15 April 2011

ఒక పరిమళపు ప్రయాణం

రాత్రిళ్ళు నువ్వు
నిదురించలేవు
పగళ్ళు నీవు
పరిగెత్తలేవు
నీ చుట్టూ ఉన్న సమస్థం
నిశ్శబ్దమవ్వగా
ఇంకా ఎంతమాత్రం
తొలి లేత కాంతిలో
నీకై వాలే పిట్టలకు
గుప్పెడు బియ్యం గింజలు
వేయలేవు
రక్తం చర్మంపై
ప్రవహిస్తుండగా
కళ్ళలో నిప్పులతో నీవు
నీ తమ్ముడిని
కౌగలించుకోలేవు
వాడి ఆటలలో
బొమ్మవు కాలేవు
అమ్మ చేతుల్లో వడలి
రాలిపోయిన
ఓ మల్లెమొగ్గలా తప్పితే
ఇల్లంతా వర్షంలా
కురియలేవు

నీడలతో నడవలేవు
నీళ్ళతో కలవలేవు
రాత్రి చందమామలో
వెన్నెలవై
ఆరుబయట కురియలేవు
గాలిలో తేలలేవు
కాగితపు పడవలతో
సాగలేవు
పచ్చిగడ్డిలో పొర్లాడే
కుక్కపిల్లతో
చిందులేయలేవు
కదలలేవు
మాట్లాడలేవు
అరిపాదాలలో నెగళ్లు రగిలి
నిదురించలేవు

నీ చిన్ని గుండెలో
గుబులు
నీ చిన్ని దేహంలో
కమ్ముకు వస్తున్న
వొణుకు
ఏం జరుగుతుందో
తెలియక
ఏం చెప్పాలో
అర్థం కాక
ముడుచుకుని
బెంగగా ఒకే ఒక
మహాప్రశ్నగా
మారి అడుగుతావు
అలా:

"అమ్మా అందరూ
నిదురోతున్నారు
నాకెందుకిలా?"

ఇక కాలం
అర్థం అవుతుంది నీకు
కొత్తగా
ఇక జీవించే ప్రక్రియ
అర్థం అవుతుంది నీకు
కొత్తగా
తెలుస్తుంది నీకు
ఒక కొత్త కాంతి
లీలగా
అర్థం అవుతుంది నీకు
మృత్యువు
ప్రప్రధమంగా
నిను వీడని
ఒక ప్రమిదెపు
వెచ్చదనంలా
నువు తాగిన
నీ తల్లి
తొలి పాల
చల్లదనంలా=

జీవించు:
పూర్తిగా ఈ భాదను
అనుభవించు.

ఒక పరిమళపు ప్రయాణం
మొదలయ్యింది నీకు

ఇవాళే, ఈ వేళే=

10 April 2011

పోలిక

ఈ వేళ నీ లేత ఎరుపు చేతి వేళ్ళను లేత ఎరుపు
మల్లెమొగ్గలతో పోలుస్తాను
లేత ఎరుపుగా మారిన నీ కళ్ళతో పోలుస్తాను=

నీ ఆగ్రహాన్ని అగ్నితోనూ, నీ అసహనాన్ని వాయువుతోనూ
నీ నిర్లక్ష్యం కలగలసిన నిరాదరణని
సర్వాన్నీ తుడిపివేసే ఒక మహా వర్షంతోనూ పోలుస్తాను

పోలికలను ద్వేషించేవాడికి ఒక మహా పోలికగా మారిన నిన్ను
దేనితో పోలుస్తాను?

ఈ వేళ నిన్ను ఒక నలుపు పారిజాతంగానూ, ఒక తెల్లటి
రాత్రిగానూ, అంతం కాని
అలవాటు లేని, వ్యసనంగా మారుతున్న ఒక స్వీయ
చరిత్రతో పోలుస్తాను

పోలికలతో ముడిపడి, పోలికలతో పోరాడి, పోలికలు లేని
ఒక పోలికగా మారుతున్న
ఒక మనిషితో (అది నేను) నిన్ను పోలుస్తాను:
అది వినా మరో మార్గం లేదు: మరో దారి లేదు.

ఇంతకూ నేను మరణించానా లేక నువ్వు ఒక
గొప్ప ప్రతీకారంతో ఇలా తిరిగి జన్మించావా?

దినానంతాన

నీ శరీరంలో ఒక అగ్నినది ప్రవహిస్తోంది ఈ వేళ. నీ కనులలో
నీ స్వరంలో ఒక ఎర్రని పుష్పం వికసిస్తోంది ఈ వేళ.

కొంత సంధ్యా సమయం కావాలి నీకు
కొంత సమయపు కాంతీ కావాలి నీకు. మరికొంత విరామపు
చల్లటి గాలీ తాకాలి నిన్ను.

అలసిపొయావు. వడలిపోయావు. అవిశ్రాంత దినానంతాన
అలా రాలిపోయావు నువ్వు. రా

లేచి కూర్చో కిటికీ పక్కగా: ఇక ఇప్పటికి, నువ్వు తపించిన
వర్షం కురియనీ, నిను తన బాహువులలో
కరిగించివేయనీ=

09 April 2011

ఏమని పిలువను నిన్ను?

చంద్రోదయ కాంతికి వికసించే పుష్పానివి నీవు
రాత్రిలో జ్వలించే మంచు మంటవి నీవు

వెన్నెల పద్మం అని పిలువనా నిన్ను?

అరచేతిలోని వెన్నపూసవి నీవు
అరమోడ్పు కనులలో మెరిసే కాంతి వర్షం నీవు
వసంతాన విరిసే తొలి ఆకుపచ్చని పిలుపు నీవు
వెనుకగా వచ్చి అరచేతులతో కనులను మూసి
సన్నటి నవ్వుతో అడిగే ప్రశ్నవి నీవు

నన్ను తడిపివేసే మెత్తటి జల్లువి నీవు.
అలా అని పిలువనా నిన్ను?

నా జీవితానికి స్వర్గలోకం ఇచ్చిన అనుమతి నీవు
నాకున్న అమూల్యమైన బహుమతి నీవు
నా బాహువులలో చిక్కుకున్న పూలపొదవి నీవు
నా చుట్టూ తిరుగాడే రంగురంగుల
లేత ఎరుపు గులాబీ సీతాకోకచిలుకవి నీవు
అనుకోకుండా నా దారిలో ఎదురుపడ్డ
ఒక స్వప్నచిహ్నం నీవు

నాకు ఉన్న ఒకే ఒక సత్యం
అని పిలువనా నిన్ను?

నా దాహం నువ్వు, నా గాయం నువ్వు
నా పురాకృత క్షణాల పురివిప్పి ఆటలాడే నెమలివి నీవు
నా ప్రారంభం నీవు, నా అంతం నీవు
నా అస్థవ్యస్థ గమనాల మధ్య కదులాడే శ్వాసవి నీవు
అలసిన వదనం పై వీచే
సాయంకాలపు చల్లటి గాలివి కూడా నీవు

నాకు మిగిలిన ఒకే ఒక మృత్యువు
అని పిలువనా నిన్ను?

నన్ను చుట్టుకుని ఓదార్చే బాహువులు నువ్వు
నన్ను క్షమించి శపించే చూపువి నువ్వు
రహస్య రూపివై నను వెంటాడే
ఒక పరిమళపు ఛాయవి నీవు
నలుదిశలా నను విస్మయపరిచే గాధవి నీవు
ఆ ప్రధమ నల్లటి అక్షరానివి నీవు
శిశువు నోటిలో తొలి పాల సంతకం నీవు

నన్ను నిర్వచించే, నన్ను రచించే
నాకు మిగిలిన ఒక ఒక జననం
అని పిలువనా నిన్ను?

ఏమని పిలువను నిన్ను?
ఏమని కాంచను నిన్ను?

08 April 2011

ఏం చేద్దాం మనం

ఉన్నావా లేక
నిన్ను నువ్వు మరచిపోయావా?

నే వచ్చేటప్పుడు
నా శరీరం నిండా నీ శరీరానికి
సరిపడేంత మత్తుని తేనా?

ఏం చేద్దాం మనం మనతో
మన తనువులతో?

ఈ వేళకి మనం
ఒక నెగడుని తయారు చేద్దాం
ఈ రాత్రిని దానిలో వేసి
వెన్నెలతో దహించి వేద్దాం
అగ్నిపూలు ధరించి
ఒకరినొకరు భక్షించుదాం. ఆపై
చితాభస్మం పూసుకుని
విశ్వలయతో తాండవం చేద్దాం
చీకటిలోంచి చీకటిలోకి మళ్ళా
మళ్ళా దుముకుదాం

ఉన్నావా లేక నీతో పాటు
నన్నూ మరచిపోయావా?

వస్తుందొక ఉన్మాద స్వప్నం
నీ కోసం

అందుకై, నాకై
నగ్నంగా సిద్ధంగా ఉండు=

ఎవరు చెప్పారు నీకు

ఎవరు చెప్పారు నీకు జీవించడం తేలికని
ఎవరు చెప్పారు నీకు ప్రేమించడం తేలికని
ఎవరు చెప్పారు నీకు
అలా ఉండటం, అలా చూడటం
కాలపు నదిలో ఇంకుతున్న
సమయపు ఇసుకను గమనించడం
తేలికని ఎవరు చెప్పారు నీకు

ఎవరు చెప్పారు నీకు
వర్షపు నీటిలో కాగితపు పడవలని
వదలడం తేలికని

ఎవరు చెప్పారు నీకు
రాత్రి చీకటిలో నక్షత్రపు చినుకులని
కళ్ళతో పట్టుకోవడం తేలికని

ఎవరు చెప్పారు నీకు
అలల్ని ఎగురవేయడం,పిచ్చుకలని
పిల్లలనీ చిందులేయించడం తేలికని

ఎవరు చెప్పారు నీకు
కాటుక దిద్దిన కళ్ళల్లో మల్లెమొగ్గల్ని
అద్దడం తేలికని

ఎవరు చెప్పారు నీకు
ఓరిమితో, ముసలివాళ్ళతో
అనాధలతో శరణార్థుల లోకంతో
పవిత్రుల పాపంతో ముసలివాడవ్వడం
తెలికనీ సహజమనీ?

ఎవరు చెప్పారు నీకు మరణించడం తేలికని
ఎవరు చెప్పారు నీకు జీవించడం తేలికని
నీకు తెలీకా అని ఎవరు చెప్పారు నీకు

అద్దంలో మరచిన ముఖాల్నీ, ముఖాలలో
జనినిస్తున్న హృదయాల్ని
హృదయాలలో వెలుగుతున్న రహస్య దీపాల్నీ
అందరి చుట్టూ అల్లుకున్న పరిమళాన్నీ

నీ చుట్టూ చుట్టుకున్న అందరినీ తాకడం
అందరిలోకీ ఇంకడం, అందరినీ శ్వాసించడం
తేలిక అని

ఎవరు చెప్పారు నీకు?

07 April 2011

ఏమనుకోను

తీసుకో, ఈ హృదయాన్ని
ఏమనుకోను

దాచుకో, ఈ శరీరాన్ని
ఏమనుకోను

నాటుకో, ఈ కళ్ళను
నీ కళ్ళల్లో
తురుముకో ఈ చేతుల్ని
నీ బాహువుల్లో
కట్టుకో, ఈ పాదాల్ని
నీ పదాలతో

ఏమనుకోను, నీకు
ఏమీ ఇవ్వను, ఏమీ
ఇవ్వలేను=

మరోవైపుకి చూడు.

నేను ఇప్పటికే
ఒక కత్తిని పదునుగా
నూరి ఉంచాను.

ప్రేమించుకుందామా
మనం ఇక?