోని నేల వైపు చూస్తాను
తను లేని నేల వైపు - నేనపుడు గమనించని -
తను వొదిలి వెళ్ళిన నెత్తురు
పద పాద ముద్రికల వైపూ
వాటిపై తడారుతున్న నా వైపూ
ఇప్పటికీ నేను పాదం మోపలేని
తను లేని నేల వైపూ-
05 March 2012
పగటిపూట పాదాలు*
పగటిపూట పాదాలు జ్ఞాపకం వొస్తాయి. అందరి మధ్యా వొంటరిగా కూర్చున్నప్పుడు, ఉదయం సమస్థం ఈ శబ్ధ ప్రపంచంలోకి ఉలికిపాటుతో మేల్కొంటున్నప్పుడు, మరో గదిలో పారాడుతున్న నీ పాదాల మెత్తటి చప్పుళ్ళ నీటి తడి మూసుకున్న నా కళ్ళ కిందుగా ఊరుతుంది.
మరో ప్రదేశంలో కూస్తున్న తపించే పక్షి పాటలానూ, సూర్యరశ్మిని మంచులా కప్పుకున్న అరణ్యాల కింద కనపడని సెలయేర్లు చేసే సన్నటి నవ్వులాంటి మెత్తటి చప్పట్లలానూ, కిటికీలోంచి గోడ గడియారం కిందుగా అల్లుకున్న ఎండలో హడావిడిగా కదిలే పిచ్చుకల కళ్ళలానూ గదంతానువ్వుతిరుగాడుతున్న నీపాదాల సవ్వడి.
నువ్వు తేనీరు పెట్టుకుంటుంటావు. నువ్వు దుస్తులనీ, దుప్పట్లనీ మడత వేస్తుంటావు. రాత్రి నేను రాసుకున్న కాగితాలూ గదంతా చిన్నపిల్లల్లా చిందరవందరగా అల్లరిచిలలరిగా గెంతుతుండగా వాటి చెవుల్ని మెలేసి బల్లపై పెడుతుం టావు. ఇంటి వెనుక తొట్టిలోంచి బుడుంగున నీళ్ళు ముంచి, స్నానానికై, పాలు దించిన పొయ్యిపై పెడుతుంటావు. ఆపై మధ్యలో గదిలోకి ఒకసారి తొంగి చూసి నన్ను లెమ్మని కేకేస్తావు. దర్గాలో హటాత్తుగా కదిలి, అంచు నుంచి నేలపైకి ఎగిరివచ్చే పావురంలా, నీస్వరం, సీతాకోకచిలుకలా సంధ్యకాంతిలోఎగిరే తూనీగలానూ నా వద్దకు వస్తుంది.
కళ్ళు మూసుకుని నేను చూస్తున్నదంతా ఒక స్వప్నమా? ఇంతకుముందే గడిపిన మరో ప్రేమైక జీవితమా?
తొలగిన దుప్పటిని తిరిగి చెవులదాకా లాక్కున్నట్టు, జీవితం తన గోరువెచ్చనితనమంతటతోనీ నన్ను కప్పుకుంటుంది. మూసుకున్న కళ్ళతోనే, పలుమార్లు నువ్వొచ్చి దుప్పట్లో నా నిదురలో నిదురించిన జ్ఞాపకమూ తడుతుంది. యిక ఆ తరువాత పగటి పూట పాదాలు ఏమీ లేని సాయంత్రలగానూ, నిదురలేని రాత్రిళ్ళగానూ మారతాయి. అనేక సంవత్సరాల తరువాత, తన్నుకులాడిన చీకట్లలోంచి చిటపటలాడే వెలుతురులోకి మేల్కొన్నతరువాత, నేను యిక పల్లేలో పెరిగి పట్నపు రహదారులలో తడబడే ఎద్దుని. అందుకని, యిక ఎప్పటిలాగే
నాలుగు రోడ్ల కూడాలి వద్ద నిలబడి, భుజంపై వేలాడే సూర్యుడి కాడిని దించి, తిమ్మిరెక్కిన ముఖాన్నిఅరచెతుల మధ్య రుద్దుకుని సలుపుతున్న భుజాన్ని విధుల్చుకుని జేబులో మిగుల్చుకున్న ఆఖరి బీడీని వెలిగించుకుని, మళ్ళా మరొక రోజులోకి, నీ పాదాలు లేని మరోక సమయంలోకీ అద్రుశ్యమవుతాను.

04 March 2012
రాత్రంతా
నేను తాకలేని చీకట్లో దాగి నీ ముఖం
చంద్రకాంతి పడి ఈ కాగితం
కానరావు నాకు అ/స్పష్టతతో-
యిక రాత్రంతా
చీకటి చెమ్మ తాకిన బరువుతో
ఆ లేత గడ్డిపరక
నా కళ్ళల్లో ఊగుతూనే ఉంది-
చంద్రకాంతి పడి ఈ కాగితం
కానరావు నాకు అ/స్పష్టతతో-
యిక రాత్రంతా
చీకటి చెమ్మ తాకిన బరువుతో
ఆ లేత గడ్డిపరక
నా కళ్ళల్లో ఊగుతూనే ఉంది-
వ్యాఖ్యానం
నా మధుపాత్రలో నీవు
నీ మధుపాత్రలో నేను:
వర్షం లేని రాత్రుళ్ళలో
నేను నిన్ను తాగాను
నువ్వు నన్నెత్తుకుని
దింపకుండా తాగావు
హృదయం తేలికయ్యింది. శరీరం
నీలి మేఘమయ్యింది, జల్లయింది
ఇంకొంత కాలం జీవించవచ్చన్న
ప్రేమో, నమ్మకమో నవ్వో కలిగింది-
యిక నిండుగా మత్తిల్లి, అరుచుకుంటూ
ఏవేవో పాడుకుంటూ ఇళ్ళకు చేరే వేళల్లో
ఎవరిదో చేయి మన నుదిటిన లేపనం అయ్యింది
ఒక లేత నిద్ర వింజామరలతో ఆహ్వానం పలికింది
స్నేహితుడా, నేను ఉన్నందుకూ
నువ్వు ఉన్నందుకూ, మధువు ఉన్నందుకూ
జీవితం ఇచ్చిన ఆ విశ్వదాతువికి కృతజ్ఞతలు-

02 March 2012
ఒకప్పుడు
ఒకప్పుడు పగలంతా ఈ నగర రహదారులలో
జీవన వేటలో చనిపోయాను, చంపబడ్డాను
ఒకప్పుడు రాత్రంతా నీతో కలిసి నీలో నీలా జన్మించాను
యిక ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానో, చనిపోయానో
కదిలే ఒక స్మశానంలానో, చూసే ఒక సమాధిలానో
ఎలా మారానో, నాకే కాదు
నా తల్లికీ తెలియడం లేదు-

ఎలా అడగటం
కన్నీటి నేత్రాలతో కదులుతోంది
ఒకప్పటి ఒక తెల్లని లోహపు తెర
తెరిచిన తన వొంటరి అరచేయిని
వీచే ఏ గాలీ తాకదు, అందుకోదు
నీ సిగలో వడలిన గులాబిది
ఏ రంగో నాకు ఇప్పటికీ జ్ఞాపకం లేదు
పగిలిన అరిపాదాలే గుర్తున్నాయి
నూనె రాసిన ఆ రాత్రుళ్ళలోంచి-
నీ పెదాలే గుర్తుకు లేవు ఇప్పటికీ
'నీళ్ళు ఇవ్వు కొద్దిగా' అని వొణుకుతూ
నువ్వు అలసటతో అడిగిన
చెమ్మగిల్లిన మాటలే గుర్తున్నాయి
మండే ఆ వేసవి దినాలలోంచి
పగలోక రెపరెపలాడే శ్వేత వస్త్రం
అప్పుడు నీకూ నాకూ
రాత్రొక విలవిలలాడే నీలి కుబుసం
అప్పుడు నాకూ నీకూ
కురియలేదు ఎన్నడూ చిన్ని వాన
వికసించలేదు ఎన్నడూ చిట్టి పూవు
వెన్నెలని తాకలేదు
పక్షులతో ఎగరలేదు
అప్పుడు నువ్వూ నేనూ - అందుకనే
లోహపు తెరలతో నీటి నేత్రాలతో
నువ్వు వొదిలివేసిన నీ అరచేయ్యే
మిగిలింది ఇక్కడ యిక ఇప్పటికి నాకూ నీకూ- ఇంతకూ
వెళ్ళిపోయినవాళ్ళని, వెళ్ళిపోయి మళ్ళా
ఎక్కడో తటాలున ఎదురుపడ్డ వాళ్ళని
'ఎలా ఉన్నావూ?' అని ఎలా అడగటం?

01 March 2012
నీకు సంబంధం లేని...
శిఖరం విరిగి
సరస్సులో పడిన ప్రకంపనం
వలయాన్ని చుడుతూ
వలయాలు, వృత్తాలుగా-
శిరస్సూ విరిగి
అరచేతులలో పడిన శిక్షణం*
కొలవలేవు ఆ వృత్తాలను
కనుగొనలేవు ఆ ఆదిమ
వలయ చలన బిందువును
ఆ చూపుడు వేలుతో ఎవరో
నుదిటిని దింపిన పదునైన
సన్నటి చిర్నవ్వు అంచును-
ఇది రాత్రుళ్ళు నన్ను
అవిశ్రాతంగా వేటాడే
అమృత విషసమయం
వెళ్ళిపో ఇక్కడనుంచి: నేను
నిదురిస్తానో, నిద్రమాత్రలతో
మధుపాత్రలతో తూగుతానో
నీకేం సంబంధం? నువ్వు చదివే
ఈ పదాలతో నీకేం అనుబంధం?
______________________________
శిక్ష+క్షణం = శిక్షణం: శిక్షించబడిన క్షణం, శిక్షా క్షణం.

Subscribe to:
Comments (Atom)